పార్లమెంటు వద్ద గందరగోళం, ఇద్దరు ఎంపీలకు గాయాలు, అసలు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, ANI
అంబేడ్కర్‌పై కేంద్రహోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలకు నిరసనగా గురువారం పార్లమెంటు వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది.
అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పాటు ఎంపీల మధ్య తోపులాట కూడా జరిగింది. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇద్దరు బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లను తీవ్రంగా గాయపరిచారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు.
ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్ పుత్ లతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రాహుల్ గాంధీపై తమ పార్టీ ఎంపీ హిమాన్షు జోషి పోలీసులకు ఫిర్యాదు చేశారని బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ తెలిపారు.
అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన కేసుపై చర్చ నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇదంతా చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం ఉదయం రాహుల్ గాంధీ పార్లమెంటులోకి ప్రవేశిస్తున్నప్పుడు, బీజేపీ ఎంపీలు ప్రవేశ ద్వారం ముందు తనను అడ్డుకోవడానికి ప్రయత్నించారని అన్నారు.


ఫొటో సోర్స్, ANI
నన్ను నెట్టేశారు : రాహుల్ గాంధీ
తనను, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బీజేపీ ఎంపీలు నెట్టేశారని రాహుల్ గాంధీ చెప్పారు. దీంతో అక్కడ కలకలం రేగింది.
ఇతర ఎంపీలపై భౌతిక దాడి చేసే హక్కు ఏ చట్టం ప్రకారం రాహుల్ గాంధీకి ఉందని కిరణ్ రిజిజు ప్రశ్నించారు. ఇతర ఎంపీలను ఓడించడానికి కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నారా? అని ప్రశ్నించారు.
'పార్లమెంట్ అనేది కుస్తీ వేదిక కాదు. ఇది శారీరక బలాన్ని చూపించే మైదానం కాదు. గాయపడిన నా సహచరులను చూడటానికి నేను ఆసుపత్రికి వెళ్తున్నాను. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు రిజిజు.
ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి ఈ ఘటనపై మాట్లాడుతూ.. ‘‘ఆ సమయంలో రాహుల్ గాంధీ ఓ ఎంపీని తోయగా, ఆయన నాపై పడటంతో గాయపడ్డాను’’ అని చెప్పారు.
ఏఎన్ఐ వార్తా సంస్థ వీడియోలో సారంగి వీల్ చైర్ పై కూర్చొని ఉండటం కనిపించింది. ఆయన తలపై చేతిరుమాలు అడ్డుపెట్టి తీసుకువెళ్లడం కనిపిస్తోంది.
గాయపడిన ఎంపీలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారిని చూసేందుకు పలువురు బీజేపీ ఎంపీలు వచ్చారు.
అదే సమయంలో కొందరు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అదానీపై చర్చ ఇష్టం లేకే..
ప్రతాప్ సారంగి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంటులో తాను అడుగుపెడుతున్న సమయంలో బీజేపీ ఎంపీల బృందం తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిందన్నారు. మల్లికార్జున ఖర్గేను కూడా తోసేశారు. అందుకే అక్కడ అలజడి రేగిందని చెప్పారు.
వారు నన్ను బెదిరించారు. కానీ అది మాకు ముఖ్యం కాదు. తోపులాటకు మేం భయపడం. ఇది పార్లమెంటు, అందులోకి ప్రవేశించే హక్కు తమకు ఉందని రాహుల్ గాంధీ అన్నారు.
అనంతరం రాహుల్ గాంధీ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలకు కొద్ది రోజుల ముందు అమెరికాలో అదానీ కేసు తెరపైకి వచ్చిందని, దీనిపై చర్చను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. దీనిపై ఎలాంటి చర్చ జరగకూడదన్నదే బీజేపీ ప్రాథమిక ప్రయత్నమన్నారు. అంబేడ్కర్ ఆలోచనలను చెరిపేయాలని వీళ్లు కోరుకుంటున్నారు.
వారి మనస్తత్వం ఏమిటో హోంమంత్రి ప్రత్యక్షంగా చూపించారన్నారు. ఈ విషయంపై (అంబేడ్కర్‌పై వ్యాఖ్య గురించి)బీజేపీ క్షమాపణ చెప్పాలని మేం చెప్పాము. కానీ వారు అలా చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. .
అంబేడ్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వైపు వెళ్తుండగా, బీజేపీ ఎంపీలు తమను మధ్యలో కర్రలతో అడ్డుకునే ప్రయత్నం చేశారని రాహుల్ చెప్పారు.
'హోంమంత్రి రాజీనామా చేయాలి. అదానీపై చర్చను వీరు కోరుకోవడం లేదన్నదే అసలు విషయం’’ అని రాహుల్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
‘అంబేడ్కర్ పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారు’
రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో జరిగిన చర్చ ముగింపు సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భీమ్ రావ్ అంబేడ్కర్‌కు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. పదేపదే అంబేడ్కర్ పేరు స్మరించే బదులు ఏ దేవుడిని స్మరించుకున్నా ఏడుజన్మలదాకా స్వర్గప్రాప్తి లభించేదని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అమిత్ షా సుదీర్ఘ ప్రసంగంలోని ఈ చిన్న భాగంపై తీవ్ర దుమారం రేగడంతో పార్లమెంట్ కార్యకలాపాలను వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ ప్రకటనను అంబేడ్కర్‌ను అవమానించడమేనని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చేందుకు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.
బాబా సాహెబ్ ను జీవితాంతం అవమానించిన వారు, ఆయన సిద్ధాంతాలను పక్కనబెట్టి, అధికారంలో ఉన్నప్పుడు బాబా సాహెబ్ కు భారతరత్న ఇవ్వనివ్వని వారు, రిజర్వేషన్ సూత్రాలను ఉల్లంఘించిన వారు నేడు బాబా సాహెబ్ పేరుతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని అమిత్ షా అన్నారు.
అంబేడ్కర్‌ను అమిత్ షా అవమానించారని, ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














