సుశీల మీణా: సచిన్ తెందూల్కర్‌ షేర్ చేసిన వీడియోతో ఒక్కసారిగా పాపులర్ అయిన బాలిక

సచిన్ తెందూల్కర్, జహీర్ ఖాన్, ఎక్స్, క్రికెట్ మ్యాచ్, సుశీల మీణా

ఫొటో సోర్స్, Anshul Verma

ఫొటో క్యాప్షన్, బౌలింగ్ యాక్షన్ కారణంగా వైరల్‌గా మారిన సుశీల మీణా
    • రచయిత, అనఘా పాఠక్, మొహర్ సింగ్ మీణా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

కొన్ని రోజుల క్రితం వరకు పదేళ్ల సుశీల మీణా రాజస్థాన్‌లోని ఓ మారుమూల గ్రామంలో సాధారణ జీవితం గడుపుతుండేది.

అయితే సచిన్ తెందూల్కర్ ఆమె క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత మీడియా దృష్టి ఆమె వైపు మళ్లింది.

ఆమె బౌలింగ్ యాక్షన్ ఇండియన్ మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ మాదిరిగా ఉందంటూ సచిన్ తెందూల్కర్ ప్రశంసించారు.

బంతిని కచ్చితంగా విసురుతూ.. స్వింగ్ చేస్తూ, తెలివిగా, వైవిధ్యభరితంగా, ప్రత్యేక శైలిలో బంతులు సంధించే బౌలర్‌గా జహీర్‌ ఖాన్‌కు గుర్తింపు ఉంది.

సుశీల మీణా గురించి సచిన్ తెందూల్కర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోను లక్షల మంది చూశారు. వేల మంది షేర్ చేశారు. అయితే ఇందులో ఒక ఆసక్తికర అంశం ఏంటంటే సుశీల్ మీణాకు సచిన్ తెందూల్కర్ ఎవరో తెలియదు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"ఆయన (సచిన్ తెందూల్కర్) ఎవరో నాకు తెలియదు" అని సుశీల చెప్పారు. తమ ఇంట్లో టీవీ లేదని, తాను ఎన్నడూ క్రికెట్ మ్యాచ్ చూడలేదని అన్నారు.

అయినప్పటికీ తాను తెందూల్కర్‌కు రుణపడి ఉంటానని అన్నారు.

పేద గిరిజన కుటుంబానికి చెందిన సుశీలను ప్రస్తుతం అంతా అభినందిస్తున్నారు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, దూరపు బంధువులు అందరూ ఆమెతో కలిసి ఫోటోలు తీసుకుంటున్నారు.

కొత్తగా వచ్చిన ఖ్యాతిని ఆనందిస్తూనే , నవ్వుతూ ఫొటోలకు పోజులిస్తున్నారు.

సచిన్ తెందూల్కర్, జహీర్ ఖాన్, ఎక్స్, క్రికెట్ మ్యాచ్, సుశీల మీణా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుశీల మీణా బౌలింగ్ యాక్షన్ మాజీ క్రికెటర్ జహీర్‌ఖాన్‌లా ఉందని సచిన్ తెందూల్కర్ అన్నారు.

ప్రోత్సహించిన టీచర్

బిడియంతో ముసిముసి నవ్వులు నవ్వే ఆ చిన్నారి స్కూల్ యూనిఫామ్ వేసుకుని రబ్బర్ బంతితో గ్రౌండ్‌లోకి అడుగు పెడితే మాత్రం ఎలాంటి భయం లేకుండా, పూర్తి ఫోకస్‌తో బంతులు సంధించే బౌలర్‌లా మారిపోతుంది.

"ఒక్కసారి బంతి నా చేతికి వచ్చిన తర్వాత, బ్యాటర్‌ను ఎలా ఔట్ చెయ్యాలా అని మాత్రమే ఆలోచిస్తుంటాను" అని సుశీల చెప్పారు.

సుశీల బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమని ఆమె ప్రత్యర్థి జట్టులో బ్యాటర్‌గా ఉన్న ఆమె క్లాస్‌మేట్ ఆశ చెప్పారు.

"ఆమె వేసే బంతులు అనూహ్యంగా తిరుగుతాయి. అవి వికెట్లను పడేస్తాయి" అని ఆశ చెప్పారు.

సుశీలకు లభించిన గుర్తింపుతో ఆమె తల్లి శాంతిబాయి గర్వపడుతున్నారు.

ఆమెను కలిసేందుకు అనేకమంది ఉత్సాహంగా ఉన్నారని, అయితే వారిలో ఎవరూ ఆమెకు మద్దతిచ్చేందుకు ముందుకు రావడం లేదని సుశీల తల్లి అన్నారు.

ఇంటి పనులు చేయకుండా అమ్మాయిని క్రికెట్ ఆడటానికి పంపిస్తున్నారేంటని కొంతమంది సుశీల తల్లిదండ్రులను అడిగారు.

"నేను వాళ్లకు ఏమీ చెప్పను, అలాగే వాళ్లు చెప్పేవి పట్టించుకోను" అని శాంతిబాయి అన్నారు.

"మా అమ్మాయి క్రికెట్ ఆడతానంటే నేను ఆపను" అని అన్నారు

సుశీల చదువుతున్న స్కూల్‌లో పిల్లలందరూ క్రికెట్ ఆడతారు
ఫొటో క్యాప్షన్, సుశీల చదువుతున్న స్కూల్‌లో పిల్లలందరూ క్రికెట్ ఆడతారు

సుశీల చదువుతున్న స్కూల్‌లో పిల్లలందరూ క్రికెట్ ఆడతారు. స్కూల్ టీచర్ ఈశ్వరీలాల్ మీణా వాళ్లను క్రికెట్ ఆడేలా ప్రోత్సహిస్తున్నారు.

"2017లో నేను ఈ స్కూలులో చేరిన తర్వాత పిల్లల్ని క్రికెట్ ఆడేలా ప్రోత్సహిస్తున్నాను. వాళ్లు స్కూలుకు వచ్చేందుకు ఏదో ఒక ఆసక్తికరమైనది ఉండాలి. లేకుంటే వాళ్లు ఇంటి దగ్గరే ఉంటారు" అని ఈశ్వరీలాల్ చెప్పారు.

గతంలో తాము, మిగతా టీచర్లు కలిసి టీములుగా ఏర్పడి పిల్లలు కూడా ఆడేలా చేసేవాళ్లమని, దీంతో అందరూ క్రికెట్ ఆడటానికి ముందుకు వచ్చారని ఆయన తెలిపారు.

ఈశ్వరీలాల్‌ మీణా క్రికెట్‌లో ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా స్కూల్ పిల్లలకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి ఆయన క్రికెట్ ఎలా ఆడాలో పిల్లలకు నేర్పిస్తున్నారు.

క్రికెట్‌లో ఆ స్కూల్ పిల్లల ప్రతిభను అందరికీ చూపించేందుకు సోషల్ మీడియా అకౌంట్ ప్రారంభించారు. క్రమంగా ఆయన వీడియోలకు స్పందనలు రావడం మొదలైంది. కొంతమంది ఆ వీడియోలు చూసి పిల్లలు ఎలా ఆడాలో సూచనలు చేసేవారు.

సచిన్ తెందూల్కర్, జహీర్ ఖాన్, ఎక్స్, క్రికెట్ మ్యాచ్, సుశీల మీణా

ఫొటో సోర్స్, Anshul Verma

ఫొటో క్యాప్షన్, సుశీల తల్లి శాంతిబాయి మీణా

సుశీల ఒక్కరే కాదు..

క్రికెటర్‌గా ఇంటర్నెట్‌లో వైరల్ అయిన చిన్నారి సుశీల ఒక్కరే కాదు.

నిరుడు, రేణుకా పర్గి అనే బాలిక కూడా తన బ్యాటింగ్ నైపుణ్యంతో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఆమె ప్రైవేటు క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. జైపుర్‌లో ఉన్న ఈ అకాడమి ఆమె ఖర్చులన్నీ భరించి శిక్షణ ఇస్తోంది.

ఈ స్కూలు, అందులో విద్యార్థులపై కేవలం సోషల్ మీడియాలో శ్రద్ధ చూపించడం కాకుండా వారికి మరింత మద్దతు అవసరం.

సుశీల చదువుతున్న స్కూలు, ఆమె గ్రామంలో పరిస్థితులు అంత బాగా లేవు.

కోచ్ ఈశ్వరిలాల్ మీణాతో సుశీల మీణా

ఫొటో సోర్స్, Mohar Singh Meena

ఫొటో క్యాప్షన్, కోచ్ ఈశ్వరిలాల్ మీణాతో సుశీల మీణా

"అధికారులు, నాయకులు వస్తున్నారు. పెద్ద పెద్ద వాగ్ధానాలు చేస్తున్నారు. అయితే ఏమీ మారడం లేదు" అని ఈశ్వరీలాల్ మీణా చెప్పారు.

ఈ స్కూల్లో పిల్లలకు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు బోధిస్తున్నారు.

"వాళ్లు ఐదో తరగతి దాటితే, క్రికెట్ ఆడటం ఆపేస్తారు. ఎందుకంటే వారికి అవకాశాలు లేవు" అని ఈశ్వరీలాల్ మీణా అన్నారు.

గ్రామానికి, గ్రామంలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఏం చేయొచ్చనేది తాము పరిశీలిస్తామని స్థానిక అధికారులు తెలిపారు.

స్కూలు పిల్లలకు క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసేందుకు కొంత స్థలం ఇవ్వడానికి సర్వే నిర్వహించాలని అటవీ శాఖ కొంతమంది అధికారులను గ్రామానికి పంపించింది.

అయితే ఇప్పటి వరకు ఏమీ జరగలేదు.

ఇదిలా ఉంటే, సుశీల ఇంటికి బహుమతులు వరదలా వచ్చి పడుతున్నాయి. ఆమె బౌలర్ అయినప్పటికీ అందరూ ఆమెకు బ్యాట్లు బహుమతిగా ఇస్తున్నారు.

ఆమెకు ఇంతవరకు ఎవరూ సరైన క్రికెట్ బాల్ ఇవ్వలేదని ఆమె టీచర్ చెప్పారు. క్రికెట్ బాల్ రబ్బరు బంతి కంటే గట్టిగా ఉంటుందని, ప్రస్తుతం సుశీల రబ్బర్ బంతితోనే ప్రాక్టీస్ చేస్తోందని అన్నారు.

బహుమతిగా వచ్చిన బ్యాట్లన్నీ ఏం చేస్తావని సుశీలను అడిగితే, ఆమె నవ్వుతూ "వాటన్నింటినీ ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పారు.

ఆన్‌లైన్‌లో సుశీలకు వచ్చిన గుర్తింపు అంతా బహుమతులతోనే ముగిసిపోతుందా లేక ఆమె జీవితంలో ఏదైనా మార్పుకు బాటలు వేస్తుందా?.. ప్రస్తుతం గ్రామస్థులందరిలోనూ ఇదే ప్రశ్న.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)