గాల్లో ప్రత్యక్షమయ్యే భార్య, లండన్ నుంచి బెంగళూరుకు 40 నిమిషాలే: 30 ఏళ్ల కిందట ఊహించినవి ఎన్నో.. ఏవి నిజమయ్యాయి?

- రచయిత, గ్రాహమ్ ఫ్రేజర్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
1995లో బీబీసీ ప్రసారం చేసిన ‘టుమారోస్ వరల్డ్’ ప్రోగ్రామ్ అప్పటికి 30 ఏళ్ల తర్వాత.. అంటే 2025లో ప్రపంచం ఎలా ఉంటుందనేది అంచనా వేసి చూపించింది.
ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్‌తో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించింది.
‘2025 నాటికి ప్రపంచంలో చాలా పెద్ద మార్పులను మనం ఆశించొచ్చు’ అని స్టీఫెన్ హాకింగ్ అప్పట్లో అన్నారు.
హోలోగ్రామ్ సర్జరీ నుంచి స్పేస్ జంక్ జెల్ వరకు ప్రపంచంలో పెనుమార్పులను ఆ కార్యక్రమంలో ఊహించారు.
అప్పుడు ఊహించినవాటిలో ఎన్ని నిజమయ్యాయి? ఏవి ఊహించలేకపోయారు?


2005లో సైబర్ స్పేస్ అల్లర్లు
ఏమని ఊహించారు?:
1995 నాటికి ‘వరల్డ్ వైడ్ వెబ్’ ఊపందుకుంటోంది.
వ్యాపార సంస్థలు, బ్యాంకులు 2000 నాటికి ఇంటర్నెట్‌ను నియంత్రణలోకి తెచ్చుకుంటాయని.. ఇవి మిగతావాళ్లకు యాక్సెస్ లేకుండా సూపర్‌నెట్‌ను ఏర్పాటుచేసుకుంటాయని అంచనా వేశారు.
వరల్డ్ వైడ్ వెబ్ హ్యాకింగ్, వైరస్, అల్లర్లకు కారణమవుతుందని ఊహించారు.
వాస్తవం ఎలా ఉంది?
ఇప్పటికీ ఇంటర్నెట్ ఉంది. మరింతగా అందుబాటులోకి వచ్చింది. అల్లర్లు లాంటివి లేవు కానీ హ్యాకర్ల చర్యలు చాలా మందికి ఇబ్బందులు కలిగించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ కార్యక్రమంలో ఊహించలేకపోయిన విషయం ఏంటంటే ప్రభుత్వాల తరఫున కూడా హ్యాకర్లు పనిచేస్తారని. ఉత్తరకొరియాలో ఇలాగే జరుగుతోంది.బీబీసీ లాజరస్ హీస్ట్ పాడ్‌కాస్ట్‌లో నిపుణులు ఈ విషయం చెప్పారు.
ప్రభుత్వాలకు, కంపెనీలకు సైబర్ భద్రత అనేది చాలా ముఖ్యమైనదిగా మారింది.
గ్రహశకలం మైనింగ్, స్పేస్ జంక్ జెల్
ఏమని ఊహించారు?:
స్పేస్ మైనింగ్ లాభదాయక పరిశ్రమగా అవతరిస్తుందని ఆ కార్యక్రమం అంచనావేసింది. విలువైన లోహాల కోసం భూమికి సమీపంలోని గ్రహశకలాలపై తవ్వకాలు జరుపుతారని ఆ కార్యక్రమంలో అంచనా వేశారు.
అంతరిక్ష వ్యర్థాలు(స్పేస్ జంక్) తీవ్రమైన సమస్యగా మారుతుందని, వ్యోమగాములకు సురక్షితం కాని ప్రదేశంగా ఉంటుందని కూడా ఆ కార్యక్రమం అంచనావేసింది.
అంతరిక్ష వ్యర్థాలను తగ్గించడానికి భారీ ఫోమ్ జెల్ ఉపయోగిస్తారని ఊహించింది.
వాస్తవం ఎలా ఉంది?:
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే సూపర్ ఫోమ్ జెల్ వంటిదేదీ లేదు. స్పేస్ జంక్ అనేది ఇంకా తీవ్రమైన సమస్యగానే ఉంది. స్పేస్ మైనింగ్ పరిశ్రమ ఇంకా లేదు.. భవిష్యత్తులో సాధ్యం కావచ్చేమో ఇంకా తెలియదు.
భవిష్యత్తును అంచనా వేసే ఫ్యూచరిస్ట్ టామ్ చీజ్‌రైట్ ఈ విషయంలో ఆశావాది. భూమికి ఆవల మైనింగ్ జరిగే అవకాశం ఉందన్నది ఆయన అభిప్రాయం.
''మనం ఊహించలేనంత మార్పు వస్తుంది. సాంకేతికత పూర్తిగా మన నియంత్రణలో ఉంది'' అని ఆయన చెప్పారు.

సూపర్ సర్జన్లు, వారి రోబోలు
ఏమని ఊహించారు?:
ఒక్కో సర్జన్ ఎన్ని విజయవంతమైన ఆపరేషన్లు చేశారనే జాబితాను బ్రిటన్‌లోని అన్ని ఆసుపత్రులు ప్రచురించాలన్న చట్టం 2004 నాటికి వస్తుందని ‘టుమారోస్ వరల్డ్’ అంచనావేసింది.
ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న డాక్టర్లు బాగా ఆదరణ పొందుతారని, వారికి జీతం బాగా ఉంటుందని, రోగుల దగ్గరకు వెళ్లడం వారికి అర్థం లేని వ్యవహారంలా అనిపిస్తుందని కార్యక్రమం అంచనావేసింది.
పేషెంట్ హోలోగ్రామ్‌లను వారికి పంపితే సర్జన్ ‘స్పేసియల్ గ్లోవ్స్’ సహాయంతో సర్జరీ చేస్తారని ఆ కార్యక్రమం అంచనావేసింది.
సర్జన్ ఎక్కడో ఉంటూ ‘స్పేసియల్ గ్లోవ్స్’తో సర్జరీ చేస్తారు.. ఈ విధానంలో సర్జన్ చేతి కదలికలను రోగి దగ్గర ఉండే రోబో అనుకరిస్తూ శస్త్రచికిత్స పూర్తిచేస్తుంది.
వాస్తవం ఎలా ఉంది?:
అచ్చంగా ఇలా జరగడం లేదు కానీ శస్త్రచికిత్సల్లో రోబోలు సాయపడుతున్నాయి.

స్మార్ట్ స్పీకర్, వీఆర్ హెడ్‌సెట్
ఏమని ఊహించారు?:
భవిష్యత్తులో మనుషులు వీఆర్ హెడ్ సెట్ పెట్టుకుని కనిపిస్తారని ‘టుమారోస్ వరల్డ్’ కార్యక్రమం అంచనావేసింది. అందులో భాగంగా భవిష్యత్తులో మనుషులు ఎలా ఉంటారన్నది కూడా చూపించారు. అలా చూపించిన వ్యక్తి, ఆయన భార్య, కుమార్తెతో ప్రస్తుత కాలంలోని(2025) లండన్‌లో ఉన్నట్లుగా చూపించారు.
మరో అంచనాలో.. ఒక మహిళ తేలుతూ స్మార్ట్ స్పీకర్ నుంచి వస్తుంది. అలా వచ్చి ఆ పురుషుడితో ‘ఇండో డిస్నీ’కి సెలవులకు వెళ్లి ఏడాదైందని చెప్తుంది.
మళ్లీ హాలిడేపై వెళ్లాలని.. బెంగళూరు వెళ్దామని అంటుంది. బెంగళూరుకు వెళ్లడానికి 40 నిమిషాల సమయమే పడుతుందంటారు ఆమె.
వాస్తవం ఏమిటి?
ఈ ఊహ సాధ్యం కాలేదు. స్మార్ట్ స్పీకర్లు, వీఆర్ హెడ్‌సెట్ టెక్నాలజీ వచ్చినప్పటికీ స్పీకర్‌లోంచి తల బయటకు రావడం.. 40 నిమిషాలలో లండన్ నుంచి బెంగళూరు చేరుకునేంత అల్ట్రా ఫాస్ట్ ప్రయాణాలు వంటివి ఇంకా లేవు.

మన చేతిలోని మైక్రోచిప్ ఉపయోగించి బ్యాంకింగ్
ఏమని ఊహించారు?:
భవిష్యత్తులో బ్యాంకింగ్ ఎలా ఉంటుందనేదానిపై ‘టుమారోస్ వరల్డ్’ అంచనావేసింది.
ఆ కార్యక్రమంలో ఒక మహిళ బ్యాంకుకు వెళ్తారు. అక్కడ సిబ్బందిలో మనుషులెవరూ ఉండరు.. ఆమె తన చేతిలో అమర్చిన చిప్‌ను స్కాన్ చేస్తే 100 యూరోలు వస్తాయి.
వాస్తవం ఏమిటి?
ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో మానవ ప్రమేయం బాగా తగ్గింది. ఆటోమేషన్ పెరిగింది.
శరీరంలో అమర్చుకున్న చిప్ స్కాన్ చేసి డబ్బు చెల్లించడం కూడా సాధ్యమైనప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు.
ఫింగర్ ప్రింట్, ఫేస్ స్కానింగ్ వంటి ఇతర సాంకేతికతల వినియోగం బాగా పెరిగింది.

ప్రజెంటర్స్ జ్ఞాపకాలు
30 ఏళ్ల క్రితం టుమారోస్ వరల్డ్ కార్యక్రమానికి ప్రజెంటర్లగా ఉన్నవారిలో గార్డెనర్స్ వరల్డ్ స్టార్ మాంటీ డాన్ ఒకరు. జన్యు ఇంజినీరింగ్, బహుళ అంతస్థుల్లో వ్యవసాయం చేసే సౌకర్యాలుండడం ద్వారా భారీగా బ్రిటిష్ అటవీ భూముల పునరుద్ధరణ జరుగుతుందని ఆయన విభాగం అంచనావేసింది. దీనివల్ల బ్రౌన్ బేర్ సహా చాలా జంతువుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు.
ఇప్పుడాయన బీబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ అప్పటి అంచనాలను ‘అమాయకమైనవి’ అన్నారు. అదే సమయంలో వచ్చే 30 ఏళ్లకు సంబంధించి కొన్ని కొత్త అంచనాలు వేశారాయన. 2055 నాటికి ప్రజలు తమ ఆహారాన్ని సొంతంగా పండించుకుంటారని అంచనావేశారు.
‘మనిషి ప్రపంచాన్ని మెరుగైనదిగా మార్చడంపై దృష్టిపెట్టడం టుమారోస్ వరల్డ్ నిర్వచనం. కానీ జరిగింది ఏంటంటే పరిస్థితులను మనిషి మరింతగా దిగజార్చాడు. ముఖ్యంగా పర్యావరణం విషయంలో ఇదే జరిగింది. మనం ప్రకృతిని మార్చాలనో, నియంత్రించాలనో అనుకోకుండా ప్రకృతితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది'' అని ఆయనన్నారు.
టుమారోస్ వరల్డ్ కార్యక్రమంలో వివేన్ పేరీ మరో ప్రెజెంటర్. ఔషధాల గురించి ఆమె అంచనావేశారు.
అప్పట్లో ఉన్న పరిమిత విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆ కార్యక్రమాన్ని చిత్రీకరించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.
2013 నుంచి ఆమె ‘జినోమిక్స్ ఇంగ్లండ్’లో పనిచేస్తున్నారు. జన్యుక్రమం గురించి 1995 ‘టుమారోస్ వరల్డ్’ కార్యక్రమంలో వేసిన అంచనాల్లో కొన్ని నిజమయ్యాయని చెప్పారు. జన్యు పరమైన కారణాలను గుర్తించి, చికిత్స అందించే పరిశోధన అధ్యయనంలో ఆమె పనిచేస్తున్నారు.

2055లో ప్రపంచం ఎలా ఉండబోతోంది?
1995 కార్యక్రమం చాలా పెద్ద పెద్ద ఆలోచనలతో రూపొందిందన్నది ఫ్యూచరిస్ట్ ట్రేసీ అభిప్రాయం. అయితే గత 30 ఏళ్లలో జరిగిన రెండు అతిపెద్ద విషయాలను అందులో ప్రస్తావించలేదు. అవి సాంకేతిక విప్లవం వ్యాప్తి, సోషల్ మీడియా.
2055 నాటికి చాలా మంది ప్రజలు మేథోపరంగా అనుసంధానంలో ఉంటారని ఇప్పుడు ట్రేసీ అంచనావేస్తున్నారు. మనుషులు మెదళ్లు, సాంకేతికత సర్వర్ల ద్వారా అనుసంధానంలో ఉంటారని, ఆలోచలను పంచుకుంటారని ఊహిస్తున్నారు.
''మేథోమథనం అంటే అక్షరాలా ఆలోచించడం ద్వారానే ఆలోచనలు పంచుకోవచ్చు''
మెటీరియల్స్ సైన్స్, బయోఇంజినీరింగ్ వచ్చే 30 ఏళ్లల్లో అత్యంత ప్రభావం కలిగించబోయే రెండు విషయాలని టామ్ చీజ్‌రైట్ భావిస్తున్నారు.
చాలా బలమైన, తేలికైన, సన్నని పరికరాల సృష్టి ప్రపంచాన్ని మార్చబోతోందని అంచనావేశారు.
కఠినమైన నియంత్రణ ఉండే బయో ఇంజినీరింగ్ ఔషధాల్లో మార్పు తేవడానికి, మనిషి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు డీకార్బొనైజేషన్, స్వచ్ఛమైన నీళ్లు, ఆహారం వంటి సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

వచ్చే 30 ఏళ్లల్లో ప్రపంచం ఎలా ఉండబోతోంది?
దీనికి మన సమాధానాలు ఏమైనప్పటికీ 30 ఏళ్ల కిందట టుమారోస్ వరల్డ్ గురించి ప్రొఫెసర్ హాకింగ్ చెప్పింది వినడం తెలివైన పని.
''వీటిల్లో కొన్ని మార్పులు చాలా ఉత్సాహంగా ఉంటాయి. కొన్ని ప్రమాదఘంటికలు మోగిస్తాయి. కచ్చితంగా ఇప్పుడున్నదానికి భిన్నంగా ఉంటుందనేది నిజం. బహుశా మనం ఆశించినట్టు కూడా ఉండకపోవచ్చు'' అని 1995లో హాకింగ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














