దక్షిణ కొరియాలో విమానం కూలిపోయిన రన్‌వే చివర్లో అంత పెద్ద కాంక్రీట్ గోడ ఎందుకు ఉంది?

సౌత్ కొరియా, మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జెజు ఎయిర్‌లైన్స్ విమాన శకలం
    • రచయిత, డేవిడ్ మెర్సర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణ కొరియాలో 179 మంది మృతికి కారణమైన విమాన ప్రమాదం జరిగిన ఎయిర్‌పోర్ట్ రన్‌వే సమీపంలో 'అసాధారణం'గా ఒక కాంక్రీడ్ గోడ ఉండడంపై వైమానిక నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదానికి గురైన విమానం రన్‌వే పైనుంచి అదుపుతప్పి గోడను ఢీకొని కాలిపోవడం వీడియో ఫుటేజ్‌లో కనిపించింది.

రన్‌వేకు 250 మీటర్ల(820 అడుగులు) దూరంలో ఈ కాంక్రీట్ గోడ ఉంది.

అక్కడ ఆ కాంక్రీట్ గోడ కనుక లేకుంటే చాలామంది ప్రాణాలతో బయటపడేవారని ఎయిర్‌ సేఫ్టీ నిపుణుడు డేవిడ్ లెర్మౌంట్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విమానం పక్షిని ఢీకొందని.. దాంతో విమానాన్ని అది ల్యాండ్ కావాల్సిన దిశలో కాకుండా వ్యతిరేక దిశ నుంచి ల్యాండయ్యేందుకు అనుమతి ఇవ్వాలని పైలట్ కోరారు.

2,800 మీటర్ల ఆ రన్‌వే మీద కొంత దూరం కిందకు వచ్చి చక్రాలు కానీ, ఇతర ల్యాండింగ్ గేర్ ఏదైనా కానీ ఉపయోగించకుండా దిగినట్లు కనిపించింది.

ల్యాండింగ్ గేర్ లేకుండా విమానం నేలపై దిగినా రెక్కలు ఎంత ఎత్తున ఉన్నాయి, విమానం ముందు భాగం ఎంత ఎత్తున ఉంది వంటి విషయాలు పరిశీలించినప్పుడు అంతా బాగానే ఉందని, రన్‌వే పై జారుతూ వెళ్తున్నప్పుడు కూడా విమానానికి చెప్పుకోదగ్గ నష్టం జరగలేదని లెర్మౌంట్ అన్నారు.

ల్యాండింగ్ ఆ రకంగా చేయడం వల్ల అంతమంది మరణించలేదని.. రన్‌వే ముగిసిన వెంటనే దృఢమైన గోడను ఢీకొనడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని లెర్మౌంట్ అన్నారు.

సౌత్ కొరియా, మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, విమాన ప్రమాదం
ఫొటో క్యాప్షన్, రన్‌వే మీద వస్తున్న విమానం

నేవిగేషన్ వ్యవస్థ కోసం..

విమానాశ్రయాలలో రన్‌వేల చివరన సాధారణంగా ఇలాంటి గోడలు ఉండవని మ్యూనిచ్‌లో ఉండే లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ పైలట్ క్రిస్టియన్ బెకెట్ 'రాయిటర్స్' న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.

విమానాల ల్యాండింగ్‌కు సహకరించే 'లోకలైజర్' అనే నేవిగేషన్ వ్యవస్థ ఈ గోడపై ఉందని దక్షిణ కొరియా న్యూస్ ఏజెన్సీ యోన్‌హాప్ పేర్కొంది.

4 మీటర్ల(13 అడుగుల కంటే ఎక్కువ) ఎత్తున్న ఈ గోడను ల్యాండింగ్ అవసరాలన్నీ సక్రమంగా జరిగేందుకు వీలుగా లోకలైజర్‌ను ఉంచేందుకు నిర్మించారని యోన్‌హాప్ పేర్కొంది.

దక్షిణ కొరియాలోని ఇతర కొన్ని విమానాశ్రయాలు, ఇతర దేశాలలోని విమానాశ్రయాలలోనూ ఈ నేవిగేషన్ వ్యవస్థలను కాంక్రీట్ గోడలపైనే అమర్చారని ఆ దేశ రవాణా మంత్రిత్వ శాఖ చెప్పింది.

అయితే, ఆ గోడను తేలికైన పదార్థాలతో నిర్మించి ఉండాల్సిందో లేదా అనేది అధికారులు విచారణ జరుపుతారని అన్నారు.

సౌత్ కొరియా, మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, స్థానిక కాలమానం ఉదయం 9.03 గంటలకు విమానం రన్‌వేకు చివర ఉన్న కాంక్రీటు గోడను ఢీకొట్టింది.

‘గోడ పగిలిపోయేలా ఉండాలి కానీ విమానం ముక్కలయ్యేలా ఉండకూడదు’

ప్రమాదానికి గురైన విమానంలాంటిదే నడిపిన 48 ఏళ్ల అనుభవం ఉన్న పైలట్ క్రిస్ కింగ్స్‌ఉడ్ 'బీబీసీ'తో మాట్లాడుతూ.. రన్‌వేకు సమీపంలో ఏవైనా అడ్డంకులు ఉన్నట్లయితే విమానం ఢీకొనగానే అవి సులభంగా ముక్కలైపోయేలా ఉండాలి కానీ విమానం ముక్కలైపోయేలా ఉండకూడదు అన్నారు.

'అక్కడ అలాంటి గట్టి గోడ ఉండడం అసాధారణమైనదే. విమానం చాలా వేగంగా వస్తోంది, రన్‌వే పైన కొంత దూరం తరువాత ల్యాండ్ అయింది. అలాంటప్పుడు అది రన్‌వే ముగిసిన తరువాత కూడా కొంతదూరం వెళ్లింది. అలాంటి సందర్భంలో ఎంతవరకు వెళ్తుందనేది ఎవరు చెప్పగలరు. ఇదంతా దర్యాప్తు చేయాలి' అన్నారు క్రిస్.

'విమానాలు ఏమీ దృఢంగా ఉండవు. డిజైన్ పరంగా గాల్లో ఎగరడానికి వీలుగా తేలిగ్గా ఉండేలా వాటిని తయారుచేస్తారు. చక్రాలేమీ లేకుండా దిగినప్పుడు నేరుగా విమానం కిందభాగం నేలను తాకుతున్నా వేగంగా వెళ్లేలా వాటి నిర్మాణం ఉండదు.

గోడల్లాంటి నిర్మాణాలను ఢీకొన్నప్పుడు విమానం ప్రధాన భాగం విరిగే ప్రమాదం ఉంటుంది, అప్పుడది చాలా నష్టం కలిగిస్తుంది అన్నారు క్రిస్.

సౌత్ కొరియా, మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, విమానం కాంక్రీటు గోడను ఢీ కొనడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

గోడ లేకపోతే ఏమయ్యేది?

'విమానం రెక్కల్లో ఇంధనం ఉంచుతారు. రెక్కలు రాపిడికి గురైతే విమానం మంటల్లో చిక్కుకోవచ్చు. కాబట్టి గోడ అక్కడ లేకపోతే ఏమై ఉండేది అనేది కూడా చెప్పలేం' అన్నారు క్రిస్.

'ఇంకా ఎన్నో ప్రధానమైన అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఎయిర్‌ఫీల్డ్స్‌లో చుట్టూ తిరిగితే అక్కడ కూడా ఇలాంటి అడ్డంకులు ఏమైనా కనిపిస్తాయేమోనని అనుమానంగా ఉంది?' అన్నారాయన.

విమానయాన విశ్లేషకులు సాలీ గెథిన్ ఈ ప్రమాదంపై మరో అనుమానం వ్యక్తం చేశారు. 'ల్యాండ్ చేయాల్సిన వైపు నుంచి కాకుండా వ్యతిరేక దిశలో ల్యాండ్ చేస్తున్న పైలట్‌కు రన్‌వే చివరన గోడ ఉన్న విషయం తెలుసా?' అని సాలీ ప్రశ్నించారు.

బీబీసీతో మాట్లాడిన ఆమె.. రన్‌వే సమీపంలో గోడ ఉన్న విషయం పైలట్లకు తెలుసా లేదా అనేది తెలియాలన్నారు. బ్లాక్ బాక్స్‌ను విశ్లేషించినప్పుడు విషయం తెలుస్తుందని, ఈ ప్రమాదంపై అనేక ప్రశ్నలు కలుగుతున్నాయని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)