బ్రెజిల్‌లో కూలిన విమానం, 61 మంది మృతి, ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు

బ్రెజిల్ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కూలిన విమానం ముక్కలైంది

బ్రెజిల్‌లోని సావో పాలోలో విమానం కూలి 61 మంది మృతి చెందారు.

ఈ ట్విన్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం పరానా రాష్ట్రంలోని కాస్కావెల్ నుంచి సావో పాలో నగరంలోని గౌరుల్‌హోస్ విమానాశ్రయానికి వెళుతుండగా విన్‌హెడో పట్టణంలో కూలిపోయిందని వోపాస్ ఎయిర్‌లైన్స్ సంస్థ తెలిపింది.

విమానం గాలిలో గిరగిరా తిరుగుతూ కిందపడినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల్లో కనిపిస్తోంది.

ప్రమాదానికి గురైన ఈ ఏటీఆర్ 72-500 విమానంలో 57 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని స్థానిక అధికారులు చెప్పారు.

బ్రెజిల్‌లో విమానం కూలిన ప్రదేశం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, విన్‌హెడో పట్టణంలో విమానం పడిన చోటు 'ఏరియల్ వ్యూ'

ఇళ్ల మధ్యలోనే..

విన్‌హెడోలో విమానం జనావాసాల మధ్యలో పడిపోయింది. స్థానిక కండోమినియం కాంప్లెక్స్‌లోని ఒక ఇల్లు దెబ్బతిన్నట్లు అధికారులు చెప్పారు.

ఈ ప్రమాదానికి సంబంధించి ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ ప్రాంతంలో చాలా ఇళ్లు ఉన్నట్లు అందులో కనిపిస్తోంది. విమానం కిందపడ్డాక అక్కడ మంటలు చెలరేగడం, పొగలు రావడం కనిపిస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఫ్లైట్ రికార్డర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విచారణకు సహకరిస్తామని ఫ్రెంచ్-ఇటాలియన్ విమానాల తయారీ సంస్థ ఏటీఆర్ తెలిపింది.

ఎప్పుడు జరిగింది?

విమానాల రాకపోకలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ ‘ఫ్లైట్‌రాడార్24’ ప్రకారం శుక్రవారం రాత్రి 8:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం 11:56) కాస్కావెల్ నుంచి విమానం బయలుదేరింది. దాదాపు గంటన్నర తర్వాత విమానం నుంచి చివరి సిగ్నల్ అందింది.

2010లో తయారైన ఈ విమానం "చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్, విమానం ఎగరడానికి సురక్షితమనే సర్టిఫికేట్‌తో పాటు మంచి కండీషన్‌లోనే ఉంది" అని బ్రెజిల్ పౌర విమానయాన సంస్థ తెలిపింది.

విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సక్రమంగా లైసెన్స్ పొందారని, సరైన అర్హతలు ఉన్నాయని పేర్కొంది. మరణించిన ప్రయాణీకులలో ఇద్దరు ట్రైనీ డాక్టర్లు ఉన్నారని కాస్కావెల్‌లోని యుపెక్కాన్ క్యాన్సర్ హాస్పిటల్ బీబీసీ బ్రెజిల్‌కు తెలిపింది.

విమానం కూలిపోతుండగా పలువురు స్థానికులు చూశారు.

బ్రెజిల్ విమాన ప్రమాదం జరిగిన ప్రదేశం సమీపంలో గుమిగూడిన జనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విమాన ప్రమాదం జరిగిన ప్రదేశం సమీపంలో గుమిగూడిన జనం

గిరగిరా తిరుగుతూ పడిపోయింది: స్థానికులు

"విమానం పడిపోతున్న శబ్దం విని మా ఇంటి కిటికీలోంచి పైకి చూశాను. అది కూలిపోవడం కనిపించింది" అని ఫెలిప్ మగల్హేస్ రాయిటర్స్ వార్తాసంస్థతో తెలిపారు. ఆ దృశ్యం భయపెట్టిందని ఆయన అన్నారు.

‘‘భోజనం చేస్తుండగా చాలా దగ్గరగా పెద్ద శబ్దం వినిపించింది. అది డ్రోన్ శబ్దంలాగా ఉంది. కానీ చాలా పెద్దగా ఉంది’’ అని మరొక నివాసి నథాలీ సికారీ సీఎన్ఎన్ బ్రెసిల్‌ వార్తాసంస్థతో తెలిపారు.

"విమానం చుట్లు తిరుగుతుండగా బాల్కనీ నుంచి చూశాను. అది సాధారణంగా విమానం తిరిగే విధానం కాదని గ్రహించాను" అని అన్నారు.

బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా మృతులకు నివాళులర్పించారు, బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. సావో పాలో గవర్నర్ టార్సియో గోమ్స్ డి ఫ్రీటాస్ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.

2007లో సావో పాలోలోని కాంగోన్‌హాస్ విమానాశ్రయంలో టీఏఎమ్ ఎక్స్‌ప్రెస్ విమానం కూలి 199 మంది మరణించారు. ఆ తర్వాత బ్రెజిల్‌లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇదే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)