న్యూ ఇయర్‌లో ఎన్నోచేయాలనుకుని, ఏమీ చేయలేకపోవడానికి కారణమేంటి?

న్యూ ఇయర్ తీర్మానాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త సంవత్సరాన మీరు చేసుకొనే తీర్మానం స్వభావం, దాని సాధ్యాసాధ్యాలే అది నేరవేరుతుందా? లేదా అనే అంశాలను నిర్ణయిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
    • రచయిత, శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేను 2019 జనవరి 1న బరువు తగ్గాలని తీర్మానించుకున్నా. ఆ తర్వాత వచ్చిన మరో రెండు కొత్త సంవత్సరాల వేళ కూడా నా తీర్మానం ఇదే.

2022లో అంటే నాలుగోసారి కూడా నేను బరువు తగ్గాలనే తీర్మానించుకున్నప్పటికీ నా బరువు 93 కేజీలకు చేరింది. మొదటిసారి బరువు తగ్గాలని నిర్ణయించుకున్నప్పటితో పోలిస్తే మరో 10 కేజీల బరువు పెరిగాను.

2024 ఏడాది ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. గతంతో పోలిస్తే నేను ఇప్పుడు 20 కేజీల బరువు తగ్గాను. ఒక తీర్మానం చేసుకున్నాక తొలి మూడు ఏళ్లలో సాధించలేని నేను, తర్వాతి మూడు ఏళ్లలో ఎలా సాధించగలిగాను?

కొత్త సంవత్సరాన మీరు చేసుకొనే తీర్మానం స్వభావం, దాని సాధ్యాసాధ్యాలే అది నేరవేరుతుందా? లేదా అనే అంశాలను నిర్ణయిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

న్యూ ఇయర్ తీర్మానం ఎలా ఉండాలి? విజయవంతంగా దాన్ని ఎలా సాధించాలి? అనే విషయాల గురించి నిపుణులతో బీబీసీ చర్చించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
న్యూ ఇయర్ రిజల్యుషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త ఆరంభాలు, తీర్మానాలు అనే వాటిని న్యూ ఇయర్‌తో ముడిపెడుతుంటారు.

ఈ సంప్రదాయం ఎప్పుడు, ఎందుకు మొదలైంది?

ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతుల్లో ఈ ఆచారాన్ని పాటిస్తారు. 4 వేల ఏళ్ల క్రితం బాబిలోనియన్ నాగరికతలో ఈ ఆచారాన్ని మొదట గుర్తించినట్లుగా అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, అంతకంటే ముందు నుంచే ఈ ఆచారం ఉండొచ్చని పరిశోధకులు అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చాలామంది కొత్త సంవత్సరం రోజున తీర్మానాలు చేసుకుంటారని, అయితే వాటిని అనుసరించడంలో విఫలమవుతారని బీబీసీతో సైక్రియాటిస్ట్ గౌతమ్ దాస్ అన్నారు.

''కొత్త సంవత్సర ప్రారంభాన్ని ప్రజలు ఒక కొత్త ఆరంభంగా చూస్తారు. ఆరోజున తమ జీవితాల్లో ఏదైనా కొత్త విషయాన్ని చేయాలని అనుకుంటారు. కొత్త సంవత్సరం మొదటి రోజున ఏదైనా పని ప్రారంభిస్తే ఏడాది పొడవునా శుభం, సంతోషాలు జరుగుతాయని ప్రజలు నమ్ముతారు'' అని ఆయన వివరించారు.

మామూలుగా కొత్త ఆరంభాలు, తీర్మానాలు అనే వాటిని న్యూ ఇయర్‌తో ముడిపెడుతుంటారు.

వారంలో తొలి రోజైన సోమవారాన్ని కూడా కొత్త పనులు, కొత్త ఆరంభాలకు గుర్తుగా భావిస్తారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీని ప్రకారం ప్రజలు తమ వ్యక్తిగత లక్ష్యాలను నూతన సంవత్సర సమయాల్లోనే కాకుండా సోమవారం రోజు కూడా మొదలుపెడతారని తెలిసింది.

న్యూ ఇయర్ రిజల్యుషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త ఏడాది తీసుకునే నిర్ణయాల్లో శారీరక ఆరోగ్యం, మారుతున్న అలవాట్ల గురించే ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చూపుతున్నాయి.

ఆచరణ సాధ్యం కాని తీర్మానాలు

ప్రజలు కొత్త సంవత్సరం రోజున సాధారణంగా బరువు తగ్గడం, రోజూ వ్యాయామం చేయడం, డబ్బు పొదుపు, మంచి డైట్ తీసుకోవడం, నచ్చిన పని చేయడం, కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం, కొత్త అలవాట్లు చేసుకోవడం, మద్యం, సిగరెట్ మానేయడం వంటి తీర్మానాలు చేసుకుంటారు.

యూగౌ వెబ్‌సైట్ ప్రకారం, మిలీనియల్స్ ఎక్కువగా ఈ ఆచారాన్ని పాటిస్తారు. వీరు ఈ విషయంలో తమ ముందు తరం వారిని అనుసరిస్తారు.

కొత్త ఏడాది తీసుకునే నిర్ణయాల్లో శారీరక ఆరోగ్యం, మారుతున్న అలవాట్ల గురించే ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చూపుతున్నాయి.

ఈ తీర్మానాలు చేసుకునే వారిలో కేవలం 55 శాతం మంది మాత్రమే వాటిని ఏడాదంతా పాటిస్తున్నారని 2020 నాటి ఒక అధ్యయనంలో గుర్తించారు. కానీ, ఈ సంఖ్య మరింత తక్కువగా ఉండొచ్చని సైక్రియాటిస్ట్ గౌతమ్, కౌన్సిలర్ చిత్రా అరవింద్ చెప్పారు.

ఆచరణ సాధ్యం కాని తీర్మానాలు చేసుకోవడమే దీనికి కారణమని డాక్టర్ గౌతమ్ అన్నారు.

న్యూ ఇయర్ రిజల్యుషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త సంవత్సరం రోజున చేసుకున్న తీర్మానాలు వాస్తవానికి దూరంగా, ప్రణాళిక రహితంగా ఉంటే వాటిని చేరుకోలేరని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎందుకు ఆచరించలేకపోతున్నారు?

కొత్త సంవత్సరం రోజున చేసుకున్న తీర్మానాలు వాస్తవానికి దూరంగా, ప్రణాళిక రహితంగా ఉంటే వాటిని చేరుకోలేరని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

స్వీయ ఆసక్తి, అంతర్గత ప్రేరణ అనే రెండు అంశాలు వీటిపై ప్రభావం చూపుతాయని డాక్టర్ గౌతమ్ అన్నారు.

ఉదాహరణకు ఇతరులకు నచ్చడం లేదని, వారి నుంచి అభ్యంతరకర మాటలు వినాల్సి వస్తుందనే కారణంతో కొందరు పొగతాగడం మానేద్దామని తీర్మానించుకుంటారు. కానీ, ఇది స్వీయ ఆసక్తితో చేస్తున్నది కాకపోవడం, ఇతరుల కోసం చేయడం వల్ల అది ముందుకు సాగదని డాక్టర్ గౌతమ్ చెప్పారు.

శారీరక ఆరోగ్యం గురించి అంతర్గత ప్రేరణతో ఎవరైనా జిమ్‌కు వెళ్లాలనే తీర్మానం చేసుకుంటే ఇది ఏడాదంతా ముందుకు సాగుతుందని ఆయన వివరించారు. అయితే, సాధ్యాసాధ్యాలను పరిశీలించుకొని తీర్మానాలు చేసుకోవాలని ఆయన సూచించారు.

డాక్టర్ గౌతమ్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ గౌతమ్

తీర్మానాలను పాటించడానికి ఏం అవసరం?

కొత్త ఏడాది తీసుకున్న తీర్మానాలు విఫలమవ్వడానికి వాటిని వాయిదా వేయడమే ప్రధాన కారణమని మానసిక ఆరోగ్య కౌన్సిలర్ చిత్ర చెప్పారు.

''ఈరోజు బిర్యానీ తిని, రేపటి నుంచి ఎక్సర్‌సైజ్ చేద్దామని ఆలోచనతో వాయిదాల పర్వం మొదలవుతుంది'' అని ఆమె తెలిపారు.

రోజూ వ్యాయామం చేయాలనే నిబద్ధతతో ఉండటమే కాకుండా దాన్ని రోజూ ఎలా చేయాలనే ప్రణాళికతో ఉండటం చాలా ముఖ్యమని డాక్టర్ గౌతమ్ తెలిపారు.

ఎక్సర్‌సైజ్ చేయాలని నిర్ణయించుకోవడం కంటే మీరు ఏ స్థాయిలో వ్యాయామం చేయగలరో గ్రహించి దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలని ఆయన అన్నారు.

''మొదటిరోజే మీరు కఠోర వ్యాయామం చేస్తే మరుసటి రోజు ఒళ్లు నొప్పులతో అది వాయిదా పడుతుంది. కాబట్టి మీకు వీలైనట్లుగా రోజూ 10 లేదా 15 నిమిషాలు వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుండటం వల్ల ఉత్సాహం పెరిగి మీకు అదనపు ప్రయోజనాలు కలుగుతాయి'' అని ఆయన వివరించారు.

న్యూ ఇయర్ రిజల్యుషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాధించగలిగే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ముఖ్యం.

మీరు ఏదైనా ఒక పనిని 21 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే అది అలవాటుగా మారుతుందనే అంశం గురించి కౌన్సిలర్ చిత్ర ప్రస్తావించారు.

''ఈ 21 రోజుల కాలగణన అన్నింటికీ, అన్ని రకాల అలవాట్లకు వర్తించదు. ప్రతీ అలవాటుకు ఉండే స్వభావం కారణంగా మన మెదడులోని నాడీ వ్యవస్థ స్పందించే సమయం వేర్వేరుగా ఉంటుంది. అయితే, ఒక పని అలవాటు కావడానికి క్రమం తప్పకుండా సగటున 21 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఒక రోజు చేయకపోయినా మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాలి'' చిత్ర అన్నారు.

సాధించగలిగే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాన్ని సాధించడానికి ప్రణాళిక రూపొందించుకోవడం, అడ్డంకులను గుర్తించి వాటిని తగినట్లుగా సిద్ధమై ముందుకు సాగాలని గౌతమ్ వివరించారు.

సైకియాట్రిక్ కౌన్సిలర్ చిత్ర
ఫొటో క్యాప్షన్, సైక్రియాటిక్ కౌన్సిలర్ చిత్ర

న్యూ ఇయర్ తీర్మానాల పర్యవసానాలు

కొత్త సంవత్సర తీర్మానాలను విజయవంతంగా అనుసరిస్తే ప్రయోజనాలు కలిగినట్లే, వాటిని సరిగ్గా అనుసరించకపోతే వ్యతిరేక ప్రభావాలు కూడా కలుగుతాయని సైక్రియాటిస్ట్ గౌతమ్ అన్నారు.

''ఒక వ్యక్తి అయిదేళ్లుగా కొత్త సంవత్సరం రోజున ఒకే తీర్మానాన్ని చేసుకుంటున్నాడని అనుకోండి. కానీ, ప్రతీ ఏడాది దాన్ని నెరవేర్చుకోవడంలో విఫలం అవుతున్నాడు. ఇది అతని మానసిక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అతని ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది'' అని గౌతమ్ వివరించారు.

ఆచరణకు సాధ్యం కాని తీర్మానాలు చేసుకుంటే అందులో విఫలం కావడం ఖాయమని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తనను తాను ఫెయిల్యూర్‌లా భావిస్తాడని ఆయన చెప్పారు.

కాబట్టి కొత్త సంవత్సరం రోజున తీసుకునే తీర్మానాలు సరైనవి కాకపోతే ఒక వ్యక్తికి అవి చేటు చేస్తాయని ఆయన అన్నారు.

నేను బరువు తగ్గాలని మొదట నిర్ణయించుకున్నప్పుడు తొలి మూడేళ్లలో ఇలాంటి పొరపాట్లే చేశాను. కానీ, నాల్గవసారి నిర్ణయించుకున్నప్పుడు నా బరువును దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజూ కనీస వ్యాయామాలు చేయాలని నిర్ణయించుకున్నా.

ఇలా రోజూ ఏదో ఒక రకమైన వ్యాయామాన్ని చేయడంలో విజయం సాధించాను. తర్వాత నా ఆహారపు అలవాట్లను మార్చుకున్నాను. ఈ విధంగా మార్పులు చేసుకోవడం వల్ల నా లక్ష్యాన్ని చేరగలిగాను.

''మనం ఏదైనా లక్ష్యాన్ని ఒక గంటలోనో లేదా ఒక ఏడాదిలోనో పూర్తి చేయలేం. కొత్త సంవత్సర లక్ష్యాలను నిర్దేశించుకునేటప్పుడు మొదటగా ఆ లక్ష్యం నెరవేరడానికి ఎంత సమయం పడుతుందో గ్రహించి, ఆ మేరకు సిద్ధం కావడం ముఖ్యం'' గౌతమ్ వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)