గాజా: చలికి చనిపోతున్న పసికందులు

సిలా తండ్రి
ఫొటో క్యాప్షన్, పాప మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళుతున్న సిలా తండ్రి
    • రచయిత, ఎమిర్ నాదెర్
    • హోదా, బీబీసీ న్యూస్, జెరూసలెం నుంచి

సిలాలో కదలికలు లేవని తల్లి తల్లి నారిమన్ గుర్తించినప్పుడు ఆ పాపకు మూడు వారాల వయసు కూడా లేదు.

''నేను పొద్దునే లేచి చూసేసరికి పాప కదలకుండా ఉండటాన్ని చూసి నా భర్తకు చెప్పాను. దీంతో ఆయన పాప ముఖంపై ఉన్న వస్త్రాన్ని తీసి చూసేసరికి నీలి రంగులోకి మారిపోయి, నాలుక కరుచుకుపోయి ఉంది. పాప నోటి నుంచి రక్తం కారుతోంది.'' అని నారిమన్ అల్- నజ్మేహ్ చెప్పారు.

దక్షిణ గాజాలో సముద్రపు ఒడ్డున ఉన్న గుడారంలో నారిమన్ తన భర్త మహమూద్ ఫాసిహ్‌, తన ఇద్దరు పిల్లలు నాలుగేళ్ల రయాన్, రెండున్నరేళ్ల నిహాద్‌తో కలిసి కూర్చుని ఉన్నారు.

14 నెలలుగా సాగుతోన్నయుద్ధంతో 10 సార్లకు పైగా నిరాశ్రయులమయ్యాం అని ఆ కుటుంబం చెప్పింది.

''నా భర్త మత్స్యకారుడు. మేం ఉత్తరం నుంచి వచ్చాం. కట్టుబట్టలతో బయటికి వచ్చేశాం. కానీ, మా పిల్లల కోసం ఇది తప్పడం లేదు.'' అని బీబీసీతో కలిసి పనిచేసే ఫ్రీలాన్స్ కెమెరామెన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారిమన్ చెప్పారు. గాజాలోకి వెళ్లి, స్వేచ్ఛగా రిపోర్టు చేయకుండా అంతర్జాతీయ మీడియాను ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది.

''నేను గర్భిణీగా ఉన్నప్పుడు, నా భర్తకు పనులు లేకపోవడంతో పుట్టబోయే బిడ్డకు బట్టలు ఎలా తేవాలా అని ఆలోచించి, చాలా ఆందోళన చెందేదాన్ని'' అని నారిమన్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
సిలా తల్లిదండ్రులు
ఫొటో క్యాప్షన్, గర్భిణీగా ఉన్నప్పుడు, పుట్టబోయే బిడ్డకు బట్టలు ఎలా తేవాలా అని నారిమన్ ఆందోళన చెందేవారు

బాంబు దాడుల వల్ల కాదు...

సిలా జీవించిన 20 రోజులలో వీరు అల్-మవాసిలోని శరణార్థి ప్రాంతంలో విపరీతమైన రద్దీతో ఉన్న ఓ చిన్నక్యాంప్‌సైట్‌లో ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలతో గాజాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వందల వేల మంది పాలస్తీనియన్లు ఆ సమయంలో ఇదే ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు.

ఈ ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య సౌకర్యాలు లేవు. అలాగే, వర్షం పడినా, మధ్యధరా సముద్రం నుంచి అలలు కొట్టుకువచ్చినా వరద ముంచెత్తుతుంది.

''చలి తీవ్రంగా ఉంది. చలి కారణంగా రాత్రంతా మేమందరం ఒకరినొకరం గట్టిగా పట్టుకుని పడుకోవాల్సి వస్తుంది.'' అని సిలా తండ్రి మహమూద్ చెప్పారు.

''మా జీవితం నరకంగా ఉంది. యుద్ధం వల్ల ఇది నరకంలా మారింది. మా కుటుంబ సభ్యులు అమరులయ్యారు. ఈ పరిస్థితి భరించలేనిది.'' అని చెప్పారు.

ప్రజలను సురక్షితంగా ప్రకటించిన ఈ ప్రాంతానికి వెళ్లాలని చెబుతున్నప్పటికీ, హమాస్‌కు, గాజాలోని ఇతర సాయుధ దళాలకు వ్యతిరేకంగా అల్-మవాసిపై ఇజ్రాయెల్ సైన్యం పదేపదే దాడి చేసింది.

సిలా బాంబు దాడితో చనిపోలేదు. కానీ, యుద్ధం కారణంతో ప్రజలు ఎదుర్కొంటోన్న కఠిన పరిస్థితులు ఆమె చావుకు కారణమయ్యాయి.

గాజాలో రెండు వారాల వ్యవధిలో హైపోథెర్మియా (శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం)తో చనిపోయిన ఆరుగురు నవజాత శిశువుల్లో సిలా కూడా ఉన్నారు. స్థానిక వైద్య అధికారుల ప్రకారం రాత్రిపూట గాజాలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతున్నాయి. ఈ వాతావరణ పరిస్థితులతో వేలాది టెంట్లు కూడా దెబ్బతింటున్నాయి.

సిలా తోబుట్టువులు

‘చలికి చనిపోతుందనుకోలేదు’

గాజాలోకి వచ్చే ఆహారం, ఇతర మానవతా సాయాలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆంక్షలు విధించిందని ఐరాస చెప్పింది. యుద్ధంలో మానవతా సంక్షోభాన్ని ఇది తీవ్రతరం చేస్తుందని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది.

ఖాన్ యునిస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బ్రిటీష్ ఫీల్డ్ హాస్పిటల్‌లో సిలా పుట్టినట్లు నారిమన్ చెప్పారు.

''నేను పాపకు జన్మనిచ్చిన తర్వాత, ఆమెకు పాలు, బట్టలు ఎక్కడ నుంచి తీసుకురావాలని బాగా ఆలోచించాను. అన్నీ అందాక, ఇంత పెద్ద కష్టాన్ని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని నారిమన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

''ఒక టెంట్ కింద, ఇంత గడ్డకట్టే చలిలో, మాపై నీటి బిందువులు పడుతున్నప్పుడు పాపకు జన్మనిస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. టెంట్ నుంచి నీళ్లు లీకవుతూ, మాపై పడేవి. పాప కోసం మేం వీటినుంచి తప్పించుకోవడానికి దూరంగా వెళ్లేవాళ్లం.'' అని నారిమన్ చెప్పారు.

అయినప్పటికీ, ఎలాంటి సమస్యలు లేకుండానే సిలా ఈ భూమిపైకి వచ్చింది.

''ఆమె ఆరోగ్యం బాగుంది. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాం. కానీ, అకస్మాతుగా చలివల్ల బిడ్డకు ఇబ్బందులు మొదలయ్యాయి'' అని నారిమన్ చెప్పారు.

''పాపకు తుమ్ములు రావడం చూశాను. చలి వల్ల పాపకు అనారోగ్యం పాలైనట్లు కనిపించింది. కానీ, చలి వల్ల చనిపోతుందని నేనసలు అనుకోలేదు'' అని అన్నారు.

సిలాను ఖాన్ యునిస్‌లోని నాసర్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి చేర్పించాం. శిశు వైద్య విభాగంలోని డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్-ఫర్రా పాపకు వైద్యం చేశారు. ''తీవ్ర హైపోథెర్మియాతో పాప బాధపడుతోంది. ఇది ప్రాణపాయ పరిస్థితులకు దారి తీసింది. కార్డియాక్ అరెస్ట్ వచ్చి, పాప మరణించింది'' అని డాక్టర్ చెప్పారు.

''మరో ఇద్దరి పిల్లలకు కూడా ఇలానే జరిగింది. ఒకరికి మూడు రోజులు, మరొకరికి నెల కంటే తక్కువ వయసు ఉంటుంది. ఈ రెండు కేసులలో కూడా పిల్లలు తీవ్రమైన హైపోథెర్మియాతో బాధపడుతూ, మరణించారు'' అని డాక్టర్ ఫర్రా తెలిపారు.

పిల్లల్లో సొంతంగా తమ శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రించుకోగలిగే వ్యవస్థలు పుట్టిన వెంటనే అంతగా అభివృద్ధి చెందవు. చలి వాతావరణంలో చాలా వేగంగా హైపోథెర్మియా వస్తుంది.

నెలలు నిండకముందే జన్మించిన పిల్లలు చాలా వేగంగా దీనికి గురవుతారని డాక్టర్ ఫర్రా చెప్పారు. యుద్ధ కాలంలో, నెలలు నిండకముందే పుడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నట్లు గాజాలోని వైద్యులు గుర్తించారు.

తల్లులు కూడా పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో, పిల్లలకు సరిపడా పాలు ఇవ్వలేకపోతున్నారు.

సిలా తల్లిదండ్రులు

‘బాబు గడ్డకట్టిపోయాడు’

బీబీసీతో కలిసి పనిచేసే రెండో స్థానిక కెమెరామాన్ సెంట్రల్ గాజాలోని అల్-అఖ్సా ఆస్పత్రిలో యెహియా అల్-బత్రాన్‌ను కలిశారు. చనిపోయిన తన బాబును పట్టుకున్నప్పుడు, ఏడుపును ఆపుకోలేకపోయారు అల్-బత్రాన్. సిలా మాదిరి ఆ బాబు పుట్టి 20 రోజులవుతుంది. చలితో మొత్తం నీలం రంగులోకి మారిపోయాడు.

''మీ చేతితో బాబును పట్టకుంటే గడ్డకట్టినట్టు ఉంటాడు'' అని యెహియా అల్-బత్రాన్ అన్నారు.''మా ఎనిమిది మందికి కనీసం నాలుగు దుప్పట్లు కూడా లేవు. నేనేం చేయగలను? నా కళ్ల ముందే నా బిడ్డలు చనిపోవడాన్ని చూస్తున్నా'' అని అల్-బత్రాన్ కన్నీరుమున్నీరయ్యారు.

''నిరోధించగలిగే ఈ మరణాల వల్ల గాజాలో కుటుంబాలు, పిల్లలు తీవ్ర కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. '' అని యూనిసెఫ్ రీజనల్ డైరెక్టర్ ఎడ్వర్డ్ బీగ్‌బెడర్ గురువారం జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

'' రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత కనిష్ఠ స్థాయిలకు పడిపోతాయి. వారు భరిస్తోన్న అమానవీయ పరిస్థితుల వల్ల మరింత మరింత మంది చిన్నారులు చనిపోనున్నారని మనం ముందుగా గ్రహించాల్సిన విషయం'' అని అన్నారు.

తన నవజాత శిశువు మృతదేహాన్ని పాతిపెట్టేందుకు మహమ్మద్ గొయ్యి తవ్వారు

‘యుద్ధం వల్ల కాకపోయినా, చలికి చనిపోతాం’

ఇజ్రాయెల్ డ్రోన్లు ఆకాశంలో తిరుగుతుండగా, నాసర్ ఆస్పత్రిలో మరణించిన సిలా మృతదేహాన్ని, ఖాన్ యునిస్‌లోని శ్మశాన వాటికి తీసుకెళ్లారు తండ్రి మహమూద్. అక్కడున్న ఇసుకలో అంత్యక్రియలు నిర్వహించారు. పాపను ఆ స్థితిలో చూసిన నారిమన్‌ను తట్టుకోలేకపోయారు. మహమూద్ ఆమెను ఓదార్చారు.

''ఆమె తోబుట్టువులు కూడా అనారోగ్యంగా ఉన్నారు. మేమందరం అనారోగ్యంతో ఉన్నాం. మా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. చలి, వర్షాలతో మేం గడ్డకట్టిపోతున్నాం.'' అని నారిమన్ చెప్పారు. ఒకవేళ యుద్ధంలో తాము చనిపోకపోయినా,చలితోనైనా చనిపోతామన్నారు.

వీడియో క్యాప్షన్, తాత్కాలిక శిబిరాలలో చలికి తట్టుకోలేక చనిపోతున్న గాజా పసికందులు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)