ఇజ్రాయెల్: ‘బందీగా ఉన్న నా కూతురిని ఏ క్షణంలోనైనా చంపేస్తారని నిత్యం భయపడుతున్నా’

ఫొటో సోర్స్, Mandy Damari
- రచయిత, లూసీ మానింగ్
- హోదా, స్పెషల్ కరస్పాండెంట్
‘‘హమాస్ చెరలో ఉన్న నా బిడ్డ గురించి అనుక్షణం భయపడుతూనే ఉన్నా. ఆమె చనిపోయిందేమోనని నాకు భయంగా ఉంది. తను బతికి ఉన్నా అన్నపానాలు లేక అవస్థ పడుతూ ఉంటుంది. అనారోగ్యం పాలై ఉంటుంది’’ అని వాపోయారు మాండీ.
మాండీ కూతురి పేరు ఎమిలీ డమారీ. వయసు 28 సంవత్సరాలు. గత 400 రోజులుగా హమాస్ చెరలో ఉన్న బ్రిటిషు ఇజ్రాయెలీ ఆమె. 2023 అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఆమె ఇంటి నుంచి ఎమిలీని హమాస్ దళాలు ఎత్తుకుపోయాయి.
హమాస్ దగ్గర 400 రోజులనుంచి బందీగా ఉన్న తన కూతురి గురించి అనుక్షణం భయపడుతూనే ఉన్నట్టు తొలిసారి ఇచ్చిన టెలివిజన్ ఇంటర్వ్యూలో బీబీసీకి చెప్పారు మాండీ.
‘‘నా కూతురి చేతికి, కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆ గాయాలతో ఆమె ఎంతో బాధపడుతోంది. ఆమె గురించి ప్రతి రోజూ ప్రతిక్షణం ఆందోళన చెందుతున్నా. ఆమెను ఏ క్షణంలోనైనా చంపేస్తారేమోననే భయం వెంటాడుతోంది’’ అని అన్నారామె.
మాండీ డమారీ బ్రిటన్‌లోని సర్రేలో జన్మించారు. బందీల విడుదల కోసం చర్చలు కొనసాగుతున్న వేళ వారికి మరింతగా మానవతా సాయం అందేలా చూడటానికి బ్రిటిషు ప్రభుత్వం కృషి చేయాలని ఆమె కోరారు.
తాను జనవరిలో పదవీబాధ్యతలు స్వీకరించేలోపు బందీలను విడుదల చేయకపోతే మూల్యం చెల్లించక తప్పదని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను మాండీ స్వాగతించారు. ఈ ప్రకటన కొంచెం ఊరట కలిగిస్తోందని అన్నారు.

తాళంలో చిక్కుకున్న బుల్లెట్
హమాస్ సాయుధులు 14 నెలల కిందట క్ఫార్ అజా ప్రాంతంపై దాడి చేసిప్పుడు ఎమిలీపై కాల్పులు జరిపారు. ఆమె కుక్కను చంపేశారు. ఆ సమయంలో మాండీ ఇంట్లోకి వెళ్లి ఓ గదిలో దాక్కుకున్నారు. ఆ గదిపైకి జరిపిన కాల్పుల్లో ఒక బుల్లెట్ గదికి ఉన్న తాళంలో ఇరుక్కుపోవడంతో ఆమె బతికి బయటపడ్డారు.
ఆ రోజున 1,200మంది చనిపోయారు. హమాస్ సాయుధులు ఎమిలీ సహా 250మందిని బందీలుగా పట్టుకుని గాజాకు తీసుకువెళ్లారు.
గాజాలో కాల్పుల విరమణకు ప్రతిగా మిగిలిన 97మంది బందీలను విడుదల చేయించే ఒప్పందం కోసం అమెరికా, ఈజిప్ట్, ఖతార్ నెలల తరబడి ప్రయత్నించాయి. కానీ హమాస్, ఇజ్రాయెల్ పరస్పర నిందారోపణల కారణంగా ప్రతిష్ఠంభన ఏర్పడింది.
హమాస్, గాజా గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా డోనల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. ‘‘ప్రపంచ అభీష్ఠానికి వ్యతిరేకంగా, అమానవీయంగా, హింసాత్మకంగా మధ్యప్రాచ్యంలో చెరను అనుభవిస్తున్న బందీల విడుదల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు’’ అని అందులో రాశారు.
‘‘జనవరి 20, 2025కు ముందు బందీలను విడుదల చేయకపోతే, నేను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజున మధ్యప్రాచ్యంలో మానవాళిపై ఈ అఘాయిత్యాలకు పాల్పడినవారు మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని రాశారు.
‘‘డోనల్డ్ ట్రంప్ పోస్టు కొద్దిగా ఆశను కల్పిస్తోంది. ఇక్కడ జరుగుతున్నదానిపై ఎవరో ఒకరు నిజంగా స్పందించడం ఆశను రేకెత్తిస్తోంది’’ అని డమారీ చెప్పారు.
‘‘ఎవరో ఒకరు బందీలను విడుదల చేయించడానికి గట్టి చర్యలు తీసుకోవాలి. ట్రంప్ చెప్పిన మాట ఇటీవల కాలంలో నేను విన్న అత్యంత బలమైన మాట’’ అని తెలిపారు.
తన కుమార్తె సహా ఇతర బందీలను విడుదల చేయించడానికి ట్రంప్ తగిన చర్యలు తీసుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమిలీ ఫుట్‌బాల్ అభిమాని అని, యూకేకు వచ్చి కుటుంబాన్ని కలుసుకోవడం, షాపింగ్ చేయడం, పబ్‌లకు వెళ్లడాన్ని ఇష్టపడేదని తెలిపారు మాండీ . అయితే బ్రిటిషు ప్రభుత్వ తీరుపై మాండీ నిరాశతో ఉన్నారు. ప్రస్తుతం ఆమె యూకేలో ప్రధాని సహా రాజకీయ నాయకులను కలుసుకుంటున్నారు.

‘ఎమిలీ గొంతుగా మారుదాం’
గాజాలో తక్షణమే కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి చేసిన ముసాయిదా తీర్మానానికి యూకే ప్రభుత్వం ఇటీవల మద్దతిచ్చింది. కానీ ఇది బందీల విడుదలకు ఉపయోగపడదని ఆమె అభిప్రాయపడ్డారు.
బందీలను విడుదల షరతును కూడా ముసాయిదాలో చేర్చాలని ఆమె కోరారు. కానీ అమెరికా దానిని వీటో చేసింది. ఇది కాల్పుల విరమణకు ముందస్తు షరతు కాబోదని తెలిపింది.
‘‘బందీల విడుదలకు ముందస్తు షరతు అవసరం లేదనడంతో వాళ్లు నా గుండెల్లో పొడిచినట్లు అనిపించింది. బందీలను విడుదల చేయకుండా కాల్పుల విరమణ జరిగితే బందీలు ఎప్పటికీ అక్కడే ఉంటారు. అది ఎమిలీ కోసం డెత్ వారెంట్ పై సంతకం చేయడమే’’ అని డమారీ అన్నారు.
"బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను వెంటనే విడుదల చేయించలేకపోతే ఆమెకు మానవతా సహాయమైనా అందించండి. కనీసం ఆమె బతికి ఉందనే సమాచారమైనా ఇవ్వండి. అసలు ఏం జరుగుతోందో నన్ను తెలుసుకోనీయండి. నా కూతురు బతికి ఉందో చనిపోయిందో అనే దిగులుతో ఉన్నాను’’ అని చెప్పారు.
తన కుమార్తెకు మానవతా సాయం అందాలని, ఆమెను ఎవరైనా చూసి రావాలని తాను ఆరాటపడుతున్నానని డమారీ చెప్పారు. బందీలకు ఏం జరుగుతుందో తెలుసుకోవడం, చూడటం మానవహక్కు అని ఆమె అన్నారు.
మొదట్లో డమారీ తన కుమార్తె గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. ఆమె విడుదల విషయంలో ప్రభుత్వాలను, చర్చలు జరిపేవారిని ఆమె నమ్మారు. కానీ ఇప్పుడు ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు బందీలుగా ఉన్నారనే విషయాన్ని బ్రిటిషు ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆమె కోరుతున్నారు.
‘‘బందీలుగా ఉన్న వారిలో ఏకైక బ్రిటిషు పౌరురాలు. ఆమెను రక్షించుకునేందుకు, ఆమె గొంతుగా మారేందుకు ప్రజలు నాకు సాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నా కుమార్తెకు అక్కడ నోరు పెగిలే పరిస్థితి లేదు’’ అని మాండీ డమారీ అన్నారు .
హమాస్ అక్టోబర్ 7నాటి దాడులకు బదులుగా ఇజ్రాయెల్ ప్రారంభించిన సైనిక చర్యలతో 44,500మందికిపైగా మరణించినట్టు హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














