హోలీ: రంగు పడేముందు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

holi

ఫొటో సోర్స్, Getty Images

రంగుల పండుగ హోలీ వచ్చేసింది.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో మార్చి 25న ఈ పండుగను జరుపుకోనున్నారు.

స్నేహితులు, బంధువుల మధ్య రంగులు చల్లుకుంటూ సరదాగా జరుపుకొనే ఈ వేడుక అంటే అందరికీ ఇష్టమే.

అయితే, చల్లుకునే రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.

సహజ రంగులు కాకుండా, రసాయనాలు ఉండే రంగులు, ఎక్కువకాలం శరీరంపై ఉండే రంగుల వంటివి కళ్లు, చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది.

ముఖ్యంగా సున్నితమైన శరీర భాగాల్లోకి ఈ రసాయనాలు చేరితే ఇబ్బంది కలుగుతుంది.

రంగుల వేడుక కోసం సిద్ధం అవుతున్న వారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు, తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి బీబీసీతో మాట్లాడారు డెర్మటాలజిస్ట్ దీపాలి భరద్వాజ్.

హోలీ పండుగ

ఫొటో సోర్స్, PIYAL ADHIKARY/EPA-EFE/REX/SHUTTERSTOCK

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • హోలీ ఆడేముందు శరీరమంతా నూనె రాసుకోవాలి. జుట్టుకు నూనె పట్టించాలి.
  • ఒకవేళ శరీరంపై గాయాలేవైనా ఉంటే, ఆ గాయాలపై బ్యాండెజ్ వేసుకోవాలి. అందువల్ల రంగులు గాయాన్ని చేరవు. ఒకవేళ సహజమైన రంగులతోనే హోలీ ఆడినా సరే, ఈ జాగ్రత్త తీసుకోవాలి.
  • ఒకవేళ ముఖంపై దద్దుర్లు, తామర వంటివి ఉంటే గనుక, మొదట సంబంధిత ఆయింట్మెంట్, ఆ తరువాత నూనెను రాయాలి.
  • ఆడ, మగ ఎవరైనా సరే, మొదట సన్‌స్క్రీన్ లోషన్‌ను రాసాక, నూనె రాసుకోవాలి.
  • బాలికలు, మహిళలు తమ చేతివేళ్లకు దట్టంగా నెయిల్ పాలిష్‌ను వేసుకోవాలి. అందువల్ల ఆ రంగు గోళ్ల కుదుళ్లకు చేరదు.
హోలీ వేడుకలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఫొటో సోర్స్, ANI

హోలీ ఆడుతున్న సమయంలో..

రంగులు నేరుగా కళ్లకు చేరకుండా మొఖానికి కళ్లజోడు ధరిస్తే మంచిది.

కళ్లద్దాలు పెట్టుకోకపోయినా సరే, ఆ రంగులు కళ్లపై పడకుండా, జాగ్రత్తగా ఆడుకోవాలి.

సాధారణ కాటన్ దుస్తులు లేదా పాతవైన ధరించి హోలీ ఆడుకోవాలి.

ఆ దుస్తులను మిగిలిన రోజుల్లో వేసుకోకుండా ఉంటేనే మంచిది. లేదంటే మరుసటి ఏడాది కోసం భద్రపర్చుకోవచ్చు.

holi

ఫొటో సోర్స్, Getty Images

అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తెలీకుండానే రసాయనాలు ఉన్న రంగులు చల్లే అవకాశం ఉంది.

లేదా కొన్ని రంగుల వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంది.

అలాంటి సమయంలో వెంటనే ఆ రంగును నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలెర్జీగా అనిపించిన చోట, నీటితో కడిగాక ఐస్‌తో మర్దన లేదా పెరుగు రాయడం వంటివి చేయాలి. లేదంటే అలోవెరా జెల్ కూడా రాయొచ్చు.

హోలీ 2024

ఫొటో సోర్స్, HARISH TYAGI/EPA-EFE/REX/SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్, సహజ రంగులతో హోలీ వేడుక చేసుకోవడం మంచిది.

హోలీ ఆడాక..

జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని రసాయనాలు ఎక్కువగా ఉండి, త్వరగా తొలగిపోని రంగులు ఉంటాయి. అవి గనుక శరీరంపై పడితే అంత త్వరగా శుభ్రం చేయడం వీలుపడదు. ఎన్నిసార్లు శుభ్రం చేసినా మార్పు కనిపించదు. అలాంటప్పుడు ఏంచేయాలి?

ఒకవేళ అలాంటి రంగులు శరీరంపై పడితే, చర్మాన్ని ఎక్కువ సేపు రుద్దడం లాంటివి చేయకూడదు. స్నానం చేసిన తరువాత ఆ ప్రదేశంలో అలోవెరా జెల్ లేదా పెరుగు రాయాలి.

10-15 నిమిషాలు ఉంచి, శుభ్రం చేయాలి.

ఆ ప్రయత్నం తరువాత కూడా రంగు పూర్తిగా తొలగకపోతే, అలోవెరా జెల్ లేదా పెరుగుతోనే శుభ్రం చేయాలే కానీ, బ్లీచ్ చేయించుకునేందుకు బ్యూటీ పార్లర్‌కు వెళ్లకూడదు.

రంగుల్లో ఉండే రసాయనాలు, చర్మం నుంచి శరీరంలోకి ప్రవేశించవచ్చు. అందువల్ల హోలీ ఆడిన వెంటనే బ్యూటీపార్లర్‌కు వెళ్లకూడదు. కనీసం ఐదు రోజులైనా వ్యవధి ఇవ్వాలి.

అన్నింటికన్నా ముఖ్యంగా హోలీ వేడుకలో పాల్గొనేముందు తగినన్ని మంచినీళ్లు తాగాలి.

వీడియో క్యాప్షన్, మోదుగు పూలతో హోలీ రంగును తయారు చేసుకోవడం ఇలా

ఇవి కూడాా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)