కాకి నితీశ్ కుమార్ రెడ్డి: ‘అవుటైతే అన్నం తినడం మానేసేవాడు.. అందుకే బౌలింగ్ కూడా నేర్పించాను’

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ లోని గాజువాక సమీపంలో తుంగ్లాం గ్రామం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మందికి తెలిసింది. దానికి కారణం టీమిండియా ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్‌లో ఆడిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్.
సీనియర్లు విఫలమైన ఈ మ్యాచ్ లో తుంగ్లాంకి చెందిన 21 ఏళ్ల తెలుగు కుర్రాడు కాకి నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడమే అందుకు కారణం.
అంతే కాదు టీమిండియాను ఫాలో ఆన్ గండం నుంచి కూడా గట్టెక్కించాడు.
బాక్సింగ్ డే మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ నితీశ్ ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ‘హానర్స్ బోర్డ్’పై నితీశ్ కుమార్ రెడ్డి పేరు చేర్చారు. బుమ్రా, నితీశ్‌ల పేర్లు ఆ బోర్డుపై చేర్చినట్లుగా ఒక వీడియోను ‘బీసీసీఐ’ షేర్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నితీశ్ కుమార్ రెడ్డికి ఇదే తొలి టెస్ట్ సిరీస్. ఈ సిరీస్‌లో తొలి మూడు టెస్టుల్లో కూడా మంచి స్కోర్ సాధించిన నితీశ్ నాలుగో టెస్టులో చేసిన సెంచరీతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
నితీశ్ సెంచరీ తరువాత తుంగ్లాం గ్రామంలో సంబరాలు జరిగాయి. తుంగ్లాంలోని నితీశ్ కుమార్ ఇంటికి చాలా మంది వస్తున్నారు.
కానీ నితీశ్ తల్లిదండ్రులు, సోదరి కూడా మ్యాచులు జరుగుతున్న ఆస్ట్రేలియాలోనే ఉన్నారు.
తుంగ్లాం గ్రామస్థులు ఏమంటున్నారో తెలుసుకునేందుకు బీబీసీ ఆ గ్రామానికి వెళ్లింది.


పెద్దవాళ్లతో నితీషే గెలిపించేవాడు: నితీశ్ స్నేహితులు
గాజువాక సమీపంలోని తుంగ్లాం గ్రామం నగర పరిధిలోనే ఉన్నప్పటికీ నగరంతో సంబంధం లేనట్లు దూరంగా ఉంటుంది.
గ్రామంలోకి ఎవరు వచ్చినా నితీశ్ కోసం వచ్చినట్లున్నారు అని అనుకుంటున్నారు. మమ్మల్ని చూసి కూడా అలాగే అనుకుని... నేరుగా నితీశ్ ఇల్లు అదే అంటూ చూపించారు.
నితీశ్ సెంచరీ చేసిన రోజు ఊరంతా సంబరాలు చేసుకున్నామని బీబీసీతో చెప్పారు.
నితీశ్ మా స్నేహితుడే. అయితే, క్రికెట్ సాధనలో బిజీ అయిన తరువాత ఊరిలో పెద్దగా ఎవరితోనూ టచ్‌లో ఉండేవాడు కాదని నితీశ్ స్నేహితుడు సుధాకర్ బీబీసీతో చెప్పారు.
‘నితీశ్‌కు ఎప్పుడూ క్రికెట్‌పైనే ధ్యాస. కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడేటప్పుడు మాకంటే పెద్దవాళ్లతోనూ ఆడేవాళ్లం. అప్పుడు నితీశ్ బౌలింగ్, బ్యాటింగ్‌లకు సీనియర్లు కూడా సరితూగేవారు కాదు. నితీశ్ మా టీంలో ఉండటం వలన పెద్దవాళ్లతో ఆడినా మేమే గెలిచేవాళ్లం’ అని సుధాకర్ గుర్తు చేసుకున్నారు.

కొడుకు క్రికెట్ కెరీర్ కోసం ఉద్యోగం వదిలేసిన తండ్రి
తండ్రి ముత్యాల రెడ్డి త్యాగమే ఇవాళ నితీశ్ కుమార్ రెడ్డిని పెద్ద క్రికెటర్‌ను చేసిందని అన్నారు ఆ గ్రామానికి చెందిన సాయిరాం. కొడుకు ఆట కోసం ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారని తెలిపారు.
ముత్యాల రెడ్డి ‘హిందుస్తాన్ జింక్ లిమిటెడ్’లో పనిచేసేవారు. గుజరాత్‌కు బదిలీ అయితే కొడుకు క్రికెట్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత కొడుకుని క్రికెట్ ప్రాక్టీసుకు, క్రికెట్ క్యాంపులకు తిప్పడమే పనిగా పెట్టుకున్నారని తుంగ్లాం గ్రామానికి చెందిన సాయిరాం బీబీసీతో చెప్పారు.
"ఉద్యోగాన్ని కూడా అతను త్యాగం చేశాడండి. నితీశ్ సక్సెస్ అవుతాడో లేదో తెలియదు. కానీ ముత్యాల రెడ్డి త్యాగం కొడుకుకు బంగారు బాటలు వేసింది. తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నితీశ్ కుమార్ ఈ రోజు ఇండియా గర్వించేటట్టు ఎదిగారు. మా గ్రామం తుంగ్లాంకి పేరు తెచ్చారు" అని సాయిరాం అన్నారు.

అల్లరి చేస్తున్నాడని గ్రౌండ్ కి తీసుకొస్తే.. కోచ్ కుమారస్వామి
నితీశ్ కుమార్ రెడ్డికి చిన్నతనంలో క్రికెట్ కోచింగ్ ఇచ్చిన కుమారస్వామితో బీబీసీ మాట్లాడింది.
ప్రాక్టీసు చేసేటప్పుడు అవుటైనా కూడా భోజనం మానేసే నితీశ్ ఇప్పుడు మెల్‌బోర్న్ వంటి మైదానంలో ఇంత సెటిల్డ్ గా బ్యాటింగ్ చేసి సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉందని కోచ్ కుమారస్వామి బీబీసీతో చెప్పారు.
కుమారస్వామి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్‌గా పని చేస్తున్నారు.
"ఆ అబ్బాయిని నాకు అప్పగించి.. ఇంట్లో చాలా అల్లరి చేస్తున్నాడండీ, కోడిగుడ్లను కూడా క్యాచ్ క్యాచ్ అంటూ విసురుతున్నాడండీ వీడు. క్రికెట్ నేర్పిస్తే కాస్త గాడిలో పడతాడని నా నమ్మకం అని నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి అన్నారు. అప్పుడు నితీశ్ వయసు 8 ఏళ్లు. ప్రాక్టీసులో చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. ఎందులోనైనా ఫస్ట్ రావాలని కోరుకునేవాడు. అవుటైతే అలిగి భోజనం మానేసేవాడు" అని కుమారస్వామి గుర్తు చేసుకున్నారు.
"క్రమంగా మంచి క్రికెటర్ అవుతాడనే విధంగా నితీశ్ ఆటతీరు మెరుగుపడింది. కానీ అవుటైతే ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. దీంతో నితీశ్‌కు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ నేర్పించాలని అనుకున్నాను. అప్పుడు నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాం. వికెట్లు తీయడం మొదలుపెట్టాడు. దీంతో బౌలింగ్‌లోనూ అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అలా క్రమంగా ఆల్ రౌండర్‌గా మారాడు" అని కుమారస్వామి బీబీసీతో చెప్పారు.

'ముందే ఆటోగ్రాఫ్ తీసుకున్నాను'
అండర్-19కి ఆడుతున్నప్పుడే అతని ఆట తీరు చూసిన నేను భవిష్యత్తులో ఇండియాకి ఆడతాడని గట్టిగా నమ్మాను. అతని ఆటో గ్రాఫ్ కూడా తీసుకున్నానంటూ నితీశ్ సంతకం చేసిన ఒక చిన్న బ్యాట్‌ను చూపించారు కోచ్ కుమారస్వామి.
ఆ బ్యాట్‌పై ‘నెవర్ గివ్ అప్’ అని రాసి సంతకం చేశాడు నితీశ్.
నితీశ్‌కు విరాట్ కోహ్లి అంటే ఎంత ఇష్టమో కోచ్ కుమారస్వామి చెప్పుకొచ్చారు.
"చిన్నప్పటి నుంచి కోహ్లి అంటే చాలా పిచ్చి. కోహ్లితో ఫోటో తీసుకోవాలని ఉండేది. ప్రయత్నించినా ఫోటో తీసుకోవడం కుదరలేదు. కానీ అదే కోహ్లి చేతుల మీదుగా క్యాప్ తీసుకున్నాడు. అదే కోహ్లి, తాను సెంచరీ చేసినప్పుడు తనకి పార్టనర్ గా ఉన్నాడు, అదే కోహ్లితో డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకున్నాడు. అంత కంటే అద్భుతమైన మూమెంట్ నితీశ్‌కు ఇంకేమీ ఉండదనుకుంటాను" అని కుమారస్వామి అభిప్రాయపడ్డారు.
విరాట్ కోహ్లీతో కలసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం అంతా కలలా ఉందని నితీశ్ కుమార్ కూడా అన్నారు.
కోహ్లీ తన ఆరాధ్యదైవమని...అతనితో కలసి ఆడటం కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూశానని, అది ఇప్పుడు నిజమైందని నితీశ్ చెప్పారు.
ఆస్ట్రేలియాలో నితీశ్ ఆట చూస్తుంటే తనకు తొలి సిరీస్ అని అనిపించలేదు. చాలా పరిణతితో ఆడుతున్నాడని అండర్- 19లో నితీశ్ సహచరుడు భార్గవ బీబీసీతో చెప్పారు.
‘ఆస్ట్రేలియా అంటే చాలా స్ట్రాంగ్ టీం. వారితో ఆడుతున్నప్పుడు ఏ ప్లేయర్‌కైనా ఒత్తిడి ఉంటుంది. కానీ నితీశ్‌లో అది కనపడలేదు. ఆయన మానసికంగా చాలా స్ట్రాంగ్. ఏదైనా పరిస్థితిని బాగా అర్థం చేసుకుని ప్లాన్ చేసుకుంటాడు. ఇక ఆటలో ఏదైనా కష్టతరమైన పరిస్థితి వచ్చిందంటే మాకు నితీశ్ కనిపించేవాడు. ఓడిపోయే స్థితిలో తానే భుజానవేసుకుని గెలిపించేవాడు" అని భార్గవ చెప్పారు.
భార్గవ, నితీశ్ కడపలోని క్రికెట్ అకాడమీలో కలిసి ఆడారు. అలాగే అక్కడ గురుకులం టెక్నో స్కూల్ లో కలిసి చదువుకున్నారు.
నితీశ్ 2003 మే 26న విశాఖలో జన్మించారు. తండ్రి ముత్యాల రెడ్డి, తల్లి మానస. ఆయన సోదరి తేజస్వి ఆస్ట్రేలియాలో మెడిసిన్ చదువుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














