‘చైనా మా కంప్యూటర్లను హ్యాక్ చేసింది’.. యూఎస్ ట్రెజరీ విభాగం ఆరోపణ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నదైన్ యూసిఫ్, జో టైడీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
చైనా ప్రభుత్వ అండదండలున్న హ్యాకర్ ఒకరు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ కంప్యూటర్లలోకి చొరబడ్డారని, ఉద్యోగుల వివరాలతో పాటు కొన్ని పత్రాలను హ్యాక్ చేశారని అమెరికన్ అధికారులు ప్రకటించారు.
డిసెంబర్ నెల ప్రారంభంలో జరిగిన ఈ సంఘటన గురించి ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అధికారులు ఒక లేఖలో వెల్లడించారు.
తమ దేశపు కంప్యూటర్లలో చొరబడి సమాచారాన్ని దొంగిలించడం "పెద్ద సంఘటన"గా అమెరికన్ ఏజన్సీ పేర్కొంది. దీని ప్రభావం ఎంతనేది దర్యాప్తు చేసేందుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది.
ఈ ఆరోపణలు నిరాధారమని, తమ ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నమని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

చైనాకు చెందిన హ్యాకర్ ఒకరు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు ఉపయోగించే సెక్యూరిటీ కీ అందిస్తున్న థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా తమ కంప్యూటర్లలోకి చొరబడినట్లు చట్ట సభ సభ్యులకు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ రాసిన లేఖలో పేర్కొంది.
అమెరికన్ ట్రెజరీ విభాగం భద్రతలో థర్డ్ పార్టీగా ఉన్న బియాండ్ ట్రస్ట్ కంపెనీ రాజీ పడిందని, ఈ సంఘటన తర్వాతి నుంచి ఆఫ్‌లైన్‌లో ఉందని అధికారులు తెలిపారు. హ్యాకర్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సమాచారాన్ని ఇప్పటికీ తీసుకుంటున్నట్లు ఆధారాలు ఏమీ లేవని తెలిపారు.
హ్యాకింగ్ వల్ల ఎంత మేరకు ప్రభావం పడిందనే దాని గురించి ట్రెజరీ విభాగం ఎఫ్‌బీఐతో పాటు సైబర్ సెక్యూరిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ, ప్రభుత్వేతర ఫోరెన్సిక్ విభాగాలతో దర్యాప్తు చేయిస్తోంది.
ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను బట్టి ఈ హ్యాకింగ్‌కు పాల్పడింది చైనా కేంద్రంగా పనిచేసే ‘అడ్వాన్స్డ్ పర్సిస్టెంట్ థ్రెట్ యాక్టర్’ అని భావిస్తున్నట్లు అమెరికా అధికారులు చెప్తున్నారు.
"ట్రెజరీ పాలసీ ప్రకారం, ఏపీటీ చొరబాట్లను భారీ సైబర్ సెక్యూరిటీ సమస్య" అని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అధికారులు రాసిన లేఖలో పేర్కొన్నారు.
చైనా హ్యాకింగ్ కుట్రలో లక్షల మంది అమెరికన్లు చిక్కుకున్నారు. సైబర్ హ్యాకింగ్ గురించి అమెరికా చైనా, బ్రిటన్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
హ్యాకింగ్ జరిగినట్లు అమెరికన్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు డిసెంబర్ 8న సమాచారం ఇచ్చామని బియాండ్ ట్రస్ట్ అధికార ప్రతినిధి బీబీసీకి చెప్పారు. ఈ అనుమానిత చర్యను డిసెంబర్ 2న తాము గుర్తించామని ఆ సంస్థ వెల్లడించింది. అయితే హ్యాకింగ్ జరిగిందో లేదో తెలుసుకోవడానికి తమకు మూడు రోజులు పట్టిందని బియాండ్ ట్రస్ట్ కంపెనీ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
హ్యాకర్ అప్పటికే ట్రెజరీ ఉద్యోగుల కంప్యూటర్లు, కొన్ని అధికారిక పత్రాలను సంపాదించినట్లు బియాండ్ ట్రస్ట్ అధికార ప్రతినిధి తెలిపారు.
అయితే ఆ ఫైల్స్ ఎలాంటివనేది స్పష్టం చేయలేదు. అలాగే హ్యాకింగ్ ఎప్పుడు, ఎంత సేపు జరిగిందనేదీ పూర్తిగా వెల్లడించలేదు.
హ్యాకైన కంప్యూటర్లు ఎంత ముఖ్యమైనవనేది కూడా వెల్లడించలేదు. ఉదాహరణకు వంద మంది కింది స్థాయి ఉద్యోగుల కంటే ఉన్నతస్థాయిలోని పది కంప్యూటర్లలో ఉండే సమాచారం చాలా విలువైనది.
మూడు రోజుల పాటు కొనసాగిన హ్యాకర్ల దాడిలో భాగంగా ఉద్యోగుల అకౌంట్లకు సంబంధించి పాస్ వర్డ్‌లు మార్చడం లేదా కొత్త అకౌంట్లను సృష్టించడం లాంటివి చేసి ఉండే అవకాశం ఉందని బియాండ్ ట్రస్ట్ చెబుతోంది.
హ్యాకర్లు డబ్బులు దోచుకోవడానికి బదులు, సమాచారాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నించి ఉంటారని నిఘా సంస్థలు భావిస్తున్నాయి.
"సంస్థలోని కంప్యూటర్లు, అందులో ఉన్న సమాచారానికి ఉన్న ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నాం" అని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. బయట నుంచి వచ్చే ప్రమాదాల బారి నుంచి తమ డేటాను కాపాడేందుకు నిరంతరం పని చేస్తూ ఉంటామని పేర్కొంది.
ఈ సంఘటనకు సంబంధించి అదనపు సమాచారాన్ని 30 రోజుల్లోపు అందిస్తామని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ రాసిన లేఖలో తెలిపింది.
ట్రెజరీ డిపార్ట్‌మెంట్ నివేదికను చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ల్యూ పెంగ్యూ తిరస్కరించారు. హ్యాకర్లు ఎక్కడి వారని గుర్తించడం చాలా కష్టమని అన్నారు.
"ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న సంస్థలు వృత్తిపరమైన, బాధ్యతాయుతమైన వైఖరితో వ్యవహరిస్తాయని మేం భావిస్తున్నాం. సైబర్ దాడుల గురించి ఆరోపణలు చేసేటప్పుడు పూర్తి ఆధారాలతో ఒక అవగాహనకు రావాలి. అంతే కానీ ఊహాజనిత ఆరోపణలు సరికాదు" అని ఆయన చెప్పారు.
"చైనా ప్రతిష్టను దెబ్బ తీసేలా పదే పదే ఆరోపణలు చేయడం అమెరికా ఆపాలి. చైనా నుంచి హ్యాకింగ్ ముప్పు అంటూ చేస్తున్న తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడాన్ని మానుకోవాలి" అని సూచించారు.
హ్యాకర్లు అమెరికాను ఇబ్బంది పెడుతున్న ఉన్నత స్థాయి కేసుల్లో తాజా సంఘటన ఒకటి.
డిసెంబర్‌లో టెలికామ్ సంస్థల డేటా హ్యాకింగ్ జరిగిన తర్వాత ట్రెజరీ విభాగంలో హ్యాకింగ్ జరిగింది. టెలికామ్ సంస్థల డేటా చోరీలో భాగంగా అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఫోన్ రికార్డు డేటా హ్యాకైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













