Working Hours: ఏపీలో పనిగంటలు పెరిగాయా, కార్మిక సంఘాల ఆందోళన ఏంటి?

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు ఉద్యోగులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల పని గంటలపై ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం చర్చాంశనీయమైంది.

ప్రభుత్వేతర సంస్థల్లో, కర్మాగారాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల పనిగంటలను ప్రస్తుతమున్న 8.30 గంటల నుంచి 10 గంటలకి పెంచుతూ ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది.

పని గంటల పెంపుపై క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కార్మిక చట్టాలను సవరిస్తామని రాష్ట్ర సమాచార సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే విధంగా ఈ సవరణలు చేస్తున్నట్టు తెలిపారు.

అయితే, ఈ నిర్ణయంతో ఏపీలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరగనుందని ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

క్యాబినెట్ తీసుకున్న మార్పులేంటి?

షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం ప్రైవేటు సంస్థలు, వివిధ కంపెనీలు, షాపుల్లో పని చేసే ఉద్యోగులకు ఇప్పటి వరకు ఒక రోజు పని గంటలు 8 గంటల 30 నిమిషాలు ( అర్ధగంట భోజన విరామంతో కలిపి).

ఇప్పుడు క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు పని గంటలు 10 అవర్స్ (అర్ధగంట భోజన విరామంతో కలిపి)

ఫ్యాక్టరీస్‌ చట్టం ప్రకారం ప్రస్తుతం కార్మికుల పనిగంటలు రోజుకు 9 గంటలు (అర్ధగంట భోజన విరామంతో కలిపి)

తాజా సవరణ ప్రకారం 10 గంటలు

కార్మికులకు ప్రతి 5 పని గంటలకు ఓ అర్ధగంట విరామం

ఇప్పుడు క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి ఆరుగంటలకు అర్ధగంట విరామం

గతంలో క్వార్టర్‌కు 50 నుంచి 75 గంటల వరకు ఓవర్‌ టైమ్‌ (ఓటీ) అవకాశం ఉండగా, తాజాగా దానిని 144 గంటలు వరకూ పెంచారు.

ప్రస్తుతం 8 గంటలు దాటి పనిచేస్తే ఓవర్‌టైంగా పరిగణిస్తున్నారు.

తాజా సవరణల్లో 10 గంటలు దాటిన పనిని ఓవర్‌టైంగా పరిగణిస్తారు.

అయితే, వారానికి 48 పనిగంటల పరిమితిలో మార్పు లేదు. వారం మొత్తం మీద సాధారణ పనిగంటలు 48 మాత్రమే.

చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, FB/TDP

ఈ మార్పుల కోసం ఏయే సవరణలంటే..

ఈ మార్పులు అమలు చేసేందుకు వీలుగా పరిశ్రమల చట్టం (1948)లోని 54, 55, 56, 59, 64, 65, 66 సెక్షన్లలోని కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ ప్రతిపాదించిన నిబంధనలను, ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం (1988)లోని 9, 10, 16, 17, 73 సెక్షన్లలోని కొన్ని నిబంధనలను సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారధి మీడియాకి తెలిపారు.

బిజినెస్, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత పెంచడమనే లక్ష్యంతో పాటు కార్మికులు, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు.

‘‘వారం పనిగంటల్లో మార్పు లేదు కదా.. ఆందోళన అక్కరలేదు’’

షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం వారంలో ఓ ఉద్యోగి మొత్తంగా 48 గంటలు పని చేయాలి. ఈ నిబంధనలో మార్పు రాలేదు.

నాలుగు రోజులు 40 గంటలు పనిచేస్తే.. ఐదో రోజు 8 గంటలు పనిచేస్తే చాలు. మిగిలిన రెండురోజులు సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది.

''పని గంటలేమీ పెరగలేదు. పని విధానంలో మార్పు వచ్చింది. రోజులో ఎక్కువ చేయించుకునేందుకు, చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అంతే.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అని బీబీసీతో అన్నారు రాష్ట్ర కార్మిక శాఖ సహాయ కమిషనర్‌ సీహెచ్‌ విజయకుమార్‌ రెడ్డి.

ఒకవేళ వారానికి 48 గంటలు కంటే ఎక్కువ పనిచేస్తే ఓటీ వస్తుంది. ఇక ఇబ్బందేముంది అని ఆయన అన్నారు.

ఏపీ ఫ్యాక్టరీస్‌ చట్టం పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలు, కర్మాగారాలు, పరిశ్రమల్లో ఈ నిబంధనలు వర్తించనున్నాయని ఏపీ జాయింట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఎం.మోహన్‌రావు బీబీసీకి తెలిపారు.

మహిళా ఉద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images

ఇకపై మహిళలకూ నైట్‌ డ్యూటీలు

పారిశ్రామిక రంగంలో లింగ వివక్ష లేకుండా చేసేందుకు, సాధికారత కోసం మహిళలకు నైట్‌డ్యూటీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

''ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలో మహిళా కార్మికులు రాత్రి పూట (రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు) పనిచేయరాదన్న నిబంధన గతంలో ఉండేది.

అయితే, లింగ వివక్ష చూపరాదన్న 2001నాటి హైకోర్టు ఆదేశాలతో మహిళా ఉద్యోగుల పని వేళల్లోనూ మార్పులు తెచ్చారు. అప్పటి నుంచే మహిళా ఉద్యోగులను రాత్రివేళల్లో అనుమతిస్తున్నారు. కానీ, ఇప్పుడు ఆ నిబంధనను చట్ట పరిధిలోకి తేనున్నారు'' అని జాయింట్‌ చీఫ్‌ ఫ్యాక్టరీస్‌ మోహన్‌రావు బీబీసీకి తెలిపారు.

''అయితే, పనిచేసే చోట కనీసం ఐదుగురు మహిళలు ఉండాలి. క్రెష్ సెంటర్లు (పిల్లల సంరక్షణ కేంద్రాలు), విశ్రాంతి గదులు, టాయ్‌లెట్లు వంటి సర్వీసులుండాలి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు లేకుండా తగిన రక్షణ, భద్రత చర్యలు చేపట్టాలి. మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండాలి. ప్రతి మహిళ ఇంటి వద్దకు సురక్షితంగా వెళ్లేలా రవాణా సౌకర్యం కల్పించాలి. ప్రత్యేకించి మహిళల సమ్మతితోనే రాత్రి పూట వారితో పనిచేయించాలనే నిబంధనలు వర్తించనున్నాయి'' అని మోహన్‌రావు వివరించారు.

కార్మికుల హక్కులు

ఫొటో సోర్స్, Getty Images

చట్టసభల్లో ఆమోదం.. రాష్ట్రపతి సమ్మతి తర్వాతే చట్టం

పరిశ్రమల్లో పని వేళలకి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ మార్పులు చట్టసభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు.

రాష్ట్రపతి సమ్మతి తర్వాత ఇవి చట్టరూపం దాల్చనున్నాయని మోహన్‌రావు తెలిపారు.

'ఇది కార్మిక హక్కులపై దాడి’

‘‘ స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరిట కార్పొరేట్లకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ.. కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను ఒక్కసారిగా హరించాలని బాబు సర్కారు చూస్తోంది. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం'' అని సీపీఐ జాతీయ నాయకులు నారాయణ బీబీసీతో అన్నారు.

'ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలి'

పని గంటలు పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు డిమాండ్‌ చేశారు.

''ఇప్పటికే 8.30 గంటల నిబంధన ఉంటే పది గంటలపైన చేయించుకుంటున్నారు. ఇప్పుడు కనీసం 10 గంటలు అంటే ఇక ఎన్ని గంటలు చేయించుకుంటారో'' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘వాస్తవానికి ఓవర్‌టైమ్‌ అన్నది కార్మికుల ఇష్ట ప్రకారం చేయాల్సిన అదనపు పని. కానీ, ఆచరణలో అది యాజమాన్యాల ఇష్టంగా, కార్మికుల పాలిట నిర్బంధంగా ఎప్పుడో మారింది. తాజా నిర్ణయంతో ఓటీ భారం కార్మికులపై మరింత పెరగనుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

'సమాన హక్కుల పేరిట దారుణం'

'' సమాన హక్కుల పేరిట రాత్రి పూట పని విధానంలో మహిళలను భాగస్వామ్యం చేయడం దారుణం. మహిళా ఉద్యోగులు కార్మికులకు రాత్రి పూట విధులు తప్పనిసరా లేక వారి ఇష్టప్రకారం అనుమతిస్తారా అన్న విషయంలో స్పష్టతనివ్వడం లేదు.

పట్టపగలే మహిళల భద్రత, రక్షణ విషయంలో పాలకులు వైఫల్యం చెందుతోన్న నేపథ్యంలో రాత్రిళ్లు ఉద్యోగాలకు వెళ్లే వారికి ఎంతవరకు రక్షణ కల్పిస్తారు'' అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐడ్వా) కార్యదర్శి రమాదేవి ప్రశ్నించారు.

మహిళా కార్మికురాలు

ఫొటో సోర్స్, Getty Images

‘రోజుకి పదిగంటలు పని చేయిస్తే, ఇక ఓటీకి అవకాశం ఎక్కడ?’

‘‘నిజంగా ఈ విధానం దారుణం. ఓ ఉద్యోగితో రోజుకి పదిగంటల పని చేయించుకున్న తర్వాత ఆ ఉద్యోగి ఓటీ (ఓవర్‌టైం) ఏం చేయగలడు. 8 గంటల పని విధానం అనేది ప్రపంచ కార్మికులు సాధించుకున్న హక్కు. దాన్ని హరించి వేయాలని చూడటం దారుణం'' అని లాంకో పైప్స్‌ ఫ్యాక్టరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కందారపు మురళి బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)