ఆంధ్రప్రదేశ్: కూటమి ఏడాది పాలనలో ఏయే హామీలు నెరవేరాయి?

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, FB/TDP

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2025 జూన్‌ 12నాటికి ఏడాది పూర్తయింది.

2024 జూన్‌ 4న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 164 సీట్లతో కూటమి భారీ విజయం దక్కించుకుంది. జూన్ 12న ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.

తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం అయ్యారు. మంత్రివర్గంలో ఉన్న 25 మందిలో సీఎం సహా 21 మంది టీడీపీకి చెందినవారు కాగా ముగ్గురు జనసేన, ఒకరు బీజేపీకి చెందిన వారు.

మరి ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఎన్డీయే హయాంలో ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు, సూపర్ సిక్స్, పవన్ కళ్యాణ్, ఏడాది పాలన

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, ఏపీలో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది.

డీఎస్సీపై తొలి సంతకం..

వైసీపీ పరిపాలనా కాలం 2019–24 మధ్యన ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదు. దీంతో అధికారంలోకి రాగానే డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ మేరకు సర్కారు కొలువుదీరగానే ఆ ఫైలుపైనే తొలి సంతకం చేశారు.

అయితే ఎస్సీ వర్గీకరణ అంశంతో జాప్యం జరిగిందంటూ దాదాపు ఏడాది పూర్తి కావస్తున్న దశలో జూన్‌ 6 నుంచి 16,347 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇంకా ఏడాదిలో ఏం చేశారు?

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు: గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వివాదాస్పదమైంది.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అదొక ప్రధాన ప్రచారాస్త్రంగా నిలిచింది.

అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు ఆ మేరకు నెల వ్యవధిలోనే ఆ చట్టాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు.

ఇసుక పాలసీలో మార్పు:

గత ప్రభుత్వ హయాంలో బాగా విమర్శల పాలైన ఇసుక విధానాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసి 'ఉచిత' ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది.

వినియోగదారుల నుంచి స్థానిక సంస్థలు సీనరేజీ వసూలు చేయాలని నిర్ణయించింది.

అన్న క్యాంటీన్లు:

ఐదు రూపాయలకే టిఫిన్, భోజనం అందించే 'అన్న క్యాంటీన్ల'ను జగన్‌ ప్రభుత్వంలో మూసివేశారు.

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ వాటిని తెరిచారు.

సామాజిక పింఛన్ల పెంపు:

అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు, కళాకారుల సామాజిక పింఛన్లను 3 వేల నుంచి నుంచి 4 వేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలో రాగానే పింఛన్లను పెంచారు.

వైసీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఒకటో తేదీ ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటికి తీసుకువెళ్లి పింఛన్లు పంపిణీ చేసేవాళ్లు. అయితే కూటమి అధికారంలోకి రాగానే వలంటర్ వ్యవస్థను పక్కనపెట్టారు. దీంతో ఫించన్లు ఇంటికి వస్తాయా రావా అనే అనుమానాలకు తావివ్వకుండా సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ కొనసాగిస్తోంది.

"గతంలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నన్ను పింఛన్ పథకానికి ఎంపిక చేయలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు పింఛన్ వస్తోంది" అని వాంబే కాలనీకి చెందిన పరుచూరి వనజ కుమారి బీబీసీ వద్ద సంతోషం వ్యక్తం చేశారు

రోడ్లకు మరమ్మతులు:

వైసీపీ హయాంలో రహదారులకు కనీస మరమ్మతులు చేపట్టలేకపోయారన్న విమర్శ ఉండేది.

కూటమి అధికారంలోకి రాగానే రూ.3,800 కోట్లు విడుదల చేసి రోడ్ల మరమ్మతులు మొదలుపెట్టారు.

కేంద్రం సాయంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ రహదారులకు రూ.6వేల కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు, సూపర్ సిక్స్, పవన్ కళ్యాణ్, ఏడాది పాలన

ఫొటో సోర్స్, telugudesam.org/

ఫొటో క్యాప్షన్, సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు.

సూపర్ సిక్స్ సంగతి ఏంటి?

2024 ఎన్నికల్లో చంద్రబాబు బాగా ప్రచారంలోకి తీసుకొచ్చిన నినాదం ''ఆరు గ్యారెంటీలు'' తాము అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తామని చెప్పారు.

ఆరు గ్యారంటీలు ఏవి.. వాటి అమలు ఏ దశలో ఉందో ఓసారి చూద్దాం.

1. ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

దీపం 2.0 పథకం ద్వారా ప్రతి ఏటా మహిళలకు మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

అయితే గత ఏడాది ఒక సిలిండర్‌, ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక సిలిండర్‌ మాత్రమే ఉచితంగా అందజేశారు.

"నాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దీపం పథకానికి నన్ను ఎంపిక చేయలేదు. కిందటిసారి పేరు లేదేమేటని అడిగితే ఈసారి చూద్దామన్నారు కానీ ఇటీవల ఇచ్చిన జాబితాలో కూడా నా పేరు లేదు" అని కృష్ణలంకకు చెందిన ఎల్ మాధవి బీబీసీకి చెప్పారు.

2 స్కూల్‌‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15వేలు

''తల్లికి వందనం'' పథకం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు రూ.15,000 ఇస్తామని హామీ ఇచ్చారు.

గత ఏడాది ఈ పథకం అమలు చేయలేదు.

అయితే ఈ ఏడాది నుంచి ఇస్తామని 2025–26 బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం... జూన్ 12 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

అయితే రూ.15వేలు బదులు రూ.13వేలు అందిస్తామని, మిగిలిన రూ.2వేలను విద్యావ్యవస్థ అభివృద్ధి నిధి కింద తీసుకుంటామని చెబుతోంది.

3. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల పెట్టుబడి (ఆర్థిక) సాయం

'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రైతుకు ఏటా రూ.20,000 ఇస్తామని హామీ ఇచ్చారు.

గతేడాది ఇవ్వకపోయినా 2025 బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించారు.

కానీ ఇప్పటివరకూ ఈ పథకం అమలు కాలేదు.

4. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి

యువతకు 3వేల రూపాయల నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు.

అయితే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆ మేరకు దిగ్గజ ఐటీ, పారిశ్రామిక సంస్థలు రాష్ట్రానికి రానున్నాయని చెబుతున్నారు.

5. ప్రతి మహిళకు నెలకి రూ. 1500

ఈ హామీ గురించి కూడా ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు.

6. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

త్వరలోనే మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఎప్పటికప్పుడు చెబుతున్నారు.

కానీ ఎప్పటి నుంచి అనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు.

సూపర్‌ సిక్స్‌ హామీల్లో నగదు బదిలీతో ముడిపడిన పథకాలు ఐదు ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని మినహాయిస్తే తల్లికి వందనం, మహిళలకు ప్రతి నెలా భృతి, యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు ఏటా ఆర్థిక సాయం, ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు... ఇవన్నీ నగదు బదిలీతో ముడిపడిన పథకాలే.

ఆర్థిక అంశాలతో ముడిపడిన ఈ హామీలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లలోనూ కనిపించలేదని బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.

కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో డబ్బుల్లేవని, ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, అయినా అప్పు చేసైనా పథకాలు అమలు చేస్తామని చెబుతూ వస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు, సూపర్ సిక్స్, పవన్ కళ్యాణ్, ఏడాది పాలన

ఫొటో సోర్స్, telugudesam.org/

ఫొటో క్యాప్షన్, పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు పీ–4 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కొత్తగా పీ–4

పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ–4 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఇటీవల దానికి బాగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు.

పీ–4 అంటే పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం. జనాభాలోని సంపన్నులైన 10 శాతం మంది.. పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న 20 శాతం మందికి నేరుగా సాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. విరాళాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంపన్న వ్యక్తులను మార్గదర్శకులుగా నియమిస్తారు. నిరుపేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తారు.

ప్రభుత్వం డిజిటల్‌ డాష్‌ బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు పురోగతిని గుర్తిస్తూ ఒక ఫెసిలిటేటర్‌‌గా వ్యవహరిస్తుంది.

వచ్చే ఆగస్టు 15కల్లా రాష్ట్రంలో 15లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా అధికారులు గుర్తించాలని ఇటీవల చంద్రబాబు ఆదేశించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు, సూపర్ సిక్స్, పవన్ కళ్యాణ్, ఏడాది పాలన, అమరావతి, పోలవరం
ఫొటో క్యాప్షన్, అమరావతి నిర్మాణం ప్యాకేజీ–1లో భాగంగా 14 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.

పోలవరం, రాజధాని నిర్మాణం ఎంత వరకు?

రాష్ట్రంలో అత్యంత కీలక ప్రాజెక్టుగా భావించే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం కూడా ఈ ఏడాదిలో పరుగులు పెట్టలేదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది.

రాజధాని విషయానికి వస్తే దాదాపు పదినెలల పాటు గత ప్రభుత్వ కాలంలో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించారు. తరువాత ఈ ఏడాది మేలో మళ్లీ ప్రధాని మోదీని పిలిచి రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

సుమారు రూ.60 వేల కోట్ల విలువైన వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు.

ఇందులో రూ.47వేల కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది.

దీంతో ఇక నుంచి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకుంటాయని భావిస్తున్నారు.

అయితే ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా రాజధాని సమగ్ర నిర్మాణానికి మరో 40వేల ఎకరాలు కావాలని ప్రతిపాదిస్తుండటం చర్చనీయాంశమైంది.

10 ఏళ్ల క్రితం దాదాపు 33వేల ఎకరాలను భూసమీకరణ కింద ఇచ్చిన రైతులకే ఇప్పటి వరకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా 40వేల ఎకరాలు తీసుకుని ఏం అభివృద్ధి చేస్తారని స్వయంగా భూములిచ్చిన రైతులే ప్రశ్నిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులు ఆశించినంత వేగంగా జరగకున్నా, ఎక్కడా ఆగకుండా జరుగుతున్నాయన్న వాదనలు ఉన్నాయి.

ప్రస్తుతం డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

వైసీపీ హయాంలో జరిగింది 3.89 మూడు శాతం పనులే అని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో జరిగిన పనులతో మొత్తంగా జరిగిన పురోగతి 81.70 శాతానికి పెరిగిందని రామానాయుడు ఇటీవల పోలవరం పర్యటన సందర్భంగా మీడియాకు వెల్లడించారు.

మొత్తంగా 2027 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే పోలవరం, రాజధాని పనులు అనుకున్నంత వేగంగా జరగడంలేదని, పోలవరం ఎత్తు తగ్గించే కుట్రలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి ఇటీవల దిల్లీలో ఆరోపించారు.

అయితే పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదంటూ వైసీపీ ఆరోపణలను కూటమి ప్రభుత్వం ఖండించింది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు, సూపర్ సిక్స్, పవన్ కళ్యాణ్, ఏడాది పాలన, అమరావతి, పోలవరం
ఫొటో క్యాప్షన్, పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

‘‘ప్రజలను భ్రమలో ఉంచుతున్నారు’’

"2047 కల్లా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుంది. ప్రపంచ స్థాయి ఐదు నగరాల్లో అమరావతి ఉంటుంది" ఇలా ప్రకటిస్తున్న రాష్ట్రంలోని కూటమి పాలకులు.. వాస్తవాలను తొక్కిపెడుతున్నారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి విమర్శించారు.

ప్రజలను భ్రమల్లో ఉంచుతూ పాలకులు ఊహల్లో విహరిస్తున్నట్టుగా ప్రస్తుత పాలన ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

"తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలో మనం అట్టడుగున ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ చేసినంత అప్పు మునుపెన్నడూ చేయలేదు. విద్యా రంగంలో కూడా మనం బాగా వెనకబడి ఉన్నాం.ఇవి వాస్తవాలు కాగా వీటిని పక్కన పెట్టి.. పాలకులు ఆశల భ్రమలు కల్పిస్తున్నారు" అని వి.లక్ష్మణరెడ్డి వ్యాఖ్యానించారు.

"కక్షపూరిత రాజకీయాలు పక్కన పెట్టి ముందు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపైనే కూటమి పాలకులు దృష్టి పెట్టాలి. రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటినా ఏమీ సాధించలేక పోయామని సామాన్య ప్రజల్లో అసహనం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి" అని లక్ష్మణ రెడ్డి సూచించారు

కూటమి ఏడాది పాలనలో పథకాలేమీ పెద్దగా అమలు కాలేదని రాజకీయ విశ్లేషకుడు, సీనియర్‌ జర్నలిస్టు దారా గోపీ బీబీసీతో అన్నారు.

"వచ్చి ఏడాదే కదా పూర్తయింది. ఇక అమలవుతాయనే ఆశలోనే కొంతమంది ఉన్నారు. ఏడాదైనా అమలు కాలేదంటే ఇక ఏం అమలవుతాయనే నిస్పృహ, అసమ్మతిలోనూ కొందరు ప్రజలున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇలా ఆశ, నిరాశ మధ్యనే కొట్టుమిట్టాడుతున్నారు. పాలకులు వెంటనే ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలి" దారా గోపీ అభిప్రాయపడ్డారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు, సూపర్ సిక్స్, పవన్ కళ్యాణ్, ఏడాది పాలన, అమరావతి, పోలవరం

ఫొటో సోర్స్, facebook.com/kethireddi

ఫొటో క్యాప్షన్, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రతీకార రాజకీయాలు తప్ప మరేమీ చేయలేదని వైసీపీ ఆరోపిస్తోంది.

ప్రతీకారం తప్పించి ఏం చేశారు?

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేయడం తప్పించి అసలు అభివృద్ధి ఏం చేశారని వైసీపీ సీనియర్‌ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు.

"అభివృద్ధి, సంక్షేమం అనే మాటలను ఒకప్పుడు చంద్రబాబు పదే పదే వల్లె వేసేవారు, కానీ ఇప్పుడు అదే చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్‌కి వంతపాడుతూ కేవలం వైసీపీ నేతలే లక్ష్యంగా అరాచకాలు చేస్తున్నారు" అని ఆయన ఆరోపించారు.

ఏడాదిలో కూటమి నేతలు సాధించింది పగ, ప్రతీకారం తప్పించి ఇంకేమీ లేదని కేతిరెడ్డి బీబీసీతో అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు, సూపర్ సిక్స్, పవన్ కళ్యాణ్, ఏడాది పాలన, అమరావతి, పోలవరం

ఫొటో సోర్స్, facebook.com/VarlaRamaiahTDP

ఫొటో క్యాప్షన్, ప్రతీకార రాజకీయాల ఆరోపణలను టీడీపీ నేత వర్ల రామయ్య తిరస్కరించారు.

ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు..

"ఏడాది పాలనలో రాష్ట్రంలో ప్రజలు సుఖసంతోషాలతో ప్రశాంతంగా ఉన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల అమల్లో కాస్త ఆలస్యం జరిగినా అర్ధం చేసుకుంటున్నారు. రోడ్ల నిర్మాణం, కొత్త ఉద్యోగాలతో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతోందని సంతోషిస్తున్నారు" అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య బీబీసీతో చెప్పారు.

ప్రతీకార రాజకీయాలకు అవకాశమే లేదని, గత ప్రభుత్వ హయాంలో అడ్డంగా తప్పులు చేసిన వారిని చట్టపరంగా శిక్షించడం తప్ప కక్షపూరితంగా చంద్రబాబు ఎవరినీ ఏమీ చేయరని, ఆయన నైజం అది కాదని వర్ల రామయ్య అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)