అనంతపురం యువతి హత్య కేసులో అసలేం జరిగింది?

యువతి శవమై కనిపించిన ప్రాంతం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అనంతపురంలో బ్రాహ్మణపల్లి సమీపంలో నేషనల్ హైవే పక్కనే ముళ్ల పొదల్లో ఒక యువతి శవాన్ని పోలీసులు గుర్తించారు.
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన ఓ యువతి హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది.

అనంతపురం శివార్లలోని టీవీ టవర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి జూన్ 3వ తేదీ రాత్రి నుంచి కనిపించడంలేదంటూ జూన్ 4వతేదీన తల్లిదండ్రులు అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే ఈనెల 8న కూడేరు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో నేషనల్ హైవే పక్కనే ముళ్ల పొదల్లో ఒక యువతి శవాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి చేరిన తల్లిదండ్రులు మృతదేహం తమ బిడ్డదేనని గుర్తించారు.

తమ బిడ్డకు కొందరు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి హత్య చేశారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులు యువతి తలపై కొట్టి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు.

బిడ్డను హత్య చేశారనే అనుమానంతో కొందరు యువకుల పేర్లు చెప్పామని కానీ, కాల్ లిస్ట్ పేరుతో పోలీసులు ఆలస్యం చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. మరోవైపు ఈ హత్య రాజకీయంగా కూడా కలకలం సృష్టిస్తోంది. వైసీపీ దీనిని మరో దిశ ఘటనగా వర్ణిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మృతురాలి ఇంటివద్ద బంధువులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, జూన్ 3వతేదీ మంగళవారం రాత్రి నుంచి తమ బిడ్డ కనిపించకుండా పోయిందని యువతి తల్లిదండ్రులు మీడియాతో చెప్పారు.

అసలేం జరిగింది?

జూన్ 3వ తేదీ మంగళవారం రాత్రి నుంచి తమ బిడ్డ కనిపించకుండా పోయిందని, నాలుగు రోజుల తర్వాత శవంగా కనిపించిందని మీడియాతో ఆమె తల్లిదండ్రులు చెప్పారు.

''అమ్మాయి మంగళవారం రాత్రి 9 గంటలకు వెళ్లిపోయింది. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో వెతికాం. బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాం. తర్వాత కూడా వెతికాం. పోలీసులు కాల్‌లిస్ట్ తెప్పిస్తామని, వెతుకుతామని చెప్పారు . మాకు ఓ అబ్బాయిపై సందేహం ఉందని చెబితే వాళ్లు స్పందించలేదు. తర్వాత కూడేరు దగ్గర మణిపాల్ కాలేజీ సమీపంలో మా బిడ్డ మృతదేహం దొరికింది. మా అమ్మాయి కేసులో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం'' అని మృతురాలి తండ్రి లక్ష్మీపతి అన్నారు.

''మంగళవారం రాత్రి వెళ్లిపోయింది. అతను నమ్మించి తీసుకెళ్లాడు. ఎంతమంది ఏం చేశారో తెలీడం లేదు. పోలీసులు నిజంగా ఎలాంటి జాగ్రత్తా తీసుకోలేదు. ఆరు రోజులైంది. మీకు దండం పెడతా మా పాపకు న్యాయం చేయండి'' అని మృతురాలి తల్లి అన్నారు.

యువతి తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అమ్మాయి కనిపించకుండా పోయిన మరుసటి రోజే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు యువతి తల్లిదండ్రులు మీడియాతో చెప్పారు.

'విచారణ జాప్యం చేశారు'

అనుమానితులను విచారించకుండా పోలీసులు జాప్యం చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

''బుధవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కొన్ని నంబర్లపై అనుమానం ఉందని చెప్పాం. వాళ్లలో ఒకరిని పిలిపించారు. అతను నాకు సంబంధం లేదు, నాకేం తెలీదన్నాడు. కానీ, అమ్మాయి వెళ్లిన రోజు 9 గంటలకు అతనికి ఫోన్ చేసింది. పోలీసులు కాల్ లిస్ట్ చెక్ చేస్తాం అన్నారు. దాని గురించి అడిగితే రేపురా, తర్వాత రా అని చెప్పారు. ఇప్పుడు కూడేరు పోలీసులు అమ్మాయి శవం దొరికిందని ఫోన్ చేశారు. మేం వెళ్లి ఆనవాళ్లు గుర్తుపట్టి మా పాపే అని క్లియర్ చేసుకున్నాం. మాకు న్యాయం చేయండి. అనుమానితుల నంబర్లు కూడా పోలీసులకు ఇచ్చాం. వారిని వాళ్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అడిగి ఉంటే సరిపోయేది'' అని మృతురాలి బంధువు చెప్పారు.

అనంతపురం పోలీసులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఈనెల 3న యువతి ఒక యువకుడితో రాత్రి 9 గంటల సమయంలో బైక్‌పై వెళ్లినట్లు ఆధారాలు సేకరించామని సీఐ రాజేంద్రనాథ్ మీడియాతో చెప్పారు.

పోలీసులు ఏమంటున్నారు?

యువతి హత్య కేసుపై అనంతపురం వన్ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. యువతి కనపడటం లేదని ఈనెల 4వ తేదీన ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని ఆయన చెప్పారు.

''ఈనెల 3న విద్యార్థిని ఒక యువకుడితో రాత్రి 9 గంటల సమయంలో బైక్‌పై వెళ్లినట్లు ఆధారాలు సేకరించాం. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. ఆమెకు ముగ్గురు యువకులతో పరిచయం ఉన్నట్లు సమాచారం ఉంది. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నాం. కూడేరు దగ్గర ఉన్న మణిపాల్ స్కూల్ వెనుక ప్రాంతంలో మంగళవారం రాత్రి బీర్ బాటిల్‌తో యువతి తల పగలగొట్టి హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజీ తనిఖీ చేస్తున్నాం. దీని వెనుక ఎంతమంది ఉన్నారనేది విచారణ తర్వాతే తెలుస్తుంది'' అని అన్నారు.

కఠినంగా శిక్షిస్తాం : నారా లోకేష్

యువతి హత్యపై మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ అకౌంట్‌లో స్పందించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

''ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తాం. హత్యకు గురైన సోదరి కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం'' అని ఎక్స్‌లో తెలిపారు.

ఇది ప్రభుత్వ వైఫల్యమే : జగన్

చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం రాత్రి సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

'అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల కిందట ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? విద్యార్థిని హత్య ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి'' అని పోస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)