పదేళ్లలో అమరావతిలో ఏం వచ్చాయంటే.. వీటి గురించే చెబుతారు..

అమరావతి విద్యా సంస్థలు

ఫొటో సోర్స్, aiimsmangalagiri.edu.in

ఫొటో క్యాప్షన్, మంగళగిరిలో ఎయిమ్స్ భవనం
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో గత పదేళ్లలో ఏయే సంస్థలు వచ్చాయని అడిగితే విద్యాసంస్థలు అని ఠక్కున చెబుతుంటారు అక్కడి ప్రజలు.

అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు సహా పరిపాలనకు సంబంధించిన శాశ్వత భవనాల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణ పనులను మొదలుపెట్టింది.

గడిచిన పదేళ్లలో అమరావతి పరిస్థితి ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా సాగిందనే చెప్పాలి. పరిశ్రమల సంగతి పక్కన పెడితే కొన్ని విద్యాసంస్థలు అమరావతిలో శాశ్వత క్యాంపస్‌లు ఏర్పాటు చేశాయి. వీటిల్లో ఐదు విద్యాసంస్థలు అమరావతి రాజధాని పరిధిలోనే ఏర్పాటయ్యాయి.

అయితే ఆయా విద్యాసంస్థలకు రాకపోకలు సాగించాలంటే సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెప్పారు.

''మేం యూనివర్సిటీకి రావాలంటే సరైన రవాణా సౌకర్యం లేదు. విజయవాడ, గుంటూరు.. పరిసర ప్రాంతాల నుంచి మా యూనివర్సిటీకి వచ్చేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ప్రైవేటు ఆటోలు తిరుగుతున్నప్పటికీ, వాటిల్లో చార్జీలు ఎక్కువగా ఉన్నాయి'' అని విట్-ఏపీ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బీబీసీతో చెప్పారు.

ప్రస్తుత పునర్నిర్మాణ పనులలో భాగంగా సరైన రవాణా సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

అసలు గత పదేళ్లలో అమరావతి పరిధిలో ఏయే విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయో,అవి ఎలా నడుస్తున్నాయో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమరావతి విద్యా సంస్థలు
ఫొటో క్యాప్షన్, అమరావతిలో 50 ఎకరాల్లో ఎన్ఐడీ భవనాలు నిర్మించారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)

ఈ సంస్ధ అమరావతి రాజధాని పరిధిలోని శాఖమూరులో ఉంది.

దాదాపు 300 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.

2015లో డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ‌స్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) అనుమతితో ఇది ఏర్పాటైంది.

మొదట నాగార్జున యూనివర్సిటీలో తరగతులు నిర్వహించగా,నిరుడు అమరావతిలో సుమారు 50 ఎకరాల్లో కట్టిన భవనాలలోకి ఎన్ఐడీ మారింది.

అమరావతి విద్యా సంస్థలు
ఫొటో క్యాప్షన్, వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ - ఏపీ

ఇది 2017లో ఏర్పాటయింది. ఈ యూనివర్సిటీ కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో (2014-19) అమరావతి ప్రాంతంలో సుమారు 200 ఎకరాలు కేటాయించింది. దాదాపు 14వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.

అమరావతి విద్యా సంస్థలు

ఫొటో సోర్స్, srmap.edu.in

ఫొటో క్యాప్షన్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ

మంగళగిరి మండలంలోని నీరుకొండ సమీపంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటైంది. 2017లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీకి వంద ఎకరాలు కేటాయించింది అప్పటి ప్రభుత్వం. ఈ యూనివర్సిటీలో సుమారు 9600 మంది చదువుతున్నారు.

అమరాావతిలో విద్యా సంస్థలు

ఫొటో సోర్స్, amrita.edu/campus/amaravati

అమృత యూనివర్సిటీ

వంద ఎకరాల విస్తీర్ణంలో అమృత విశ్వవిద్యాపీఠం ఆధ్వర్యంలో ఏర్పాటైంది ఈ యూనివర్సిటీ.

నిడమర్రు గ్రామం వద్ద ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

ప్రధాన భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ఇప్పటికే పూర్తయిన భవనాల్లో గతేడాది నుంచి ప్రవేశాలు జరిపి, తరగతులు నిర్వహిస్తున్నారు.

ఎయిమ్స్, మంగళగిరి

ఏపీ పునర్విభజన చట్టంలో ప్రకటించిన మేరకు మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసింది. 2018లో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఏర్పాటుచేసిన తాత్కాలిక క్యాంపస్‌లో 50 మంది విద్యార్థులతో తరగతులు మొదలయ్యాయి.

2019 మార్చి 12 నుంచి మంగళగిరిలోని శాశ్వత భవనంలో ఓపీడీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2020-21 బ్యాచ్ నుంచి 125 మందితో మొదటి సంవత్సరం తరగతులు శాశ్వత భవనంలో ప్రారంభయ్యాయి.

అమరావతిలో విద్యా సంస్థలు

ఫొటో సోర్స్, xlri.ac.in/about

ఫొటో క్యాప్షన్, ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ త్వరలో నిర్మాణాలు ప్రారంభిస్తుందని సీఆర్డీఏ అధికారి చెప్పారు

ప్రతిపాదనల్లో మరికొన్ని…

ఇవి కాకుండా ప్రస్తుతం మరికొన్ని విద్యా సంస్థలు ప్రతిపాదనదశలో ఉన్నట్టు ఏపీసీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.

అమరావతి పరిధిలో బిట్స్ క్యాంపస్ ఏర్పాటుపై ప్రతిపాదన ఉంది. ఇందుకు సంబంధించి 2024 డిసెంబరులోనే బిట్స్ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు.

ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ కూడా త్వరలోనే నిర్మాణాలు ప్రారంభిస్తుందని సీఆర్డీఏ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

ఈ సంస్థకు ఐనవోలు వద్ద 2019కు ముందే 50 ఎకరాలు ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. కానీ, అప్పటి నుంచి నిర్మాణాలు ప్రారంభం కాలేదు. త్వరలోనే నిర్మాణాలు ప్రారంభిస్తామని ఎక్స్ఎల్ఆర్ఐ ఇటీవల సమాచారం అందించిందని ఆ అధికారి బీబీసీతో అన్నారు.

తమ ఆధ్వర్యంలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సమర్పించింది.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) ప్రతినిధులు నిరుడు ఆగస్టులోనే సీఎం చంద్రబాబును కలిసి టాటా గ్రూపు భాగస్వామ్యంతో సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్ ఆన్ కాంపిటీటివ్‌నెస్ (సీజీఎల్‌సీ) ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు.

వీటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.

అయితే, ఆయా సంస్థలు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు.

అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న సంస్ధల్లో రెగ్యులర్ కోర్సులే ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని, పరిశోధనలు, ఉపాధి కల్పన రంగాలపై దృష్టి పెట్టేలా ఉండాలన్నారు ఆంధ్ర లయోలా కాలేజీ ప్రొఫెసర్ శ్రీకుమార్.

''భవిష్యత్తు నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలకు నాంది పలికేలా విద్యాసంస్థలు ఏర్పాటవ్వాలి'' అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)