దువ్వాడ శ్రీనివాస్‌కు డాక్టరేట్ ఇచ్చింది ఫేక్ యూనివర్సిటీయా? బీబీసీ పరిశీలనలో ఏం తేలింది?

దువ్వాడ శ్రీనివాస్‌కు డాక్టరేట్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నిన్నామొన్నటివరకు వివిధ రకాలుగా వార్తల్లో నిలిచిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి చర్చంతా ఆయనకు వచ్చిన గౌరవ డాక్టరేట్ పైనా.

దువ్వాడ శ్రీనివాస్‌కు‌‌‌‌ డాక్టరేట్ ఇవ్వడమే కాదు, ఆయనకు ఇచ్చిన యూనివర్సిటీ విషయంలోనూ వివాదం నడుస్తోంది.

తాను చేసిన సేవలకు గుర్తింపుగానే డాక్టరేట్ ఇచ్చారని దువ్వాడ శ్రీనివాస్ చెబుతుండగా.. వర్సిటీకి గుర్తింపు లేని విషయంపై సదరు యూనివర్సిటీ బీబీసీకి వివరణ ఇచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

డాక్టరేట్ అందుకోవడంపై వివాదం ఏమిటి..?

మార్చి 21న హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

ఆయనకు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఈ డాక్టరేట్‌ను ఇచ్చింది.

ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు చెబుతూ... ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సలహాదారు చేతుల మీదుగా ఆయనకు గౌరవ డాక్టరేట్ దక్కిందంటూ వైసీపీ మద్దతుదారులు పోస్టు చేశారు.

దీనిపై టీడీపీ, జనసేన మద్దతుదారులు విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారు.

ఈ విషయం చర్చనీయాంశంగా మారడంతో, దువ్వాడ శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడారు.

''నేనంటే గిట్టని వాళ్లు నాకు డాక్టరేట్ రావడంపై దుష్ప్రచారం చేస్తున్నారు. గ్రానైట్ బిజినెస్‌లో నేను చేసే సేవలు, సమాజం కోసం నీతి, నిజాయితీగా చేస్తున్న ఉద్యమాలు, రాజకీయాలను చూసి నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు.'' అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.

డేస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ

దువ్వాడకు డాక్టరేట్ ఇచ్చిన యూనివర్సిటీ నేపథ్యం ఏమిటి..?

దువ్వాడ శ్రీనివాస్‌కు డాక్టరేట్ ఇచ్చిన డేస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ విషయంలో వివాదం ఉంది.

దీని వెబ్‌సైట్‌ను బీబీసీ పరిశీలించినప్పుడు.. ''అమెరికాలోని ఫ్లోరిడాలో ఎపిటోమ్ స్టేట్ అకాడమీకి అనుబంధమైనది.'' అని ఉంది.

థియోలాజికల్ ఎడ్యుకేషన్ (మత సంబంధమైన విషయాల గురించిన విద్య) అందించేందుకు ఉద్దేశించినదిగా చెబుతోంది. దీని ప్రకారం ఇదొక క్రిస్టియన్ మతప్రచార సంస్థ.

అలాగే ఫ్రాన్స్‌లోని పారిస్ అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనుబంధంగా డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పనిచేస్తున్నట్లుగా వెబ్‌సైట్‌లో ఉంది.

భారత్‌లో నేషన్స్ అసోసియేషన్ ఫర్ థియోలాజికల్ అక్రిడిటేషన్ (నాటా) గుర్తింపుతో దిల్లీలోని డే స్ప్రింగ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్‌గా రిజిస్టర్ అయ్యిందని చెబుతోంది.

మతపరమైన డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులు అందిస్తున్నట్లుగా ఉంది.

''మేం కోర్సులన్నీ వర్చ్యువల్‌గా బోధిస్తుంటాం.'' అని డే స్ప్రింగ్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇన్‌చార్జ్ అమోస్ జేమ్స్ బీబీసీతో చెప్పారు.

దువ్వాడ

ఫొటో సోర్స్, Duvvada Srinivas/FB

ఫొటో క్యాప్షన్, దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ

బీబీసీ పరిశీలనలో ఏం తేలిందంటే..

ఈ యూనివర్సిటీ హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో ఉన్న అమృతవాణి కమ్యూనికేషన్ సెంటర్‌ నుంచి పని చేస్తున్నట్లుగా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు బీబీసీ సదరు అడ్రస్‌కు వెళ్లింది.

అక్కడ ఎలాంటి యూనివర్సిటీ లేదని బీబీసీ పరిశీలనలో తేలింది. నాలుగో అంతస్తులో అడ్రసుకు వెళ్లగా.. అక్కడ యూనివర్సిటీ లేదు.

ఆ భవనంలో క్రైస్తవ మత ప్రచారానికి చెందిన సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి. డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది ఇక్కడ లేదని అక్కడివారు చెప్పారు.

అలాగే భవనానికి చెందిన అంతస్తుల వారీగా ప్లాన్‌లోనూ ఎక్కడా యూనివర్సిటీ ప్రస్తావన లేదు.

''యూనివర్సిటీ గతంలో అమృతవాణి కమ్యూనికేషన్ సెంటర్లో ఉండేది. ఇప్పుడు అక్కడ లేదు. కోర్సులన్నీ ఆన్‌లైన్‌లో బోధిస్తున్నందున ఫిజికల్ క్యాంపస్ హైదరాబాద్‌లో లేదు.'' అని అమోస్ జేమ్స్ బీబీసీకి చెప్పారు.

దువ్వాడ శ్రీనివాస్

ఫొటో సోర్స్, fb/Duvvada.Ysrcp

డాక్టరేట్ ఇవ్వడానికి కారణాలేమిటి?

దువ్వాడ శ్రీనివాస్‌కు డాక్టర్ ఇన్ సోషల్ సర్వీసెస్ (డాక్టరేట్) ఇచ్చామని అమోస్ జేమ్స్ చెప్పారు.

ఇండో - ఇజ్రాయెల్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ వార్షిక ఈవెంట్ సందర్భంగా డాక్టరేట్ ఇచ్చారు.

''అసోసియేషన్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేసిన తర్వాతే శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. ముందుగా ఆయన చేసిన సేవను (వర్క్‌ను) పరిగణనలోకి తీసుకున్నారు. తర్వాతే డాక్టరేట్ కోసం ఎంపిక చేశారు.'' అని అమోస్ జేమ్స్ చెప్పారు.

డాక్టరేట్ దక్కడంపై మరో విధంగా చెప్పారు దువ్వాడ శ్రీనివాస్.

మార్చి 21న తనకు యూనివర్సిటీ ఈవెంట్ ఉందని, 'చీఫ్ గెస్ట్'గా రావాలని పిలిస్తే వెళ్లానని చెప్పారు.

అంతకుముందు ఫోటోలు అడిగితే ఇచ్చానని తెలిపారు.

ఈవెంట్‌కు వెళ్లే వరకు డాక్టరేట్ ఇస్తున్నట్లుగా తనకు తెలియదని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.

కార్యక్రమంలో దువ్వాడతోపాటు దివ్వెల మాధురి స్టేజీపై ఉండటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

''నా పర్సనల్ లైఫ్‌ను నేనెక్కడా దాచుకోలేదు. అంతా బహిరంగంగానే ఉంచాను. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు.'' అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.

నిరుడు ఆగస్టులో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో వివాదం తలెత్తింది. ఆయన భార్య వాణి, కుమార్తెలు హైందవి, నవీనలు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు నిరసనకు దిగారు.

కొత్తగా నిర్మించిన ఇంటిలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారని, ఇంటికి రాకుండా అక్కడే ఉంటున్న తమ తండ్రి తమతో ఇంటికి రావాలని ఆయన కుమార్తెలు అప్పట్లో నిరసనకు దిగారు.

దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని వాణి ఆరోపించారు.

ఈ వ్యవహారం ఏపీలో సంచలనమైంది. తర్వాత ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు.

ఈ విషయంపై అమోస్ జేమ్స్ బీబీసీతో మాట్లాడారు.

''దువ్వాడ శ్రీనివాస్‌కు భార్యతో ఉన్న విభేదాలు, కేసుల విషయం, ఇప్పుడు వేరొకరితో కలిసి జీవిస్తున్న విషయం మేం చూడలేదు. ఆయన చేసి సేవకు గుర్తింపుగా డాక్టరేట్ ఇచ్చాం.'' అని తెలిపారు.

విద్యను అభ్యసించడం

ఫొటో సోర్స్, Getty Images

యూనివర్సిటీకి గుర్తింపు ఉందా..?

డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గుర్తింపు విషయంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెబ్‌సైట్‌ను బీబీసీ పరిశీలించింది.

ఈ యూనివర్సిటీ ఎక్కడా రిజిస్టర్ కాలేదు.

యూనివర్సిటీ గుర్తింపు విషయంపై అమోస్ జేమ్స్‌ను బీబీసీ ప్రశ్నించింది.

''ప్రైవేట్ అటానమస్ థియోలజికల్ యూనివర్సిటీ కనుక మాకు ఎలాంటి గుర్తింపు అవసరం ఉండదు. మేం క్లాసులన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నాం.'' అని చెప్పారు.

యూనివర్సిటీ కార్యకలాపాలన్నీ అమెరికా నుంచి నడుస్తాయని, ఇక్కడ అనుమతులు అవసరం లేదంటూ చెప్పారు.

అయితే, డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గుర్తింపు, డాక్టరేట్లు ప్రదానం చేసే విషయంపై ఈ-మెయిల్ ద్వారా యూజీసీ చైర్మన్‌ను బీబీసీ సంప్రదించింది. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది.

డేస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వెబ్‌సైట్ పరిశీలిస్తే, గతంలోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరికి డాక్టరేట్లు ప్రదానం చేసినట్లుగా ఉంది.

వారిలో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, తెలంగాణకు చెందిన మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఏపీ మాజీ హోంమంత్రి తానేటి వనిత, ఏపీ-తెలంగాణ ఇజ్రాయెల్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ కెన్ ఉదయ్ సాగర్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జాన్ వెస్లీ సహా పలువురు ఉన్నారు.

అంతా విచారించుకున్నాకే డాక్టరేట్ తీసుకున్నానని చెప్పారు దువ్వాడ శ్రీనివాస్.

‘‘నాకు డాక్టరేట్ ఇస్తున్నారని చెప్పాక నేను యూనివర్సిటీ గురించి తెలుసుకున్నా. బలరాం నాయక్, శ్రీనివాస్ గౌడ్ వంటి ప్రముఖులకు గతంలో డాక్టరేట్లు ఇచ్చారని తెలిసింది. అలాంటిది ఫేక్ యూనిర్సిటీ అని ఎలా అనుకుంటాను.'' అని బీబీసీతో అన్నారాయన.

మరోవైపు, మార్క్ బర్న్స్ అనే వ్యక్తి చేతుల మీదుగా దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ అందుకున్నారు.

''ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్పిరిచ్యువల్ అడ్వైజర్ అని తెలిసింది. నాకు డాక్టరేట్ ఇచ్చిన తర్వాతరోజు తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు.'' అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.

అయితే, మార్క్ బర్న్స్ ట్రంప్‌కు సలహాదారు కాదని ఆయన సోషల్ మీడియా ఖాతాలను బీబీసీ పరిశీలించినప్పుడు తేలింది.

ఆయన అమెరికాలో క్రైస్తవ మత ప్రచారకుడు.

డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, dayspringuniversity.com

గౌరవ డాక్టరేట్లు అసలు ఎవరికి ఇస్తారు?

సాధారణంగా డాక్టరేట్లు పొందాలంటే రీసెర్చ్ ద్వారా పొందే వీలుంటుంది. లేదా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి యూనివర్సిటీల తరఫున గౌరవ డాక్టరేట్ ఇస్తుంటారు.

ఇవి సాధారణంగా యూనివర్సిటీ కాన్వొకేషన్ (స్నాతకోత్సవం) సమయంలో ఇస్తుంటారు.

రాష్ట్ర, కేంద్ర వర్సిటీలలో గౌరవ డాక్టరేట్లు ఇచ్చేందుకు ముందుగా కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అకడమిక్ సెనేట్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఆమోదం తీసుకున్న తర్వాత గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తారు.

సాధారణ డాక్టరేట్లను పీహెచ్‌డీగా చెబుతుంటారు. పీజీ పూర్తయ్యాక ఏదైనా అంశం లేదా టాపిక్‌ను ఎంపిక చేసుకుని చేసే రీసెర్చ్ ఇది.

సాధారణంగా పీహెచ్‌డీ పూర్తి గడువు మూడు నుంచి ఐదేళ్ల మధ్యలో ఉంటుంది.

గతంలో ఎంఫిల్ (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) పేరుతో రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు ఉండేది. జాతీయ విద్యా విధానం-2020లో ఎంఫిల్‌ను రద్దు చేస్తూ కేంద్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది.

గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసే విషయంలో ప్రముఖ యూనివర్సిటీలన్నీ చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇస్తుంటాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ చెప్పారు.

''యూనివర్సిటీ హోదా కానీ, గుర్తింపు కానీ లేకుండా ఇచ్చే గౌరవ డాక్టరేట్లకు ఎలాంటి గుర్తింపు, విలువా ఉండదు.'' అని అన్నారాయన.

యూజీసీ

ఫొటో సోర్స్, UGC

గుర్తింపు లేకుండా 'యూనివర్సిటీ' పేరు పెట్టుకోవచ్చా..?

డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రైవేటు థియోలజికల్ యూనివర్సిటీగా చెబుతున్నారు నిర్వాహకులు.

యూజీసీ నుంచి గుర్తింపు లేకుండా 'యూనివర్సిటీ' అనే పేరు వాడుకోవచ్చా.. అనేది ప్రశ్న.

భారతదేశంలో కేంద్రీయ, రాష్ట్ర, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలున్నాయని, అన్నింటికి తప్పనిసరిగా యూజీసీ గుర్తింపు ఉండాల్సిందేనని తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ఆర్.లింబాద్రి చెప్పారు.

''యూనివర్సిటీ పెట్టాలన్నా, ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలన్నా సరే యూజీసీ గుర్తింపు తప్పనిసరి.'' అని చెప్పారాయన.

అలాగే దేశంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలన్నా సరే, తప్పకుండా యూజీసీ గుర్తింపు ఆ యూనివర్సిటీకి ఉండాలని శ్రీరాం వెంకటేశ్ కూడా చెప్పారు.

యూజీసీ గుర్తింపు లేకుండా బోధన సంస్థల కోసం 'యూనివర్సిటీ' పేరు వాడుకునేందుకు వీల్లేదని యూజీసీ, 1956 చట్టం స్పష్టం చేస్తోంది.

అలా కాకుండా ఏర్పాటైన ఏ సంస్థ అయినా సరే 'ఫేక్ యూనివర్సిటీ'లుగా గుర్తిస్తామని యూజీసీ చెబుతోంది.

యూనివర్సిటీ అంటే కేంద్ర ప్రభుత్వ చట్టం లేదా ప్రావిన్షియల్ చట్టం లేదా రాష్ట్ర చట్టం ద్వారా యూజీసీ గుర్తింపుతో ఏర్పాటై ఉండాలి.

ఇలా ఏర్పాటైన యూనివర్సిటీలే డిగ్రీల ప్రదానం, క్లాసుల నిర్వహణ చేయవచ్చని యూజీసీ యాక్ట్ సెక్షన్ 22 చెబుతోంది.

అలా కాని పక్షంలో ఓ వ్యక్తి గానీ, సంస్థ గానీ ఏ విధమైన డిగ్రీలు ఇచ్చేందుకు వీల్లేదు.

నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకునే అధికారం యూజీసీకి ఉంటుంది.

డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి యూజీసీ నుంచి గానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి గుర్తింపు లేదని అమోస్ జేమ్స్ బీబీసీకి చెప్పారు.

ఆ పేరుతో తెలంగాణలో యూనివర్సిటీకి గుర్తింపు ఇవ్వలేదని ప్రొ. శ్రీరాం వెంకటేశ్ బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)