సీబీఎస్ఈ: పదో తరగతికి రెండు బోర్డు ఎగ్జామ్స్, ఇంకా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?

సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్‌టీ, మ్యాథ్స్, సైన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 9,10వ తరగతి విద్యార్థులకు సైన్స్, సోషల్ సైన్స్‌లో రెండు ఆప్షన్లు ఇవ్వాలని సీబీఎస్ఈ నిర్ణయించింది.

తొమ్మిది, పది తరగతుల సిలబస్, పరీక్షలకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్( సీబీఎస్ఈ) ప్రకటించింది.

పదో తరగతి విద్యార్థులకు ఒకే ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం ఇందులో పెద్ద విషయంగా చెబుతున్నారు.

దీంతోపాటు బోర్డు పరీక్షల నిర్వహించే వ్యవధి, కొన్ని సబ్జెక్టులలో రెండు దశల సిలబస్ లాంటి అంశాలు కూడా ఈ మార్పుల్లో ఉన్నాయి.

జాతీయ విద్యా విధానం 2020 నియమావళి ప్రకారమే ఈ మార్పులు చేస్తున్నామని, దీని వల్ల విద్యార్థుల ప్రతిభ మెరుగుపడుతుందని సీబీఎస్ఈ చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్ష, నిబంధనలేంటి?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గత మంగళవారం దీనికి సంబంధించిన ముసాయిదా విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న దాని ప్రకారం పదో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు.

విద్యార్థులు ఇందులో ఏదైనా ఒకటి లేదా రెండు పరీక్షలు రాయడాన్ని ఎంచుకోవచ్చు. బోర్డు నిర్వహించే రెండో పరీక్షను ఎంచుకున్న విద్యార్థులు, తాము తర్వాత చదవాలనుకున్న సబ్జెక్టులను వదిలివెయ్యవచ్చు.

రెండు పరీక్షల్లోనూ మార్కులను మెరుగుపరుచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్ ఉంటుంది.

ప్రస్తుతం బోర్డు పరీక్షలు 32 రోజులు జరుగుతున్నాయి. తాజా ముసాయిదాలో దీన్ని 16 లేదా 18 రోజులకు కుదించాలనే ప్రతిపాదన కూడా ఉంది.

మొదటి దశ పరీక్షలను ఫిబ్రవరి 17 నుంచి మార్చ్ 6 వరకు, రెండో దశ పరీక్షలను మే 5 నుంచి మే 20 వరకూ నిర్వహించాలని ముసాయిదా ప్రతిపాదించింది.

దీని వల్ల విద్యార్థులకు రెండు పరీక్షలకు మధ్య ఒకటి రెండు రోజుల ఖాళీ లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఖాళీ 5 నుంచి 10 రోజులు ఉంది.

మొదటి దశ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 20, రెండో దశ పరీక్షల ఫలితాలను జూన్ 30కల్లా ప్రకటిస్తారు.

నూతన నియమావళిపై స్కూళ్లు, టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇలా అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. మార్పులపై మార్చ్ 9లోగా తమ అభిప్రాయాన్ని చెప్పాలని సీబీఎస్ఈ కోరింది.

ఈ మార్పుల్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని ముసాయిదాలో తెలిపారు.

సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్‌టీ, మ్యాథ్స్, సైన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యార్థులపై ఒత్తిడి, భారం తగ్గించేందుకు జాతీయ విద్యా విధానం 2020లో అనేక మార్పుల్ని ప్రతిపాదించారు.

పాఠ్యాంశాలలో మార్పులు

మరో మార్పు ఏంటంటే 9,10వ తరగతుల్లో సైన్స్, సోషల్ సైన్సెన్స్ సబ్జెక్టుల్లోనూ రెండు రకాల పాఠ్య ప్రణాళిక( కరికులం)ను అమలు చేసేందుకు సీబీఎస్ఈ ఆమోదం తెలిపింది.

ఈ రెండు సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ విద్యార్థులకు స్టాండర్డ్, అడ్వాన్స్డ్ అనే రెండు ఆప్షన్లు ఇస్తారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది.

వచ్చే ఏడాది నుంచి తొమ్మిదో తరగతికి, 2028 నుంచి పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

సోషల్ సైన్స్, సైన్స్‌లో రెండు ఆప్షన్లు ఇవ్వడం వల్ల విద్యార్థుల పని తీరు మెరుగు పడుతుందని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది సాయపడుతుందని బోర్డు చెబుతోంది.

మేథమేటిక్స్‌ సహా అన్ని సబ్జెక్టుల్లోనూ రెండు దశలు ఉండాలని జాతీయ విద్యావిధానం 2020 సూచిస్తోంది. కొందరు విద్యార్థులు ప్రామాణిక స్థాయిని, మరి కొందరు ఆధునిక విద్యా విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందనేది ఎన్ఈపీ అభిప్రాయం.

వచ్చే ఏడాది నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల సైన్స్, సోషల్ సైన్స్‌ సబ్జెక్టులలో రెండు దశల పాఠ్య ప్రణాళికతో పుస్తకాలను సిద్ధం చేసే బాధ్యతను ఎన్‌సీఈఆర్‌టీకి అప్పగించారు.

"పదో తరగతిలో ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించి రెండు దశల్లోనూ అదనపు సమాచారాన్ని జత పరుస్తాము. అడ్వాన్స్డ్ లెవల్‌ విద్యార్ఖులకు అదనపు ప్రశ్న పత్రాలను కూడా జతపరుస్తాము లేదా వారి కోసం ప్రత్యేక ప్రశ్న పత్రాలను రూపొందిస్తాము" అని సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్ చెప్పినట్లు హిందూస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది.

నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ ప్రకారం 2023 పాఠశాల విద్యకు సంబంధించి అన్ని తరగతుల కొత్త పాఠ్య పుస్తకాల రూపకల్పన బాధ్యతను ఎన్‌సీఈఆర్‌టీకి అప్పగించారు. ఒకటి, రెండు తరగతులకు సంబంధించిన పుస్తకాలను 2023లో, మూడు, ఆరో తరగతి పుస్తకాలను 2024లో ఎన్‌సీఈఆర్‌టీ విడుదల చేసింది.

ఈ ఏడాది నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిదవ తరగతుల పుస్తకాలను విడుదల చేయనుంది.

తొమ్మిదో తరగతి పుస్తకాలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయని సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్ చెప్పారు.

సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్‌టీ, మ్యాథ్స్, సైన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త విధానం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సాయపడుతుందని ముసాయిదాలో తెలిపారు.

మార్పులకు కారణం ఏంటి?

విద్యార్థులు నెలల తరబడి పాఠ్యాంశాలను బట్టీ పట్టే అవసరం లేకుండా, వారి ప్రాథమిక సామర్థ్యాలను గుర్తించేలా బోర్డు పరీక్షలను సులభతరం చేసేందుకే ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ముసాయిదాలో తెలిపారు.

ఈ ముసాయిదా లక్ష్యం ఏంటంటే, క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై, టీచర్లు చెప్పే పాఠాలు వినే విద్యార్థులు ఎలాంటి అదనపు శ్రమ లేకుండా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం.

"బోర్డు పరీక్షలంటే విద్యార్థుల్లో ఉండే భయాన్ని తొలగించేందుకు, విద్యార్థులకు ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశాన్ని ఇస్తున్నాం. ఒకటి ప్రధాన పరీక్ష, రెండోది అవసరాన్ని బట్టి మార్కుల్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు" అని ముసాయిదా తెలిపింది.

మ్యాథ్స్ తర్వాత సైన్స్‌లో రెండు స్థాయిల్లో ఎంచుకునే అవకాశం ఇవ్వడం వెనుక, విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టును ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని బోర్డు భావిస్తోంది.

రెండు ప్రత్యామ్నాయాలు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్- జేఈఈ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులకు ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.

ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రస్తుత సీబీఎస్ఈ సిలబస్ అనుకూలమైనదిగా కనిపించడం లేదు. అందుకే వారు కోచింగ్‌సెంటర్లను ఆశ్రయిస్తున్నారని సీబీఎస్ఈ భావిస్తోంది.

"అయినప్పటికీ ఈ నిర్ణయం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. విద్యార్థుల మీద కోచింగ్ భారాన్ని తగ్గించేందుకు అనేక ప్రాథమిక మార్పులు చేయాల్సి ఉంటుంది" అని ఎన్‌సీఈఆర్‌టీ మాజీ డైరెక్టర్ జేఎస్ రాజ్‌పుత్ చెప్పారు.

2019-2020 నుంచి గణితంలో మాత్రమే సీబీఎస్ఈలో రెండు దశల సిలబస్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో ప్రామాణిక గణితం, ప్రాథమిక గణితం ఉన్నాయి. ఈ రెండు దశల్లో సిలబస్ ఒకటే అయినప్పటికీ, బోర్డు పరీక్షల్లో వచ్చే ప్రశ్న పత్రాల సంక్లిష్టతలో తేడా ఉంది.

"మేథమేటిక్స్‌లో ఈ ప్రయోగం చేశారు. ఇది విద్యార్థులకు ఉపయోగపడింది. భవిష్యత్‌లో గణితం వద్దనుకున్నవారు, మరో సబ్జెక్టు చదవాలని అనుకున్నవారు గణితంలో రెండోదైన అడ్వాన్స్ లెవల్ సిలబస్ చదవాల్సిన అవసరం ఉండదు" అని దిల్లీ పేరెంట్స్ అసోసియేషన్‌కు చెందిన అపరాజిత గౌతమ్ బీబీసీతో చెప్పారు.

"అలాగే, మేథమేటిక్స్‌ బాగా చదువుకోవాలనుకునే విద్యార్థులు, ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి పదో తరగతి నుంచే ఒక ఆప్షన్ ఉంటుంది. వారికి ఈ విధానం వల్ల ఆ సబ్జెక్టు కష్టంగా అనిపించదు" అని ఆమె అన్నారు.

సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్‌టీ, మ్యాథ్స్, సైన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీబీఎస్ఈ పుస్తకాలు సకాలంలో అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

కొత్త విధానాన్నిఅమలు చేయడంలో కష్టాలు

ముసాయిదా విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు కొన్ని సందేహాలు ఉన్నాయి. సిలబస్, పరీక్షలకు సంబంధించి చూస్తే, కొత్త సిలబస్‌ ఉన్న పుస్తకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీని వల్ల మార్పు ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

మార్పుల్ని సరిగ్గా అమలు చెయ్యలేకపోతే విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు కొనసాగుతాయని అపరాజిత గౌతమ్ అన్నారు.

"అతి పెద్ద సమస్య ఏంటంటే కొత్త సీబీఎస్ఈ పుస్తకాలను విద్యా సంవత్సరం ప్రారంభమైన 3 నెలల తర్వాత ముద్రించడం ప్రారంభిస్తారు" అని ఆమె చెప్పారు.

ఈ సమస్య గురించి అనేకమంది తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న అనేక సీబీఎస్ఈ స్కూళ్లు తమ సొంత పుస్తకాలను ముద్రించి, వాటిని కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయని అపరాజిత గౌతమ్ చెప్పారు.

"ముందుగా, సీబీఎస్ఈ ప్రైవేటు స్కూళ్లు తమ సొంత పుస్తకాలను ముద్రించడం, దాన్ని బోధించడాన్ని నిషేధించాలి. సీబీఎస్ఈ పుస్తకాలు అందరికీ సరైన సమయంలో అందుబాటులోకి వస్తేనే ఇది వీలవుతుంది" అని ఆమె అన్నారు.

జాతీయ విద్యా విధానం కింద అనేక మార్పులు వస్తున్నాయి. అయితే అవి ఎలా ఉంటాయి? ఎంత వరకు అమలవుతాయి? అనే అంశాలపై స్పష్టత రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆమె చెప్పారు.

సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్‌టీ, మ్యాథ్స్, సైన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త విధానంతో విద్యార్థులకు కోచింగ్ అవసరం ఉండదని సీబీఎస్ఈ చెబుతోంది.

ఎ‌న్‌సీఈఆర్టీ మాజీ డైరెక్టర్ ఏమంటున్నారు?

సిలబస్‌ను సరళీకరించాలని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న సిలబస్ కఠినంగా ఉండటం వల్ల అనేక మంది విద్యార్థులు మధ్యలోనే స్కూలు మానేస్తున్నారని ఎన్‌సీఈఆర్‌టీ మాజీ డైరెక్టర్ జేఎస్ రాజ్‌పుత్ బీబీసీతో చెప్పారు.

స్కూలు బ్యాగుల బరువు తగ్గించేందుకు ప్రభుత్వం యశ్‌పాల్ కమిటీని నియమించింది. జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనమిక్స్ సబ్జెక్టులో సిలబస్ చాలా ఎక్కువగా ఉందని ఈ కమిటీ తెలిపిందని ఆయన అన్నారు.

"మా కాలంలో ఈ నాలుగు సబ్జెక్టులను ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో కలిపి బోధించేవారు. తొమ్మిది, పదో తరగతుల్లో కూడా ఇదే చేయాల్సింది. అయితే ఆ సమయంలో అది సాధ్యం కాలేదు" అని ఎన్‌సీఈఆర్‌టీ మాజీ డైరెక్టర్ చెప్పారు.

కొత్తగా చేస్తున్న మార్పులు పిల్లల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని చేయాలనీ, వీటన్నింటినీ ఎప్పుడో చేసి ఉండాల్సిందని జేఎస్ రాజ్‌పుత్ చెప్పారు.

"మన విద్యా వ్యవస్థలో అతి పెద్ద సమస్య ఏంటంటే, మనం అన్నీ బలవంతంగా చదివిస్తాము. అంతే కానీ పిల్లల ఆసక్తి ఎక్కడ ఉందో గుర్తించము" అని ఆయన అన్నారు.

సీబీఎస్ఈ విడుదల చేసిన ముసాయిదాలో మార్పుల వల్ల పిల్లల మీద కోచింగ్ భారం తగ్గుతుందనే వాదనతో ఆయన పూర్తిగా ఏకీభవించలేదు.

"లక్షల సంఖ్యలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల్ని భర్తీ చేయకపోతే, పిల్లలు కోచింగ్ మీద ఆధారపడటం తగ్గదు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో టీచర్ ‌పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. కొత్త విద్యా విధానం దీన్ని కూడా గుర్తించింది. కాంట్రాక్టు టీచర్ల స్థానంలో రెగ్యులర్ టీచర్లను తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయి" అని ఆయన అన్నారు.

"కోచింగ్ వ్యవస్థ మీద ఆధారపడటాన్ని తగ్గించాలంటే, ముందు మనం మన టీచర్లను నమ్మాలి. ప్రైమరీ క్లాసుల్లో బోధించే టీచర్ల మీద ఎక్కువ నమ్మకం ఉంచాలి. వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలి. వారి నియామకాలు ఆన్ టైమ్ జరగాలి" అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)