ట్రంప్, జెలియెన్‌స్కీ, జేడీ వాన్స్‌లలో ఎవరిది తప్పు? యుక్రెయిన్ అధ్యక్షుడి ముందున్న ప్రత్యామ్నాయాలేంటి

డోనల్డ్ ట్రంప్, జెలియెన్‌స్కీ, జేడీ వాన్స్, రష్యా యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలో డోనల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ మధ్య జరిగిన సంభాషణ యుక్రెయిన్- రష్యా యుద్ధం ముగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ లాంటిదే.

ఈ మొత్తం వ్యవహారంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ జెలియెన్‌స్కీ క్షమాపణ చెప్పాలని అన్నారు.

"కీలక ఒప్పందాలను విజయవంతం చేసేందుకు ట్రంప్ అనేక ప్రయత్నాలు చేశారు. మీరు(జెలియెన్‌స్కీ) ఆవేశంతో మాట్లాడితే మీతో ఎవరు మాట్లాడతారు? ఆయన శాంతి ఒప్పందం గురించి మాట్లాడుతున్నారు. కానీ అది ఆయనకు ఇష్టం లేదు" అని రుబియో అన్నారు.

ఈ సంభాషణ పట్ల క్షమాపణలు చెప్పేందుకు జెలియెన్‌స్కీ సిద్ధంగా లేరు.

"క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అమెరికా అధ్యక్షుడు, ప్రజలంటే గౌరవం ఉంది. మనం మన అభిప్రాయాలు, ఆలోచన గురించి నిజాయితీగా ఉండాలి. నేను ఎలాంటి తప్పు చేయలేదని అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యాన్ని, మీడియా స్వేచ్ఛను గౌరవించాలి. కొన్ని అంశాలు మీడియాకు దూరంగా చర్చించాలని నేను చెప్పాలనుకుంటున్నాను" అని జెలియెన్‌స్కీ ఫాక్స్ న్యూస్‌తో అన్నారు.

యుక్రెయిన్‌కు తాము ఎంతో సాయం చేసినప్పటికీ, జెలియెన్‌స్కీ తమకు కృతజ్ఞతలు చెప్పేందుకు సిద్ధంగా లేరని ట్రంప్, జేడీ వాన్స్ అన్నారు.

ఓవల్ ఆఫీసులో ట్రంప్, జేడీవాన్స్, జెలియెన్‌స్కీ మధ్య యుక్రెయిన్ యుద్ధం గురించి వాడివేడి చర్చ జరిగింది. ఇదంతా మీడియా ప్రతినిధుల సమక్షంలోనే జరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్, జెలియెన్‌స్కీ, జేడీ వాన్స్, రష్యా యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

జెలియెన్‌స్కీ ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి?

జెలియెన్‌స్కీ మీద ట్రంప్ అరిచినట్లుగా గతంలో ఏ విదేశీ అతిథి మీద కూడా ఆగ్రహంతో కేకలు వేయలేదని అమెరికన్ మీడియాలో కథనాలు వచ్చాయి.

ట్రంప్ ఒక దశంలో యుక్రెయిన్‌ను తన మానాన తనను విడిచి పెడతామని హెచ్చరించారు.

ఇప్పుడు జెలియెన్‌స్కీ ఏం చేస్తారు? ఎవరి దగ్గరకు వెళతారు? ఏం చేస్తారనే ప్రశ్నలు కీలకంగా మారాయి.

"అధ్యక్షుడిగా జెలియెన్‌స్కీ తన పదవీకాలంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. మంత్రం వేసినట్లు ఆయన ఈ వివాదాన్ని ముగించాలి లేదంటే అమెరికా లేకుండా ముందుకెళ్లాలి. అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం అన్నింటికంటే తేలికైన మార్గం. తాను పదవి నుంచి వైదొలగి మరొకరికి యుద్ధాన్ని ముగించే అవకాశాన్ని అప్పగించవచ్చు. జెలియెన్‌స్కీ పదవి నుంచి దిగిపోతే అది రష్యాకు విజయమే. ఆయన రాజీనామా మరో సంక్షోభానికి దారి తీయవచ్చు. ఆయన రాజీనామా చేస్తే తర్వాత జరిగే అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం లేదు" అని అమెరికన్ న్యూస్ నెట్‌వర్క్ సీఎన్ఎన్ అంతర్జాతీయ భద్రత వ్యవహారాల ప్రతినిధి నిక్ పాట్ వాల్ష్ రాశారు.

ఈ వ్యవహారంపై రష్యాలోనూ విపరీతమైన ప్రతిస్పందన వచ్చింది. ట్రంప్, వాన్స్, జెలియెన్‌స్కీ వాదించుకుంటున్న వీడియో క్లిప్‌ను పోస్ట్ చేస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక దూత కిరిల్ దిమిత్రేవ్ "చరిత్రాత్మకం" అని రాశారు.

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ మీడియా ఎదుట ఆవేశపూరితంగా వ్యవహరించారని రష్యా అధికారిక పత్రిక టీఎఎస్ఎస్ హెడ్‌లైన్ పెట్టింది.

‘వైట్‌హౌస్‌లో జెలియెన్‌స్కీ ఉన్మాదం’ చూసి యుక్రెయిన్ పార్లమెంట్ కూడా ఆశ్చర్యపోయిందని రష్యాకు చెందిన మరో అధికారిక న్యూస్ ఏజెన్సీ ‘ఆర్ఐఏ నొవోస్తీ’ రాసింది.

డెలావర్ యూనివర్సిటీలో అంతర్జాతీయ వ్యవహారాలు బోధించే ప్రొఫెసర్ ముక్తదర్ ఖాన్ జెలియెన్‌స్కీ వైఖరిని తప్పు పట్టారు.

"ఈ వ్యవహారంలో నేను డోనల్డ్ ట్రంప్ వైపు ఉన్నాను. జెలియెన్‌స్కీ అంత అహంకారంగా ఎలా మాట్లాడతారు? అమెరికా సాయాన్ని ఆయన హక్కుగా భావిస్తున్నారు. అమెరికన్ల సానుభూతి పొందేందుకే ఆయన అలా చేశారని అనుకుంటున్నాను" ఆయన చెప్పారు.

డోనల్డ్ ట్రంప్, జెలియెన్‌స్కీ, జేడీ వాన్స్, రష్యా యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

జెలియెన్‌స్కీ దూకుడుగా వ్యవహరించారా?

"ట్రంప్‌తో జెలియెన్‌స్కీ మాట్లాడిన తీరు ఊహించలేకపోతున్నాను. మీకు సాయం చేస్తున్న దేశంతో మీరిలాగేనా మాట్లాడేది. అమెరికా సాయం లేకపోతే యుక్రెయిన్‌ రష్యాతో వారం రోజులు కూడా యుద్ధం చేయగలిగేది కాదు. 2014 నుంచి అమెరికా యుక్రెయిన్‌కు అండగా ఉంది" అని ముక్తదర్ ఖాన్ చెప్పారు.

కేవలం జెలియెన్‌స్కీ మాత్రమే కాదు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు వైట్‌హౌస్ తొలి అతిథిగా వచ్చారు. నెతన్యాహు అడిగిన వాటన్నింటికీ ట్రంప్ సరేనన్నారు.

ఆ తర్వాత జోర్డాన్ రాజు, భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ట్రంప్‌తో భేటీ అయ్యారు.

వీళ్లందరితోనూ ట్రంప్ కఠినంగానే మాట్లాడారు. అయితే వాళ్లంతా చర్చను తేలిక చేసేలా వ్యవహరించారు. జెలియెన్‌స్కీ అలా చేయలేకపోయారు.

జెలియెన్‌స్కీతో చర్చ తర్వాత ట్రంప్ ట్రూత్‌సోషల్‌లో ఇలా రాశారు.

"అమెరికా ప్రతిపాదిత చర్చల్లో పాల్గొనాలని జెలియెన్‌స్కీ అనుకోవడం లేదు. చర్చల్లో మేమేదో లాభపడుతున్నామని ఆయన అనుకుంటున్నారు. మాకు ఎలాంటి లాభం వద్దు. శాంతి కావాలి. శాంతి కోసం ఆయన ఎప్పుడైనా ఇక్కడకు రావచ్చు" అని అందులో పేర్కొన్నారు.

"ఇప్పుడు జెలియెన్‌స్కీ వద్ద ప్రత్యామ్నాయం ఏముంది? ఆయన మళ్లీ వైట్‌హౌస్‌కు వెళ్లి ట్రంప్ చెప్పిన ప్రతి మాటకు తలూపడం లేదా యుక్రెయిన్ వెళ్లి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం. ఎలాగూ ఆయన పదవీ కాలం ముగిసింది. జెలియెన్‌స్కీ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. యుద్ధం చేసే అధ్యక్షుడు ఇలాంటివి జరగవచ్చని ఆలోచించి ఉండాలి. జెలియెన్‌స్కీ పుతిన్ మధ్య రాజీ కుదిరితే అది యుక్రెయిన్‌కు అవమానకరమే అయినా దాని తీవ్రత తక్కువగా ఉంటుంది" అని ది హిందూ పత్రిక ఇంటర్నేషనల్ ఎడిటర్ స్టేన్లీ జానీ చెప్పారు.

ట్రంప్, జెలియెన్‌స్కీ మధ్య జరిగిన వాదాన్ని 1962లో చైనా దాడి చేసినప్పుడు సోవియట్ యూనియన్ నాయకుడు నికిత కృశ్చేవ్- నెహ్రూ మధ్య జరిగిన సంభాషణకు ముడి పెట్టారు బ్రూక్స్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ ఫెలో తన్వి మదన్.

ఆ సమయంలో కృశ్చేవ్ .. 'భావోద్వేగాలను వదిలి పెట్టి చైనా ప్రతిపాదించిన కాల్పుల విరమణను అంగీకరించాలి' అని నెహ్రూకు సలహా ఇచ్చారు.

"తన ప్రతి స్పందన సోవియట్ యూనియన్‌కు కోపం తెప్పిస్తుందని నెహ్రూకు తెలుసు. అయినప్పటికీ ఆయన లొంగుబాటు ప్రతిపాదనను తిరస్కరించారు" అని తన్వి మదన్ రాశారు.

డోనల్డ్ ట్రంప్, జెలియెన్‌స్కీ, జేడీ వాన్స్, రష్యా యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

జెలియెన్‌స్కీ విషయంలో ట్రంప్ ఎందుకంత కఠినంగా ఉన్నారు?

1990లో ఇరాక్, కువైట్ మీద దాడి చేసినప్పుడు జార్జ్ డబ్ల్యు బుష్ అధ్యక్షుడిగా ఉన్నారు. కువైట్ మీద దాడిని సహించేది లేదని చెప్పిన బుష్ ఇరాక్ మీదకు ‌అమెరికన్ బలగాను పంపిచారు.

యుక్రెయిన్ విషయంలో ట్రంప్ వ్యవహార శైలిని విమర్శిస్తూ బ్రిటిష్ చరిత్రకారుడు నీల్ ఫెర్గూసన్ 1990లో బుష్ నిర్ణయాన్ని ప్రస్తావించారు. యుక్రెయిన్ మీద ఒక నియంత దాడి చేస్తుంటే, అమెరికా రిపబ్లికన్ అధ్యక్షుడు ఏం చేశారని భవిష్యత్‌లో చరిత్రకారులు ప్రశ్నిస్తారని అన్నారు.

యుక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా తన బలగాలను పంపించాలని ఆయన వాదిస్తున్నారు.

నీల్ ఫెర్గూసన్ వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు.

"ఇదంతా చెత్త. అంతర్జాతీయ మేథావులు దీన్ని అమ్ముకుంటున్నారు. వారికి చెప్పడానికి ఇంకేమీ మిగల్లేదు. మూడేళ్ల నుంచి ట్రంప్, నేను రెండు అంశాలు ప్రస్తావిస్తున్నాం. మొదటిది ట్రంప్ అధ్యక్షుడై ఉంటే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరిగి ఉండేది కాదు. మరొకటి యూరప్, బైడెన్ ప్రభుత్వం, యుక్రెయిన్ కలిసినా ఈ యుద్ధంలో గెలవలేవు. ఈ మూడేళ్లలో ఇదే కదా జరిగింది" అని ఆయన అన్నారు.

"యుక్రెయిన్ విషయంలో నీల్ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? మరో ప్యాకేజ్ ఇవ్వాలా? యుక్రెయిన్‌లో రష్యా ఆధిక్యం సాధించిందనే విషయం ఆయనకు తెలుసా?యూరప్ యుద్ధం చేసే పరిస్థితిలో ఉందా? మీరు జార్జ్ బుష్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు, ఇప్పుడు పరిస్థితులు వేర్వేరు. ట్రంప్ వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు కొన్ని వాస్తవాలు చెబుతాను" అని వాన్స్ చెప్పారు.

డోనల్డ్ ట్రంప్, జెలియెన్‌స్కీ, జేడీ వాన్స్, రష్యా యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ విషయంలో త్వరలో పుతిన్‌ ట్రంప్ చర్చలు జరపనున్నారు.

యుద్ధంతో యుక్రెయిన్ ఏం సాధించింది?

"ముందుగా యూరప్‌లో మన మిత్ర దేశాలు అమెరికా ఇచ్చే నిధుల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ దేశాల విధానాలు, ప్రత్యేకించి వలసల విషయంలో అమెరికన్ ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా ఉంది. అయినప్పటికీ, వాళ్లు భద్రత విషయానికి వచ్చే సరికి అమెరికా తమను కాపాడుతుందని భావిస్తున్నారు" అని వాన్స్ చెప్పారు.

"యూరప్‌కు ప్రమాదం రష్యా నుంచి కాదు. యూరప్ నుంచే ఉంది" అని జేడీ వాన్స్ ఇటీవల జరిగిన మ్యూనిచ్ భద్రత సదస్సులో చెప్పారు.

2022 ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసింది. ఈ యుద్ధం మొదలై మూడేళ్లు దాటింది. ఈ మూడేళ్లలో ప్రపంచం రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చినా యుద్ధానికి పరిష్కారం దొరకలేదు.

యుద్ధం మొదలైనప్పుడు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. యుద్ధానికి మూడేళ్లు పూర్తయ్యేసరికి ట్రంప్ అధ్యక్షుడయ్యారు. ట్రంప్ రష్యా అధ్యక్షుడితో సంధి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ చర్చల్లో యుక్రెయిన్‌ను పట్టించుకోవడం లేదు.

ఇదిలా ఉంటే 2022 ఫిబ్రవరి తర్వాత తాము ఆక్రమించుకున్న యుక్రెయిన్ భూభాగాలను వదిలే ప్రసక్తే లేదని రష్యా స్పష్టంచేసింది.

యుద్ధాన్ని ఆపేసే అంశంపై చర్చలు జరిపేందుకు అమెరికా, రష్యా ప్రతినిధులు ఇస్తాంబుల్‌లో చర్చలు జరపడానికి ముందే రష్యా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది.

"రష్యా ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలను రష్యన్ రాజ్యాంగంలో చేర్చాము. వాటిని ఇప్పుడు రష్యా నుంచి విడదీయడం అసంభవం. వాటిని వదిలివేయడం గురించి ఎలాంటి చర్చలు జరగవు" అని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు.

యుక్రెయిన్‌లో తాము నాలుగు ప్రాంతాలు దోనియెస్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సాన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించింది.

డోనల్డ్ ట్రంప్, జెలియెన్‌స్కీ, జేడీ వాన్స్, రష్యా యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా విషయంలో అమెరికా వైఖరి యూరప్ దేశాలను మరింతగా కలవరపెడుతోంది.

రష్యా అమెరికా సాన్నిహిత్యంపై చైనా ఆందోళన చెందుతోందా?

దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యలపై యుక్రెయిన్ విదేశాంగ శాఖ స్పందించింది. యుక్రెయిన్ సరిహద్దులకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. అలాంటి దేశంలోని కొన్ని ప్రాంతాలు తమవని మరో దేశం తన రాజ్యాంగంలో ప్రకటించుకోవడం కంటే హాస్యాస్పదం ఏముంటుంది? అని ప్రశ్నించింది.

దోనియెన్స్, లుహాన్స్క్ మీద పూర్తి స్థాయిలో, జపోరిజియా, ఖేర్సాన్ మీద పాక్షికంగా రష్యా పట్టు సాధించింది.

దీంతో పాటు ఖార్కియేవ్‌, ఈశాన్య యుక్రెయిన్‌లోనూ కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.

తమ సైన్యం వద్ద వనరులు లేవని జెలియెన్‌స్కీ గతంలో చెప్పారు. అందుకే రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి గెలుచుకోలేకపోయామన్నారు. దౌత్యం ద్వారా కొన్ని ప్రాంతాలను తిరిగి సంపాదిస్తామని చెప్పారు.

"మీలాగే మేము కూడా సుసంపన్నమైన, సార్వభౌమ యుక్రెయిన్ కోరుకుంటున్నాం. అయితే 2014కు ముందున్న సరిహద్దుల్ని పొందడం వాస్తవానికి దూరం. ఇలాంటి ఆసాధారణ లక్ష్యాలను సాధించాలంటే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది" అని అమెరికన్ రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఫిబ్రవరి 12న బ్రస్సెల్స్‌లో జరిగిన భద్రత సదస్సులో చెప్పారు.

"యుక్రెయిన్‌కు నేటో సభ్యత్వం ఇవ్వడం ఒక్కటే పరిష్కారం కాదు. శాంతి స్థాపనతో పాటు మరోసారి యుద్ధం జరగదనే హామీ కావాలి" అని ఆయన అన్నారు.

జెలియెన్‌స్కీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్‌ను కలవడానికి ముందు ట్రంప్ కూడా ఇదే విషయం చెప్పారు.

నేటోలో సభ్యత్వం గురించి యుక్రెయిన్ మర్చిపోవాలి. నేటో కారణంగానే ఇదంతా జరిగి ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు భావిస్తున్నారు. తాను రష్యా అధ్యక్షుడిని నేరుగా కలుస్తానని, యుద్ధాన్ని ముగించేలా ఒప్పందం కుదురుందని ట్రంప్ తెలిపారు.

యుక్రెయిన్ విషయంలో ట్రంప్ ఎందుకిలాంటి వ్యూహంతో ఉన్నారు? యుక్రెయిన్ పట్ల సానుభూతితో ఆలోచిస్తున్న వారంతా, ట్రంప్ రష్యా- చైనా బంధాన్ని బలహీన పరిచేందుకే ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు.

"రష్యా, చైనాను వేరు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అదే జరిగితే ఆయన పూర్తిగా చైనా మీద దృష్టి పెట్టాలని చూస్తున్నారనే విశ్లేషణ ఉంది" అని జేఎన్‌యూలో ప్రొఫెసర్ సంజయ్ కుమార్ పాండే చెప్పారు.

"యుక్రెయిన్ విషయంలో రష్యాతో సన్నిహితంగా ఉండటం ద్వారా రష్యా, చైనా బంధాన్ని చెరిపేయవచ్చని భావించడం భ్రమ. యుక్రెయిన సరిహద్దుల విషయంలో రష్యా లక్ష్యాలు పరిమితంగా లేవు. రష్యా యుక్రెయిన్ దాటి యూరప్ వైపు విస్తరించవచ్చు. ఇంధనం సరఫరా విషయంలో బ్లాక్ మెయిలింగ్ ద్వారా రష్యా యూరప్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఇప్పటికే మొదలైందనే ప్రచారం ఉంది" అని సెంటర్ ఫర్ యూరోపియన్ పాలసీ అనాలసిస్‌కు చెందిన ఎలెనా దవలికోవా మాస్కో టైమ్స్‌కు రాసిన కథనంలో తెలిపారు.

‘‘యుక్రెయిన్ విషయంలో అమెరికా హఠాత్తుగా యు టర్న్ తీసుకోవడంపై చైనా ఆందోళన చెందుతుంది. రష్యా అమెరికా మధ్య బంధం మెల్లిగా పుంజుకుంటున్నట్లు బీజింగ్ భావిస్తోంది. ఈ బంధం బలపడటాన్ని చైనా అసౌకర్యంగా భావిస్తుంది. ఎందుకంటే చైనా రష్యాలో భారీగా పెట్టుబడులు పెట్టింది. చైనాకు ఇప్పుడు రష్యా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అనేక అంశాల్లో చైనా రష్యా నుంచి ప్రయోజనాలు పొందుతోంది" అని చాథమ్ హౌస్‌లో ఆసియా ఫసిఫిక్ ప్రోగ్రామ్‌లో సీనియర్ రీసర్చ్ ఫెలో యూ జి బ్రిటిష్ వార్తాపత్రి ఫైనాన్షియల్ టైమ్స్‌కు రాసిన కాలంలో పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)