యుక్రెయిన్‌తో యుద్ధంపై అమెరికాతో రష్యా చర్చలు, దిగాలుగా కనిపించిన జెలియెన్‌స్కీ

అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, రియాద్, శాంతి చర్చలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చలపై 'సంతృప్తి'తో ఉన్నట్లు ట్రంప్ చెప్పారు.

యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేందుకు సౌదీ అరేబియాలో జరుగుతున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ చర్చలు ఫలిస్తాయని తాను మరింత నమ్మకంతో ఉన్నట్లు ట్రంప్ చెప్పారు.

"రష్యా ఏదో చేయాలనుకుంటోంది. అనాగరికతను ఆపాలనుకుంటోంది. ప్రతీవారం వేల మంది సైనికులు చనిపోతున్నారు. ఇది మూర్ఖత్వం" అని ట్రంప్ అన్నారు.

"ఇది అర్థం లేని యుద్ధం. దీన్ని ముగించాలని మేము అనుకుంటున్నాం. నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగి ఉండేది కాదు" అని ట్రంప్ అన్నారు.

యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రష్యా విదేశామంత్రి సెర్గీ లవ్రోవ్ మధ్య మంగళవారం సౌదీ అరేబియాలో చర్చలు జరిగాయి.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, రియాద్, శాంతి చర్చలు

ఫొటో సోర్స్, RUSSIAN FOREIGN MINISTRY / HANDOUT

ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియాలో చర్చలు జరిపిన అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు

యుక్రెయిన్‌లో నేటో బలగాలు వద్దన్న రష్యా

"మేము పారదర్శకతను కోరుకుంటున్నాం. అందుకే మా వెనుక ఎవరూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదు.’’ అని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెెలియెన్‌స్కీ అన్నారు.

జెెలియెన్‌స్కీ స్పందన తనను 'నిరుత్సాహపరిచిందని' అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. యుక్రెయిన్ యుద్ధం మొదలు పెట్టిందని, యుద్దానికి ముందే ఆ దేశం రష్యాతో ఒప్పందం చేసుకుని ఉండాల్సిందని ట్రంప్ వ్యాఖ్యానించారు

యుక్రెయిన్‌లో యుద్దాన్ని ముగించేందుకు సౌదీలో అమెరికా, రష్యా ఒక ఒప్పందానికి వచ్చాయి.

శాంతి ఒప్పందంలో భాగంగా యుక్రెయిన్‌లో నేటో బలగాలను మోహరించేందుకు తాము అంగీకరించేది లేదని రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ చెప్పారు.

యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేస్తే అక్కడ నేటో బలగాలను మోహరించాలని యూరోపియన్ యూనియన్ దేశాలు కోరాయి.

రష్యాకు వ్యతిరేకంగా నేటో కూటమిలోని యూరోపియన్ దేశాలు యుక్రెయిన్‌కు మద్దతిస్తున్నాయి. శాంతి చర్చల విషయంలో ట్రంప్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్న ఈయూ ఆచితూచి అడుగేస్తోంది.

అమెరికా తమకు ద్రోహం చేస్తోందని యుక్రేనియిన్లు ఆరోపిస్తున్నారన్న వ్యాఖ్యలపై ట్రంప్‌ను బీబీసీ ప్రశ్నించింది.

"చర్చల్లో తమకు స్థానం లేకపోవడంపట్ల వారు నిరాశ చెందారని నేను కూడా విన్నాను. మూడేళ్లుగా, అంతకు ముందు కూడా వాళ్లకు అలాంటి అవకాశం ఉంది. దీన్ని చాలా తేలిగ్గా పరిష్కంచుకోవాల్సింది" అని ట్రంప్ అన్నారు.

"మీరు ఆ పని చేయలేదు. మీరు ఓ ఒప్పందం కుదుర్చుకుని ఉండాల్సింది" అని ఆయన అన్నారు.

అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, రియాద్, శాంతి చర్చలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుర్కియే అధ్యక్షుడితో సమావేశంలో పాల్గొన్న జెెలియెన్‌స్కీ దిగాలుగా కనిపించారు.

విచారంగా జెెలియెన్‌స్కీ

అమెరికా- రష్యా ఏకపక్షంగా చర్చలు జరపడంపై పారిస్‌లో జరిగిన ఈయూ దేశాల సమావేశం అభ్యంతరం వ్యక్తం చేసింది.

యుక్రెయిన్‌కు బలగాలను పంపడాన్ని "పూర్తిగా అర్థరహితం" అని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ అన్నారు. ఇదే విషయాన్ని పోలండ్ ప్రధానమంత్రి టస్క్ పునరుద్ఘాటించారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏకైక యూరోపియన్ నాయకురాలు జార్జియా మెలొనీ సందేహాలు వ్యక్తం చేశారు

యుక్రెయిన్‌లో బలగాలను మోహరించడం "సంక్లిష్టమైన, చాలా తక్కువ ప్రభావవంతమైన చర్య" అని ఆమె అన్నారు.

"చర్చల్లో ఏదో ఒక దశలో యూరోపియన్ యూనియన్ కూడా పాల్గొంటుంది. ఎందుకంటే వారి మీద కూడా ఆంక్షలు అమల్లో ఉన్నాయి" అని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో చెప్పారు.

చర్చల్లో యుక్రెయి‌న్‌ను దూరంగా పెట్టడంపైనా ఆయన స్పందించారు. "ఎవర్నీ పక్కన పెట్టలేదు" అని చెప్పారు.

రియాద్‌లో అమెరికా, రష్యా చర్చల తర్వాత తుర్కియేలో జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జెెలియెన్‌స్కీ దిగాలుగా కనిపించారు.

"యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ఎలా ముగించాలనే దానిపై నిర్ణయాన్ని యుక్రెయిన్ లేకుండా తీసుకోలేరు" అని ఆయన అన్నారు.

రియాద్‌లో చర్చల అనంతరం అమెరికా, రష్యా నాయకుల మొహాలపై నవ్వు చూసిన తర్వాత ఆయన అప్రమత్తం అయ్యారు.

ఈ రెండు దేశాలు ఏది నిర్ణయించినా అందులో ఆయన స్వల్ప మార్పులు మాత్రమే చేయగలిగిన పరిస్థితిలో ఉన్నారు.

అమెరికా సాయం లేకుండా రష్యాను ఎదుర్కోవడం కష్టమని యుక్రెయిన్ అధ్యక్షుడికి తెలుసు. అందుకే ఆయన అమెరికాను గట్టిగా తిరస్కరించలేకపోతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)