యుద్ధమా? రాజీయా

శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు రెండు దేశాల సంకేతాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూడేళ్లుగా సాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం
    • రచయిత, జొనాథన్ బీల్
    • హోదా, డిఫెన్స్ కరస్పాండెంట్

యుద్ధరంగంలో యుక్రెయిన్ వెనకబడుతోంది. మూడేళ్ల యుద్ధం తర్వాత యుక్రెయిన్ సైనికుల్లో చాలామంది అలసిపోయి కనిపిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో యుక్రెయిన్ మరో ఏడాది యుద్ధాన్ని కొనసాగించగలదా అనేది పెద్ద ప్రశ్న.

తూర్పు యుక్రెయిన్‌లో ముందుకెళ్తున్న రష్యా బలగాలకు వ్యతిరేకంగా యుక్రెయిన్ ఆర్మీ ఇప్పటికీ పోరాడుతోంది. అయితే రష్యా బలగాలు కురఖోవ్‌ను చుట్టుముట్టి ఉన్నాయి.

గత కొన్ని వారాల్లో అక్కడ తీవ్రమైన యుద్ధం జరిగింది. కురఖోవ్ ముట్టడిని విచ్ఛిన్నం చేయడానికి యుక్రెయిన్ మోర్టార్ బ్లాక్ ప్యాక్ ప్రయత్నిస్తోంది. కానీ రష్యా బలగాలు మూడు వైపుల నుంచి ముందుకు సాగుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రష్యా ఆక్రమణ తర్వాత స్వచ్ఛందంగా సైన్యంలో చేరిన సెర్ట్
ఫొటో క్యాప్షన్, సెర్ట్, యుక్రెయిన్ కమాండర్

కాల్పుల విరమణపై యుక్రెయిన్ సైనికులు ఏమంటున్నారు?

ఒక సురక్షితమైన ప్రాంతంలో మేం ఈ యూనిట్‌ను కలుసుకున్నాం. వారు యుద్ధంలో పాల్గొని వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్లంతా మామూలు సైనికులు కాదు.. వారిలో షెఫ్, మెకానిక్, వెబ్ డెవలపర్, ఆర్టిస్ట్ వంటివారంతా ఉన్నారు.

సంప్రదాయేతర అభిప్రాయాలు కలిగిన స్నేహితుల సమూహం అది. తమ ఇష్టప్రకారమే వారు పోరాటంలో చేరారు.

వారి కమాండర్...31 ఏళ్ల సెర్ట్... రష్యా ఆక్రమణ ప్రారంభమైన వెంటనే ఆయన యుక్రెయిన్ ఆర్మీలో చేరారు.

యుద్ధం మొదలైన కొత్తలో.. మూడేళ్లలో ముగిసిపోతుందని తాము మొదట్లో అనుకున్నామని సెర్ట్ చెప్పారు. ఇప్పుడు యుద్ధం వచ్చే పదేళ్ల పాటు కొనసాగుతుందనేదానికి తాను మానసికంగా సిద్ధమవుతున్నానని సెర్ట్ అంటున్నారు.

యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని డోనల్డ్ ట్రంప్ అనుకుంటున్నారు.

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరూ చర్చలకు సిద్ధమనే సంకేతాలిచ్చారు.

అయితే అమల్లోకి వచ్చే ఒప్పందం కుదుర్చుకోవడం కష్టంగా కనిపిస్తోంది. సంప్రదింపులు గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా- యుక్రెయిన్ యుద్ధం ముగిస్తానన్న ట్రంప్

ట్రంప్ ప్రకటనలపై యుక్రెయిన్ సైనికులు ఏమనుకుంటున్నారు?

ట్రంప్ లక్ష్యాలను సెర్ట్ వ్యతిరేకించడం లేదు. డోనల్డ్ ట్రంప్ అనుకున్నది చేయడానికి ప్రయత్నించే వ్యక్తి అని, ఆయన యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నిస్తారని సెర్ట్ అంటున్నారు.

అయితే ఎలాంటి ఒప్పందాల వల్లయినా తలెత్తే పరిణామాలపై కమాండర్ సెర్ట్ కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

తాను వాస్తవికవాదినని నమ్మే ఆయన యుక్రెయిన్‌కు న్యాయం జరగదని భావిస్తున్నారు.

''తమ ఇళ్లు రాకెట్లు, షెల్లింగులతో ధ్వంసమైపోయాయన్న వాస్తవాన్ని యుక్రెయిన్ ప్రజలు అంగీకరించాలి. తమకు ఇష్టమైనవారు మరణించారు. వీటన్నింటినీ అంగీకరించడం చాలా కష్టమైన విషయం'' అని కమాండర్ సెర్ట్ అన్నారు.

సంప్రదింపులా.. పోరాటం కొనసాగించడమా అన్న ప్రశ్నకు తాము యుద్ధం కొనసాగిస్తామని సెర్ట్ సమాధానమిచ్చారు. మోర్టార్ యూనిట్‌లో చాలా మంది సభ్యులు తాము యుద్ధం కొనసాగిస్తామని చెప్పారు.

యుద్ధం ముగియాలని కోరుకుంటున్న యుక్రేనియన్లు
ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్‌పై యుక్రెయిన్ ప్రజల్లో సందేహాలు

యుక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితి ఏంటి?

''చర్చలు తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తాయి. కానీ ఒకట్రెండేళ్ల తర్వాత యుద్ధం మళ్లీ మొదలవుతుంది'' అని మోర్టార్ యూనిట్ బ్లాక్ ప్యాక్‌కు చెందిన వీగన్ చెఫ్ సెర్హీ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితి యుక్రెయిన్‌కు అంత సానుకూలంగా లేదన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. కానీ యుద్ధాన్ని కొనసాగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యుద్ధంలో చనిపోవడం అన్నది వృత్తిపరమైన ప్రమాదమన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

డోనల్డ్ ట్రంప్ ఏం చేస్తారన్నది ఊహించలేమని బ్లాక్ ప్యాక్ యూనిట్‌కు చెందిన డేవిడ్ అనే ఆర్టిస్ట్ అన్నారు.

యుక్రెయిన్‌కు చెందిన ఈ ఆర్మీ ఒక వారం యుద్ధంలో పాల్గొని మరో వారం విశ్రాంతి తీసుకుంటుంది.

విశ్రాంతి సమయంలో కూడా వారు శిక్షణ కొనసాగిస్తారు. తమను తాము యుద్ధానికి సన్నద్ధంగా ఉంచుకుంటారు.

మంచు ప్రాంతాల్లో వారు మోర్టార్లతో సాధన చేస్తారు. ఈ బృందంలోకి ఇటీవలే డెనిస్ వచ్చారు. జర్మనీలో సురక్షితంగా జీవిస్తున్నప్పడికీ పోరాటంలో పాల్గొనేందుకు ఆయన అక్కడి జీవితాన్ని వదిలిపెట్టివచ్చారు.

''యుక్రెయిన్ ఉనికి లేని ప్రపంచంలో నేను జీవించగలనా'' అన్ని నన్ను నేను ప్రశ్నించుకున్నా'' అని డెనిస్ చెప్పారు.

''మేమిప్పుడు ఓడిపోతున్నట్టు కనిపిస్తోంది. కానీ మనం ప్రయత్నించకపోతే ఎలా? ఊరికే కూర్చుని, పోరాటాన్ని వదిలేయకుండా కనీసం నేను గెలిచేందుకు ప్రయత్నిస్తూ చనిపోతే బాగుంటుంది'' అని డెనిస్ తెలిపారు.

అయితే ఇతర సహచరుల్లా కాకుండా యుక్రెయిన్ కాల్పుల విరమణ గురించి కచ్చితంగా ఆలోచించాలన్నది డెనిస్ అభిప్రాయం.

యుక్రెయిన్‌లో మృతుల సంఖ్య, అధికారికంగా వెల్లడించినదానికన్నా చాలా ఎక్కువ అని కూడా ఆయన నమ్ముతున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం 4 లక్షలకు పైగా యుక్రెయిన్ సైనికులు యుద్ధంలో చనిపోయారు లేదా గాయపడ్డారు.

మరింతమంది సైనికులను నియమించుకోవడం సమస్యకు పరిష్కారం కాదని డెనిస్ నమ్ముతున్నారు.

''అంకితభావంతో ఉండే ఎంతోమంది సైనికులను మేం పోగొట్టుకున్నాం. వారు అలసిపోయి ఉన్నారు. మేం కాల్పుల విరమణ కోరుకుంటున్నామని కాదు...ఇంకొన్నేళ్లు యుద్ధం చేయలేం'' అని ఆయన చెప్పారు.

శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని రెండు దేశాల సంకేతాలు

కాల్పుల విరమణ గురించి ప్రజలేమనుకుంటున్నారు?

యుద్ధం వల్ల కలిగే నైరాశ్యానికి డినిప్రో కూడా ఓ సాక్ష్యం. యుక్రెయిన్‌లో మూడో అతిపెద్ద నగరం ఇది. క్షిపణులు, డ్రోన్లతో రష్యా ఈ నగరంపై నిరంతరం దాడులు జరిపింది.

యుద్ధవిమానాల సైరన్‌లు రాత్రీపగలనక మోగుతూనే ఉంటాయి. అవి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సాధారణ జీవితం గడిపేందుకు యుక్రేనియన్లు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి అసాధారణ పరిస్థితుల మధ్య కాస్త సమయమైనా వారికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమయంలో వారు థియేటర్‌కు కూడా వెళ్తారు.

'కైదాష్ ఫామిలీ' కామెడీ ప్లే ప్రదర్శన సమయంలో యుద్ధం గురించి గుర్తుచేసుకుంటారు. యుక్రెయిన్ జాతీయగీతం పాడిన తర్వాత చనిపోయినవారి స్మృత్యర్థం ఒక నిమిషం మౌనం పాటిస్తారు.

యుద్ధానికి దీర్ఘకాలిక ముగింపుపై తాము ఆశాభావంతో ఉన్నామని ప్రేక్షకుల్లో కొందరు కూడా అంగీకరించారు.

''యుద్ధం ముగుస్తుందనే ఆశ చాలా తక్కువగా ఉంది. మాకు కొంత మానవతా సాయం అందుతోంది. కానీ అది సరిపోవడం లేదు. అందుకోసమైనా మేం సంప్రదింపులు జరిపి రాజీ కుదుర్చుకోవాలి'' అని లుడమేలా అనే మహిళ అభిప్రాయపడ్డారు.

''దీనికి అంత తేలిగ్గా సమాధానం లభించదు. మా సైనికులు చాలా మంది చనిపోయారు. వారు పోరాడింది దేని కోసం- మా భూభాగాల కోసం. అయితే నేను యుద్ధం ముగియాలనే కోరుకుంటున్నా'' అని కెస్నియా అనే మహిళ కాల్పుల విరమణ చర్చలపై అభిప్రాయం వ్యక్తంచేశారు.

యుద్ధం ముగించాలని కొందరు మహిళల విజ్ఞప్తి
ఫొటో క్యాప్షన్, శిబిరంలో నివసిస్తున్న వృద్ధురాళ్లు

యుద్ధం ముగింపు కోరుకుంటున్న ప్రజలు

యుద్ధాన్ని ముగించడానికి చర్చలు ప్రారంభించాలన్న అభిప్రాయానికి మద్దతు పెరిగినట్టు యుక్రెయిన్‌లో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌ వెల్లడించాయి.

యుద్ధం వల్ల బలవంతంగా తమ ప్రాంతాలను, ఇళ్లను వదిలివెళ్లిన వారి నుంచి కాల్పుల విరమణకు గట్టి మద్దతు లభిస్తోంది.

థియేటర్‌కు దగ్గర ఉన్న ఓ శిబిరంలో తమ ఇళ్లనుంచి పారిపోయి వచ్చిన నలుగురు వృద్ధురాళ్లు ఉంటున్నారు. ఒకప్పుడు అది విద్యార్థుల వసతిగృహం.

తానేమీ తీసుకోకుండా ఇక్కడకు వచ్చానని 87ఏళ్ల వాలెంటీనా చెప్పారు.

షెల్టర్‌లో తమకు ఆహారం, దుస్తులు, షూస్ అందించారని తెలిపారు. ''మమ్మల్నిఇక్కడ బాగా చూస్తున్నారు. అతిథిగా ఉండడం బాగుంటుంది. కానీ మన ఇంట్లో మనం జీవించడం ఇంకా బాగుంటుంది'' అని ఆమె అన్నారు.

వాలెంటీనా ఇల్లు ఇప్పుడు రష్యా ఆక్రమిత భూభాగంలో ఉంది. నలుగురు మహిళలు శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుతున్నారు.

'' ఇంత విధ్వంసం తర్వాత రెండు వర్గాల వారు ఎదురెదురుగా కూర్చుని ఒకరి కళ్లల్లోకి మరొకరు ఎలా చూడగలరో నాకు తెలియదు'' అని 89 ఏళ్ల మరియా చెప్పారు.

సైన్యం బలంతో ఏ ఒక్కరూ గెలవలేరన్నది ఇప్పటికే స్పష్టమైపోయిందని మరియా నమ్ముతున్నారు. అందుకే సంప్రదింపులు అవసరమని ఆమె అభిప్రాయపడుతున్నారు.

శాంతి కోసం తమ భూమిని యుక్రెయిన్ త్యాగం చేయాల్సివచ్చినట్టే.. చర్చలు జరిగినప్పటికీ ఈ మహిళలు చాలా పెద్ద త్యాగం చేయాల్సి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)