విశాఖలో జరగాల్సిన నేవీ డే వేడుకలు పూరీలో ఎందుకు జరిగాయి ? మళ్లీ ఇప్పుడు విశాఖలో ఎందుకు నిర్వహిస్తున్నారు

విశాఖ పట్నం, నేవీ డే, పూరి, ఒరిస్సా
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఏటా విశాఖలో డిసెంబర్ 4న నిర్వహించే నేవీ డే వేడుకలను 2024లో ఆనవాయితీకి భిన్నంగా పూరీలో నిర్వహించారు.

ఆ వేడుకలకు కొనసాగింపుగా ఈ నెల 4న(2025 జనవరి) విశాఖలోని రామకృష్ణ బీచ్‌లో నేవీ ‘ఆపరేషనల్ డిమాన్‌స్ట్రేషన్’ను భారీ ఎత్తున నిర్వహించనుంది.

ఇందుకోసం పెద్దఎత్తున ఏర్పాట్లు, రిహార్సల్స్ జరుగుతున్నాయి.

1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా ఏటా విశాఖలో తూర్పు నౌకాదళం ‘నేవీ డే’ నిర్వహిస్తుంది.

భారత నౌకాదళం విశాఖలో పాకిస్తాన్ నౌకాదళంపై చేసిన దాడితో ఆ యుద్ధంలో ఇండియాకు విజయం దక్కింది.

ఆ సందర్భంగా ఏటా డిసెంబర్ 4న తూర్పు నౌకాదళం నేవీ డే జరుపుతుంది. ఇది క్రమం తప్పకుండా విశాఖలో జరుగుతున్న రక్షణ రంగ వేడుక.

కానీ 2024లో మాత్రం నేవీ డే వేడుకలను విశాఖలో కాకుండా ఒడిశాలోని పూరీలో నిర్వహించారు. ఇలా జరగడం ఇదే తొలిసారి.

అయితే, సరిగ్గా నెల రోజుల తర్వాత ఇప్పుడు జనవరి 4న విశాఖలో ‘నేవీ డే’ వేడుకల కొనసాగింపు' పేరుతో విశాఖలో నేవీ డే ఉత్సవాలను తూర్పు నౌకాదళం నిర్వహిస్తోంది.

విశాఖతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నేవీ డే ఉత్సవాలను అక్కడ కాకుండా ఈసారి పూరీలో ఎందుకు నిర్వహించారు?

మళ్లీ విశాఖలో కూడా ఎందుకు సెలబ్రేషన్స్ నిర్వహిస్తోంది? దీనికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? తూర్పు నౌకాదళం ఏం చెప్తోంది?

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖ పట్నం, నేవీడే, పూరీ, ఒడిశా, భారత్ పాకిస్తాన్ యుద్ధం, బంగ్లాదేశ్, 1971 యుద్ధం, ప్రధాని ఇందిరా గాంధీ.
ఫొటో క్యాప్షన్, 1971లో పాకిస్తాన్‌పై యుద్ధంలో విజయానికి గుర్తుగా ఏటా విశాఖలో తూర్పు నౌకాదళం నేవీడే ఉత్సవాలు నిర్వహిస్తోంది.

1971 డిసెంబర్ 4 ముందు ఏం జరిగింది

1970ల్లో పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) నుంచి విమోచన కోరుతూ తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) చేస్తున్న పోరాటాలతో యుద్ధ వాతావరణం నెలకొంది.

1971 మార్చిలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ తూర్పు పాకిస్తాన్ పోరాటానికి మద్దతు తెలిపారు.

అది ఇండియా, పాకిస్తాన్ యుద్ధానికి దారి తీసింది.

1971 నవంబర్ రెండో వారంలోనే యుద్ధానికి సిద్ధం కావాలని పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు పిలుపు ఇచ్చిందని, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 16 వరకు జరిగిన యుద్ధ పరిస్థితులను తూర్పు నౌకాదళ మాజీ ఉద్యోగి జి. ఫణిరాజు బీబీసీకి వివరించారు.

‘పశ్చిమ పాకిస్తాన్ నుంచి 1971 నవంబర్ 30న పాకిస్తాన్ భారత్‌పై దాడి ప్రారంభించింది. డిసెంబర్ 3న పాకిస్తాన్ భారత నేవీని, పోర్టులను టార్గెట్ చేసింది. దాంతో రంగంలోకి దిగిన తూర్పు నౌకాదళం డిసెంబర్ 3 రాత్రి నుంచి డిసెంబర్ 4 ఉదయం వరకు పాకిస్తాన్ నేవీ వార్ ఎస్టాబ్లిష్‌మెంట్లను సగానికి పైగా నాశనం చేసింది. ఆ వెంటనే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ యుద్ధరంగంలోకి వచ్చి పాకిస్తాన్ సైన్యాన్ని క్రమంగా చిత్తు చేశాయి. ఇదంతా డిసెంబర్ 4న జరగడంతో... ఆ తేదీన విజయోత్సవాలు చేసుకుంటాం. పైగా తూర్పు నౌకాదళం ఈ యుద్ధంలో కీలకమైన పాత్ర పోషించడంతో విశాఖ తీరంలో నేవీ డే ఏటా జరుపుకొంటాం" అని ఫణిరాజు తెలిపారు.

విశాఖ పట్నం, నేవీడే, పూరి, ఒరిస్సా, భారత్ పాకిస్తాన్ యుద్ధం, బంగ్లాదేశ్, 1971 యుద్ధం, ప్రధాని ఇందిరా గాంధీ.
ఫొటో క్యాప్షన్, డిసెంబరు 4న నేవీ డేను ఒడిశాలోని పూరీ తీరంలో నిర్వహించారు.

ఆటంకాలు లేవు, అయినా జరగలేదు.

పాకిస్తాన్‌పై విజయానికి గుర్తుగా 'విక్టరీ ఎట్ సీ' పేరుతో విశాఖ తీరంలో ఒక మెమోరియల్ కూడా నిర్మించారు.

యుద్ధంలో మరణించిన నౌకాదళ ఉద్యోగులకు ఏటా డిసెంబర్ 4న ఈ మెమోరియల్ వద్ద తూర్పు నౌకాదళం నివాళులు అర్పించి.. నేవీ డే ఉత్సవాలను నిర్వహిస్తుంది.

1971 నుంచి ఇప్పటివరకు భారీ తుపాన్లు, కోవిడ్ సమయంలో తప్ప... ఏటా విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద నేవీ డే నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి లేదా గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వంటి వారితో పాటు నేవీ ఉన్నతాధికారులు వస్తారు.

దీంతో ఏటా డిసెంబర్ 4కి వారం రోజుల ముందు నుంచి విశాఖ ఆర్కే బీచ్‌లో ఏర్పాట్లు, రిహార్సల్స్ తో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుంది.

కానీ ఈ ఏడాది తుపాన్లు, ఇతర అనివార్య పరిస్థితులు లేనప్పటికీ డిసెంబర్ 4న విశాఖలో నేవీ డే జరగలేదు.

డిసెంబరు 4న నేవీ డేను ఒడిశాలోని పూరీ తీరంలో నిర్వహించారు.

అక్కడ వైమానిక దళం అద్భుతమైన విన్యాసాలు చేసింది. వీటిని తొలిసారి ప్రత్యక్షంగా చూసిన ఒడిశావాసులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

రిహార్సల్స్‌తో కలిపి వారం రోజుల పాటు జరిగిన నేవీ విన్యాసాలను లక్షల మంది ఒడిశా వాసులు ప్రత్యక్ష్యంగా వీక్షించారు.

"గత రెండేళ్లుగా నేవీ డే వేడుకలను పూరీలో కూడా నిర్వహించాలని ఇక్కడి ప్రజలు, రాజకీయ నాయకులు తూర్పు నౌకాదళాన్ని, భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అది ఈ సారి సాకారమైంది" అని ఒడిశాలోని కళింగ టీవీ సీనియర్ జర్నలిస్టు కీర్తిజీ బీబీసీతో చెప్పారు.

విశాఖ పట్నం, నేవీడే, పూరి, ఒరిస్సా, భారత్ పాకిస్తాన్ యుద్ధం, బంగ్లాదేశ్, 1971 యుద్ధం, ప్రధాని ఇందిరా గాంధీ.
ఫొటో క్యాప్షన్, విశాఖలో 2025 జనవరి 4న నిర్వహిస్తున్నట్లు తూర్పు నౌకాదళం ప్రకటించింది.

విశాఖ నుంచి 'నేవీ డే' పూరీ తీరానికి ఎలా చేరిదంటే...

పూరీ తీరంలో డిసెంబర్ 4న జరిగిన వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒడిశా రాష్ట్రానికి చెందినవారే.

తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రమైన విశాఖలో కాకుండా వేరే ప్రాంతంలో నేవీ డే విన్యాసాలు నిర్వహించడం ఇదే ప్రథమం. దీనికి గత ఏడాదే బీజం పడింది.

పశ్చిమ నౌకాదళానికి సంబంధించి... ముంబయిలో ఏటా నేవీ డే నిర్వహించేవారు. గత ఏడాది అక్కడ కాకుండా మహారాష్ట్రలోని సింధు దుర్గ్‌లో విన్యాసాలు నిర్వహించారు.

ఆ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అదే తరహాలో ఈసారి తూర్పు నౌకాదళంలోనూ విన్యాసాల వేదిక మార్చారని కొందరు అధికారులు చెప్తున్నారు.

"ఉత్తరాంధ్ర, ఒడిశా అంతా గతంలో కళింగ సామ్రాజ్యంగా వ్యవహరించేవారు. ఒడిశా కూడా తూర్పు నౌకాదళంలో భాగమే కాబట్టి అక్కడ నేవీ విన్యాసాలు నిర్వహించాం. నేవీ డే సందర్భంగా ప్రధాన నగరాల్లో ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనవాయితీ. తూర్పు నౌకాదళం కోల్‌కతా, పారాదీప్‌, పాండిచ్చేరి, చెన్నై వంటి నగరాలకు యుద్ధనౌకలను, హెలికాప్టర్లను పంపించి, అక్కడి పౌరులకు వాటిని సందర్శించే అవకాశం కల్పిస్తుంది. ఈసారి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖలో కాకుండా తూర్పు తీరంలోని మరో ముఖ్య నగరమైన పూరీ తీరంలో నేవీ డే నిర్వహించాం" అని తూర్పు నౌకాదళం అధికారులు తెలిపారు.

విశాఖ పట్నం, నేవీడే, పూరి, ఒరిస్సా, భారత్ పాకిస్తాన్ యుద్ధం, బంగ్లాదేశ్, 1971 యుద్ధం, ప్రధాని ఇందిరా గాంధీ.
ఫొటో క్యాప్షన్, డిసెంబరు 4న నేవీ డేను ఒడిశాలోని పూరీ తీరంలో నిర్వహించారు.

రెండేళ్ల ప్రయత్నం ఫలించింది: పూరీ ఎంపీ సంబిత్ పాత్ర

నేవీ డే వేడుకలకు ముందు తూర్పు నౌకాదళ ఉన్నతాధికారులు పూరీ శ్రీజగన్నాథ ఆలయానికి వెళ్లి, వేడుకలో పాల్గొనడానికి జగన్నాథుడిని ఆహ్వానించారు.

ఏ ముఖ్య కార్యక్రమానికైనా ఒడిశా ప్రజలు స్వామిని ఆహ్వానించడం ఆనవాయితీ, ఎల్లప్పుడూ మొదటి ఆహ్వానితుడు పూరీ జగన్నాధుడే అని ఒడిశా మీడియాతో మాట్లాడుతూ అన్నారు పూరీ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు సంబిత్ పాత్ర.

"తూర్పు భారతదేశంలో ఉన్న ఒడిశా వంటి వెనుకబడిన రాష్ట్రాలలో ఇలాంటి వేడుకలు నిర్వహించడం ద్వారా వారిని దేశ రక్షణలో భాగం చేసినట్లు అవుతుంది. తీర ప్రాంతాల్లోని అన్నిచోట్ల ఇటువంటి కార్యక్రమాలు జరిగితే అక్కడి ప్రజలకు తూర్పు నౌకాదళం, రక్షణ రంగం పట్ల అవగాహన పెరుగుతుంది. అందుకే గత రెండేళ్లుగా చేసిన ప్రయత్నాల ద్వారా 2024 నేవీ డే ఉత్సవాలను పూరీలో నిర్వహిస్తున్నాం" అని ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకల్లో భాగంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఇండియన్ నేవీ "ఆపరేషనల్ డిమాన్‌స్ట్రేషన్" నిర్వహించింది.

దీనిని రక్షణ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.

"ఈ ఈవెంట్ భారతదేశపు గొప్ప సముద్ర వారసత్వానికి నిదర్శనం. నేవీకి చెందిన యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, నౌకలు, యుద్ధ రంగంలో నేవీ నింగి, నేల, నీరుపై ఎలా పోరాడుతుందో ప్రత్యక్షంగా చూసే అవకాశం సాధారణ ప్రజలకు కూడా కలిగింది" అని కమాండింగ్ ఆఫీసర్ బి. దీపక్ అనిల్ అన్నారు.

విశాఖ పట్నం, నేవీడే, పూరి, ఒరిస్సా, భారత్ పాకిస్తాన్ యుద్ధం, బంగ్లాదేశ్, 1971 యుద్ధం, ప్రధాని ఇందిరా గాంధీ.
ఫొటో క్యాప్షన్, డిసెంబర్ 4న నేవీ డే వేడుకల్లో భాగంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఇండియన్ నేవీ "ఆపరేషనల్ డిమాన్‌స్ట్రేషన్" నిర్వహించింది.

ఇప్పుడు మళ్లీ విశాఖలో నేవీ డే ఉత్సవాలు

2024 నేవీ డే ఉత్సవాలు పూరీలో ఘనంగా ముగిశాయి. కానీ మళ్లీ విశాఖలో 2025 జనవరి 4న నిర్వహిస్తున్నట్లు తూర్పు నౌకాదళం ప్రకటించింది.

ఇప్పటికే రిహార్సల్స్ జరుగుతున్నాయి. వీటికి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.

ఏటా జరిగే నేవీ డే ఉత్సవాలకు డిసెంబర్ 4న ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విశాఖ తీరానికి సందర్శకులు వస్తుంటారు.

ఆ రోజు ఆర్కే బీచ్ జనసందోహంగా మారిపోతుంది. సాయంత్రం గంటన్నర పాటు ఆర్కే బీచ్ పరిసరాలన్ని యుద్ధ భూమిలా కనిపిస్తాయి.

మళ్లీ విశాఖలో జరుగుతుండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఒకే వేడుకను రెండు సార్లు నిర్వహించడంపై చర్చ జరుగుతోంది.

దీనిపై తూర్పు నౌకాదళం పీఆర్వో కార్యాలయంతో బీబీసీ మాట్లాడింది.

"పూరీ ప్రజలకు నేవీ విన్యాసాలు చూపేందుకు అక్కడ నిర్వహించాం. ఏటా విశాఖలో జరిగే ఈ ఉత్సవాలకు బ్రేక్ పడకుండా విశాఖ వాసుల కోసం మళ్లీ ఇక్కడ నిర్వహిస్తున్నాం" అని తూర్పు నౌకాదళం పీఆర్వో కార్యాలయం తెలిపింది.

"నేవీ డే ఉత్సవాలు తూర్పు తీరంలో ఎక్కడ జరిగినా ఒక్కటే. అయితే విశాఖలో జరగడం అనవాయితీ కాబట్టి ఎప్పుడూ ఇక్కడ జరగడమే బాగుంటుంది. నేవీ డే ఉత్సవాలకు, విశాఖకు సంబంధం కూడా ఉంది. అయితే ఈ ఏడాది ఒడిశాలో బీజేపీ సొంత బలంతో అధికారంలోకి రావడం, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా ఈ ప్రాంతానికే చెందిన వారు కావడంతో...ఈ ప్రాంతంలో జరిపితే బాగుంటుందని పూరీ తీరానికి ఈ ఏడాది అవకాశం ఇచ్చి ఉండవచ్చు" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని తూర్పు నౌకాదళం మాజీ ఉద్యోగి ఒకరు బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)