విశాఖ డెయిరీ 3 లక్షల మంది పాడి రైతులకు అన్యాయం చేస్తోందా? ఆరోపణలు ఏంటి?

ఫొటో సోర్స్, Lakkoju srinivas
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖ డెయిరీ, 2025 నాటికి పాడి రైతుల నుంచి ప్రతి రోజూ 10 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. సరిగ్గా, 2025 సమీపిస్తున్న తరుణంలో విశాఖ డెయిరీ వివాదాల్లో చిక్కుకుంది.
డెయిరీ యాజమాన్యం అవినీతి, అక్రమాలు చేస్తుందంటూ పాలు సరఫరా చేసే పాడి రైతులు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నారు. ఇందులో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం హౌస్ కమిటీని నియమించింది.
ఈ హౌస్ కమిటీ డిసెంబర్ 9 (సోమవారం)న విశాఖ డెయిరీలో విచారణ జరిపింది. పాడి రైతులు, డెయిరీ యాజమాన్య ప్రతినిధులతో హౌస్ కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు చర్చలు జరిపారు.
విశాఖ డెయిరీపై వస్తున్న ఆరోపణలు ఏంటి? దీనిపై ఏర్పాటైన హౌస్ కమిటీ సభ్యులు ఏమంటున్నారు? పాడి రైతుల వాదన ఏంటి? డెయిరీకి రాజకీయాలకు ఏదైనా సంబంధం ఉందా? అసలు విశాఖ డెయిరీ చరిత్ర ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Lakkoju srinivas
విశాఖ డెయిరీ అసలు పేరు ఏంటంటే
విశాఖ అక్కిరెడ్డిపాలెంలో ఉన్న డెయిరీని విశాఖ డెయిరీ అని పిలుస్తారు. దీని అసలు పేరు శ్రీ విజయ విశాఖ మిల్క్ కంపెనీ లిమిటెడ్. 1973లో కో ఆపరేటివ్ సోసైటీ చట్టం ప్రకారం ఈ డెయిరీని నెలకొల్పారు. 50 వేల లీటర్ల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ డెయిరీ ప్రస్తుత సామర్థ్యం రోజుకు 9 లక్షల లీటర్లు.
విశాఖ డెయిరీకి విశాఖపట్నంతో పాటు తూర్పు గోదావరిలోని రంగంపేటలో కూడా డెయిరీ ఉంది. పాలతో పాటు పాల ఉత్పత్తులైన పెరుగు, లస్సీ, స్వీట్లు, వెన్న, బేకరీ ఐటమ్స్ ఇక్కడ తయారు అవుతాయి. ఈ ఉత్పత్తులకు ఏపీ, తెలంగాణతోపాటు ఛత్తీస్‌ఘడ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో కూడా మార్కెట్ ఉంది.
విశాఖ డెయిరీ ద్వారా ప్రత్యక్షంగా 1500 మందికి పైగా, పరోక్షంగా 1000 మంది ఉపాధి పొందుతున్నారు. 2025 నాటికి రూ. 2 వేల కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని డెయిరీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
విశాఖ డెయిరీకి చైర్మన్‌గా 1986 నుంచి, అంటే 36 ఏళ్లు ఆడారి తులసీరావు వ్యవహరించారు. ఆయన మరణానంతరం 2023 నుంచి ఆయన కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ ఈ బాధ్యతలు తీసుకున్నారు.
"కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తిదారుల కంపెనీ చట్టం-2002 ప్రకారం, 2013 నుంచి విశాఖ డెయిరీని 'శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్'గా మార్చాం. డెయిరీకి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో పాల సరఫరాదారులు 3 లక్షల వరకు ఉన్నారు" అని బీబీసీతో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వీ రమణ చెప్పారు.

ఫొటో సోర్స్, Lakkoju srinivas
2024 ఎన్నికల తర్వాత...
విశాఖ డెయిరీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆడారి ఆనంద్ కుమార్, 2024 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత పాడి రైతులకు ఆవు పాలకు ఇచ్చే ధరను సెప్టెంబర్‌లో డెయిరీ తగ్గించింది. అప్పటివరకు లీటరు పాలకు రూ.34 ఇవ్వగా, దాన్ని రూ. 31కి తగ్గించింది.
దీనికి నిరసనగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో పాలను సరఫరా చేసే రైతులు ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో విశాఖ డెయిరీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు రావడం మొదలైంది. ఈ విషయంపై ఏపీ అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో విశాఖ డెయిరీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణకు సభా సంఘం ఏర్పాటు చేయాలని నవంబర్ 20న ప్రభుత్వం నిర్ణయించింది.
సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఈ కమిటీకి చైర్మన్‌గా నియమిస్తూ, అందులో సభ్యులుగా బోండా ఉమా మహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌వీఎస్కే రంగారావు, దాట్ల సుబ్బరాజులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Lakkoju srinivas
విశాఖ డెయిరీపై వచ్చిన ఆరోపణలు
విశాఖ డెయిరీలో అవకతవకలు జరిగాయంటూ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు.
ఆయనతో పాటు పాడి రైతుల సంఘాలు కూడా జతకూడాయి. విశాఖ డెయిరీ నిర్వహణపై వరుస ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. డెయిరీపై వచ్చిన ప్రధాన ఆరోపణలను ఏపీ పాలరైతుల సంఘం అధ్యక్షుడు బి. రాంబాబు, బీబీసీకి తెలిపారు. అవేంటంటే,
- హైదరాబాద్‌లో ఆడారి కుటుంబం సొంతంగా ఒక డెయిరీని పెట్టుకొని దానికి ఇక్కడి నుంచి రోజూ 15 వేల లీటర్ల పాలను సరఫరా చేస్తోంది.
- డెయిరీ సభ్యులకు ఆడపిల్ల పుడితే లక్ష రూపాయలు, మగబిడ్డ పుడితే రూ. 50 వేలు డిపాజిట్ చేస్తారు. దీని కోసం కేటాయించిన రూ. 25 కోట్ల డిపాజిట్లను డెయిరీ పెద్దలు వాడుకుంటున్నారు.
- నర్సీపట్నం, చినగదిలి, విజయనగరంలోని మెరకముడిదాం తదితర ప్రాంతాల్లో డెయిరీ పేరుతో 84 ఎకరాల భూములు ఉన్నాయి. అవి సొసైటీ నిధులతో కొనుగోలు చేసినా, అధికారిక లెక్కలు చెప్పడం లేదు.
- విశాఖ నరవలో డెయిరీ పేరుతో మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసి అందులో 90 సెంట్లు కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చేశారు.
- రైతుల కోసమని నిర్మించిన 'కృషి' ఆసుపత్రిని కార్పొరేట్ సంస్థకు అప్పగించేశారు.
- విశాఖ డెయిరీ బోర్డు డైరెక్టర్ల కుటుంబ సభ్యులకు పశువుల వైద్యానికి ఉపయోగించే వెహికిల్స్ కాంట్రాక్ట్ ఇచ్చి నెలకు ఒక్కొక్క వాహనానికి రూ. 1,50,000 వరకు చెల్లిస్తున్నారు.

ఫొటో సోర్స్, Lakkoju srinivas
సభా సంఘం ఏమంటోంది?
డెయిరీలో డిసెంబర్ 9న విచారణ చేపట్టిన సభా సంఘం, డెయిరీ యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో వారి ప్రతినిధులతో సమావేశమైంది. అనంతరం పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులతో కూడా మాట్లాడింది.
"సహకార డెయిరీని కంపెనీ చట్టం కిందకు తీసుకొచ్చిన తర్వాత పాడి రైతులకు అందాల్సిన ప్రయోజనాలను డెయిరీ విస్మరించింది. కంపెనీ యాక్ట్, కోఆపరేటివ్ యాక్ట్, ఫైనాన్స్ ఇతర డిపార్ట్‌మెంట్ల గురించి తెలిసిన నిపుణుల సలహాలు తీసుకుంటాం. ఇక్కడ విచారించిన తర్వాత డెయిరీపై వచ్చిన ఆరోపణలకు మరింత బలం చేకూరింది" అని కమిటీ చైర్మన్ జ్యోతులు నెహ్రూ అన్నారు.
"విశాఖ డెయిరీ మీద ఆడిట్ జరగాల్సి ఉంది. విశాఖ డెయిరీ నాలుగు జిల్లాల పరిధిలో ఉంది. ఆ నాలుగు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాం" అని కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

ఫొటో సోర్స్, Lakkoju srinivas
డెయిరీ చైర్మెన్ ఎక్కడ?: జ్యోతుల నెహ్రూ
సభా సంఘం కమిటీ, విశాఖ డెయిరీకి వచ్చినప్పుడు అనేక మంది పాడి రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు వీరిని కలిసి వినతిపత్రాలు అందజేశారు.
పాడి రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని, పాల సేకరణ ధరను పెంచాలని కోరుతూ సీపీఐ నాయకులు, జీవీఎంసీ కార్పొరేటర్ బి. గంగారావు హౌస్ కమిటీ చైర్మన్‌కు వినతి పత్రం ఇచ్చారు.
"డెయిరీ యాజమాన్యం అవినీతికి పాల్పడుతూ డెయిరీని నష్టాల్లోకి నెట్టేస్తోంది. దీనివల్ల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి విశాఖ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న దాదాపు 3 లక్షల మంది పాడి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది" అని గంగారావు అన్నారు.
"చర్చల్లో యాజమాన్యం ఇచ్చిన సమాధానం చూస్తే సందేహాలు పెరిగాయి. ప్రస్తుతానికి ఏ స్పష్టతా రాలేదు. మా పరిశీలన సమయంలో విశాఖ డెయిరీ చైర్మన్ ఎక్కడున్నారు? ఆయన హాజరు కాలేదు. కేవలం ఎండీ మాత్రమే పాల్గొన్నారు" అని హౌస్ కమిటీ చైర్మన్ జోత్యుల నెహ్రూ అన్నారు.
ఈ విషయాలపై డెయిరీ యాజమాన్యంతో మాట్లాడేందుకు బీబీసీ విశాఖ డెయిరీకి వెళ్లింది. అక్కడ కొందరు ఉద్యోగులు జీతాల కోసం ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపించింది. డెయిరీ చైర్మన్ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పారు.
"గత ఆడిట్ స్టేట్‌మెంట్లను కమిటీ అడిగింది. అలాగే, గతంలో జరిగిన లావాదేవీల వివరాలు కోరింది. వీటితో పాటు మరికొన్ని వివరాలు అడిగింది. అవి సిద్ధం చేసి కమిటీకి అందిస్తాం. డెయిరీపై వచ్చిన ఆరోపణలపై కమిటీ సభ్యులకు సమాధానం చెప్తాం" అని డెయిరీ ఎండీ ఎస్వీ రమణ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Lakkoju srinivas
డెయిరీపై ఆరోపణలు ఇప్పటివి కావు: యుగంధర్ రెడ్డి
ఆడారి తులసీరావు తర్వాత ఆయన కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ డెయిరీ చైర్మన్ అయ్యారు. తులసీరావు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన టీడీపీ మద్దతుదారు. ఆయన కుమారుడు కూడా 2019లో టీడీపీ తరఫున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు'' అని రాజకీయ విశ్లేషకుడు ఎం. యుగంధర్ రెడ్డి అన్నారు.
"డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయని ఎన్నాళ్లుగానో వినిపిస్తోంది. అప్పుడు అధికారంలో వైసీపీ ఉండటంతో పెద్దగా ఇబ్బందులు ఎదురై ఉండకపోవచ్చు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో డెయిరీ ప్రక్షాళన అంటూ హడావిడి కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆనంద్‌కుమార్ మళ్లీ టీడీపీలోకి తిరిగి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు రెండు పార్టీలతో సంబంధాలున్నాయి" అని యుగంధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
''కమిటీ విచారణ జరుపుతోంది కదా. దాని ఫలితాలు ఎలా వస్తాయనేది చూసి, దాన్నిబట్టి డెయిరీపై వస్తున్న ఆరోపణల లక్ష్యమేంటో'' తెలుస్తుందన్నారు యుగంధర్ రెడ్డి.
విశాఖ డెయిరీ మీద, చైర్మన్ కుటుంబం మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆడారి ఆనంద్ కుమార్‌ను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














