రష్యాను సవాలు చెయ్యడానికి 'యూరప్ సైన్యం' కావాలని జెెలియెన్‌స్కీ ఎందుకు అంటున్నారు?

Ukrainian President Volodymyr Zelensky

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డియర్బెయిల్ జోర్డన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా నుంచి యూరప్ దేశాలకు అందుతున్న ఆర్థిక, సైనిక సాయం ఇకపై అందే అవకాశం కనిపించకపోవడంతో ‘యూరప్ సైన్యం’ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలియెన్‌స్కీ పిలుపిచ్చారు.

యూరప్, అమెరికా మధ్య ఉన్న చిరకాల బంధం ‘ముగింపు దశకు’ చేరుకుందని, ఈ విషయాన్ని యూరప్ దేశాలు అర్థం చేసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల్ని జెలియెన్‌స్కీ మ్యూనిచ్‌లో జరిగిన భద్రత సదస్సుల్లో గుర్తు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాంతి చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించినట్లు తెలిసిన తర్వాత ‘మా ప్రమేయం లేకుండా మా వెనుక జరిగే ఒప్పందాలను మేం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించే ప్రసక్తే లేదు’ అని యుక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

ట్రంప్-పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ‘చర్చల ప్రక్రియను విస్తరించే విషయమై’ రష్యా విదేశాంగమంత్రితో ఫోన్‌లో మాట్లాడారు

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, రష్యా, యుక్రెయిన్, జెలెన్‌స్కీ, యూరప్ దేశాలు

ఫొటో సోర్స్, EPA

ట్రంప్, పుతిన్ ఫోన్ సంభాషణ ‘అమెరికా వైపు నుంచి వచ్చిన అభ్యర్థన’ అని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ప్రకటనలో యుక్రెయిన్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

అయితే ‘చర్చల విషయంలో రెండు దేశాలు నిబద్ధతతో ఉన్నాయని పునరుద్ఘాటిస్తున్నట్లు’ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేయడంతో మూడేళ్లుగా అమెరికా, రష్యా మధ్య ఉన్న నిశ్శబ్దానికి ముగింపు పలికినట్లయింది.

ట్రంప్ ప్రత్యేక దూత కీత్ కెల్లాగ్ ‘అమెరికా రష్యా మధ్య చర్చల్లో యూరప్‌ను సంప్రదిస్తాం, అయితే చర్చల్లో వారికి ఎలాంటి భాగస్వామ్యం ఉండదు’ అని చెప్పారు.

ఆయన వ్యాఖ్యలు యుక్రెయిన్‌తో పాటు యూరప్ దేశాల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ‘ఎక్కువ మంది చర్చల్లో పాల్గొనడం వల్లనే గతంలో అవి విఫలం అయ్యాయి’ అని ఆయన అన్నారు.

‘ఇది బ్లాక్ బోర్డు మీద చాక్‌పీసుతో రాసినప్పుడు అది రాలిపోతున్నట్లుగా అనిపించవచ్చు. కానీ నేను మీకు వాస్తవాలు చెబుతున్నాను’ అని కీత్ కెల్లాగ్ అన్నారు.

యుక్రెయిన్‌కు చెందిన విస్తృత సహజవనరులను అమెరికాకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని తాను అడ్డుకున్నట్లు జెలియెన్‌స్కీ చెప్పారు.

ట్రంప్ ప్రతిపాదనలో తమకు ‘భద్రత హామీలు’ లేవని, అది కీయెవ్ ప్రయోజనాలను ‘పరిరక్షించేలా లేదని’ యుక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.

అమెరికా యుక్రెయిన్‌కు అందిస్తున్న సాయానికి బదులుగా, ఆ దేశంలోని అరుదైన సహజ వనరులను తమకు అందుబాటులోకి తేవాలని ట్రంప్ ప్రతిపాదించారు. అలా కాకున్నా అమెరికా ఇప్పటికే చేసిన సాయానికి పరిహారంగానైనా ఇవ్వాలని అన్నారు.

రష్యా యుక్రెయిన్ మీద పూర్తి స్థాయి యుద్ధం చెయ్యడం నేటోకు ‘ఫ్యాక్టరీ రీసెట్’లాంటిదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ చెప్పారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడి నేటో సభ్య దేశాలు బలంగా, దూకుడుగా ఉండాలన్న సంకేతం ఇచ్చిందన్నారు.

‘ఒక్క విషయం నిజంగా మాట్లాడుకుందాం. యూరప్‌ను భయపెట్టే సమస్య విషయంలో అమెరికా అండగా నిలబడదనే విషయాన్ని మనమిపుడు కొట్టిపారేయలేం. అనేక మంది నాయకులు యూరప్‌కు సొంత సైన్యం ఉండాలని, అది ఆర్మీ ఆఫ్ యూరప్ కావాలని అంటున్నారు’ అని జెలియెన్‌స్కీ చెప్పారు.

అమెరికా మీద ఆధారపడడాన్ని తగ్గించేందుకు యూరోపియన్ దేశాలకు సైనిక వ్యవస్థ ఉండాలని గతంలో అనేక మంది నాయకులు ప్రతిపాదించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చారు.

యూరోపియన్ యూనియన్ విదేశీ విధాన అధ్యక్షుడు కజ కల్లాస్ కూడా దీన్ని సమర్థించారు.

‘కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తాను పుతిన్‌తో జరిపిన సంభాషణ గురించి నాతో చెప్పారు. ఒక్కసారి కూడా ఆయన చర్చల్లో యూరప్ ఉండాలని అనలేదు. అందులో ఎంతో అర్థం ఉంది. యూరప్‌కు అవసరమైనప్పుడల్లా అమెరికా అండగా ఉంటుందనేదిప్పుడు గతం’ అని జెలియెన్‌స్కీ అన్నారు.

రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసి మూడేళ్లవుతోంది. యుక్రెయిన్‌ను నేటోలో చేర్చుకోవడం సాధ్యం కాకపోవచ్చని ట్రంప్, హెగ్‌సెత్ చెప్పారు.

2014కి ముందు యుక్రెయిన్‌కున్న సరిహద్దుల్ని తిరిగి ఆ దేశానికి అప్పగించడం కుదరదని అమెరికా రక్షణ మంత్రి అన్నారు.

చర్చల్లో యుక్రెయిన్‌ను పక్కన పెడితే తాను నేటో సభ్యత్వం తీసుకోనని జెలియెన్‌స్కీ చెప్పారు.

అమెరికా, రష్యా, యుక్రెయిన్, జెలెన్‌స్కీ, యూరప్ దేశాలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రష్యా యూరప్‌ దేశాలతో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోందని జెలియెన్‌స్కీ గతంలో హెచ్చరించారు.

మిగతా భాగస్వాములను పక్కన పెట్టి యుక్రెయిన్ విషయంలో చర్చల ప్రక్రియ కొనసాగించాలని ట్రంప్, పుతిన్ గత వారం జరిగిన ఫోన్ కాల్ సంభాషణలో నిర్ణయించారు.

"యుక్రెయిన్, యూరప్ మీద నిర్ణయాలు తీసుకునేటప్పుడు యుక్రెయిన్ మాదిరిగానే, యూరప్ కూడా చర్చల్లో భాగస్వామిగా ఉండాలని" జెలియెన్‌స్కీ అడుగుతున్నారు.

తాను, పుతిన్ సౌదీ అరేబియాలో కలిసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు చెప్పారు. పుతిన్‌ను తాను వాషింగ్టన్‌ పర్యటనకు ఆహ్వానించానని, అలాగే ఆయన తనను మాస్కోకు రావాల్సిందిగా కోరారని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ట్రంప్ మాస్కో పర్యటన ఎప్పుడనేది ఖరారు కాలేదు.

"ఏదో ఒక రూపంలో యుక్రెయిన్ కూడా చర్చల్లో పాల్గొంటుంది" అని రష్యా అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు

శాంతిని బలవంతంగా రుద్దడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ అన్నారు.

యుక్రెయిన్ విషయంలో యూరప్‌కు సొంత ప్రణాళిక ఉండాలని లేదా ‘అంతర్జాతీయ భాగస్వాములు భవిష్యత్ గురించి నిర్ణయించాలని’ పోలండ్ ప్రధానమంత్రి డోనల్డ్ టస్క్ సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)