యుక్రెయిన్: సైనికుల కోసం భార్యల సాహసం, 50 నిమిషాలకోసం 50 గంటల ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇల్లోనా హ్రోమ్‌లియుక్
- హోదా, బీబీసీ న్యూస్, యుక్రెయిన్
హై హీల్స్ వేసుకున్న మహిళ ఓ వ్యక్తిని కౌగిలించుకుని, ముద్దుపెట్టుకుంటున్న దృశ్యం రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన సినిమాలోనిదిలా కనిపిస్తుంది. కానీ తూర్పు యుక్రెయిన్‌లో ఇది నిత్యజీవితంలో భాగంగా మారింది.
రష్యా ఆక్రమణ మూడో ఏడు పూర్తిచేసుకుంటున్న సమయంలో...దీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధప్రభావం యుక్రెయిన్ సైనికులపైనే కాదు, ఇళ్ల దగ్గర ఎదరుచూస్తున్న వారి భార్యలపై కూడా ఉంటోంది.
యుద్ధం మొదలయ్యేనాటికి ఒక్సానా, ఆర్టెమ్‌కు పెళ్లయి 18నెలలయింది. ఆ జంట తమకు పిల్లలు కావాలని ఎంతగానో కోరుకుంది. కానీ ఆర్టెమ్ యుక్రెయిన్ సైన్యంలో చేరారు. ఆయనకు చాలా తక్కువ రోజుల సెలవు మాత్రమే దొరుకుతుంది.
ఆర్టెమ్, డోనెట్స్క్ ప్రాంతంలో ఉంటారు. ఆయనను కలవాలంటే యుక్రెయిన్ రాజధాని కీయేవ్‌కు సమీపంలోని తన సొంతపట్టణం బిలా సెర్క్వా నుంచి వందలాది కిలోమీటర్లు ప్రయాణించడం మినహా ఒక్సానాకు మరో దారి లేదు.


‘అప్పుడే నేను జీవించి ఉన్నట్టు అనిపిస్తుంది’
ఒక్సానా మొదటిసారి ఇలా వందలాది కిలోమీటర్లు ప్రయాణించి ఏప్రిల్ 2022లో భర్త దగ్గరకు వెళ్లారు. అదే ఏడాది నవంబరులో కూడా మరోసారి వెళ్లారు. ఆ సమయంలో ఆర్టెన్ యుద్ధంలో గాయపడ్డారు. ఒక్సానాకు అప్పుడే గర్భస్రావమైంది.
తల్లి కావాలనే ఉద్దేశంతో ఆ తర్వాత ఆమె తరచుగా భర్త దగ్గరకు వెళుతున్నారు. భర్త తన భద్రతపై భర్త ఆందోళన వ్యక్తంచేస్తున్నప్పటికీ ఆమె వెళ్తున్నారు.
''ఆయన్ను చూడకుండా నా జీవితాన్ని ఊహించలేను'' అని ఒక్సానా బీబీసీ యుక్రెయిన్‌తో చెప్పారు. ఆయన్ను చూడడానికి వెళ్లినప్పుడు మాత్రమే నేను జీవించి ఉన్నట్టు అనిపిస్తుంటుంది.’’ అని చెబుతారు ఒక్సానా.
యుద్ధభూమికి దగ్గరగా ఉండే గ్రామం లేదా పట్ణణంలో ఈ జంట కలుసుకుంటారు.స్థానికంగా ఉండే ఓ ఇంట్లో బస చేస్తారు. ఆ ఇంటి యజమానులు వీరు ఒక రాత్రి ఉచితంగా తమ ఇంట్లో ఉండే అవకాశం కల్పిస్తారు.
'నా భర్తతో కలిసి గడపడం సంతోషంగా అనిపిస్తుంది. కానీ అక్కడ చుట్టూ తెలియని వ్యక్తులు ఫోటోలు కన్పిస్తుండడం బాధగా ఉంటుంది' అని ఒక్సానా చెప్పారు. అవి యుద్ధంతో జీవితాలు కోల్పోయిన వారి ఫోటోలు అని ఆమె తెలిపారు.

పెరుగుతున్న విడాకుల సంఖ్య
ఫిబ్రవరి 2022లో రష్యా ఆక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్ అంతటా విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. 60 లక్షల మంది ప్రజలు దేశం వదిలి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ సంఖ్య యుద్ధానికి ముందు యుక్రెయిన్ జనాభాలో 15వ శాతానికి సమానం.
దేశాన్ని విడిచివెళ్లినవారిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. యుక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో ఉండడంతో 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మగవారు దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదు.
సైనికులు ఏడాదికి కేవలం 30 రోజులు మాత్రమే సెలవు తీసుకోగలరు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అదనంగా మరో 10 రోజులు సెలవుకు మాత్రమే అనుమతి ఉంది.
దీనివల్ల భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు కలిసి గడిపే సమయం చాలా తక్కువగా ఉంటోంది. దీంతో యుక్రెయిన్‌లో జననాల రేటు భారీగా తగ్గిపోయింది.
సోవియట్ యూనియన్ విచ్చిన్నమై, యుక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించిన 1991లో 6,30,000 జననాలు ఉండేవి. అప్పటినుంచి తగ్గుతూ వస్తున్న జననాల రేటు 2019నాటికి 3,09,000కి పడిపోయింది. రష్యా ఆక్రమణ ప్రారంభమై ఏడాది గడిచేనాటికి 2023లో జననాల రేటు కేవలం 1,87,000 మాత్రమే. యుక్రెయిన్‌లో గతంలో ఎప్పుడూ ఇంత తక్కువ స్థాయిలో జననాల రేటు లేదు.
విడాకుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది.
యుక్రెయిన్ న్యాయమంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2023 తొలి ఆరు నెలలతో పోలిస్తే, 2024 తొలి ఆరు నెలల్లో విడాకులు 50శాతం పెరిగాయి.
చాలా మంది మహిళలకు యుద్ధరంగంలో ఉన్న తమ భర్తల దగ్గరకు వెళ్లడమే తమ వివాహ జీవితాన్ని రక్షించుకునే, కుటుంబాన్ని కలిపిఉంచే ఏకైక మార్గంగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
‘50 గంటలు రోడ్డుపైనే’
యుద్ధం జరిగే ప్రాంతాలకు ప్రయాణించడం కష్టమైన విషయం. వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి.
మహిళలు ఎక్కువగా దగ్గరిలోని పట్టణానికి రైల్లో ప్రయాణిస్తారు. అక్కడినుంచి యుద్ధం జరిగే ప్రాంతానికి బస్సు లేదా ట్యాక్సీల్లో వెళతారు.
కొన్నిసార్లు వారు భర్తల దగ్గర కాకుండా, రోడ్డు మీదే ఎక్కువ సమయం గడపాల్సివస్తుంది. అధికారిక సెలవు లేకపోతే, సైనికుడికి షార్ట్ బ్రేక్ తీసుకునేందుకు మాత్రమే అనుమతిస్తారు.
భర్తను చూసేందుకు నటల్యా పశ్చిమ యుక్రెయిన్‌లోని ఎల్‌వివ్ నుంచి తూర్పు నగరం క్రమటోర్క్స్‌కు వెళ్లారు. ఇందుకోసం ఆమె 1,230 కిలోమీటర్లు ప్రయాణించారు.
ఆమె రెండురోజులకన్నా ఎక్కువ సమయం (50గంటలు పైనే) రోడ్డు మీద గడిపారు. కానీ ఆమె భర్తను చూడగలిగింది కాసేపే. దగ్గరలోని ఐదు సరిహద్దు పట్టణాలపై నిరంతరాయంగా బాంబుదాడులు జరుగుతుండడంతో ఆమె భర్త దగ్గర ఎక్కువసేపు ఉండలేకపోయారు.
''మేం ప్లాట్‌ఫామ్ మీద 50 నిమిషాలు మాత్రమే గడిపాం. ఆయన నన్ను మళ్లీ తిరిగి అదే ట్రైన్ ఎక్కించారు'' అని నటల్యా కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు. ''అయితే ఆ 50 నిమిషాలూ చాలా అమూల్యమైనవి'' అని ఆమె అన్నారు.
ఈ ప్రయాణానికి ఆమెకు అయిన ఖర్చు 5వేల హ్రివ్నియాస్ అంటే దాదాపు 10వేల రూపాయలు. యుక్రెయిన్‌లో ప్రజల సగటు నెలజీతంలో ఇది నాలుగోవంతు. ప్రతి రెండు,మూడు నెలలకోసారి తాను భర్త దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తానని ఆమె చెప్పారు.
వాళ్లకు పెళ్లయి 22ఏళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబం మళ్లీ కలుసుకుంటుందనే భావన రావడానికి ఈ ప్రయాణాలతో అవకాశమేర్పడుతుందని ఆమె అన్నారు.
అందరి కథలూ సుఖాంతం కాదు
యుద్ధరంగం దగ్గర కలుసుకుంటున్న జంటల కథలన్నీ సుఖాంతం కావడం లేదు.
భాగస్వాములను కలుసుకోవడానికి ప్రమాదకర ప్రయాణం చేసే మహిళలు కొందరికి...తీరా అక్కడకు వెళ్లిన తర్వాత కొత్త విషయం తెలుస్తోంది. తమ భాగస్వాములు యుద్ధరంగం దగ్గర ఇతర మహిళలతో సంబంధంలో ఉన్నారనే సంగతి అర్ధమవుతోంది.
యుక్రెయిన్‌తో రష్యా 2014లో పరోక్ష యుద్ధం ప్రారంభించినప్పుడు తూర్పు యుక్రెయిన్‌లో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంది. మరియా(అసలు పేరు కాదు)భర్త యుద్ధరంగంలో ఉన్నారు. ఆమె భర్తను చూసేందుకు కీయేవ్ నుంచి మూడు రోజులు ప్రయాణించి తూర్పు యుక్రెయిన్ చేరుకున్నారు. కానీ తర్వాత పరిస్థితులు దిగజారడం మొదలయింది. మరియా భర్తకు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్-(పీటీఎస్‌డీ)మొదలయింది.
ఆర్మీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మరియా, పిల్లలపై హింసాత్మకంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు. తర్వాత కొన్నిరోజులకు వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇప్పుడు మిలటరీకే చెందిన మరో వ్యక్తిని పెళ్లిచేసుకున్న మరియా, కానీ ఆయన కోసం ప్రయాణాలు చేయడం లేదు. ‘‘యుద్ధరంగంలో ఉన్నవాళ్లను కలుసుకోవడం వల్ల కుటుంబాలు సురక్షితంగా ఉండవు. వివాహాన్ని సంరక్షించుకోవాలని ఇద్దరికీ ఉండాలి. మీ భవిష్యత్తు జీవితం గురించి మాట్లాడుకోవాలి'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిరీక్షణ ఎంతో విలువైనది
బిలా సెర్క్వాకు తిరిగి వస్తే...ఒక్సానా ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు గర్భస్రావమయింది. చాలా కాలం నుంచి పిల్లల కోసం ఎదురుచూస్తున్నవారికి మొదటి సంతానం ఆనందం కలిగించింది.
తన ప్రసవ సమయంలో భర్త ఆర్టెమ్ తన పక్కనే ఉండాలని ఒక్సానా కోరుకున్నారు. కానీ ఆయనకు సెలవు దొరకలేదు.
ప్రసవానికి కొంత కాలం ముందు ఆమె ఇలా చెప్పారు. ''ఇలాంటి సమయంలో భర్త తన పక్కనే ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటారు'' అని ఆమె అన్నారు.
''కానీ మా బిడ్డను మోస్తూ నేనిక్కడ ఉన్నా. నా భర్త ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారని నాకు తెలుసు'' అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














