40 ఏళ్లకే స్ట్రోక్.. ఏ అలవాట్లున్న వారికి వస్తోంది? తగ్గించుకోవడం ఎలా?

స్ట్రోక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెదడుకి రక్తసరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల కలిగే కొన్ని లక్షణాలని స్ట్రోక్ అంటాం
    • రచయిత, డాక్టర్ దేశం పీఆర్
    • హోదా, బీబీసీ కోసం

ఇరవై ఎనిమిదేళ్ల రేణుకకి రెండు వారాల బిడ్డ. ప్రసూతి వార్డులో ఉండాలి. కానీ, ఐసీయూలో స్పృహ లేకుండా ఉంది. వైద్యులు పోస్టుపార్టం (ప్రసవానంతర) స్ట్రోక్ అని చెప్పారు. అంటే ఏంటో అర్థం కాకపోయినా అయినట్లు తలూపారు రేణుక తల్లిదండ్రులు. మెదడులో రక్తం గడ్డ కట్టిందనీ, చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నామని వైద్యులు చెప్పారు.

బాలయ్యకి 54 ఏళ్లు. పొద్దున లేస్తూనే నడవలేక తూలిపోయారు. రెండు మూడు నిమిషాల్లో ఎడమ చేయి, కాలు వంకరగా తిరిగిపోతున్నాయని తెలుస్తోంది. ఏమీ అర్థం కాలేదు. పక్కనే ఉన్న భార్యను లేపాలని కూడా తెలియడం లేదు. ఏదో శబ్దం వచ్చి ఆవిడ లేచి చూస్తే భర్త మంచం కింద పడిపోయి ఉన్నారు. నోట్లో నుంచి మాట రావడం లేదు. వెంటనే పక్కింటి వాళ్లని పిలిచారు భార్య.

వారంలో కనీసం రెండుసార్లు తలనొప్పి అని సెలవు తీసుకుంటున్నారు 40 ఏళ్ల మౌనిక. తలనొప్పి వచ్చినపుడల్లా అల్లం చాయి తాగడం, తలకి బామ్ రాసుకోవడం, నూనె పెట్టుకోవడం, ఏదో ఒక కషాయం తాగడం చేసేవారు. తనకి మైగ్రేన్ ఉందని అందరికీ చెబుతుండేవారు కానీ, ఎప్పుడూ డాక్టర్ దగ్గరకి వెళ్లలేదు మౌనిక. పని మాత్రం చాలా చురుకుగా చేసేవారు.

అలాగే ఒకరోజు తలనొప్పి అని ఇంట్లోనే ఉండిపోయారు మౌనిక. అదే రోజు రాత్రి ఆమె స్పృహ తప్పి పడిపోయారు. కుడి కాలు, కుడి చేయి పని చేయడం లేదు. అప్పటికప్పుడు ఆమె భర్త ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి రక్త నాళం చిట్లిపోయింది అనీ, స్ట్రోక్ వచ్చిందని చెప్పారు.

వైద్యులు వివరాలు అడిగితే.. ఇద్దరు పిల్లలున్నా మౌనికకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ అంటే భయమని, అందుకే పదేళ్ల నుంచి మందుల దుకాణంలో ఓసీపీలు (గర్భ నిరోధక మాత్రలు) తెచ్చుకొని వాడుతున్నారని చెప్పారు భర్త.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్ట్రోక్ లక్షణాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రక్త సరఫరా సరిగ్గా జరగక మెదడు సరిగ్గా పని చేయకపోవడమే స్ట్రోక్.

కారణాలేంటి?

వైద్య పరిభాషలో మెదడుకి రక్తసరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల కలిగే కొన్ని లక్షణాలని స్ట్రోక్ అంటాం. వాడుక భాషలో పక్షవాతం అంటుంటారు.

తలకి దెబ్బ తాకడం, మెదడులో కణతులు పెరగడం, డ్రగ్స్ తీసుకోవడం వల్ల మెదడు పనిచేయకపోవడం స్ట్రోక్ కిందకి రావు. కేవలం రక్త సరఫరా సరిగ్గా జరగక మెదడు సరిగ్గా పని చేయకపోవడమే స్ట్రోక్.

ఈ స్ట్రోక్ ముఖ్యంగా మూడు కారణాల వల్ల రావొచ్చు. ఒకటి, రక్తనాళాల గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం(స్టెనోసిస్), రెండు.. రక్తనాళాలలోని రక్తం గడ్డకట్టుకుపోయి ఉండలు కట్టడం(త్రాంబస్), మూడు.. రక్తనాళాలు పగిలిపోవడం(హెమోరేజ్).

ఈ రక్త సరఫరా మెదడులో ఎంత మేరకు నిలిచిపోయింది అనేదాన్ని బట్టి మనకి లక్షణాలు కనిపిస్తాయి. కోమా, పక్షవాతం, చేతులు కాళ్లు అన్నీ చచ్చుబడిపోవడం, ఒక చెయ్యి లేదా కాలు మాత్రమే చచ్చుబడిపోవడం, మాట సరిగ్గా రాకపోవడం, మూతి వంకర పోవడం, మాట స్పష్టంగా పలకలేకపోవడం వంటివి ఉంటాయి.

స్ట్రోక్ లక్షణాలు, పక్షవాతం

మగవారికే..

ప్రపంచంలో జరిగే మరణాలలో 10 శాతం మరణాలు స్ట్రోక్ వల్లనే సంభవిస్తున్నాయి. మామూలుగా 70 యేళ్లు పైబడిన వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో స్ట్రోక్ వచ్చే సగటు వయసు 73 అయితే, మన దేశంలో 40 నుంచి 60 సంవత్సరాల వయసులోనే వచ్చేస్తుంది.

గత ముప్పై సంవత్సరాలుగా పక్షవాతం కేసులు 50 శాతం పెరిగాయి. ఈ జబ్బు వచ్చిన మొదటి నెలలోపు రోగి మరణించే ప్రమాదం ఉంది. ఇది వారికి అందే వైద్యం, మందులు, సహాయాన్ని బట్టి సంభవించవచ్చు. ఆడవారి కన్నా మగవారికే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

లక్షణాలు:

నోరు ఒక వైపు వంకర పోవడం, ఒకవైపు చెయ్యి కాలు పడిపోవడం, చెయ్యి పైకి ఎత్తలేకపోవడం, సరిగ్గా నడవలేకపోవడం, తల పగిలిపోయినట్టు ఉండే తలనొప్పి, కళ్లు మసకగా కనబడటం, ఒకే వస్తువు రెండుగా కనబడటం, కనురెప్పలు వాలిపోవడం - ఇవన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలు. వీటిలో ఏ లక్షణం కనపడినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

తలనొప్పి

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి వారికి వస్తుంది?

పక్షవాతం ఎక్కువ శాతం బీపీ ఉన్న వారికే వస్తుంది. నలుగురు పక్షవాతం వచ్చిన రోగులు ఉన్నారంటే వారిలో ముగ్గురికి బీపీ ఉండే అవకాశాలే ఎక్కువ. బీపీ ఉందని తెలిసినా చాలామంది మందులు వేసుకోరు. అందుకే, వారు స్ట్రోక్ బారిన పడతారు.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బీపీ మాత్రలు కేవలం 12 నుంచి 24 గంటలు పని చేస్తుంటాయి. అందుకే బీపీ మాత్రలు వాటి పనితీరు ఆధారంగా వేసుకోవాలి. వరసబెట్టి రెండు, మూడు రోజులు బీపీ టాబ్లెట్ మర్చిపోతే, బీపీ పెరిగిపోయి రక్తనాళాలు ముడుచుకుపోయి రక్తం సరఫరా తగ్గిపోతుంది. లేదా రక్తనాళాలు చీలిపోయి, మెదడులో రక్తం గడ్డ కడుతుంది. అందుకే రక్తపోటు ఉన్నవారు బీపీ మాత్రలు ప్రతీరోజూ వేసుకోవాలి.

ప్రతి నలుగురు స్ట్రోక్ బాధితుల్లో ఒకరు షుగర్ పేషెంట్ ఉంటారు. షుగర్ కంట్రోల్ లేని వారికి రక్తనాళాలు తొందరగా మందంగా తయారవుతాయి. దాని మూలాన మెదడుకి రక్త సరఫరా సరిగ్గా జరగదు. అందుకే షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవడం ముఖ్యం.

స్ట్రోక్ వచ్చే చాలామంది పేషెంట్లలో పొగ తాగేవారు ఉంటారు. పొగ మానేయడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. లావుగా ఉండటం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని పోవడం కూడా స్ట్రోక్ రావడానికి కారణమవుతాయి. కొంతమందిలో జన్యువులకు సంబంధించిన మార్పుల వలన రక్తం గడ్డ కట్టుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి (హైపర్ కొయాగులబిలిటీ).

మందులు వేసుకోవడం

ఫొటో సోర్స్, Getty Images

సంవత్సరాల తరబడి గర్భనిరోధక మాత్రలు వాడే మహిళకి, మద్యం తాగే వారికి, కండరాలు పెరగడానికి అనబోలిక్ స్టెరాయిడ్స్ వాడే వారికీ, టెస్టోస్టెరాన్ పెరగడానికి మందులు వాడే వారిలో రక్తం సాంద్రత పెరుగుతుంది. దీనివల్ల రక్తం గడ్డ కడుతుంది.

ఆ రక్తం ఉండలు శరీరం అంతా తిరిగి మెదడులోని చిన్న చిన్న రక్తనాళాల్లో ఇరుక్కుపోతాయి. అప్పుడు మెదడుకి రక్త సరఫరా లేక స్ట్రోక్ వస్తుంది.

మైగ్రైన్ ఉన్నవారికి కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. రుమాటిక్ హార్ట్ డిసీస్ వచ్చిన వారికి కూడా స్ట్రోక్ వస్తుంది. వీరికి రక్తనాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్ అనే గుండె జబ్బు ఉన్న వారికి కూడా గుండెలో రక్తం గడ్డ కట్టి అవి రక్త నాళాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. ఈ వ్యాధులు ఉన్నవారికి కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

రక్త సంబంధీకులలో ఎవరికైనా పక్షవాతం వచ్చినా కూడా మీకు స్ట్రోక్ రావొచ్చు. రక్తపోటు ఎక్కువగా ఉన్న గర్భిణీలు, ముందంతా ఏమీ లేకపోయినా డెలివరీకి ముందు రక్తపోటు ఎక్కువ అయిన వారికి కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

డెలివరీ అయ్యాక కదలకుండా పడుకునే ఉండే వారికి కాళ్లల్లో రక్తం నిలిచిపోతుంది, దాని వలన రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే సిజేరియన్ గానీ నార్మల్ డెలివరీ గానీ అయిన స్త్రీలను నిలబడమని, కాళ్లు అటూ ఇటూ కదపమనీ, రెండు మూడు గంటలకి ఒకసారి అటూ ఇటూ నడవమని వైద్యులు చెబుతారు.

పక్షవాతం

ఫొటో సోర్స్, Getty Images

పక్షవాతం ముందే ఎలా గుర్తించొచ్చు?

కొన్నిసార్లు మాత్రమే పక్షవాతం రావడాన్ని ముందుగా గుర్తించొచ్చు.

పక్షవాతం రావడానికి ముందు దాని లక్షణాల్లో ఏదో ఒకటి కనబడుతుంది. కళ్లు బైర్లు కమ్మి కింద పడిపోవటం (బ్లాక్ అవుట్), కళ్లు సరిగ్గా కనబడకపోవడం, ముఖంలో పక్షవాతం రావడం, కాలు లేదా చెయ్యి పడిపోవడం, ఏం అర్థం కాకపోవడం, గందరగోళంగా ఉండటం, విపరీతమైన తలనొప్పి రావడం - ఈ లక్షణాలన్నీ ఒక గంట లేదా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో తగ్గిపోవడం.

పై లక్షణాల్లో ఏం కనబడినా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీనిని ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ ఎటాక్ అంటారు. ఇది వచ్చిన వారు ఖచ్చితంగా సంవత్సరం, రెండు సంవత్సరాల కాలంలో స్ట్రోక్‌కి గురవుతారు.

సీటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ చూసి వైద్యులు మెదడులో జరిగే రక్త సరఫరాను అంచనా వేస్తారు. గుండె పనితీరు, పక్షవాతానికి సంబంధించిన ఇతర లక్షణాలు కూడా పరీక్ష చేసి చూస్తారు.

పక్షవాతం, స్ట్రోక్ చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

దీనికి చికిత్స ఏంటి?

రక్త నాళంలో త్రాంబస్ ఉందా, రక్తనాళం చిట్లిందా? అనే దాని బట్టి, చికిత్స ఉంటుంది.

పై లక్షణాలు కనబడిన వెంటనే న్యూరో ఐసీయూ ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలి. లక్షణాలు కనిపించిన తర్వాత ప్రతీ నిమిషం ఎంతో విలువైనది. ఎంత వీలైతే అంత తొందరగా ఆసుపత్రికి వెళ్లాలి.

త్రాంబస్ ఉంటే.. రక్త నాళాల్లోకి వెళ్లి దాన్ని తీసేయడం (త్రోంబెక్టమి) లేదా అది చిట్లిపోవడానికి మందులు (త్రాంబోలైసిస్) ఇవ్వడం చేస్తారు. ఒకవేళ హెమరేజ్ ఉంటే.. అది మెదడులో ఉన్న స్థలం బట్టి ఆ గడ్డ కట్టిన రక్తాన్ని మొత్తం స్కల్ డ్రిల్ చేసి ఆస్పిరేషన్ ద్వారా తీసేస్తారు.

గంటలో పెద్ద ఆసుపత్రికి వెళ్లే వీలు లేకపోతే, దగ్గర్లోని చిన్న ఆసుపత్రికి వెళ్లినా బీపీ కంట్రోల్ కావడానికి మందులు ఇస్తారు. మెదడులో ప్రెషర్ పెరగకుండా మందులు అందిస్తారు. మెదడు కణాలు ఒకసారి చనిపోతే మళ్లీ బతికించే వీలు ఉండదు. అందుకే రక్తం సరిగా సరఫరా అయ్యేందుకు సమయానికి మందులు వేయాలి.

స్ట్రోక్ వచ్చిన వారు కూడా ఎప్పటికీ మందులు వాడుతూనే ఉండాలి. లేదంటే రెండోసారి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రెండో సారి స్ట్రోక్ వస్తే బతికే అవకాశం చాలా తక్కువ.

(గమనిక: రచయిత డాక్టర్. వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే ఇది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)