'లివింగ్ విల్' అంటే ఏమిటి? ప్రాణాంతక వ్యాధులు సోకిన వారికి మరణించే హక్కు ఉండాలా?

ఆసుపత్రి వృద్ధులు బీబీసీ న్యూస్ తెలుగు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చెరిలాన్ మొలన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్చరిక: ఈ కథనంలో మిమ్మల్ని కలచివేసే అంశాలుంటాయి.

కేరళకు చెందిన సర్జన్ ఐపీ యాదవ్ 2010 సంవత్సరంలో తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నారు.

క్యాన్సర్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్న తండ్రికి చికిత్సను కొనసాగించటమా లేదా తన తండ్రే కోరుకున్నట్లు అన్ని రకాల చికిత్సలు ఆపేసి, ఆయన అవస్థలకు ముగింపు పలకడమా అనే రెండు అంశాలపై ఐపీ యాదవ్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

‘‘ఒక కొడుకుగా నా తండ్రిని ఎలాగైనా బతికించుకోవడం నా బాధ్యత అని నమ్మా. కానీ మా నాన్నకు ఈ నిర్ణయం నచ్చలేదు. ఆయన ఐసీయూలో ఒంటరిగా మరణించారు. తనను బతికించడానికి డాక్టర్లు చివరి నిమిషాల్లో చేసిన సీపీఆర్ వల్ల ఆయన పక్కటెముకలు విరిగాయి. ఆయన ఒక దారుణమైన మరణాన్ని పొందారు’’ అని డా.యాదవ్ అన్నారు.

ఈ అనుభవం తనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించిందని యాదవ్ అభిప్రాయపడ్డారు.

అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్ (ఏఎమ్‌డీ) ప్రాముఖ్యతను కూడా ఈ ఘటన తరువాత తెలుసుకున్నానని ఆయన అన్నారు. వీటిని 'లివింగ్ విల్స్' అని కూడా అంటారు.

ఒకవేళ భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాధి సంభవిస్తే, కోలుకోలేని పరిస్థితి వస్తే, ఎలాంటి వైద్య సహాయం పొందాలనుకుంటున్నారో 18 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరూ ముందే నిర్ణయించుకునే అవకాశాన్ని 'లివింగ్ విల్' కల్పిస్తుంది.

ఉదాహరణకి, లైఫ్ సపోర్ట్ మెషీన్లపై తమని ఉంచొద్దని వారు కోరవచ్చు. లేదా పెయిన్‌ కిల్లర్లను తగినంతగా అందించమని కూడా అడగొచ్చు.

సుప్రీంకోర్టు 2018లో లివింగ్ విల్ ను రూపొందించుకునే అనుమతినిచ్చింది. దీనివల్ల పాసివ్ యుథనేసియాను ఎంచుకునే అనుమతి కూడా చట్టబద్ధమైంది. పాసివ్ యుథనేసియా అంటే మరణశయ్య మీద ఉన్నవారికి మరణాన్ని వేగవంతం చేసేందుకు ఖచ్చితమైన మార్గదర్శకాలతో చికిత్సను ఉపసంహరించడం.

అయితే యాక్టివ్ యుథనేసియా మాత్రం మన దేశంలో చట్ట విరుద్ధం. యాక్టివ్ యుథనేసియా- అంటే ఒక వ్యక్తి బలవన్మరణానికి ఉద్దేశప్పూర్వకంగా చేసే సహాయకచర్య.

'లివింగ్ విల్స్' చట్టపరమైన ఆమోదాన్ని పొందినా, మన దేశంలో అవి సామాజిక ఆమోదాన్ని ఇంకా పూర్తిగా పొందలేదు. మరణం గురించి మన దేశంలో బహిరంగ చర్చలు జరగవు. ఒకవేళ చావు గురించే ప్రస్తావిస్తే అది దురదృష్టానికి సూచిక అని భావిస్తారు.

కానీ ఈ ధోరణిలో మెల్లగా మార్పును సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గతేడాది నవంబర్ నెలలో డా.యాదవ్ తన బృందంతో కలిసి 'లివింగ్ విల్స్' పై దేశంలో అవగాహన కల్పించే మొదటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కేరళలోని కొల్లం జిల్లా మెడికల్ కాలేజీలో మొదలైన ఈ ప్రోగ్రాంలో భాగంగా, ప్రజలకి లివింగ్ విల్స్ గురించి సమాచారాన్ని అందిస్తారు. వలంటీర్లు అవగాహన కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వీలునామ నమూనాలను పంచుతున్నారు కూడా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కొల్లం జిల్లా కేరళ ఆసుపత్రి వైద్యులు బీబీసీ తెలుగు
ఫొటో క్యాప్షన్, గతేడాది మార్చ్ నెలలో త్రిసూర్ లోని పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సొసైటీకు చెందిన 30 మంది లివింగ్ విల్స్ పై సంతకం చేశారు.

లివింగ్ విల్‌ను రూపొందించుకోవడం అంటే కుటుంబ సభ్యులతో మరణం గురించి మనస్ఫూర్తిగా, నిజాయితీగా చర్చించుకోవడం. కాస్త వ్యతిరేకత ఉన్నా కూడా యాక్టివిస్టులు, సంస్థలు అవగాహనా పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితంగా ఈ అంశంపై మెల్లగా ఆసక్తి పెరుగుతోంది.

ఈ అంశంపై అవగాహన కల్పించడంలో కేరళ ముందంజలో ఉంది.

జీవితం చివరి రోజుల్లో వైద్య ఇతరేతర సహాయాలని అందించే సంస్థలు కేరళలో విస్తృతంగా ఉన్నాయి.

గతేడాది మార్చ్ నెలలో త్రిశూర్‌లోని పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సొసైటీకి చెందిన 30 మంది వ్యక్తులు లివింగ్ విల్స్‌పై సంతకం చేశారు. లివింగ్ విల్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నమే ఇదని ఈ సొసైటీ సంస్థాపకులు డా. ఈ. దివాకరన్ అన్నారు.

‘‘లివింగ్ విల్స్ అనే పదాన్ని ఇదివరకు చాలామంది విని కూడా ఉండరు. కాబట్టి దీని గురించి ప్రత్యేకించి 50 నుంచి 60 వయస్కుల దగ్గరి నుంచి అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి చదువుకున్న ఎగువ మధ్య తరగతి వాళ్లు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్‌లో ఇంకా ప్రచారం చేస్తే మరింతమంది దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను’’ అని డా.రవీందర్ అన్నారు.

సుప్రీమ్ కోర్టు ఆదేశాల ప్రకారం ఒక వ్యక్తి తన లివింగ్ విల్‌ను ఇద్దరు సాక్షుల సమక్షంలో రూపొందించి, దానిపై సంతకం చేయాలి. ఒక నోటరీ లేదా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించాలి. తరువాత ఈ విల్ కాపీని ఒక ప్రభుత్వ అధికారికి సమర్పించాలి.

ఈ విషయంపై సూచనలు మార్గదర్శకాలు లిఖితపూర్వకంగా ఉన్నా, చాలా రాష్ట్రాల్లో దీనిని అమలు చేసేందుకు సరైన యంత్రాంగం లేదు. ముంబయికి చెందిన గైనకాలజిస్ట్ డా. నిఖిల్‌ దాతార్‌కు ఈ విషయం అనుభవ పూర్వకంగా తెలిసింది.

రెండేళ్ల కిందట తన లివింగ్ విల్ ను రూపొందించుకున్నప్పుడు దాన్ని ధృవీకరించేందుకు ఏ ప్రభుత్వాధికారి నిఖిల్‌కు సహకరించ లేదు. దీంతో ఆయన కోర్టు మెట్లెక్కారు. ఫలితంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లివింగ్ విల్స్‌ను ధృవీకరించేందుకు 400మంది అధికారులను నియమించింది.

నిఖిల్ దాతార్

ఫొటో సోర్స్, Nikhil Daatar

గతేడాది జూన్‌లో సుప్రీం కోర్టు ఆదేశాలను గోవా రాష్ట్రం అమలు చేసింది. హైకోర్టు జడ్జి ఒకరు ఆ రాష్ట్రంలో మొదటిసారి లివింగ్ విల్‌ను ప్రకటించారు.

ఈ విషయంపై కర్ణాటక రాష్ట్రం కూడా లివింగ్ విల్స్‌ను ధృవీకరించేందుకు ఒక మెడికల్ బోర్డును స్థాపించి దానికి సభ్యులను నియమించాలని అధికారులకు సూచించింది.

లివింగ్ విల్స్‌కు ఒక కేంద్రీకృత డిజిటల్ రిపాసిటరిని (డిజిటల్‌గా స్టోర్ చేయడం) సృష్టించాలని డా.దాతార్ కోరారు. అయన తన విల్‌ను తన సొంత వెబ్‌సైట్‌లో ఒక టెంప్లేట్ మాదిరిగా అప్‌లోడ్ చేశారు.

పేషెంట్ కదలలేని స్థితిలో ఉన్నా, కోలుకోలేని స్థితిలో ఉన్నా, పేషెంట్ కుటుంబాలకు, డాక్టర్లకు లివింగ్ విల్ సమస్యలను తొలగిస్తుందని డా. దాతార్ భావిస్తున్నారు.

‘‘చాలా సందర్భాల్లో పేషెంట్ అవస్థను గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్సను నిలిపి వేయాలని కోరుకుంటారు. కానీ వారు పేషెంట్‌ని ఇంట్లో చూసుకోలేరు కాబట్టి ఆసుపత్రిలోనే ఉంచుతారు. మరోవైపు, వైద్య విలువలకు కట్టుబడి డాక్టర్లు చికిత్సను నిలిపివేయలేరు. చివరికి పేషెంట్ తన బాధని వ్యక్తపరిచే దారి లేక ఇబ్బంది పడుతుంటారు’’ అని దాతార్ అన్నారు.

లివింగ్ విల్ అంటే కేవలం పాసివ్ యుథనేసియా మాత్రమే కాదు.

‘‘ఉదాహరణకి ఒకాయన తనకి ఆరోగ్యపరంగా ఏదైనా ఆపద వస్తే, విదేశంలో ఉన్న తన కొడుకు కోసం తనని లైఫ్ సపోర్ట్ మెషీన్ల మీద ఉంచాలని తన విల్‌లో కోరారు’’ అని ఒక కేసు గురించి మాట్లాడుతూ డా. దాతర్ అన్నారు.

మీరు ఎలా మరణించాలో మీరు నిర్ణయించుకోవచ్చు. మనకి ఉన్న అత్యుత్తమమైన హక్కులలో ఇదొకటి. అలాంటప్పుడు దీన్ని ఎందుకు వినియోగించుకోకూడదు? అని ఆయన అన్నారు.

లివింగ్ విల్స్ గురించి దేశంలో కొద్ది కొద్దిగా చర్చ పెరుగుతుంది.

‘‘వాస్తవానికి లివింగ్ విల్స్ గురించి వైద్యులు పేషెంట్లతో చర్చించాలి. అలా జరగట్లేదు. కానీ, జరగాలి’’ అని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కు చెందిన డా. సుష్మా భట్నాగర్ అన్నారు.

‘‘మన జీవితం అంతా మన ఇష్టాయిష్టాలు, మన దగ్గరి వారితో ప్రభావితమవుతాయి. సమాజానికి లోబడి ఉంటాయి. కనీసం చావులోనైనా మనకు నచ్చినట్టు చేద్దాం’’ అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)