అమ్రాబాద్‌, నాగార్జునసాగర్-శ్రీశైలం అడవులలో పులుల సంఖ్య పెరగడానికి.. మావోయిస్ట్ సమస్యకు సంబంధం ఉందా?

పులులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా గుర్తింపు పొందిన భారత్ పులుల సంఖ్య విషయంలోనూ మిగతా అన్ని దేశాలకంటే ముందుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల ఆవాసాల్లో 18 శాతం మాత్రమే భారత్‌లో ఉన్నప్పటికీ పులుల సంఖ్య విషయంలో మాత్రం ఇండియా మిగతా అన్ని దేశాలను దాటిపోయిందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.

కేవలం పదేళ్లలోనే, భారత్‌లో పులుల జనాభా రెండింతలు పెరిగి, 3600కి పైగా చేరుకుంది. ఈ సంఖ్య ప్రపంచంలో ఉన్న మొత్తం పులుల్లో 75 శాతం.

భారత్‌లో ప్రస్తుతం 1,38,200 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో పులులు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో 6 కోట్ల మంది ప్రజలు కూడా నివసిస్తున్నారు.

వేట నుంచి పులులను సంరక్షించడం, కోల్పోతున్న వాటి ఆవాసాలను కాపాడటం, మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించడం అనేది స్థానిక కమ్యూనిటీలను ప్రోత్సహించడం వల్లే సాధ్యమవుతుందని ప్రముఖ రీసెర్చ్ జర్నల్ సైన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.

''జనసాంద్రత పులుల సంరక్షణకు హానికరమని మేం భావిస్తుంటాం. కానీ, జనసాంద్రత కంటే, ప్రజల వైఖరే ముఖ్యం'' అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన రచయిత యద్వేంద్ర దేవ్ విక్రమ్‌ సిన్హ్ ఝాలా బీబీసీతో అన్నారు.

మలేసియాను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఆర్థికంగా సంపన్న దేశమైనప్పటికీ.. భారత్ కంటే తక్కువ జనసాంద్రత ఉన్న దేశమైనప్పటికీ మలేసియాలో పులుల సంఖ్య పెంచే చర్యలు విజయవంతం కావడం లేదన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌లో పులుల పునరుద్ధరణ.. బిగ్ క్యాట్‌లను ఎలా సంరక్షించవచ్చు, జీవ వైవిధ్యాన్ని ఎలా పెంచవచ్చు, కమ్యూనిటీల మద్దతు ఎలా అనే వాటిని చూపిస్తోంది. ఇవి ప్రపంచానికి కీలక పాఠాలుగా నిలుస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.

2006 నుంచి 2018 మధ్యలో భారత్‌లో పులుల అక్యుపెన్సీపై ఝాలా, నినాద్ అవినాష్ ముంగి, రాజేష్ గోపాల్, ఖమర్ ఖురేషిలు అనాలసిస్ చేశారు.

2006 నుంచి 20 రాష్ట్రాల్లో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి పులుల ఆవాసాలపై భారత్ సర్వే చేసింది. పులులు, వేటాడే వర్గానికి ఇతర జంతువులు ఎన్ని ఉన్నాయి.. వాటి ఆవాసాలు ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తూ వచ్చింది.

ఈ సమయంలో, పులుల ఆవాసాలు 2,929 చదరపు కి.మీ.లు పెరిగాయి.

ఈ ప్రాంతాల్లో సుమారు 6 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రధానంగా వీరు వ్యవసాయ కార్యకలాపాలలో ఉంటారు. వీరు తమ సెటిల్‌మెంట్లను పులుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాల బయట ఏర్పాటు చేసుకున్నారు.

పులులు

ఫొటో సోర్స్, Getty Images

పులులతో కలిసి జీవించే పరిస్థితులు భారత్‌లో మారుతూ ఉన్నాయని, అవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలతో ప్రభావితమై ఉంటాయని పరిశోధకులు గుర్తించారు.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న దగ్గర పులులతో కలిసి మనుషులు జీవించే ప్రాంతాలున్నాయి.

పులులు పొదలలో దాక్కుని వేటాడటం, వెంబడించడం వంటి చరిత్ర ఉన్న ప్రాంతాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఈశాన్య భారత్‌ రాష్ట్రాలలో ఇప్పుడు పులులు బాగా తగ్గిపోవడం లేదా అంతరించిపోవడం జరిగింది.

ప్రజలతో పులులు మమేకమై ఉన్న ప్రాంతాలు తరచూ ఆర్థికంగా సంపన్న ప్రాంతాలుగా ఉంటున్నాయని పరిశోధకులు చెప్తున్నారు.

పులులకు సంబంధించిన పర్యటకాన్ని పెంచడం, సంఘర్షణ ప్రాంతాలలో ప్రభుత్వ పరిహారాలను పెంచడం నుంచి లబ్ది పొందుతున్నట్టు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత అనేది కూడా వన్యప్రాణులు వేగంగా తగ్గిపోయేందుకు కారణమైంది.

కొన్ని ప్రాంతాల్లో మిలిటెంట్లు నిధుల కోసం వన్యప్రాణులను దుర్వినియోగం చేశారని.. అనుమతి లేని ప్రాంతాలను వేటాడే ప్రాంతాలుగా మార్చారన్న విమర్శలున్నాయి.

పులి

ఫొటో సోర్స్, AFP

భారత్‌లో సంఘర్షణ సమయంలో మనాస్ జాతీయ ఉద్యానవనం తన రెనోలను కోల్పోయింది. నేపాల్‌లో కూడా రెనోలు తగ్గిపోయాయి.

భారత్‌లో కూడా మావోయిస్ట్ సంఘర్షణలతో ప్రభావితమైన జిల్లాల్లో ముఖ్యంగా చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ పులుల అభయారణ్యాలలో పులులు కనుమరుగైనట్లు పరిశోధకులు గుర్తించారు.

సంఘర్షణలను నియంత్రించిన నాగార్జునసాగర్-శ్రీశైలం, అమ్రబాద్, సిమిలిపాల్‌ అభయారణ్యాలలో పులుల సంఖ్యలో పెరుగుదల కనిపించినట్లు తెలిపారు.

ఒడిశా, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తూర్పు మహారాష్ట్రల్లో సాయుధ తిరుగుబాటులు చోటు చేసుకున్నాయి. దీనివల్ల పులుల సంఖ్య తగ్గడం, అంతరించిపోయే ప్రమాదం పెరిగిందని పరిశోధకులు చెప్పారు.

తీవ్రవాదం తగ్గి రాజకీయ స్థిరత్వం మెరుగుపడటంతో ఈ ప్రాంతాల్లో పులుల పునరుద్ధరణకు అవకాశం ఉందని పరిశోధకులు చెప్పారు.

పులి

ఫొటో సోర్స్, AFP

భారత్‌లో పులులు లేని ఆవాసాలు ముఖ్యంగా చత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్‌ల్లో 1,57,000 చదరపు కి.మీలు ఉంటాయి. పులులను తిరిగి ప్రవేశపెట్టడం, సంరక్షిత ప్రాంతాలలో ఆవాసాల అనుసంధాన్ని పెంచడం ద్వారా ఈ ప్రాంతాల్లో సుమారు 10,000 చదరపు కి.మీల పునరుద్ధరించవచ్చని పరిశోధకులు చెప్పారు.

జనసాంద్రత ఎక్కువగా ఉన్న, పేదరికంతో సతమతమవుతున్న ప్రాంతాల్లో ఈ పెద్ద మాంసాహార జీవులను పునరుద్ధరించడం కాస్త సవాలుతో కూడుకున్న విషయమేనని అన్నారు.

ల్యాండ్ షేరింగ్ (భూమిని పంచుకోవడం) సంఘర్షణలకు దారితీస్తుందని, ల్యాండ్ స్పారింగ్ (భూమిని వ్యవసాయేతర ఆవాసాలను సృష్టించేందుకు ఉపయోగించడం) ఆచరణపరంగా సాధ్యం కాకపోవచ్చని విమర్శకులు అంటున్నారు.

అయితే, ఈ రెండు విధానాలు కూడా పులుల పునరుద్ధరణకు అవసరమని అధ్యయనం చెబుతోంది. పెద్ద మాంసాహార జీవులను సంరక్షించడంలో రెండింటి పాత్ర ఉందంటున్నారు.

మరోవైపు ప్రతి ఏడాది పులుల దాడులతో 35 మంది, చిరుత పులుల దాడుల్లో 150 మంది, అడవి పందుల దాడిలో కూడా అంతే మంది చనిపోతున్నారని ఝాలా చెప్పారు. విషపూరితమైన పాములు కరవడంతో 50 వేల మంది మరణిస్తున్నారు. కార్ల ప్రమాదాలతో వార్షికంగా 1,50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఝాలా చెప్పారు.

200 వందల ఏళ్ల క్రితం వేటాడే జంతువుల చేతిలో మనుషులు ప్రాణాలు కోల్పోవడం సాధారణం. కానీ ఇప్పుడు అసాధారణంగా మారిందన్నారు. అందుకే, వార్తల్లో ప్రధానాంశంగా నిలుస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)