అక్కడ చెరువుల్లో రోజూ ముగ్గురు పిల్లల మృతి, గ్రామస్థులు నీటిని కర్రతో కొడతారు

చనిపోయిన బాబు ఫోటో పట్టుకున్న తల్లి

ఫొటో సోర్స్, Swastik Pal

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మంగళ ప్రదాన్.. తన ఏడాది వయసున్న కొడుకును పోగొట్టుకున్న ఆ ఉదయాన్ని ఎప్పటికీ మర్చిపోరు.

పశ్చిమ బెంగాల్లో 100 లంకలతో కూడిన కఠిన డెల్టా ప్రాంతమైన సుందర్‌బన్‌లో 16 ఏళ్ల క్రితం ఇది జరిగింది.

ఆమె కొడుకు అజిత్ అప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. కానీ, ఆ బుల్లి బుల్లి అడుగుల జీవితం అంతలోనే ముగిసిపోయింది.

చాలామంది లాగానే మంగళ కుటుంబం రోజువారీ పనుల్లో నిమగ్నమైంది.

మంగళ తన కొడుకు అజిత్‌కు అల్పాహారం తినిపించి, తనతోపాటు వంటగదికి తీసుకువెళ్లారు. ఆమె భర్త కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లారు.

అనారోగ్యంతో ఉన్న మంగళ అత్తమ్మ మరో గదిలో నిద్రపోతున్నారు.

అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న అజిత్ ఉన్నట్టుండి తల్లికి కనిపించకపోవడంతో, కొడుకు ఎక్కడకు వెళ్లాడో చూడమంటూ నిద్రపోతున్నఅత్తకు వినిపించేలా గట్టిగా అరిచారు మంగళ.

ఆ తర్వాత కొన్ని నిమిషాలకు'‘నా కొడుకు ఎక్కడా? ఎవరైనా చూశారా'' అంటూ మంగళ ఏడుస్తూ గట్టిగట్టిగా అడగడం మొదలుపెట్టారు. పక్కింటి వారు ఆమె దగ్గరకు వచ్చారు.

కొద్దిసేపటి తర్వాత ఆమెకు గుండెబద్ధలయ్యే వార్త తెలిసింది. ఇంటి బయట ఉన్న చెరువులో బాబు మృతదేహం తేలుతూ ఉండటాన్ని ఆమె బావ చూశారు.

ఇంటి నుంచి బయటికి వచ్చిన ఆ బాబు, పొరపాటున నీటిలో పడిపోయాడు.

అప్పటి దాకా వారి కళ్ల ముందు కదిలిన ఆ అమాయకపు ముఖం.. శవమై కనిపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటి ముందు చెరువు

ఫొటో సోర్స్, Swastik Pal

ఫొటో క్యాప్షన్, సుందర్‌బన్ ప్రాంతంలో ప్రతి ఇంటిముందు చెరువు ఉంటుంది.

ప్రతి ఇంటి ముందు చెరువు

తల్లులు పనులకు వెళుతూ శిశు సంరక్షణా కేంద్రాలలో విడిచిపెట్టే పిల్లలను చూసుకోవడానికి, వారికి తిండిపెట్టి, చదువు చెప్పడానికి ఏర్పాటు చేసిన ఒక లాభరహిత సంస్థలో మంగళ పనిచేస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన 16 మంది తల్లుల్లో మంగళ కూడా ఒకరు.

'' ఈ తల్లులు పిల్లలను తమ సొంత బిడ్డల్లానే కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు'' అని శిశు సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసిన చైల్డ్ ఇన్ నీడ్ ఇన్‌స్టిట్యూట్ (సీఐఎన్ఐ)కు చెందిన సుజాయ్ రాయ్ చెప్పారు.

ఈ సంరక్షణ తక్షణ అవసరంగా మారింది. చెరువులు, నదులతో నిండిన నదీతీర ప్రాంతంలో లెక్కలేనంత మంది పిల్లలు ఆ నీళ్లలో పడిపోయి చనిపోతున్నారు.

ప్రతి ఇంటి ముందు ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు నీటిని స్నానానికి, బట్టలు ఉతుక్కోవడానికి వాడుతుంటారు. కొందరు మంచినీటిగానూ వినియోగిస్తుంటారు.

మంగళ ప్రధాన్

ఫొటో సోర్స్, Swastik Pal

ఫొటో క్యాప్షన్, '' ఒక తల్లిగా, బిడ్డను కోల్పోయిన బాధ ఏమిటో నాకు తెలుసు'' అంటారు మంగళ.

ప్రతిరోజూ ముగ్గురు..

సుందర్‌బన్ ప్రాంతంలో ఏడాది నుంచి తొమ్మిదేళ్ల వయసున్న పిల్లలు ప్రతి రోజూ కనీసం ముగ్గురు నీటిలో పడిపోతున్నారని వైద్య పరిశోధన సంస్థ ది జార్జ్ ఇన్‌స్టిట్యూట్, సీఐఎన్ఐ 2020 సర్వే తెలిపింది.

రుతుపవన వర్షాలు మొదలయ్యే జులైలో, ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో నీటిలో మునిగిపోవడం మరింత ఎక్కువగా పెరుగుతోంది.

ఆ సమయంలో చాలామంది పిల్లలు సంరక్షకుల పర్యవేక్షణలో ఉండరు. సుమారు 65 శాతం మంది పిల్లలు ఇంటికి 50 మీటర్ల దూరంలోని నీటిలోనే పడిపోతున్నారు. కేవలం 6 శాతం మంది పిల్లలకే లైసెన్స్ ఉన్న డాక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షణ అందుతోంది.

నీటిలో పడిపోయిన పిల్లలను కాపాడుకోవడానికి గ్రామస్థులు మూఢనమ్మకాలను ఆశ్రయిస్తు న్నారు. పిల్లల మృతదేహాన్ని వారు పెద్దల తలపై నుంచి తిప్పి, ఏవో మంత్రాలు చదువుతుంటారు. నీటిని కర్రలతో కొడతారు.

'' ఒక తల్లిగా, బిడ్డను కోల్పోయిన బాధ నాకు తెలుసు'' అని మంగళ చెప్పారు.

''నాలాగా మరే తల్లికి జరగకూడదనుకుంటున్నా. నీటిలో పడకుండా ఈ పిల్లలను కాపాడాలనుకుంటున్నా. ఎన్నో ప్రమాదాల మధ్యన మేం నివసిస్తున్నాం.'' అని తెలిపారు.

శిశు సంరక్షక కేంద్రాలు

ఫొటో సోర్స్, Swastik Pal

ఫొటో క్యాప్షన్, సుందర్‌బన్‌లో నివసించే 40 లక్షల మంది జీవితం నిత్య పోరాటంగా మారుతోంది.

సుందర్‌బన్‌లో నివసించే 40 లక్షల మంది జీవితం నిత్య పోరాటంగా మారుతోంది.

మనుషులపై దాడులు చేసే పులులు గ్రామాలకు సమీపంలో ప్రమాదకరంగా సంచరిస్తుంటాయి. అవి ఊళ్లలోకి వస్తూంటాయి.పులులు,పాములతో తరచూ ముప్పు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు చేపలు పట్టడానికి, తేనెను తీయడానికి, పీతల కోసం వెళుతుంటారు.

జులై నుంచి అక్టోబర్ మధ్యలో ఈ ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాలు, తుపాన్లతో నదులు, చెరువులు పొంగుతుంటాయి. దీంతో, గ్రామాల్లో నీరు ముంచెత్తుతుంది. వాతావరణ మార్పు ఈ పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చుతోంది.

ఈ ప్రాంతంలో ఏడాది నుంచి తొమ్మిదేళ్ల వయసున్న పిల్లలు సుమారు 16 శాతం మంది ఉంటారు.

''ప్రమాదం వచ్చే వరకు ముప్పు గురించి తెలియకుండానే మేం నీటితో నివసిస్తుంటాం.'' అని సుజాత దాస్ చెప్పారు.

మూడు నెలల కిందట కుల్తాలీలో తమ ఉమ్మడి కుటుంబం నివసించే ఇంటికి సమీపంలోని చెరువులో తన 18 నెలల కూతురు అంబికా మునిగి, చనిపోయిన తర్వాత సుజాత దాస్ జీవితం తలకిందులైంది. ఆ సమయంలో ఆమె కొడుకులు కోచింగ్ క్లాసులలో ఉన్నారు. కొందరు కుటుంబ సభ్యులు మార్కెట్‌కి వెళ్లారు. పెద్ద అత్త ఇంట్లో పనుల్లో బిజీగా ఉన్నారు.

కేరళలో పనులకు వెళ్లే ఆమె భర్త, ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నా,సమీపంలోని ట్రాలర్ వద్ద చేపలు పట్టే వలను బాగు చేస్తున్నారు.

ఆ సమయంలో నీటి కోసం స్థానికంగా ఉన్న హ్యాండ్‌పంప్ వద్దకు వెళ్లారు. సుజాత ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇస్తామనే హామీ నెరవేర్చకపోవడం వల్ల ఆమె హ్యాండ్ పంప్‌వద్దకు వెళ్లాల్సి వచ్చింది.

కొడుకును పోగొట్టుకున్న ఓ తల్లి

ఫొటో సోర్స్, Swastik Pal

'' చెరువులో పాప తేలుతూ కనిపించినప్పుడు, బాగా వర్షం పడుతోంది. చెరువు నిండుగా ఉంది. పాపను బయటికి తీశాం. కానీ, అప్పటికే తను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ సంఘటన మా కళ్లు తెరిపించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలో మాకు నేర్పింది’’ అని సుజాత దాస్ చెప్పారు.

పిల్లలు నీటిలో పడిపోకుండా చూసుకోవడానికి గ్రామంలో సుజాత లాంటి ఎందరో మహిళలు చెరువుల చుట్టూ వెదురు కర్రలతో, వలలతో కంచె వేశారు.

ఈత రాని పిల్లలకు చెరువుల్లో ఎలా ఈత కొట్టాల్లో నేర్పించాలని ఆశిస్తున్నారు. నీటిలో పడిపోయిన పిల్లలను కాపాడేందుకు సీపీఆర్ చేయడం నేర్చుకోవాలని పొరుగువారిని ప్రోత్సహించాలని ఆమె కోరుకుంటున్నారు.

''పిల్లలు ఓటేయరు. అందుకే ఈ సమస్యలను రాజకీయ నాయకులు చర్చించరు.'' అని రాయ్ అన్నారు. ''అందుకే మేం స్థానికంగా ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తున్నాం.'' అని తెలిపారు.

భారత్‌లో అత్యున్నత సైన్స్ ఏజెన్సీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మద్దతుతో శిశు సంరక్షణా కేంద్రాలకు నిధులను సమకూర్చడం, చెరువులకు కంచె వేయడంలాంటి పనులు చేయిస్తున్నట్టు చెప్పారు.

రెండేళ్లలో సుమారు 2 వేల గ్రామాలకు సీపీఆర్ శిక్షణ అందించారు. జులైలో ఒక గ్రామస్థుడు చెరువులో పడిన బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లడాని కంటే ముందే సీపీఆర్ చేసి కాపాడాడు.

'' శిశు సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం, అక్కడ కమ్యూనిటీలో దీనిపై అవగాహన కల్పించడం అసలైన సవాలు'' అని సుజాయ్ రాయ్ చెప్పారు.

ఖర్చులు, స్థానిక నమ్మకాల కారణంతో ఈ తేలిక పరిష్కారాన్ని అమలు చేయడం కూడా సవాలుగా మారుతోంది. ఏడాది నుంచి నాలుగేళ్ల లోపున్న పిల్లలు నీటిలో పడకుండా సరిహద్దు బంగ్లాదేశ్‌లో, ఇంటి ఆవరణలో చుట్టు చెక్కలతో కంచెలా తయారుచేసిన ఆటస్థలాన్ని ఏర్పాటుచేస్తున్నారు. వీటిల్లోంచి పిల్లలు బయటకు రావడానికి వీలుండదు. కానీ పిల్లలు వాటిని ఇష్టపడటం లేదు. దీంతో అవి తరచూ మేకలు, బాతుల కోసం వాడుతున్నారు.

ఇవి సరైన భద్రత ఇవ్వకపోతుండటంతో మూడేళ్లుగా నీటిలో పడిపోయి చనిపోతున్న పిల్లల సంఖ్య కొద్దిగా పెరిగిందని జార్జ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజ్యూరీ ఎపిడెమియాలజిస్ట్‌గా పనిచేసే జగ్నూర్ చెప్పారు.

స్విమ్మింగ్ క్లాస్‌లు

ఫొటో సోర్స్, Swastik Pal

ఫొటో క్యాప్షన్, పిల్లలు నీటిలో పడిపోకుండా చూసుకోవడానికి చెరువుల చుట్టూ వెదురు కర్రలతో, వలలతో కంచె వేశారు.

బంగ్లాదేశ్‌లో లాభారహిత సంస్థలు 2,500 శిశు సంరక్షక కేంద్రాలను ఏర్పాటు చేశాయి. నీటిలో మునిగిపోయి చనిపోతున్న పిల్లల మరణాలను ఇవి 88 శాతం తగ్గించాయి.

2024లో ప్రభుత్వం ఈ కేంద్రాలను 8000కు విస్తరించింది. వీటివల్ల, వార్షికంగా 2 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుతోంది.

నీరు ఎక్కువగా ఉండే వియత్నాంలో ఆరు నుంచి 10 ఏళ్ల పిల్లల మరణాల రేటును తగ్గించేందుకు విధానాలను రూపొందించింది. పిల్లలకు ప్రాణాపాయస్థితి నుంచి రక్షించుకోవడం ఎలాగో నేర్పిస్తోంది. నీటి మార్గాల ద్వారా ప్రయాణించే స్కూల్ పిల్లల్లో మరణాల రేటును ఇవి తగ్గిస్తున్నాయి.

నీటిలో మునిగిపోయి చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సమస్యగా ఉంది. 2021లో సుమారు 3 లక్షల మంది నీటిలో మునిగిపోయి మరణించారని డబ్ల్యూహెచ్ఓ అంచనావేసింది. అంటే ప్రతి గంటకు 30 మంది చనిపోయారు. వారిలో సగం మంది 29 ఏళ్ల లోపు వారైతే, పావు వంతు మంది ఐదేళ్ల లోపు వారు.

భారత్‌లో అధికారికంగా రికార్డు అయిన డేటా ప్రకారం 2022లో 38 వేల మంది నీటిలో మునిగిపోయి మరణించారని తెలిసింది. అయితే, వాస్తవ సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

ఇంటి ముందున్న చెరువు

ఫొటో సోర్స్, Swastik Pal

సుందర్‌బన్‌లో వాస్తవం మరింత కఠినంగా ఉంది. పిల్లలు బయటకు వెళ్లకుండా తాళ్లతో కడతారు. పిల్లల కదలికలను అర్థం చేసుకునేందుకు శబ్దాలు చేసే పట్టీలను ఉపయోగిస్తారు. కానీ, చుట్టూ నీరు ఉండే ప్రాంతాల్లో ఏదీ సురక్షితం కాదు.

ప్రస్తుతం శిశు సంరక్షణ కేంద్రాలు మాత్రమే వారికి ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. నీటి ప్రమాదాల నుంచి వారి పిల్లలను సంరక్షించే మార్గంగా వాటిని చూస్తున్నారు.

ఇటీవల మధ్యాహ్నం నాలుగేళ్ల బాలుడు మాణిక్ పాల్, తన స్నేహితుల కోసం ''నా తల్లిదండ్రులు నాతో లేనప్పుడు ఒంటరిగా చెరువు వద్దకు వెళ్లను. ఈత కొట్టడం నేర్చుకుంటాను. నా జీవితాన్ని ఎలాంటి భయం లేకుండా గడుపుతాను'' అనే పాటను పాడి, అవగాహన కల్పించాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)