కడుపులో బ్యాండేజ్ ఉంచి కుట్లు వేసిన వైద్యులు, రూ.13 లక్షల పరిహారానికి ఆదేశాలు

మహిళ కడుపులో బ్యాండేజ్ ఉంచి ఆపరేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, విజయానంద్ అర్ముగమ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రసవ సమయంలో మహిళ కడుపులో బ్యాండేజ్ ఉంచి కుట్లువేసిన ఆస్పత్రి రూ.13 లక్షల పరిహారం చెల్లించాలని చెన్నై వినియోగదారుల సమస్యల పరిష్కార కమిటీ ఆదేశించింది.

శస్త్రచికిత్స కారణంగా 22 రోజులకుపైగా వాంతులు, విరేచనాలతో బాధపడ్డానని బాధితురాలు తెలిపారు.

ఆస్పత్రిలో ఏం జరిగింది?

చెన్నైలోని తాండయార్‌పేటలో నివాసముంటున్న ధనశేఖర్‌-ప్రీతి దంపతులకు వివాహమై ఐదేళ్లయినా పిల్లలు పుట్టలేదు. దీంతో వారు తిరువొత్తియూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

దీని తరువాత, గర్భవతి అయిన ప్రీతికి 2022 జులైలో కడుపు నొప్పి వచ్చింది. అనంతరం ధనశేఖర్ తన భార్యను అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రీతి ఏడు నెలల గర్భవతి.

"డాక్టర్లు నాకు డెలివరీ డేట్ సెప్టెంబర్ 5న ఇచ్చారు. కానీ ఏడో నెలలో బాగా నొప్పి వచ్చింది. దీంతో మేం ఆసుపత్రికి వెళ్లాం. అక్కడ ఉన్న ఒక మహిళా డాక్టర్ పరీక్ష చేసి, వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలని చెప్పారు" అని ప్రీతి తెలిపారు.

నెలలు నిండకుండానే బిడ్డ జన్మించడంతో అబ్జర్వేషన్‌లో ఉంచేందుకు మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని ప్రీతి బీబీసీతో చెప్పారు.

శస్త్ర చికిత్స జరిగిన ప్రాంతంలో చాలా రక్తం కారుతోందన్నారు.

"కుట్లు వేసిన శరీరభాగం దగ్గరి నుంచి ఇంకా రక్తం వస్తూనే ఉంది. అక్కడ ఉన్న నర్సు ఒకరు దూది బాల్‌తో అక్కడ నొక్కిపెట్టారు. నొప్పి ఎక్కువగా ఉందని నర్సు చెబుతున్నా.... డాక్టర్లు వెంటనే రాలేదు'' అని ప్రీతి ఆవేదన వ్యక్తంచేశారు.

ఆ రాత్రి (2022 జులై 18) దాదాపు పది గంటల సమయంలో నన్ను పరీక్షించిన డాక్టర్ నాకు రక్తం ఎక్కించాల్సిన అవసరముందని చెప్పారు. అదే ఆస్పత్రిలో నేను ఏడు రోజుల పాటు ఐసీయూలో ఉన్నాను. అయినప్పటికీ వాంతులు, విరేచనాలు ఆగలేదు'' అని ప్రీతి తెలిపారు.

‘‘ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీని గురించి నేను వైద్యులను అడగగా, ' చికిత్స సమయంలో చాలా యాంటీబయాటిక్స్ ఇచ్చాం. అంతా బాగానే ఉంది' అని వారు చెప్పారు. నా పొట్టలో ఏదో ఉందని చెబుతున్నప్పటికీ వారు వినిపించుకోలేదు’’ ఆమె వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్యాండేజ్ పొట్టలో ఉంచి ఆపరేషన్

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, ఆపరేషన్ తర్వాత వాంతులు, విరేచనాలతో మహిళ బాధపడ్డారు

కడుపులోని వస్త్రం తొలగించిన ప్రభుత్వ వైద్యులు

ఆ తర్వాత ప్రీతి భర్త ఆమెను చికిత్స కోసం ఎగ్మోర్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రీతిని పరీక్షించిన మహిళా వైద్యురాలు ఆమె కడుపులో ఏదో సమస్య ఉందని చెప్పారు. అక్కడి నుంచి రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రికి ప్రీతిని పంపించారు.

ఎగ్మూర్ ఆస్పత్రి నుంచి రాజీవ్ గాంధీ ఆస్పత్రికి తరలించే క్రమంలో తాను స్పృహ కోల్పోయానని ప్రీతి తెలిపారు. సీటీ స్కాన్ చేసి.. తన కడుపులో ఏదో ఉందని.. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పిన విషయాన్ని ప్రీతి గుర్తుచేసుకున్నారు.

దాదాపు 8 గంటల పాటు సర్జరీ జరిగింది. ప్రీతి పొట్టలోంచి బ్యాండేజ్ బయటకు తీశారు.

బ్యాండేజ్‌ను బయటకు తీసిన డాక్టర్లు షాక్‌ అయ్యారు.

''మీకు ఆపరేషన్ చేసింది ఎవరు? వాళ్ల ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి. మేం ఫిర్యాదు చేస్తాం'' అని డాక్టర్లు చెప్పిన మాటలు విని తాము షాకయ్యామని ప్రీతి తెలిపారు.

రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో 14 రోజుల చికిత్స తర్వాత ప్రీతి ఆరోగ్యం మెరుగుపడింది. ''ఆ రోజు నేను ప్రభుత్వాసుపత్రికి వెళ్లకపోయి ఉంటే నేను బతికి ఉండేదాన్ని కాదు. నా బిడ్డను పెంచగలిగేదాన్నికాదు'' అని కన్నీళ్లతో చెప్పారు ప్రీతి.

ప్రైవేట్ ఆస్పత్రిలో చేసిన చికిత్స, ప్రభుత్వాసుపత్రిలో చికిత్సకు సంబంధించిన పత్రాలతో ఉత్తర చెన్నైలోని వినియోగదారుల సమస్యల పరిష్కార కేంద్రంలో ప్రీతి కేసు వేశారు.

వైద్యుల తప్పుడు చికిత్స వల్ల తన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా తన శరీర బరువు దాదాపు 20 కిలోలు తగ్గిందని పిటిషన్‌లో ప్రీతి తెలిపారు.

"ప్రీతి చేసిన ఆరోపణలను ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం కేసు విచారణలో అంగీకరించలేదు" అని ఆమె తరఫు న్యాయవాది సూర్య ప్రకాష్ బీబీసీతో చెప్పారు.

రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రి

ఫొటో సోర్స్, HANDOU

ఫొటో క్యాప్షన్, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రిలో మహిళకు మరో ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది.

ప్రైవేట్ హాస్పిటల్ వివరణ

కేసు విచారణ సమయంలో ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం కోర్టులో తమ వాదన వినిపించింది.

పిల్లలు పుట్టడంలో ఉన్న సమస్యలకు చికిత్స కోసం వచ్చిన దంపతులకు మంచి వైద్యం చేశామని తెలిపింది. పురిటినొప్పులతో వచ్చిన మహిళ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, ఆమెను అత్యవసర విబాగంలో చేర్చుకుని, ప్రాణాలను రక్షించామని తెలిపారు.

సర్జరీ అనంతరం మహిళ ఆరోగ్యం మామూలుగానే ఉందని, ఆ తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యారని ఆస్పత్రి యాజమాన్యం వాదించింది. ఆపరేషన్ తర్వాత రోగి చాలా దూరం ప్రయాణించారని.. మళ్లీ నొప్పి వస్తుందని చెప్పడంతో ఇంకోసారి చికిత్స అందించామని తెలిపింది.

దీనికి సంబంధించి తీసిన స్కానింగ్‌లో కడుపులో ఎలాంటి వస్తువు కనిపించలేదని తెలిపింది.

అదే సమయంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో తెల్లవారుజామున 2 గంటలకు మహిళకు ఆపరేషన్ జరిగిందని, అక్కడే ఇలాంటి పొరపాటు జరిగే అవకాశం ఉందని వాదించింది. తమ నుంచి డబ్బులు వసూలు చేసేందుకే ఈ కేసు పెట్టారని ఆరోపణలు చేసింది.

ప్రీతి

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ తర్వాత తాను బరువు తగ్గిపోయానని ప్రీతి చెప్పారు.

తీర్పులో న్యాయమూర్తి ఏం చెప్పారు?

ఉత్తర చెన్నై వినియోగదారుల సమస్యల పరిష్కార కమిటీ చైర్మన్ డి.గోపీనాథ్, సభ్యులు కవితా కన్నన్, వి.రామమూర్తిలతో కూడిన బెంచ్ జనవరి 10వ తేదీన తీర్పు వెలువరించింది.

సర్జరీ అనంతరం ప్రీతి వాంతులు, విరేచనాలు, అజీర్తితో బాధపడ్డారు. ఆహారం సరిగా తీసుకోలేకపోయారు. సర్జరీ అనంతరం మళ్లీ ఎనిమిది రోజుల పాటు అదే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

పిటిషనర్ నొప్పికి కారణాన్ని కనిపెట్టడంలో ప్రైవేట్ ఆసుపత్రి విఫలమవ్వడమే కాక దాన్ని దాచిపెట్టింది.

అంతే కాకుండా పిటిషనర్‌ను బలవంతంగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన చికిత్సలో బ్యాండేజ్ తొలగించారు'' అని తీర్పులో తెలిపారు.

''ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన ఆపరేషన్‌లో పొట్టలోంచి స్పాంజ్‌లాంటి పదార్థం (15*15 సెం.మీ.) బయటకు తీశారు'' ఆ తర్వాతే ప్రీతి ఆరోగ్య పరిస్థితి మెరుగయిందని కోర్టు తెలిపింది.

చికిత్స అందించినవారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పట్టించుకోకపోవడం వల్లే పిటిషనర్‌ రెండోసారి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని న్యాయమూర్తి అన్నారు.

''కాబట్టి ప్రైవేటు ఆసుపత్రి బాధితురాలికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.10 వేలు చెల్లించాలి. అలాగే వైద్య ఖర్చులకు 3,26,746 రూపాయలు ఖర్చు చేసినందున మొత్తం 13,36,746 రూపాయలు అదనంగా చెల్లించాలి'' అని వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్‌ న్యాయమూర్తి గోపీనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు.

లాయర్ సూర్యప్రకాశ్

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, పొట్టలో బ్యాండేజ్ ఉంచి ఆపరేషన్ చేశారన్న విషయాన్ని జడ్జి సీరియస్‌గా తీసుకున్నారని లాయర్ చెప్పారు.

పరిహారం ఆదేశాలివ్వడానికి కారణాలేంటి?

ఆపరేషన్ సమయంలో పొట్టలో వస్త్రం ఉంచడాన్ని మాత్రమే న్యాయమూర్తి సీరియస్‌గా తీసుకున్నారని న్యాయవాది సూర్యప్రకాశ్ చెబుతున్నారు.

వైద్యుల నిర్లక్ష్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పోలీసు కమిషనర్‌ను కోరాం. ప్రైవేట్‌ ఆస్పత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని తిరువొట్టరియూర్ తాత్కాలకి ధర్మాసనం ఆదేశించింది. ఇవి ఈ కేసులో ఉపయోగపడ్డాయి'' అని న్యాయవాది సూర్యప్రకాశ్‌ చెప్పారు.

''రెండు రోజులు ఆలస్యమై ఉంటే ఆ మహిళ ప్రాణాలకు ముప్పు ఏర్పడి ఉండేది. ఈ ఆపరేషన్‌లో పొట్టలో బ్యాండేజ్ ఉంచడాన్ని న్యాయమూర్తి సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే ఎక్కువ మొత్తంలో పరిహారం చెల్లించాలని ఆదేశించారు'' అని బీబీసీ తమిళ్‌తో తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)