తెలంగాణ: కాంగ్రెస్ పార్టీ పెట్టిన సోషల్ మీడియా పోల్‌లో ఏం తేలింది? కేసీఆర్ ఏమన్నారు?

భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, FB/revanthofficial

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేపట్టిన పోల్ సర్వే వివాదాస్పదమైంది.

బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా పోల్ సర్వే చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. కానీ, కాంగ్రెస్ పాలనకు అనుకూలంగా నెటిజన్ల నుంచి తక్కువ ఓట్లు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

దీనిపై ఇరుపార్టీల నేతలు స్పందించారు.

తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ‘ఎక్స్’(ట్విటర్) హ్యాండిల్‌లో జనవరి 29వ తేదీన పోల్ సర్వే చేపట్టారు.

ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? అనే ప్రశ్నను నెటిజన్లకు వేశారు.

దాని కింద రెండు ఆప్షన్లు ఇచ్చారు.

A. ఫామ్ హౌస్ పాలన

B. ప్రజల వద్దకు పాలన

ఈ రెండు సమాధానాల్లో పరోక్షంగా ‘ఫామ్ హౌస్ పాలన’ అంటే బీఆర్ఎస్ పాలన కావాలా? లేదా ‘ప్రజలకు వద్దకు పాలన’ అంటే కాంగ్రెస్ పాలన కావాలా? అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినట్లుగా ఉంది.

 తెలంగాణ కాంగ్రెస్

ఫొటో సోర్స్, Twitter/ Telangana Congres

ఈ సర్వేలో మొత్తం 92,551 ఓట్లు పోలైనట్లుగా తుది ఫలితాల్లో ఉంది.

ఈ పోల్‌లో పాల్గొన్న వారిలో 67 శాతం మంది ఆప్షన్ ‘A’కి అనుకూలంగా ఓట్లు వేయగా, 33 శాతం మంది ‘B’ని ఎంచుకున్నారు.

కాంగ్రెస్ పెట్టిన పోల్‌లో కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఎక్కువగా ఓట్లు రావడంతో, ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

‘‘కాంగ్రెస్ పార్టీ ఆన్‌లైన్ సర్వే చేపట్టి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అయ్యింది’’ అంటూ కొందరు నెటిజన్లు అంటున్నారు.

వాట్సాప్ చానల్
కేసీఆర్

ఫొటో సోర్స్, FB/BRSParty

కాంగ్రెస్ పోల్‌పై కేసీఆర్ ఏమన్నారంటే..

''కాంగ్రెస్ వాళ్లే పోలింగ్ పెట్టారు. వాళ్ల పార్టీ వారే పెట్టారు. ఆ పోల్‌లో 70 శాతం బీఆర్‌ఎస్‌కు వచ్చింది. 30 శాతం వాళ్లకు వచ్చిందట’’ అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

ఈ సర్వేపై కాంగ్రెస్ పార్టీ సైతం వివరణ ఇచ్చుకుంది.

''పరిపాలన విధానం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడానికి ఈ పోల్ పెట్టాం'' అని చెప్పారు టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ కుమార్.

అలాగే, ఈ సర్వేపై బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించింది.

''తెలంగాణ కాంగ్రెస్‌కు ఇప్పటికైనా జనం గుండె చప్పుడు తెలుసుకోవాలనే జ్ఞానోదయం కలిగినందుకు సంతోషం. మీరు ప్రశ్నలు ఇంకా డైరెక్టుగా అడిగి ఉంటే సమూలంగా తుడిచిపెట్టుకుపోయేవారు'' అని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య సోషల్ వార్

ఇటీవల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన తర్వాత 'ఈనో' ప్రకటన కూడా రాజకీయంగా దుమారం రేపింది.

దానికి కౌంటర్‌గా రాజ్యాంగ దినోత్సవం రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 'ఓటు హక్కు' ప్రకటన విడుదల చేసింది.

ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ అడిగిన పోల్‌లో కాంగ్రెస్ పార్టీకే తక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది.

''ఇది కాంగ్రెస్ పార్టీ వేసుకున్న సెల్ఫ్ గోల్'' అని ప్రభాకర్ గౌడ్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, Twitter/ Telangana Congress

ఫొటో క్యాప్షన్, పరిపాలనా విధానం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడానికి ఈ పోల్ పెట్టామని టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ కుమార్ తెలిపారు.

మరోవైపు ఈ పోల్ ఫలితాలను తొలగించవద్దని కొందరు నెటిజన్లు కోరారు. ఈ విషయంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

''ఎప్పుడైనా ఆప్షన్ 1 అనేది సొంత పార్టీ ఛాయిస్ ఉండాలి. అది కూడా సోయి లేదు'' అని ట్వీట్ చేశారు జర్నలిస్టు నవీన.

''మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనంత వరకు ప్రజలకు మీపై నమ్మకం ఉండదు'' అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ఇందులో రెండు లక్షల జాబ్‌లు, రూ. 15 వేల రైతు భరోసా, నాలుగు వేల పింఛను, మహిళలకు నెలకు రూ.2,500సాయం, కౌలు రైతులకు రూ.15 వేల సాయం ఏది?’’ అంటూ ఆరు గ్యారెంటీలను పోస్టు చేస్తూ ప్రశ్నించారు.

''ఫాం హౌస్ పాలన కావాలని ఎవరికీ ఉండదు. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులకు అధికారం ఇచ్చేవారు. కానీ అధికారం కొద్దిమంది కుటుంబ సభ్యులకే పరిమితమైతే, అది ప్రజాస్వామ్యం కాదని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు అదే సందేశాన్ని ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా చెప్పారు'' అని 'కాంగ్రెస్ ఫర్ తెలంగాణ' ఎక్స్ హ్యాండిల్ నిర్వహిస్తున్న వ్యక్తి పోస్టు పెట్టారు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, Twitter/ Telangana Congress

కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది..

ఈ పోల్ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

''టీపీసీసీ పోల్ రిఫలితాలను బీఆర్ఎస్ సోషల్ మీడియా పబ్లిసిటీ చేయడం సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ అసలు రూపం తెలుసుకోవడం ఈ పోల్ ఉద్దేశం'' అని చెప్పారు టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్.

సమాజం పట్ల బాధ్యత ఉన్నవారెవరూ ఫామ్‌హౌస్ పాలన కావాలని కోరుకోరని ఆయన అన్నారు.

''కాంగ్రెస్ సోషల్ మీడియా స్వచ్ఛంద కాంగ్రెస్ కార్యకర్తలు. పార్టీ లైన్ ప్రకారమే మా సోషల్ మీడియా పని చేస్తోంది'' అని చెప్పారు మన్నె సతీష్.

ఇదే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

''ప్యాలెస్ సీఎం ఎవరు అంటే ప్రజలే చెబుతారు. ప్రజల సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి సమీక్ష చేస్తే తప్పు ఏంటి? హరీష్ రావు ఎందుకు విమర్శలు చేస్తున్నారు. క్యాబినెట్ సమావేశాలు, పాలనాపరమైన నిర్ణయాలు సచివాలయం నుంచి జరుగుతున్నాయి'' అని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

కాంగ్రెస్

ఫొటో సోర్స్, Twitter/BRS party

బీఆర్ఎస్ పార్టీ ఏమంటోందంటే..

కాంగ్రెస్ నిర్వహించిన పోల్‌పై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

''కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో ఎవరి పాలన బాగుంది అంటే కేసీఆర్ పాలన బాగుంది అని 70 శాతం నెటిజన్లు సమాధానమిచ్చారు. ఈ సర్వే ద్వారా ప్రజలు కాంగ్రెస్ చెంప చెళ్లుమనిపించారు'' అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ విషయంపై సీనియర్ జర్నలిస్టు పి. వేణుగోపాల్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.

''సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా పాలనలో మార్పులు తెచ్చుకుంటూ ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సర్వే ఎవరు చేశారు? అధికారికంగా పీసీసీ అనుమతితో చేశారా.. రాజకీయంగా డైవర్ట్ చేయడానికి చేశారా.. అన్నది కూడా చూడాలి. మరోవైపు కొన్నిసార్లు గ్రామంలో తిరగలేని పరిస్థితి ఉందంటూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే చెబుతున్నారు. దీని ఆధారంగా పాలనలో కొన్ని మార్పులు తీసుకుంటే మంచిది'' అని చెప్పారు.

పోల్‌లో వ్యంగ్యంగా ఆప్షన్లు పెట్టడాన్ని, కేసీఆర్ వైపు ప్రజలు చూడకుండా ఉండేందుకు అనుసరించిన వ్యూహంలో భాగంగా కూడా చూడాల్సి ఉంటుందని చెప్పారు వేణుగోపాల్ రెడ్డి.

''సర్వేను క్షేత్రస్థాయి పరిస్థితులతో పోల్చితే మరి సీరియస్‌గా తీసుకోవడానికి కూడా లేదు. కానీ, సమాధానాలు అడిగినప్పుడు రేవంత్ పాలన బాగుందా? కేసీఆర్ పాలన బాగుందా? అంటే బాగుండేది. అప్పుడు కాస్త మెరుగైన ఫలితం వచ్చి ఉండేదేమో? వ్యంగ్యంగా అడగడం వెనుక కూడా కొంత వ్యూహాన్ని అనుసరించినట్లుగా తెలుస్తోంది'' అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)