‘శానిటరీ ప్యాడ్స్ అడిగితే పీరియడ్స్ వచ్చినట్లు ఆధారం చూపించమంటున్నారు’.. కేజీబీవీ విద్యార్థినుల ఫిర్యాదుతో అధికారుల సస్పెన్షన్

కేజీబీవీ విద్యార్థినులు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

అన్నమయ్య జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తనిఖీకి వెళ్లిన అధికారులకు అక్కడ చదువుకుంటున్న విద్యార్థినులు కన్నీళ్లతో తమ బాధలు చెప్పుకోవడం, స్కూల్లో తమను వేధిస్తున్నారని ఆరోపించడం కలకలం సృష్టించింది.

మొలకల చెరువు సమీపంలోలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో తనిఖీ కోసం వెళ్లిన సామాజిక తనిఖీ సిబ్బంది (ఏపీ సోషల్ ఆడిట్ టీమ్)తో అక్కడి విద్యార్థినులు తమ సమస్యలను చెప్పుకొన్నారు.

పాఠశాల సిబ్బంది తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, పురుగుల ఆహారం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు.

సామాజిక తనిఖీ సిబ్బంది వెంటనే స్పందించి ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాట్లాడారు.

విద్యాశాఖ దీనికి బాధ్యులైన ప్రిన్సిపల్, ఏఎన్ఎంలను మరుసటి రోజు సస్పెండ్ చేసింది. కొందరు టీచర్లు తనపై కుట్ర చేశారని సస్పెండ్ అయిన ప్రిన్సిపల్ ఆరోపించారు.

అసలు ఆ స్కూల్లో ఏం జరిగింది. బాలికలు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? అనే విషయాలను తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం
ఫొటో క్యాప్షన్, మొలకల చెరువు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషల్ ఆడిట్ బృందం, జనవరి 22, 27 తేదీల్లో అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు కేజీబీవీ పాఠశాలలో తనిఖీలు నిర్వహించింది.

ఆ సమయంలో తమతో అక్కడి విద్యార్థినులు వెల్లడించిన సమస్యలపై ఆ బృందం 27వ తేదీన తల్లిదండ్రులకు, మీడియాకు వివరించింది.

స్కూల్లో రెండు రోజుల పాటు సామాజిక తనిఖీలు నిర్వహించామని స్టేట్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ సుబ్బారావు తెలిపారు.

తర్వాత సామాజిక తనిఖీల్లో తమకు తెలిసిన విషయాలను విద్యార్థినుల తల్లిదండ్రులకు చెప్పామని ఆయన బీబీసీతో అన్నారు.

''విద్యార్థినులు, అక్కడి సిబ్బందితో మాట్లాడాం. విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు, విద్యానాణ్యత, స్నానాల గదులు, ఆహారం, ప్రభుత్వం పిల్లలకు అందించే వస్తువులు వంటి అంశాలపై సమగ్రంగా తనిఖీ చేశాం'' అని ఆయన చెప్పారు.

ఎస్పీడీఓ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేస్తున్నామని చెప్పిన ఆయన, తర్వాత జిల్లా అధికారులకు నివేదిక అందిజేస్తామని అన్నారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి మొత్తం 68 స్కూళ్లలో ఆడిట్ చేస్తున్నామని తెలిపారు.

 సోషల్ ఆడిట్ టీమ్‌కు చెందిన సరిత
ఫొటో క్యాప్షన్, సోషల్ ఆడిట్ టీమ్‌ ప్రతినిధి సరిత
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం

పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ అడిగితే, పీరియడ్స్ వచ్చినట్లు ఆధారాలు చూపించాలని స్టాఫ్ అడుగుతున్నారని విద్యార్థులు తమతో చెప్పారని సోషల్ ఆడిట్ టీమ్‌కు చెందిన సరిత ‘బీబీసీ’తో చెప్పారు.

''నెలసరి సమయంలో అమ్మాయిలకు 5 ప్యాడ్లు ఇస్తున్నట్లు రిజిస్టర్‌లో రాస్తున్నారు. కానీ, తమకు రెండు మాత్రమే ఇస్తున్నట్లు పిల్లలు చెబుతున్నారు. నెలసరి వచ్చినప్పుడు తలస్నానం చేసే సమయంలో ప్రతి విద్యార్థిని నుంచి రూ. 100 అడుగుతున్నారని తెలిసింది. ఆహారంలో నాణ్యత ఉండట్లేదు. ఎవరైనా తనిఖీలకు వచ్చిన సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు. మిగిలిన సమయంలో సరిగా ఉండటం లేదు. మెనూ ప్రకారం కూడా పెట్టడం లేదు'' అని సరిత తెలిపారు.

ఒకవేళ విద్యార్థినుల్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిని వేధిస్తున్నారంటూ స్కూల్లో చదివే బాలికలు తమకు చెప్పారని సరిత అన్నారు.

కేబీజీవీ
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం

''పిల్లలకి ఆరోగ్యం బాలేకపోతే, ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఒకే టాబ్లెట్ ఇస్తున్నారు. ఏఎన్ఎం తమను కొడతారని, తిడతారని పిల్లలు ఫిర్యాదు చేశారు. ఒకసారి ఒకమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు సూది లోపలే ఉండిపోవడంతో ఆమె ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. తర్వాత, ఇంటికి వెళ్లి ఆమె చికిత్స తీసుకున్నారు. ఏమైనా వీరు కేవలం పారాసిటమాల్ ఇస్తారని పిల్లలు మాతో చెప్పారు'' అని సరిత వివరించారు.

ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, కుటుంబీకులు కూడా ఇవే ఆరోపణలు చేశారు. పిల్లలకు ఆరోగ్యం బాలేకపోతే తమతో స్కూల్ సిబ్బంది చెప్పనివ్వరని, ఏ సమస్య అయినా బాగా ముదిరిన తర్వాత తమ వరకు వస్తుందని ఒక విద్యార్థిని నాన్నమ్మ సుబ్బమ్మ చెప్పారు.

''పిల్లలకు ఆరోగ్యం బాలేకపోయినా పట్టించుకోరు. ఒక మాత్ర ఇస్తారు. మాకు చెప్పరు. ఫోన్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది అంటారు. మేం కలవడానికి వెళ్లినప్పుడు బిడ్డ కుమిలిపోయింది. ఇంటికి తీసుకెళ్లి రూ.3000 ఖర్చు పెట్టి ఆసుపత్రిలో చూపించాం. తిండి కూడా సరిగా పెట్టరు. మేం స్నాక్స్ ఇచ్చి వెళ్తుంటాం. ఏ సౌకర్యం లేనప్పుడు ఈ హాస్టల్ ఎందుకు? దయచేసి ఆడబిడ్డల భవిష్యత్తు నిలపండి'' అని ఆమె అన్నారు.

భోజనం సరిగా లేదని చెబితే, మీ ఇంట్లో ఇంకా బాగా పెడతారా అని పిల్లలపై కోప్పడతారని, కొట్టడానికి వస్తారని తన మనవరాలు చెప్పిందని సుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

స్టేట్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ సుబ్బారావు
ఫొటో క్యాప్షన్, స్టేట్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ సుబ్బారావు
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం

అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తండ్రి కూడా ఇలాగే బాధపడ్డారు. తాము ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని అన్నారు.

''ఇంతకుముందు కూడా అన్నంలో పురుగులు వస్తున్నాయని చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఏఎన్ఎం మీద కూడా కంప్లైంట్ వచ్చింది. ప్యాడ్స్ అడిగితే ప్రూఫ్ ఏది చూపించు అని అడుగుతారంటా. ఆడపిల్లని అలా అడగడం చాలా తప్పు. దీనిపై కూడా మేం ఫిర్యాదు చేశాం. అయినా మళ్లీ అలాగే జరుగుతోంది.

హాస్టల్ సిబ్బంది అభ్యంతరకర రీతిలో మాట్లాడతారని పిల్లలు చెబుతుంటారు. పిల్లలతో చెత్త తీయించడం, అంట్లు కడిగించడం వంటి పనులు చేయిస్తారు. వాళ్ల మాట వినకపోతే సరిగా చదవడం లేదని తల్లిదండ్రులకు కంప్లైంట్ చేయడం, కాళ్లు నొక్కించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడైనా న్యాయం చేయండి. హాస్టల్‌లో సిబ్బందిని మార్చండి'' అని ఆవేదన చెందారు.

పేరెంట్స్ మీటింగ్
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం

తమ దర్యాప్తులో కూడా కేజీబీవీలో అక్రమాలు జరిగినట్లే తేలిందని, అందుకే ఏఎన్ఎం అశ్విని, ప్రిన్సిపల్ శిల్ప‌ను సస్పెండ్ చేశామని అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రమణ్యం బీబీసీతో చెప్పారు.

''రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సోషల్ ఆడిట్ బృందాలు కొన్ని పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తాయి. మొలకల చెరువు పాఠశాలను విజిట్ చేసిన బృందం అక్కడ విద్యార్థులు చెప్పిన విషయాలను పేరెంట్స్ మీటింగ్‌లో తల్లిదండ్రులకు చెప్పారు. జనవరి 28న అవన్నీ మీడియాలో కథనాలుగా వచ్చాయి. దీనిపై మేం వెంటనే ఎంక్వైరీ చేయించాం. అవన్నీ నిజమేనని తేలడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యులైన ఇద్దరినీ సస్పెండ్ చేశాం'' అని డీఈఓ సుబ్రమణ్యం చెప్పారు.

సోషల్ ఆడిట్ సిబ్బంది తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని, వారు మీడియాతో మాట్లాడినదాన్ని బట్టి తామే విచారణ చేయించామని ఆయన వివరించారు.

''సోషల్ ఆడిట్ వాళ్లు మాకు రిపోర్టు ఏమీ ఇవ్వలేదు. అది ప్రభుత్వానికి వెళుతుంది. వాళ్లు మీడియాతో మాట్లాడారు. అది మాకు తెలిసింది. వెంటనే జనవరి 28న ఇద్దరు ఎంఈఓలతో విచారణ చేపట్టాం. వారి ఇచ్చిన నివేదిక ప్రకారం, అదే రోజు ఇద్దరిని సస్పెండ్ చేశాం. నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్స్ సరిగా ఇవ్వలేదు. ఏఎన్ఎం ఎక్స్‌పైరీ అయిన మందులు ఇచ్చారు. అందుకే ఏఎన్ఎంను కూడా సస్పెండ్ చేశాం'' అన్నారు.

టీచర్‌గా పని చేసిన తాను అదే స్కూలుకు ప్రిన్సిపల్ కావడంతో జీర్ణించుకోలేక, తమ పాఠశాలలోని కొంతమంది టీచర్లు తనపై పిల్లలతో తప్పుడు ఫిర్యాదులు చేయించారని సస్పెండ్ అయిన ప్రిన్సిపల్ శిల్ప ‘బీబీసీ’తో అన్నారు.

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం

కొంతమంది టీచర్లు వర్గాలుగా విడిపోయి పరస్పర ఆరోపణలు చేస్తూ కళాశాల ప్రతిష్టను దిగజార్చారని ప్రిన్సిపల్ శిల్ప చెప్పారు.

''నా భర్త చనిపోయాడని కొందరు టీచర్లు చులకనగా మాట్లాడారు. సోషల్ ఆడిట్ అంటే ఎక్కడైనా ఎలా జరుగుతుంది. ప్రెస్‌మీట్ పెట్టి మీడియాకు చెబుతారా? లేక ఉన్నత అధికారులకు రిపోర్ట్స్ పంపుతారా? మా వద్ద ఉండే 28 రికార్డులను పరిశీలించకుండా కేవలం ఒకే రిజిస్టర్ చూశారు.

పిల్లల్ని ఒక గదిలో పెట్టి మాట్లాడారు. అక్కడ అందరూ పురుషులే ఉన్నారు. మహిళ లేకుండా ఆడపిల్లల్ని ఎలా ఎంక్వయిరీ చేస్తారు. మరో రోజు పురుషులే పిల్లల ఫ్రీ టైమ్‌లో వచ్చారు. ఆ సమయంలో హాస్టల్లోకి వేరే వ్యక్తులు రాకూడదు. తర్వాత పేరెంట్స్ మీటింగ్ పెట్టమన్నారు. ఆ సమావేశంలో పేరెంట్స్ ముందే స్కూల్లో ఇలా జరుగుతుంది అని చెప్పారు. ఇక్కడ ఇంత జరుగుతుందా అని నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత మీడియాతో కూడా చెప్పారు'' అని ఆమె వివరించారు.

కొంతమంది టీచర్లు పిల్లల్ని మచ్చిక చేసుకుని వారిని చెడగొట్టారని, తమకు అనుకూలంగా మార్చుకుని వారితో ఫిర్యాదు చేయించారని ఆమె ఆరోపించారు.

''అసలు సోషల్ ఆడిట్ నిర్వహించే వారికి మీడియాని పిలవాల్సిన అవసరం ఏముంది. మరుసటి రోజు మీడియాలో రావడంతో వెంటనే, నా నుంచి వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేశారు. ఇదంతా చూస్తుంటే ఏం జరిగిందో ఎవరైనా అర్థం చేసుకోగలరు.

24 మంది ఉపాధ్యాయులు ఉన్న స్కూల్లో ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ ప్రిన్సిపల్‌కు ఎలా తెలుస్తాయి. పేపర్లో వచ్చిన కథనాలు గాని, సోషల్ ఆడిట్ వాళ్లు చెప్పిన విషయాలు కానీ నిజాలు కావు. ఇదంతా ఏదో కుట్రగా నేను భావిస్తున్నా'' అని శిల్ప అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)