మహాకుంభ మేళా : 'సంగమ్ నోస్' అంటే ఏమిటి, యోగి ఆదిత్యనాథ్ అక్కడికి వెళ్లొద్దని ఎందుకు చెప్పారు?

మహా కుంభమేళ

ఫొటో సోర్స్, UP Government

ఫొటో క్యాప్షన్, కుంభమేళాలో అమృత్ స్నాన్ (షాహీస్నాన్‌)ను అత్యంత పవిత్రంగా భావిస్తారు.

ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో మౌని అమావాస్య నాడు రాత్రి (జనవరి 29న) 'సంగమ్ నోస్' వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు 12 మంది భక్తులు మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

తొక్కిసలాట తరువాత, భక్తులు 'సంగమ్ నోస్' వద్దకు వెళ్లవద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. సమీప ఘాట్లలోనే స్నానం చేయాలని సూచించారు.

కుంభమేళా జనవరి 13న పుష్య పూర్ణిమ నాడు ప్రారంభమైంది. జనవరి 14 మకర సంక్రాంతి నాడు రెండవ 'అమృత స్నానం' జరిగింది. అదేరోజు అఖాడాలు మొదటి 'అమృత స్నానం' చేశారు.

కుంభమేళాలో 'అమృత స్నానానికి' ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. దీనిని 'రాజయోగ స్నానం' అని కూడా అంటారు.

మహా కుంభమేళా సమయంలో సంగమ్‌లో ఎక్కువ భాగం అఖాడాలకు కేటాయించారు.

నాగ సాధువులు సంగమ్ ఘాట్‌కు చేరుకోవడానికి చెక్క దుంగలతో దారులు వేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సంగమ్ నోస్

'సంగమ్ నోస్' అంటే ఏమిటి?

గంగ, యమునా నదులు కలిసే ప్రదేశమే 'సంగమ్‌ నోస్'. అందుకే ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఇక్కడ రెండు నదులు వేరువేరు రంగులలో కనిపిస్తాయి.

యమున నీరు లేత నీలం రంగులో ఉండగా, గంగ నీరు కొద్దిగా బురదలా కనిపిస్తుంది.

యమునా నది ప్రయాణం ఇక్కడ గంగలో కలవడంతో పూర్తవుతుంది. ఈ ప్రాంతాన్నే కుంభమేళాలోని సంగమ్‌ ఘాట్‌గా గుర్తించారు.

"వివిధ సంప్రదాయాలకు చెందిన అఖాడా సాధువులు తమ ఆచారాలు, అమృత స్నానాలను ఆచరించే ప్రదేశం 'సంగమ్‌ నోస్'. 'అమృత స్నానం' రోజున అఖాడాలు సంగమ్‌ ఘాట్‌కు చేరుకోవడానికి ప్రత్యేక మార్గాలను ఏర్పాటుచేశారు" అని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జ్యోతిష్యుడు పండిట్ రమేష్ పాండే బీబీసీతో చెప్పారు.

"సంగమ్‌ నోస్ వద్ద స్నానం చేయడం ద్వారా మోక్షం లభిస్తుందని హిందూ మతంలో నమ్ముతారు. అందుకే ప్రతి భక్తుడు సంగమ్‌నోస్‌లో స్నానం చేయాలని కోరుకుంటారు" అని ఆయన అన్నారు.

శాస్త్రి వంతెన, 'సంగమ్‌ నోస్' మధ్య 26 హెక్టార్ల భూమిని విస్తరించే పనిని నీటిపారుదల శాఖ యూనిట్ పూర్తి చేసిందని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. కుంభమేళా నేపథ్యంలో కేవలం 'సంగమ్‌ నోస్' వద్ద రెండు హెక్టార్ల మేర భూ విస్తీర్ణాన్ని పెంచేందుకు 85 రోజులపాటు మూడు షిఫ్టుల్లో పనిచేసినట్లు అధికారులు తెలిపారు.

భక్తుల రద్దీ దృష్ట్యా 1,650 మీటర్ల విస్తీర్ణంలో ఇసుక బస్తాలను వేసి సంగమ్‌ ఘాట్‌ను విస్తరించినట్టు అధికారులను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. దీని కోసం నాలుగు పెద్ద డ్రెడ్జింగ్ యంత్రాలను ఉపయోగించి, సంగమ్‌ ఘాట్ వద్ద స్నానానికి పెద్ద స్థలాన్ని సృష్టించారు. దీనివల్ల 'సంగమ్‌ నోస్' స్నానఘట్టాల సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

2019లో 'సంగమ్‌ నోస్' వద్ద గంటకు 50 వేల మంది భక్తులు స్నానాలు చేసే సామర్థ్యం ఉండగా, ఈసారి గంటకు రెండు లక్షల మందికి పైగా భక్తులు స్నానాలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

సంగం నోస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా ప్రాంతాన్ని రాష్ట్రంలోని 76వ జిల్లాగా ప్రకటించింది

సంగమ్‌ నోస్‌కు జనం క్యూ

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది, ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. 2019లో ప్రయాగ్‌రాజ్‌లో అర్థకుంభ్ జరిగింది. 2013లో పూర్ణ కుంభ్ వేడుక నిర్వహించారు.

కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్‌రాజ్‌లో ఇలా వరుసగా నిర్వహిస్తారు.

ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా ప్రాంతం దాదాపు 4 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. దీనిని 25 సెక్టార్లుగా విభజించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా జరిగే ప్రాంతాన్ని రాష్ట్రంలోని 76వ జిల్లాగా ప్రకటించింది. జాతర ప్రాంతంలో మొత్తం 41 ఘాట్లను యంత్రాంగం సిద్ధం చేసింది.

'అమృత స్నానం' రోజున వివిధ మార్గాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునే భక్తులను సంగమ్‌ ఘాట్‌లో ఎక్కువ రద్దీ లేకుండా సమీప ఘాట్‌లలోనే నిలిపివేస్తారు. 'అమృత స్నానం' కాకుండా మిగతా రోజుల్లో ఆరైల్ ఘాట్ నుంచి పడవల్లో 'సంగమ్‌ నోస్' చేరుకుని స్నానాలు చేస్తుంటారు.

కానీ 'అమృత స్నానం' రోజున ఘాట్‌ల వద్దే బోట్లను నిలిపివేస్తారు. దీంతో భక్తులు బోటు ద్వారా 'సంగమ్‌ నోస్' చేరుకోలేరు. ఇలా భక్తుల రద్దీని నియంత్రిస్తున్నారు.

'అమృత స్నానం' మొదటి రోజు భక్తులు బీబీసీతో మాట్లాడుతూ.. ఇతర ఘాట్‌ల నుంచి పడవలను ప్రభుత్వం నిలిపివేయడంతో సంగమ్‌ ఘాట్‌కు చేరుకోలేకపోయామని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)