మహా కుంభమేళాలో తొక్కిసలాట: 30 మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30మంది చనిపోయారు. బుధవారం రాత్రి 1.30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అనేకమంది గాయపడ్డారు.
మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ‘‘మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30మంది మృతి చెందారు. వీరిలో 25మందిని గుర్తించాం’ అని చెప్పారు.
అంతకుముందు ఘటనలో 12 మందికిపైగా మృతి చెందారని, తొక్కిసలాట ప్రదేశంలో మృతదేహాలను చూశానని పేరు వెల్లడించడానికి ఇష్టపడని హెల్త్ వర్కర్ ఒకరు ‘బీబీసీ ప్రతినిధి’ వికాస్ పాండేతో చెప్పారు.
పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.

ఫొటో సోర్స్, Getty Images
గాయపడిన వారిని ప్రయాగ్ రాజ్‌లోని ఆరైల్‌లో గల సెక్టార్ 24 ఉప-కేంద్ర ఆసుపత్రికి తీసుకువస్తున్నట్లు చూపుతున్న వీడియోను పీటీఐ వార్తాసంస్థ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది.
ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారని, పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారని, తక్షణ సహాయం అందించాలని సూచించారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన ఎక్స్ ఖాతాలో ఆయన ఈ ఘటన గురించి స్పందిస్తూ ‘‘ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ మేళాలో జరిగిన ఘటన అత్యంత విచారకరం. ఈ ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. దీతోపాటు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. బాధితులకు సాయం చేయడానికి స్థానిక అధికార యంత్రాంగం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది.’’ అని రాశారు.


ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
‘నడుచుకుంటూ వెళుతున్నాం.. జనం వెనుక నుంచి తోసుకొచ్చారు’
"సంగం రూట్లలో కొన్ని బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట ఏర్పడింది. కొంతమంది గాయపడ్డారు. అందరికీ చికిత్స అందుతోంది. పరిస్థితి అంత తీవ్రంగా లేదు" అని ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ఆకాంక్ష రాణా అన్నారు.
ఐఏఎన్ఎస్ వార్తాసంస్థతో ప్రత్యక్ష సాక్షి విద్యా సాహు మాట్లాడుతూ "మేం కర్ణాటకలోని బెల్గావి నుంచి వచ్చాం. మేం నడుచుకుంటూ వెళుతుండగా కొందరు వెనుక నుంచి మమ్మల్ని ముందుకు తోసేశారు. ఎదురుగా ఒక స్తంభం ఉంది, అందరూ దాని దగ్గర ఇరుక్కుపోయారు" అని తెలిపారు.
మహా కుంభమేళాలో ‘పుణ్యస్నానాలు’ కోసం బుధవారం 10 కోట్ల మంది రానున్నట్లు అంచనా.
ఈరోజు ఉదయం 6 గంటల వరకు 1.75 కోట్ల మంది ప్రజలు స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం ప్రకటించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. మొత్తంగా జనవరి 28 వరకు 19.94 కోట్ల మంది స్నానాలు చేసినట్లు ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














