మీర్‌పేట మర్డర్ కేసు: ‘‘ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా.. అనుకున్నాం’’ అని పోలీసు కమిషనరే అన్నారంటే..

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
(హెచ్చరిక: ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)
హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో వెంకట మాధవి అనే మహిళ మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. ఆమెను భర్త గురుమూర్తి అత్యంత దారుణంగా చంపినట్లుగా పోలీసులు చెప్పారు.
మాధవిని చంపి మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో గురుమూర్తి అత్యంత కిరాతకంగా వ్యవహరించారంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. జాతీయ మీడియాలోనూ రిపోర్టు అయ్యాయి.
ఒక మహిళ ఇంట్లో ఉంటే చాలా భద్రంగా ఉన్నానని భావిస్తారని, అలాంటి ఇంట్లోనే మాధవి దారుణంగా హత్యకు గురయ్యారని రాచకొండ పొలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు.
''ఇదొక అరుదైన ఘటన. విచారణలో తెలిసిన విషయాలతో.. ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా.. అని అనుకున్నాం. ఇలా జరగకపోయి ఉంటే బాగుండు కదా.. ఏదైనా మహత్యం జరిగి ఇంత దారుణం జరగకూడదని అనుకున్నాం. కానీ మా విచారణలో అత్యంత క్రూరంగా చంపినట్లుగా తేలింది'' అని సుధీర్ బాబు మీడియాకు చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
అసలేం జరిగిందంటే?
పుట్టా గురుమూర్తి, మాధవి దంపతులు హైదరాబాద్ శివారులోని మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు.
వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. దాదాపు 15 ఏళ్లపాటు గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్‌లో ప్రైవేటు సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నారు.
ఈ నెల (జనవరి) 18వ తేదీన మాధవి కనిపించడం లేదని ఆమె తల్లి సుబ్బమ్మ మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
''16వ తేదీ ఉదయం నా కుమార్తె మాధవి, భర్త గురుమూర్తికి గొడవ జరిగి మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. చుట్టుపక్కల, తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా కనిపించలేదు'' అని ఫిర్యాదులో పేర్కొన్నారు సుబ్బమ్మ.
దీంతో మీర్ పేట పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్ కేసు (81/2025) నమోదైంది. కేసు దర్యాప్తులో సీసీ కెమెరాలు పరిశీలించారు పోలీసులు.
''15వ తేదీ మాధవి, గురుమూర్తి ఇంటికి వచ్చారు. తర్వాత ఆమె ఆచూకీ లేదని తెలిసింది. సీసీ కెమెరాలు కూడా పరిశీలించాం. మాధవి తల్లిదండ్రులను విచారించినప్పుడు గురుమూర్తిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో విచారణ సాగింది'' అని మీర్‌పేట ఇన్ స్పెక్టర్ నాగరాజు బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, UGC
పోలీసులు ఏం చెప్పారంటే..
15వ తేదీ రాత్రి 10.41 గంటల ప్రాంతంలో మాధవి, గురుమూర్తి ఇంట్లోకి వెళ్లినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చినట్లుగా ఆధారాలు పోలీసులకు దొరకలేదు.
ఈ కేసులో పోలీసులకు సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలు కీలకంగా మారాయి. సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ రిపోర్టులతోపాటు జనవరి 28వ తేదీన గురుమూర్తి ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలం ఆధారంగా గురుమూర్తి హత్య చేసినట్లుగా నిర్ధరించామని పోలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు.
''ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య. క్షణికావేశంలో జరిగింది కాదు. ముందుగానే గురుమూర్తి తన అక్క ఇంట్లో ఇద్దరు పిల్లలను వదిలి వచ్చారు.14వ తేదీన గురుమూర్తి, మాధవి ఇంటికి తిరిగి వచ్చారు. తర్వాత 15వ తేదీ ఉదయం మళ్లీ వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చారు. 16వ తేదీ ఉదయం నిద్ర లేచాక హత్య చేయాలనే ఉద్దేశంతో మాధవితో గురుమూర్తి గొడవ పెట్టుకున్నారు. ఆ క్రమంలో మాధవిని గొడకేసి కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత గొంతు పిసికి చంపారు'' అని పోలీసు కమిషనర్ వివరించారు.
ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో గురుమూర్తి అత్యంత క్రూరంగా వ్యవహరించారని చెప్పారాయన.
ఇక్కడ రాయడానికి వీల్లేని విధంగా దారుణాతీదారుణంగా మాధవి డెడ్ బాడీని గురుమూర్తి మాయం చేసినట్లుగా చెప్పారు.
''ఇది చాలా అరుదైన ఘటన. అతను వ్యవహరించిన తీరును తెలుసుకుని మేమే ఆశ్చర్యపోయాం. ఆ వివరాలన్నీ నేనే మాటల్లో చెప్పలేకపోతున్నా. గురుమూర్తిని అరెస్టు చేసి విచారిస్తున్న క్రమంలో ఎక్కడా పశ్చాత్తాపమే కనిపించలేదు'' అని చెప్పారు పోలీసు కమిషనర్.
ఎనిమిది గంటలపాటు..
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గురుమూర్తి తన క్రూరత్వం కొనసాగించినట్లుగా పోలీసులు చెప్పారు.
''చాలా క్రూరంగా గురుమూర్తి వ్యవహరించారు'' అని సుధీర్ బాబు అన్నారు.
ఆ తర్వాత ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు బాత్రూంను డిటర్జెంట్, ఫినాయిల్‌తో శుభ్రం చేసినట్లుగా వివరించారు.
మాధవి అస్థికలు(బూడిద)ను టాయిలెట్‌లో వేసి నీటిని ఫ్లష్ చేయడం, తర్వాత మిగిలిన దాన్ని డస్ట్ బిన్ వేసినట్లుగా గుర్తించామని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత వాటిని సమీపంలోని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లుగా గురుమూర్తి చెప్పాడని అన్నారు.
ఇంట్లో వాసన రాకుండా ఉండేందుకు తలుపులు, కిటికీ తెరిచి ఉంచడంతో పాటు రూమ్ ఫ్రెషనర్ కొట్టినట్లుగా వివరించారు.
తర్వాత పిల్లలను ఇంటికి తీసుకు వచ్చినప్పటికీ, ఘటన జరిగిన బెడ్రూం వైపు వెళ్లకుండా గురుమూర్తి లాక్ చేసి పెట్టారని చెప్పారు.
మాధవి మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చినట్లుగా సుధీర్ బాబు వివరించారు.
గురుమూర్తి ఏమంటున్నాడంటే..
అరెస్టు చేసి తీసుకెళ్లుతున్న క్రమంలో గురుమూర్తితో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించింది. అతను స్పందించలేదు.
మీడియా ముందు హాజరుపరిచిన క్రమంలో ఆయనకు ముసుగు వేసి తీసుకువచ్చారు. ఘటనపై మాధవి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. వారు అందుబాటులోకి రాలేదు.
ఈ కేసులో కొన్ని వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాధవి మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో ఆయా వస్తువులను గురుమూర్తి వినియోగించారని చెప్పారు పోలీసులు
స్టవ్, కత్తి, రోలర్, రోలర్ స్టోన్, బకెట్, వాటర్ హీటర్, మాధవి బట్టలు, గురుమూర్తి వేసుకున్న నిక్కర్, ఫినాయిల్ బాటిల్, రూమ్ ఫ్రెషనర్, సర్ఫ్ ప్యాకెట్, యాసిడ్ బాటిల్, డోర్ మ్యాట్, స్క్రాప్ బకెట్, మోటార్ సైకిల్, రెండు ఫోన్లు సీజ్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు.
మాధవిని గురుమూర్తి ఇంత కిరాతంగా ఎందుకు చంపాడనే విషయంపై కారణాన్ని మాత్రం పోలీసులు స్పష్టంగా చెప్పలేదు.
హత్య మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లుగా చెబుతున్నారు. గురుమూర్తికి వివాహేతర సంబంధం ఉందా.. అని మీడియా ప్రశ్నించగా, అలాంటి వివరాలేమీ మా విచారణలో వెల్లడి కాలేదని సుధీర్ బాబు చెప్పారు.
‘మీడియా బాధ్యతగా ఉండాలి’
''కేసులో మీడియా బాధ్యతగా వ్యవహరించాలి. మహిళతో ఇంత క్రూరంగా వ్యవహరించినప్పుడు ఎంతో బాధ్యతగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మీడియా తన సొంత అభిప్రాయాలు చెప్పకుండా సహకరించాలి. ఈ కేసులో వీలైనంత త్వరగా ఛార్జ్ షీట్ దాఖలు చేసి కఠిన శిక్ష పడేలా చేస్తాం'' అని సుధీర్ బాబు అన్నారు.
గురుమూర్తి ఇంత క్రూరత్వానికి పాల్పడతాడని అనుకోలేదని అతనితో కలిసి పనిచేసే ఉద్యోగి ఒకరు చెప్పారు.
'' అంత కఠినంగా ఉండేవాడు కాదు. పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. సాధారణంగానే ఉండేవాడు. మాతోనూ మామూలుగానే మాట్లాడేవాడు'' అని చెప్పారు.
అయితే, మనిషి ప్రవర్తన ఒకేలా ఉంటుందని చెప్పలేమని పోలీసు కమిషనర్ అన్నారు.
''అతను భార్యతో క్రూరత్వంగా వ్యవహరించారు. చూడటానికి సాధారణంగా ఉన్నప్పటికీ, ప్రవర్తన దారుణంగా ఉంది. బయట మరోలా ఉన్నప్పటికీ ఇంట్లో మాత్రం కిరాతంగా ఉన్నారు'' అని అన్నారు.
ఇదే విషయంపై సైకాలజిస్టు అనిత ఆరె బీబీసీతో మాట్లాడారు.
''ఇదొక సైకోటిక్ నేచర్‌గా చెప్పవచ్చు. దానివల్ల ఎదుటి వ్యక్తిపై విపరీతమైన ద్వేషం, అనుమానం పెంచుకుంటారు'' అని ఆమె చెప్పారు.
హత్యకు ముందుగా ఎక్కువగా నిద్రపోవడం లేదా అస్సలు నిద్రపోకపోవడం, సరిగా తినకపోవడం, అడిగితే సమాధానం సరిగా చెప్పకపోవడం వంటివి గుర్తించవచ్చని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














