త్రివేణి సంగమం: తెలుగురాష్ట్రాల్లో ఈ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి,ఏయే నదులు కలుస్తాయి?

ఫొటో సోర్స్, K.Suhani
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా మహోత్సవం జరుగుతోంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వచ్చి అక్కడి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం గంగ, యమున, సరస్వతి నదుల సంగమంగా ప్రసిద్ధి పొందింది. అయితే, సరస్వతి నది ప్రస్తావన పురాణాల్లో ఉంది. కానీ అక్కడ సరస్వతి నది కనిపించదు. అది అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుందని పండితుల మాట.
ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి, ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. పునర్జన్మ నుంచి ముక్తి పొందడమే మోక్షంగా హిందువులు భావిస్తారు.
సాధారణంగా రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. అదే మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటారు. సంగమ స్నానాన్ని, ముఖ్యంగా త్రివేణి సంగమ స్నానాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ?
అయితే, ప్రయాగ్‌రాజ్‌లోనే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో త్రివేణి సంగమాలు ఉన్నాయి. ఇక్కడ మూడు నదులు లేదా ఉప నదులు కలుస్తూ సంగమ ప్రదేశంగా మారుతున్నాయి.
ఈ ప్రదేశాలను త్రివేణి సంగమంగా భావిస్తూ.. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రజల భక్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వాలు ఆ ప్రాంతాలను త్రివేణి సంగమంగా పేర్కొంటున్నాయి.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో త్రివేణి సంగమాలు ఎక్కడున్నాయి? ఆ ప్రాంతాల్లో ఏయే నదులు, ఉపనదులు కలుస్తున్నాయో తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, K.Suhani
తెలంగాణలో
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ గోదావరి, మంజీర, హరిద్ర నదులు కలుస్తాయి.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద పుట్టిన గోదావరి నది.. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.
ఇక్కడ గోదావరి నదిలో హరిద్ర, మంజీర నదులు కలుస్తాయి. తెలంగాణలో గోదావరి నదిలో కలిసే మొదటి ఉపనది మంజీర. ఇది కందకుర్తి వద్దే గోదావరితో కలుస్తుంది.
తెలంగాణలో ప్రముఖ త్రివేణి సంగమాల్లో ఇదొకటి అని తెలంగాణ దేవాదాయ శాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ త్రివేణి సంగమం వద్ద భక్తుల కోసం 3 ఘాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇక్కడ గోదావరి గట్టుపైన ఓ పురాతన శివాలయం ఉంది. దీన్ని నల్లరాతితో నిర్మించినట్లు దేవాదాయ శాఖ పేర్కొంది. దీంతో పాటు గ్రామంలో రామాలయం, కేశవ స్మృతి మందిరం, స్కంద మాతాలయం కూడా ఉన్నాయి. కందకుర్తిని కాశీ, రామేశ్వరాలతో సమానమైన పుణ్యక్షేత్రంగా కొందరు భక్తులు భావిస్తారు.

ఫొటో సోర్స్, K.Suhani
కాళేశ్వరం త్రివేణి సంగమం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలంలో ఉన్న కాళేశ్వర శైవక్షేత్రం వద్ద కూడా త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పురాణాల్లో పేర్కొన్న సరస్వతి నది కలుస్తుందని భక్తుల నమ్మకం.
ఇక్కడ సరస్వతి నదికి ఈ ఏడాది మే 15 నుండి 26 వరకు పుష్కరాలు నిర్వహిస్తామని, దీనికోసం నిధులు కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఇక్కడున్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో శివుడికి (ముక్తీశ్వరుడికి), యమధర్మరాజుకి (కాళేశ్వరుడికి) భక్తులు పూజలు చేస్తారు.
ఈ త్రివేణి సంగమం వద్ద స్నానం ఆచరించి, శివుణ్ని పూజిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఫొటో సోర్స్, K.Suhani
కాళేశ్వరంలో సరస్వతి నదికి పుష్కరాలు
ఎక్కడ రెండు నదులు కలిసినా అక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పురాణాలు చెబుతున్నాయని, కాళేశ్వర క్షేత్ర వర్ణన కూడా పురాణాల్లో ఉందని కాళేశ్వరానికి చెందిన డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ చెప్పారు. పూర్వం నుంచి ఇక్కడ సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్నాయని చెప్పారు.
ప్రయాగ్‌రాజ్‌లోని సరస్వతి నదిని, కాళేశ్వర క్షేత్రంలోని సరస్వతి నదిని ఒకటిగానే భావిస్తుంటారన్నారు. కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి ఆలయం ఉండటం వల్ల కూడా సరస్వతి నది ఉన్నట్టుగా భావిస్తుంటారన్నారు.
రాజస్తాన్‌లోని పుష్కర్‌లో, హిమాచల్‌లోనూ సరస్వతి నది ఉందని చెబుతుంటారని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, https://srikakulam.ap.gov.in/religious-tourism/
సంగం
నాగావళి, వేగావతి, సువర్ణ ముఖి నదుల సంగమ ప్రదేశమే 'సంగం'.
ఈ త్రివేణి సంగమ ప్రదేశం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉంది. అలహాబాద్‌లోని త్రివేణి సంగమానికి సమానంగా దీన్ని కొందరు భక్తులు చూస్తారు.
శ్రీకాకుళం పట్టణానికి ఈ ప్రాంతం 56 కి.మీ. దూరంలో ఉంది. సంగమేశ్వరుడి పంచ లింగక్షేత్రాలలో ఇదొకటి అని శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ వెబ్‌సైట్ పేర్కొంది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడకు వేలాదిమంది భక్తులు వస్తారు.
సంగమేశ్వరం
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో గల సంగమేశ్వరాన్ని హిందువులు ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ కృష్ణా నదిలో తుంగభద్ర, భవనాసి నదులు కలుస్తాయి.
వరాహ పర్వతాల్లో పుట్టిన తుంగ, భద్ర అనే రెండు నదులు కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాలో ఒకదానికొకటి కలిసి తుంగభద్రగా ఏర్పడతాయి. ఆ తర్వాత కర్ణాటకలో ప్రవహిస్తూ.. కర్నూలు జిల్లా కొసిగి ప్రాంతం వద్ద తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి, సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
అయితే ఈ ప్రాంతాన్ని సప్తనదీ సంగమస్థానం అని, తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మలపహరిణీ, భీమాహారతి, భవనాసి నదులు ఇక్కడ కలుస్తాయని కూడా చెబుతుంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














