బాయ్‌ఫ్రెండ్‌కు విషమిచ్చి చంపిన యువతికి మరణ శిక్ష విధించిన కోర్టు, ప్రత్యక్ష ఆధారాలు లేకున్నా నేరం ఎలా రుజువైందంటే..

గ్రీష్మ, షారోన్‌ రాజ్
ఫొటో క్యాప్షన్, గ్రీష్మ, షారోన్‌ రాజ్
    • రచయిత, ఎస్ మహేష్
    • హోదా, బీబీసీ కోసం

కేరళలో స్థానిక పోలీసులు ఓ హత్య కేసుపై జరిపిన విచారణ, కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

విషమిచ్చి తన ప్రియుడిని చంపిన కారణంతో 24 ఏళ్ల గ్రీష్మ అనే మహిళకు కేరళలోని సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. కోర్టు తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం, 2022లో గ్రీష్మ తన బాయ్‌ఫ్రెండ్ షారోన్‌కు విషం ఇచ్చి హత్య చేసింది. అయితే, ఈ కేసులో ఆసక్తికర విషయం ఏంటంటే.. మరణ శిక్ష ప్రకటించే సమయంలో కోర్టు డిజిటల్ సాక్ష్యాధారాలను అంగీకరిస్తున్నట్లు తెలిపింది.

ఈ నేరాన్ని రుజువు చేసేందుకు పోలీసులు గూగుల్ క్లౌడ్ ద్వారా సేకరించిన డిజిటల్ సాక్ష్యాధారాలు కీలకంగా నిలిచాయి.

''ఫిజికల్ ఆధారాలు లేకపోవడంతో, ప్రాసంగిక సాక్ష్యం (సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్), డిజిటల్ సాక్ష్యాలను చూపించారు. ఈ సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, గ్రీష్మకు శిక్ష విధించింది'' అని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ తెలిపారు.

అసలేంటి ఈ కేసు?

గ్రీష్మ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా దేవికోడ్ గ్రామం. అప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్‌ చదువుతున్నారు.

షారోన్ రాజ్ కేరళలోని పరసళై ప్రాంతానికి చెందిన వ్యక్తి. హత్య జరిగినప్పుడు ఆయన కన్యాకుమారిలోని ఒక కాలేజీలో బీఎస్సీ రేడియాలజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ తెలిపారు.

గ్రీష్మ, షారోన్ రాజ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. అదే సమయంలో, గ్రీష్మ తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో సంబంధం కుదిర్చారు.

ఆర్మీలో పనిచేసే వ్యక్తితో గ్రీష్మకు ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. ఈ విషయాన్ని షారోన్ రాజ్‌కు చెప్పిన గ్రీష్మ, తనతో సంబంధాన్ని తెంచుకోవాలని కోరారు. కానీ, దానికి షారోన్ రాజ్ అంగీకరించలేదు.

తన తల్లిదండ్రులు అంగీకరించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని గ్రీష్మ నిర్ణయించుకున్నారు. దీనికి షారోన్ రాజ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. షారోన్ అసలు వినలేదు.

తన పెళ్లికి, భవిష్యత్‌లో తన వైవాహిక జీవితానికి షారోన్ రాజ్ అడ్డు పడతారని భయపడిన గ్రీష్మ, ఆయన్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

షారోన్ రాజ్‌ను ఇంటికి పిలిచిన గ్రీష్మ, ఆయన తినే ఆహార పదార్థంలో విషం కలిపి, ఆయన మరణించేలా చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్‌పీ) రసిత్ వీ.టీ
ఫొటో క్యాప్షన్, క్రాస్-ఎగ్జామినేషన్ సమయంలో, గ్రీష్మ జరిగిన విషయమంతా పోలీసులకు చెప్పారని డీఎస్‌పీ రసిత్ వీ.టీ తెలిపారు.

నిజమెలా బయటపడింది?

''తొలుత పరసళై పోలీసులు అనుమానాస్పద మరణంగా ఎఫ్‌ఆర్ఐ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు'' అని బీబీసీతో డీఎస్పీ రసిత్ వీ.టీ తెలిపారు.

షారోన్ మరణం విషయంలో గ్రీష్మపై ఆయన బంధువులు అనుమానం వ్యక్తం చేసినట్లు చెప్పారు.

ఆ తర్వాత కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

క్రాస్-ఎగ్జామినేషన్‌లో గ్రీష్మ నిజమంతా చెప్పారని రసిత్ వీ.టీ తెలిపారు. పోలీసుల విచారణలో ఆమె దేన్నీ దాచలేదన్నారు.

గ్రీష్మ తల్లిని, ఆమె అంకుల్‌ను ప్రశ్నించినప్పుడు, షారోన్ రాజ్‌కు విషమిచ్చినట్లు నిర్ధరణ అయ్యిందని తెలిపారు.

పోలీసుల కస్టడీలో ఆత్మహత్యాయత్నం

పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడే గ్రీష్మ ఆత్మహత్యాయత్నం చేశారు.

''గ్రీష్మను కస్టడీలోకి తీసుకున్నాం. ఆ సమయంలో, గ్రీష్మ టాయిలెట్ శుభ్రం చేసేందుకు వాడే రసాయనం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ తర్వాత ఆమె నిజం ఒప్పుకున్నారు. మొత్తం విషయాన్ని జడ్జికి చెప్పారు'' అని రసిత్ తెలిపారు.

''మరో వ్యక్తితో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయిస్తున్నట్లు తెలుసుకున్నప్పుడు, తనతో బ్రేకప్ చేసుకోవాలని గ్రీష్మ, షారోన్ రాజ్‌ను కోరారు. దానికి షారోన్ రాజ్ ఒప్పుకోలేదు. దీంతో, విషం ఇచ్చి, ఆయన్ను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నారు'' అని డీఎస్‌పీ చెప్పారు.

గ్రీష్మ చెప్పిన ఆధారాలన్నింటినీ సేకరించి, కోర్టుకు సమర్పించినట్లు డీఎస్‌పీ తెలిపారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీ.ఎస్ వినీత్ కుమార్
ఫొటో క్యాప్షన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీ.ఎస్ వినీత్ కుమార్

మొబైల్ డేటా డిలీట్

''ఈ కేసులో మేం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఏంటంటే.. ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవు. డిజిటల్, టెక్నికల్, సైంటిఫిక్ సాక్ష్యాధారాల సాయంతో ప్రాసంగిక సాక్ష్యం (సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్) సేకరించి కోర్టులో నిరూపించాల్సి వచ్చింది'' అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీ.ఎస్ వినీత్ కుమార్ చెప్పారు.

''అంతకుముందు పండ్ల రసంలో జ్వరం మాత్రలను ఎక్కువగా కలిపి షారోన్ రాజ్‌ను హత్య చేసేందుకు గ్రీష్మ ప్రయత్నించింది. ఆమె తన మొబైల్ ఫోన్‌లో దీనికి సంబంధించిన సమాచారం కోసం వెతికింది. కానీ, షారోన్ రాజ్ ఆ రోజు బతికి బయటపడ్డారు. ఎందుకంటే, జ్యూస్‌ చేదుగా ఉందని, పూర్తిగా తాగలేదు'' అని న్యాయవాది వినీత్ కుమార్ తెలిపారు.

ఆ తర్వాత షారోన్ రాజ్‌ను చంపేందుకు గ్రీష్మ మరో ప్లాన్ వేశారు.

''2022 అక్టోబర్ 14న గ్రీష్మ తన మొబైల్ ఫోన్‌లో వ్యవసాయంలో వాడే అత్యధిక ప్రమాదకరమైన పురుగుమందు గురించి వెతికింది. మనుషుల శరీరంపై ఇదెలా పనిచేస్తుంది, ఎలా ఇవ్వాలో వెతికింది. ఆ పురుగుమందు వాళ్ల ఇంట్లో ఉంది. ఆ రాత్రి షారోన్ రాజ్‌ను గ్రీష్మ తమ ఇంటికి ఆహ్వానించింది. పొరిడ్జ్‌లో ఆ పురుగుమందు కలిపి ఇచ్చింది. దాన్ని తాగిన తర్వాత షారోన్ రాజ్‌కు వాంతులు, విరేచనాలు అయ్యాయి. షారోన్ రాజ్ చికిత్స కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీలో అడ్మిట్ అయ్యారు. 2022 అక్టోబర్ 25న చనిపోయారు'' అని వినీత్ కుమార్ వివరించారు.

షారోన్ రాజ్ చనిపోయినట్లు తెలుసుకున్న గ్రీష్మ, పోలీసులు వచ్చి తనను ప్రశ్నిస్తారని అనుమానించి, ముందుగానే తన మొబైల్ ఫోన్‌లోని డేటా అంతా డిలీట్ చేశారు. డిలీట్ చేసిన సమాచారాన్ని మొబైల్ ఫోన్ నుంచి రికవరీ చేయొచ్చా లేదా అనే దాన్ని కూడా సెర్చింజిన్ ద్వారానే గ్రీష్మ తెలుసుకున్నట్లు వినీత్ కుమార్ చెప్పారు.

విచారణ సందర్భంగా, గ్రీష్మ మొబైల్ ఫోన్‌ను పోలీసులు పరిశీలించారు. సమాచారం అంతా డిలీట్ చేసి ఉంది. ఆ తర్వాత మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

ఆమె తన ఫోన్‌లో ఏం చేశారన్న సమాచారం అంతా గూగుల్ క్లౌడ్‌లో రికార్డు అయిందని, దాన్నంతా తిరిగి పొందగలిగినట్లు వినీత్ కుమార్ తెలిపారు.

ఆమె మొబైల్ ఫోన్‌ నుంచి సేకరించిన వాట్సాప్ సంభాషణలు, వీడియో కాల్స్, సెర్చింజిన్ డేటాను రికవరీ చేసి, డిజిటల్ సాక్ష్యాధారాలుగా కోర్టులో సమర్పించారు.

''ఘటన జరిగిన రోజు గ్రీష్మ ఇంటికి షారోన్ రాజ్ వెళ్లినట్లు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరా ఆధారంగా కోర్టులో నిరూపించాం. డిజిటల్ సాక్ష్యాధారాలుగా ఆ ఇద్దరి వాట్సాప్ సంభాషణలు, ఆ ఇద్దరు వాడిన పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, సీడీలోని సమాచారం కోర్టుకు ఇచ్చాం'' అని వినీత్ కుమార్ చెప్పారు.

విషం అవశేషాలు ఎందుకు లేవంటే..

''షారోన్ రాజ్‌కు విషం ఇచ్చి గ్రీష్మ హత్య చేసినట్లు విచారణలో తేలింది. కానీ, శవ పరీక్షలో మాత్రం ఆయన శరీరంలో ఎలాంటి విష నమూనాలు దొరకలేదు. ఎందుకంటే, విష ప్రయోగం తర్వాత షారోన్ రాజ్‌ 11 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ చికిత్స సమయంలో, షారోన్ రాజ్‌కు మూడుసార్లు డయాలసిస్ చేశారు. దీనివల్ల, రక్తం పూర్తిగా ప్యూరిఫై అయింది. ఆయన శరీరంలో ఎలాంటి విష నమూనాలు లేవు'' అని వినీత్ కుమార్ చెప్పారు.

ప్రాసంగిక సాక్ష్యాలకు అనుగుణంగా కోర్టులో తాము ఇవన్నీ వివరించి, ఆమెను దోషిగా నిరూపించాల్సి వచ్చిందని తెలిపారు.

500 పేజీల తీర్పు

2025 జనవరి 20న ఈ కేసు తీర్పును తిరువనంతపురం జిల్లా నెయ్యట్టింకర అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి ఏ.ఎం బషీర్ వెల్లడించారు. ఈ తీర్పులో గ్రీష్మకు మరణ శిక్ష, ఆమె అంకుల్ నిర్మల్ కుమారన్ నాయర్‌కు‌ మూడేళ్ల జైలు శిక్ష విధించారు.

పోలీసులు దర్యాప్తు చేసిన విధానాన్ని జడ్జి మెచ్చుకున్నారు.

''షారోన్ రాజ్, గ్రీష్మ ఇద్దరి వయసూ ఒకటే. గ్రీష్మను షారోన్ రాజ్ ఎంతగానో ప్రేమించారు. ఆమెను గుడ్డిగా నమ్మారు. కానీ, గ్రీష్మ ఆయన్ను మోసం చేశారు'' అని జడ్జి తన తీర్పులో చెప్పారు.

''ఆస్పత్రి బెడ్‌పై ఉన్న షారోన్ రాజ్ ఆ సమయంలో కూడా గ్రీష్మకు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. గ్రీష్మను శిక్షించాలని కోరుకోలేదు. ఆమె చేసింది చాలా క్రూరమైన నేరం. ఒక అమాయకపు అబ్బాయి దారుణంగా హత్యకు గురయ్యారు'' అని అన్నారు.

''గ్రీష్మ ఇచ్చిన విషం వల్ల షారోన్ అంతర్గత అవయవాలు కిడ్నీలు, కాలేయం, ఊపరితిత్తులు పూర్తిగా పాడైపోయాయి. ఆయన 11 రోజులు ఆస్పత్రిలో కనీసం మంచినీళ్లు కూడా తాగలేకపోయారు. ఆ కాలేజీ విద్యార్థి స్వచ్ఛమైన ప్రేమ హత్యకు గురైంది'' అని జస్టిస్ బషీర్ తన తీర్పులో రాశారు.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన కోర్టు, గ్రీష్మకు మరణ శిక్ష విధించింది.

షిమోన్ రాజ్
ఫొటో క్యాప్షన్, షారోన్ రాజ్ సోదరుడు డాక్టర్ షిమోన్ రాజ్

‘అమ్మ ప్రార్థనలు ఫలించాయి’

''మా సోదరుడిని చంపిన వారికి ఉరిశిక్ష పడాలని మేం కోరుకున్నాం. మేం కోరుకున్నట్లే ఈ కేసులో తీర్పు వచ్చింది. తీర్పు విన్న తర్వాత మా అమ్మకు చాలా ఉపశమనంగా అనిపించింది. మా సోదరుడు ఎప్పటికీ మాతో ఉండడన్న బాధను మర్చిపోలేం. ఆమెకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు మాకు రిలీఫ్‌ను కలిగించింది'' అని చనిపోయిన షారోన్ రాజ్ సోదరుడు డాక్టర్ షిమోన్ రాజ్ బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)