ఓ సిగరెట్ పీక 30 ఏళ్ల తరువాత హంతకుడిని ఎలా పట్టించిందంటే..

ఫొటో సోర్స్, Crown Office
- రచయిత, పాల్ ఓహారే
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో మేరీ మెక్‌లాఫ్లిన్ అనే మహిళ హత్య కేసు పరిష్కరించడానికి 30 ఏళ్లకు పైగా ప్రయత్నించిన పోలీసులకు ఓ సిగరెట్ పీక దారిచూపింది.
పదకొండుమంది పిల్లలకు తల్లి అయిన మేరీ మేక్ లాఫ్లిన్‌ను హత్య చేయడానికి ఉపయోగించిన గౌను పట్టీలో నిందితుడి డీఎన్‌ఏతో సరిపోయే ఆనవాళ్ళు లభించాయి.
గ్లాస్గో పశ్చిమాన 58 ఏళ్ల మేరీ శవమై కనిపించినప్పుడు ప్రధాన నిందితుడని అనుమానించిన గ్రాహం మెక్‌గిల్ ఎడిన్‌బర్గ్ జైలులో ఖైదీగా ఉండటం ఈ కేసును విచారిస్తున్న డిటెక్టివ్‌లను తికమక పెట్టింది.

బీబీసీ కొత్త డాక్యుమెంటరీ మర్డర్ కేస్: ది హంట్ ఫర్ మేరీ మెక్ లాఫ్లిన్స్ కిల్లర్ ఈ కేసు దర్యాప్తు ప్రక్రియను, మేరీ మరణం ఆమె కుటుంబంపై చూసిన ప్రభావాన్ని వివరించింది.
‘‘కొన్ని హత్యలు సవాలుగా నిలిచిపోతుంటాయి’’ అని చెప్పారు సీనియర్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ జోఅన్నేకోచర్నే.‘‘నేను దర్యాప్తు చేసిన కేసులలో మేరీది అత్యంత దారుణమైనది’’ అని ఆమె చెప్పారు.
మేరీ తన చివరి రాత్రిని హైలాండ్ పబ్ (ప్రస్తుతం డక్ క్లబ్)లో డొమినోస్ ఆడుతూ మద్యం సేవిస్తూ గడిపారు. రాత్రి 10 గంటల 15 నిమిషాలకు బార్ నుంచి బయలుదేరి, దాదాపు కిలోమీటరు దూరంలోని తన ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లారు. మధ్యలో డుంబార్టోన్ రోడ్ వద్ద ఒక చిప్స్ షాప్‌లోకి వెళ్లి కొన్ని స్నాక్స్, సిగరెట్లు కొన్నారు. షాపు ఉద్యోగులతో మేరీ జోకులు కూడా వేశారు.
ఆ రోజు రాత్రి మేరీ తన షూను చేతులతో పట్టుకుని ఉత్తకాళ్లతో నడుచుకుంటూ వెళుతుంటే ఓ అపరిచితుడు ఆమెను అనుసరిస్తున్నట్టు చూశానని మేరీని బాగా ఎరిగిన టాక్సీ డ్రైవర్ ఒకరు చెప్పారు.


ఫొటో సోర్స్, ఫైర్ క్రెస్ట్
ఇంట్లోకి ఎలా వచ్చాడో?
మేరీ ఇంట్లోకి హంతకుడు ఎలా ప్రవేశించాడనే వివరాలు పోలీసులకు తెలియలేదు. పైగా అతను బలవంతంగా మేరీ ఇంట్లోకి చొరబడినట్టుగా ఆధారాలు కూడా ఏవీ కనిపించలేదు.
కానీ అతను ఇంటి లోపలకు వెళ్లగానే, తన కంటే వయసులో రెండింతలు పెద్దదైన ఆమె మీద క్రూరమైన దాడికి దిగాడు.
అది మొబైల్ ఫోన్లు లేని కాలం.అందుకే మూడు వేరు వేరు ప్రాంతాల్లో నివసించే తన అతిపెద్ద కుటుంబసభ్యులను మేరీ తరచుగా సంప్రదించలేకపోయేవారు.
కానీ వారానికి ఒకసారి ఆమె కొడుకుల్లో ఒకరైన మార్టిన్ కల్లెన్ తల్లిని చూసేందుకు మేరీ ఇంటికి వస్తూ ఉండే వారు.
అక్టోబర్2 , 1984న మేరీని చూసేందుకు ఆమె 24 ఏళ్ళ కొడుకు మార్టిన్ కుల్లెన్ వెళ్లాడు. ఇంటిలోపలకు వెళ్లిన మార్టిన్‌కు మేరీ పరుపుపై శవమై కనిపించింది. ఆమె పళ్ళ సెట్టు నేలపై పడి ఉంది. మేరీ పబ్‌కి వేసుకెళ్లిన గ్రీన్ డ్రెస్ అస్తవ్యస్తంగా ఉంది.

ఫొటో సోర్స్, ఫైర్ క్రెస్ట్
మాజీ సీనియర్ విచారణాధికారి ఇయాన్ విషార్ట్ నేరం జరిగిన తీరును ' అత్యంత దారుణం' అని చెప్పారు.
మేరీ మృతదేహాన్ని కనుగొన్న సమయానికంటే ఐదురోజుల ముందే ఆమెను గొంతునులిమి చంపారని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించింది.
హత్య అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు డిటెక్టివ్‌లు వెయ్యికి పైగా వాంగ్మూలాలను సేకరించినా వారికెటువంటి పురోగతి కనిపించలేదు. దీంతో మేరీ కేసును మూసివేస్తున్నట్టు ఆ మరుసటి ఏడాది పోలీసు అధికారులు ఆమె కుటుంబానికి తెలిపారు. కానీ ఒక సీఐడీ అధికారి మాత్రం ఆశ కోల్పోవద్దని మేరీ కుమార్తె గిని మెక్ గవిన్‌ను కోరారు.

పిల్లల్లో ఎవరైనా చేశారా?
మేరీకి ఇద్దరు భర్తల ద్వారా 11 మంది పిల్లలున్నారు. స్థానిక కమ్యూనిటీలో ఆమె అందరికి తెలిసిన వ్యక్తి. ఆమెకు మొదటి భర్త ద్వారా ఆరుగురు, రెండో భర్త ద్వారా ఐదుగురు పిల్లలు ఉన్నారు.
అయితే మొదటి ఆరుగురు పిల్లలను మేరీ వదిలేయడంతో కుటుంబంలో ఎప్పుడూ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉండేవని మేరీ కుమార్తె జీనా బీబీసీ డాక్యుమెంటరీలో చెప్పారు.
కుటుంబంలోనే ఎవరో హంతకుడు ఉన్నాడని భావించానని ఆమె చెప్పారు. తన తల్లి హత్యపై పుస్తకం రాసిన జీనా తన అనుమానాలను పోలీసులతోనూ పంచుకున్నారు. జీనా అనుమానాలతో ఆమె సోదరులు కూడా ఏకీభవించేవారు.
‘‘మా పిల్లల్లో ఒకరు ఈ పని చేసి ఉంటారు, లేదా ఈ హత్య గురించి ఎవరికీ తెలియని సమాచారం మాలో ఒకరికి తెలిసి ఉంటుందని మేమంతా అనుమానించాం, కానీ నిరూపించలేకపోయాం’’ అని జీనా అన్నారు.

ఫొటో సోర్స్, Crown Office
టెక్నాలజీ సాయం
నిందితుడెవరో కనిపెట్టడానికి 2008 వరకు నాలుగుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2014లో ఐదోసారి ఈ కేసు పునర్విచారణ ప్రారంభించినప్పుడు ముఖ్యమైన విషయాలు కనుగొనగలిగారు. స్కాట్లాండ్‌లోని నేర విచారణా కేంద్రంలో అందుబాటులోకి వచ్చిన డీఎన్ఏ విశ్లేషణ సౌకర్యం వల్ల ఇది సాధ్యమైంది.
గతంలో నిపుణులు కేవలం 11 డిఎన్ఏ ఆనవాళ్లను మాత్రమే కనుగొనగలిగేవారు, కానీ కొత్త సాంకేతికతో 24 ఆనవాళ్లను కనుక్కోగలుగుతున్నారు. చిన్న సైజులు, లేదా తక్కువ స్పష్టత ఉన్న నమూనాల నుంచి ఫలితాలు రాబట్టడంలో ఉన్న ఇబ్బందుల నుంచి ఈ నవీన సౌకర్యం ఊరట కలిగించింది.
'కాలంలో వెనక్కి వెళ్లి ఇక ఆశలు మిగలని ఎన్నో కేసులకు న్యాయం చేకూర్చే అవకాశాన్ని ఈ సాంకేతికత సాధ్యం చేసిందని' స్కాటిష్ పోలీస్ అథారిటీలో ఫోరెన్సిక్స్ డైరెక్టర్ టామ్ నెల్సన్ 2015లో అన్నారు.

ఫొటో సోర్స్, ఫైర్ క్రెస్ట్
విలువ తెలియకపోయినా..
ఘటనాస్థలం నుంచి 1984లో సేకరించిన శాంపిల్స్‌లో మేరీ జుట్టు, గోళ్లు, సిగరెట్ పీకలు ఉన్నాయి.
పేపర్ సంచులలో 30 ఏళ్ళ నుంచి భద్రపరిచిన ఈ ఆధారాలను పరిశీలించాల్సిన బాధ్యతను స్కాట్లాండ్ నేర విచారణా కేంద్రంలోని కొచర్నేకు అప్పగించారు .
‘‘ఆ సమయంలో డీఎన్ఏ ప్రొఫైలింగ్ అంటే ఏమిటో వారికి తెలియదు’’ ఈ శాంపిల్స్ సామర్థ్యం ఏమిటో కూడా వారికి తెలియదు. బహుశా ఇవి ఎంత ఉపయోగకరమనే విషయం అప్పట్లో వారికి తెలిసి ఉండదు’’ కానీ ఆ సమయంలో విచారణ జరిపిన సిబ్బంది వీటిని భద్రపరచడంలో అద్భుతమైన ముందుచూపును ప్రదర్శించారని కొచర్నే కొనియాడారు.

ఫొటో సోర్స్, ఫైర్ క్రెస్ట్
సిగరెట్ పీక దారిచూపింది
విచారణాధికారులు లివింగ్‌రూమ్‌లోని కాఫీటేబుల్‌పై ఉన్న యాష్‌ట్రే నుంచి ఎంబసీ సిగరెట్ పీకను కనుగొనడం ద్వారా కేసులో ముఖ్యమైన లీడ్ దొరికినట్టయింది.
మేరీ సహజంగా వుడ్ బైన్ బ్రాండ్ సిగరెట్లను తాగుతారు. కానీ ఘటనాస్థలంలో ఎంబసీ బ్రాండ్ సిగరెట్ పీక దొరకడంతో దర్యాప్తు బృందానికి అనుమానం వచ్చి డిఎన్ఏ పరీక్షకు పంపించారు. అలా ఈ కేసులో ఆధారాలు దొరకసాగాయి.
సాంకేతికత అభివృద్ధి కారణంగా డీఎన్ఏ ఆనవాళ్లను గుర్తించగలిగాం అని కొచర్నే చెప్పారు.
‘‘అప్పుడే మేం గాల్లో ఎగిరిగంతేసేలాంటి క్షణాన్ని అనుభవించాం. ఒకప్పుడు ఎటువంటి ఆనవాళ్లు అందించలేని సిగరెట్ పీక ఇప్పుడు పూర్తిస్థాయి డీఎన్ఏ ప్రొఫైల్‌ను అందించడానికి పనికి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు చోటుచేసుకొని పరిణామం ఇది. కేసుకు సంబంధించి మాకు మొదటి ఫోరెన్సిక్ ఆధారం దొరికింది' అని ఆమె బీబీసీ డాక్యుమెంటరీకి చెప్పారు.

ఫొటో సోర్స్, ఫైర్ క్రెస్ట్
వేలాది ప్రొఫైల్స్‌తో పోల్చి చూసి..
ఆ సిగరెట్ పీకను స్కాటిష్ డీఎన్ఏ డేటాబేస్ సెంటర్‌కు పంపించారు. అక్కడ దానిని వేలాదిమంది నేరస్తుల ప్రొఫైల్స్‌తో పోల్చి చూశారు. ఫలితాలను ఈమెయిల్ ద్వారా కొచర్నేకు పంపారు. ఆ మెయిల్‌ను ఆమె ఆతృతగా కిందకు జరుపుతూ ‘‘డైరక్ట్ మ్యాచ్’ అని టిక్ చేసి ఉన్న పేరును చూశారు కోచర్నే. ఆ సమయంలో నా నా శరీరం రోమాంచితమైంది' అని ఆమె చెప్పారు.
‘ఆ డీఎన్ఏ గ్రాహం మెక్‌గిల్‌ది అని తెలిసింది. నా దగ్గరకు వచ్చిన మెయిల్ ఫామ్‌ను చూసినప్పుడు అతనిపై అనేక లైంగిక వేధింపుల కేసులు ఉన్నట్టు తెలిసింది’ అని తెలిపారు. 30 ఏళ్ళ తరువాత డిఎన్ఏ ప్రొఫైల్ కు సరిగ్గా మ్యాచ్ అయిన వ్యక్తి దొరికారు' అని కొచర్నే వెల్లడించారు.

ఫొటో సోర్స్, Google
నిందితుడు జైల్లో ఉన్నాడే..
హంతకుడు ఎవరో తెలిసినా దర్యాప్తు అధికారులకు మరో చిక్కుముడి ఎదురైంది. మేరీ హత్యకు గురయ్యే సమయానికి, నిందితుడిగా భావిస్తున్న మెక్‌గిల్ అత్యాచారం, అత్యాచార యత్నాలపై శిక్ష అనుభవిస్తూ జైలులో ఉన్నాడు.
పైగా మేరీ చనిపోయిన 9 రోజుల తరువాత అంటే అక్టోబర్ 5, 1984న అతను జైలు నుంచి విడుదలైనట్టుగా రికార్డులు చెబుతున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు మాజీ డిటెక్టివ్ కెన్నీ మెక్ క్యూబిన్ నడుం బిగించారు. మరింత బలమైన ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించాలని కొచర్నేకు కూడా ఆదేశాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, ఫైర్ క్రెస్ట్
గౌను పట్టీపై ఆనవాళ్లు
మరో సారి రంగంలోకి దిగిన కొచర్నేకు ఒక ఆలోచన వచ్చింది - మేరీ గొంతు నులమడానికి వాడిన డ్రెస్సింగ్ గౌను పట్టీ గురించిన ఆలోచన అది. కచ్చితంగా నిందితుడి డీఎన్ఏ ఆనవాలు ఆ పట్టీపై ఉండి ఉంటుందని ఆమె బలంగా నమ్మారు. దీంతో మేరీ తన ల్యాబ్‌లో ఫ్లోరోసెంట్ లైటు వెలుతురులో మెల్లిగా ఆ గౌను మడతలు విప్పి, అందులోని పట్టీని బయటకు తీశారు.
‘‘మేరీ గొంతు నులమడానికి హంతకుడు ఉపయోగించిన గౌనుపట్టీపై మాకు కీలకమైన డీఎన్ఏ ఆధారం దొరికింది’’ అని కోచర్నే చెప్పారు.
‘‘అతను మేరీ మెడ నులమడానికి ఆ గౌను పట్టీ ఉపయోగించాడు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, ఫైర్ క్రెస్ట్
ఓ ఎంట్రీ కేసును మలుపు తిప్పింది
మేరీ గ్రీన్ డ్రెస్ మీద గ్రాహం వీర్యం జాడలు కూడా దొరికాయి. కానీ దోషనిర్ధారణ చేయడానికి ఫోరెన్సిక్ ఆధారాలు సరిపోవు అని మెక్ క్యూబిన్ అన్నారు.
'మీ దగ్గర ఉన్న ఎలాంటి డిఎన్ఏ ఆధారం ఉందన్నది అంత ముఖ్యమైన విషయమే కాదు’’
‘‘తాను జైల్లో ఉంటే హత్య ఎలా చేయగలను అనే వంక అతని దగ్గర ఉంది’’
మేరీ హత్యకు గురైన సమయంలో ఎడిన్‌బర్గ్ జైలును పునర్‌నిర్మిస్తున్నారు. పైగా అది కంప్యూటర్ కాలం కాదు కాబట్టి అప్పటి పత్రాలు దొరకడం కష్టంగా మారింది. కానీ ఈ కేసును ఎలాగైనా పరిష్కరించాలనే మెక్‌క్యూబిన్ పట్టుదల ఆయనను ఎడిన్‌బర్గ్ నడిబొడ్డున ఉన్న నేనషల్ రికార్డ్స్ ఆఫ్ స్కాట్లాండ్‌వైపు నడిపించింది. అక్కడ ఆయనకి ఎడిన్‌బర్గ్ జైలు జర్నల్స్ దొరికాయి.
అందులోని ఓ చిన్న ఎంట్రీ కేసు మొత్తాన్ని మలుపు తిప్పింది.
జి మెక్ గిల్ అనే పేరు పక్కన 'టీఎఫ్ఎఫ్' (ట్రైనింగ్ ఫర్ ఫ్రీడమ్) అని రాసుంది. ట్రైనింగ్ ఫర్ ఫ్రీడమ్అం టే వారాంతంలో ఇంటికి వెళ్ళడానికి ఇచ్చే సెలవు అని అర్ధం అని మెక్‌క్యూబిన్ వివరించారు.
మేరీ హత్య జరిగినప్పుడు గ్రాహం 5 రోజుల సెలవుపై ఉన్నారు. 27 సెప్టెంబర్ 1984 అంటే మేరీ హత్య జరిగిన రోజు సాయంత్రానికి తిరిగి జైలుకు వచ్చినట్లు దర్యాప్తు బృందం కనుగొంది.
'ఈ పజిల్ ని పూర్తి చేయడానికి మేం వెతుకుతున్న ముఖ్యమైన భాగం దొరికింది' అని మాజీ సీనియర్ దర్యాప్తు అధికారి మార్క్ హేండెర్సన్ అన్నారు.

ఫొటో సోర్స్, Police Scotland
37 ఏళ్ల తరువాత శిక్ష
గ్రాహం మెక్ గిల్‌ను ఎట్టకేలకు డిసెంబర్4, 2019న అరెస్ట్ చేశారు. 'నా జీవితకాలంలో ఈ కేసు ముగింపుని చూస్తాననుకోలేదని, తనకి ఊరట లభించిందని' మేరీ కూతురు జీనా అన్నారు.
ఏప్రిల్ 2021లో నాలుగు రోజులపాటు కొనసాగిన కోర్టు విచారణ తరువాత గ్రాహం మెక్ గిల్ ను కోర్టు దోషిగా ప్రకటించి 14 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.
గ్లాస్గో హై కోర్టు న్యాయమూర్తి లార్డ్‌బర్న్స్ తీర్పు చెబుతు 'ఈ హత్యకు పాల్పడినప్పుడు గ్రాహం వయసు 22 సంవత్సరాలు కానీ ఇవాళ కోర్టు ముందు నుంచున్న గ్రాహం వయసు 59 సంవత్సరాలు. మేరీ కుటుంబం న్యాయం కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. కానీ ఏదో ఒక రోజు మేరీకి న్యాయం జరుగుతుందనే ఆశని వారు కోల్పోలేదు'
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














