కుళ్లిపోయిన మృతదేహాల మధ్య భూగర్భంలో చిక్కుకున్న మైనర్లను రక్షించిన వలంటీర్ల అనుభవాలు ఎలా ఉన్నాయంటే...

వలంటీర్లు మజ్వాండిల్ మక్వాయి (కుడివైపు), మండ్లా చార్లెస్ (ఎడమ వైపు)
ఫొటో క్యాప్షన్, వలంటీర్లు మజ్వాండిల్ మక్వాయి (కుడివైపు), మండ్లా చార్లెస్ (ఎడమ వైపు)
    • రచయిత, ఖానియిసిలే ఎన్కోబో, మయేని జోన్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఈ కథనంలో మిమ్మల్ని కలచివేసే అంశాలు ఉంటాయి.

అది దక్షిణాఫ్రికాలోని ఓ గని. ఒక ఎరుపు రంగు లోహపు బోనులో నిలబడ్డ మజ్వాండిల్ మక్వాయి అనే వ్యక్తిని గని లోపలకు దించుతున్నారు. కొంచెం దూరం వెళ్లాక తనకు దుర్వాసన వచ్చిందని మక్వాయి చెప్పారు.

'' ఆ మృతదేహాల నుంచి వస్తున్న వాసన దారుణంగా ఉంది’’ అని ఆయన బీబీసీతో అన్నారు.

సాయంత్రం ఇంటి వెళ్లినప్పుడు, తన భార్య వండిపెట్టిన మాంసం కూరను తినలేకపోయానని మక్వాయి అన్నారు.

''నేను మైనర్ల (గని కార్మికులు) తో మాట్లాడాను. ఆహారం దొరక్క ఆకలికి గని లోపలే ఉన్న మిగిలిన కార్మికుల మాంసాన్ని తిన్నామని కొందరు నాకు చెప్పారు. బొద్దింకలను కూడా తిన్నారట.'' అని మక్వాయి చెప్పారు.

ప్రాణాలు నిలుపుకోవడానికి మానవ మాంసాన్ని తిన్నామని ఈ గని నుంచి డిసెంబర్‌లో బయటపడిన కొందరు మైనర్లు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో కూడా తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కేజ్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఆ కేజ్ ద్వారా గనిలోకి మక్వాయిని దించారు.

మక్వాయి ప్రస్తుతం ఖుమా అనే టౌన్‌షిప్‌లో ఉంటున్నారు. దొంగతనం కేసులో ఆయన ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించారు. ఆయన ఉండే టౌన్‌షిప్ స్టిల్‌ఫొంటీన్ అనే పాడుబడ్డ గనికి సమీపంలో ఉంది.

ఈ గనిలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు మక్వాయి.

''గనిలోకి దిగడానికి ఎవరూ ముందుకు రావడంలేదని రెస్క్యూ కంపెనీ చెప్పింది. నేను, నా ఫ్రెండ్ మండ్లా చార్లెస్‌ వలంటీర్లుగా పని చేసేందుకు ఒప్పుకున్నాం. ఇందులో చిక్కుకుపోయిన మా ప్రాంతానికి చెందిన వారిని బయటకు తీసుకురావడంలో సాయపడదామని నిర్ణయించుకున్నాం’’ అని అన్నారు మక్వాయి.

సుమారు 2 కిలోమీటర్ల లోతు ఉన్న ఆ గనిలోకి దిగడానికి 25 నిమిషాలు పట్టిందని, చాలా భయం వేసిందని మక్వాయి చెప్పారు.

ఆయనను ఒక షాఫ్ట్ ద్వారా గని సొరంగంలోకి దించుతున్న క్రేన్ అప్పుడప్పుడు ఆగిపోయిందట. ఇక గనిలోకి దిగగానే అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి తాను షాకయినట్లు మక్వాయి చెప్పారు.

''చాలా మృతదేహాలు ఉన్నాయి. 70కి పైనే ఉంటాయి. అక్కడ చిక్కుకున్న సుమారు 200 మంది దాహంతో అలమటిస్తూ కనిపించారు.'' అని ఆయన చెప్పారు.

''చాలా బలహీనంగా ఉన్నారు. వారిని అలా చూడటం చాలా బాధగా అనిపించింది. కానీ, నేను, నా ఫ్రెండ్ ఇద్దరం స్ట్రాంగ్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాం. మేం ఏమనుకుంటున్నామో వారికి తెలియకూడదు. అప్పుడే, వారికి ధైర్యమిచ్చి, బయటకి తీసుకురాగలం'' అని తెలిపారు.

సాయం కోసం నెలల తరబడి వేచిచూస్తున్న ఈ మైనర్లకు, మక్వాయి, మండ్లాలను చూడగానే ప్రాణం లేచివచ్చింది.

''చాలా అంటే చాలా సంతోషం వ్యక్తం చేశారు.'' అని మక్వాయి తెలిపారు.

ఒకప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఈ పరిశ్రమ దివాలా తీయడంతో నిరుపయోగంగా మారిన గనుల్లో కొన్ని గ్యాంగులు అక్రమ మైనింగ్‌ చేపడుతున్నాయి. ఈ మైనింగ్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా పోలీసులు తీవ్ర చర్యలు చేపట్టడంతో మైనర్లు ఈ గనిలో చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది.

గనికి దగ్గర్లో నిరసన వ్యక్తం చేసిన కమ్యూనిటీ సభ్యులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గనికి దగ్గర్లో నిరసన వ్యక్తం చేసిన కమ్యూనిటీ సభ్యులు

స్టిల్‌ఫొంటీన్‌లో ఉన్న ఓ గని వద్ద నవంబర్‌లో పోలీసులు చర్యలు ప్రారంభించారు. దీనిలోకి ప్రవేశించే మార్గాన్ని దిగ్బంధించారు. గని లోపలికి ఆహారం, నీటి సరఫరాను నిలిపివేశారు.

సోమవారం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం కావడానికి ముందు, స్థానిక కమ్యూనిటీ స్వయంగా షాఫ్ట్ నుంచి తాడు ద్వారా కొందర్ని గనిలోకి దించి, కొందరిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది.

అలాగే, వారికి సాయం చేసేందుకు వస్తున్నట్లు మైనర్లకు తెలియజేసింది.

''మేం అక్కడికి వెళ్లినప్పుడు, వారు అప్పటికే క్రేన్ వద్ద వేచిచూస్తున్నారు. మమ్మల్ని చూసినప్పుడు, తమను వారి రక్షకులుగా, దేవుళ్లుగా భావించారు.'' అని మక్వాయి తెలిపారు.

అక్రమ మైనర్లు సొంతంగా బయటికి రాగలుగుతారని, కానీ అరెస్ట్ భయంతో, గనిలో నుంచి బయటికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారని పోలీసులు తెలిపారు. కానీ, మక్వాయి దీన్ని ఒప్పుకోలేదు.

''వారు బయటికి రావద్దనుకున్న మాట నిజం కాదు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు. చావుబతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు.'' అని మక్వాయి అన్నారు.

గని దగ్గర సహాయం పొందిన డజన్ల మందిని బీబీసీ గమనించింది. వారు చాలా బలహీనంగా కనిపించారు. వారు వేసుకున్న దుస్తుల మీద నుంచి ఎముకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొందరైతే నడవడానికే కష్టపడ్డారు. వారికి వైద్య సిబ్బంది సాయం చేశారు.

తమ తోటివారు ఎలాంటి మరణాన్ని పొందారో మాటలతో వర్ణించడానికి వీలులేని బాధాకరమైన వివరాలను ఈ మైనర్లు హైకోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తమ సహచరులు చాలామంది ఆకలితో అలమటించి చనిపోయినట్లు తెలిపారు.

సెక్యూరిటీ సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

''గత ఏడాది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో మాకు తినడానికి కనీస సరుకులు దొరకలేదు. ప్రాణాలు కాపాడుకోవడం రోజూ ఒక యుద్ధంగా మారింది.'' అని ఒక మైనర్ చెప్పారు.

తాము రక్షించిన వ్యక్తులు చాలా బలహీనంగా, దారుణంగా ఉన్నారని, కేవలం ఏడుగురు ఆరోగ్యకరమైన వ్యక్తులు మాత్రమే పట్టే కేజ్‌లో 13 మందిని తీసుకురాగలిగామని మక్వాయి చెప్పారు.

''వారు చాలా డీహైడ్రేట్‌గా మారారు. బాగా బరువు తగ్గిపోయారు. అందుకే, కేజ్‌లో మరింత ఎక్కువ మందినే తీసుకురాగలిగాం. ఆ గనిలో మరో రెండు రోజులుంటే వారు బతకరు. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది.'' అని చెప్పారు.

మృతదేహాలను బయటికి తీసుకొచ్చేందుకు కూడా వలంటీర్లు సాయపడ్డారు.

''రెస్క్యూ సేవా సంస్థలు మాకు బ్యాగులు ఇచ్చాయి. వాటిల్లో మృతదేహాలు పెట్టాలని చెప్పాయి. కొందరు మైనర్ల సాయంతో మృతదేహాలను కేజ్‌లో పెట్టి బయటికి తీసుకొచ్చాం.'' అని తెలిపారు మక్వాయి.

రెస్క్యూ ఆపరేషన్ కనీసం వారం పాటు సాగుతుందని తొలుత అంచనా వేశారు. కానీ, మూడు రోజుల్లోనే పూర్తయిందని, గనిలో ఇంకెవ్వరూ లేరని వలంటీర్లు చెప్పారు.

అధికారులు గనిలోకి కెమెరాను పంపి, ఇంకెవరైనా ఉన్నారేమో పరిశీలించారు. ఈ గనిని ఇకపై శాశ్వతంగా మూసివేస్తామని అధికారులు చెప్పారు.

గనిలోకి వెళ్లే రంధ్రం

ఫొటో సోర్స్, AFP

గనిలోకి వెళ్లి రావడం మక్వాయి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపింది. ఆయన వినికిడి శక్తి దెబ్బతింది. ఒత్తిడి వల్ల అలా జరిగి ఉండొచ్చని ఆయన భావిస్తున్నారు.

'' నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. అక్కడ చూసిన దృశ్యాలను నా జీవితాంతం మర్చిపోలేను.'' అని తెలిపారు.

గనిలో 87 మంది చనిపోవడానికి కారణం ప్రభుత్వం, అధికారులేనని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలతోపాటు ట్రేడ్ యూనియన్లు ఆరోపించాయి.

2012లో స్టిల్‌ఫొంటీన్‌కు 150 కి.మీల దూరంలో ఉన్న మారికానా గనిలో 34 మంది మైనర్లను పోలీసులు కాల్చిచంపిన ఘటనతో దీన్ని పోల్చుతున్నారు.

అయితే, ఈసారి ఎలాంటి కాల్పులు లేకుండానే, ఆకలితో మైనర్లు మరణించేలా చేశారని అన్నారు. అయితే, దీనికి తామే బాధ్యులమన్న వాదనను అధికారులు తోసిపుచ్చుతున్నారు.

ఆపరేషన్ వాలా ఉంగోడి ( జులు తెగ భాష ఇసిజులులో ఈ మాటకు ‘రంధ్రాన్ని మూసివేయడం’ అని అర్థం) ద్వారా 2023 డిసెంబర్‌ నుంచి అక్రమ మైనింగ్‌‌పై ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది ప్రభుత్వం.

వదిలేసిన గనులను కొన్ని ముఠాలు ఆక్రమించుకున్నాయి. అంతకుముందు వాటిల్లో ఉద్యోగులుగా పనిచేసిన వారే ఈ గ్యాంగులకు సారథ్యం వహించారు. ఇక్కడ వెలికితీసిన వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు.

బలవంతంగానో, తెలిసో ఈ అక్రమ వాణిజ్యంలో కూరుకుపోయిన వారు, ఖనిజాల కోసం నెలల పాటు భూగర్భంలోనే ఉంటున్నారు. అక్రమ మైనింగ్ వల్ల, కేవలం 2024లోనే దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థకు 3.2 బిలియన్ డాలర్ల( సుమారు రూ.25,600 కోట్లు ) నష్టం వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వ ఆపరేషన్‌తో, చాలా గనుల్లో ప్రవేశ మార్గాలను మూసివేశారు. దీంతో పాటు ఆహారం, నీటి సరఫరాలను ఆపేశారు. స్థానికంగా జామాజామాలుగా పిలిచే అక్రమ మైనర్లను బయటికి తీసుకొచ్చేందుకు పోలీసులు ఈ చర్యలు ప్రారంభించారు.

వాలా ఉంగోడి ఇతర ప్రావిన్సులలో విజయవంతమైంది. అయితే, పాత బఫెల్స్‌ఫొంటీన్ బంగారు గని మాత్రం ఒక సవాలుగా మారింది.

ఈ పోలీసు ఆపరేషన్‌కు ముందు, పైనుంచి ఒక తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పుల్లింగ్ సిస్టమ్ (రవాణా వ్యవస్థ) ద్వారా స్థానికుల సాయంతో గని లోపలికి వెళ్లగలిగేవారు.

కానీ, ఆగస్టులో సెక్యూరిటీ అధికారులు పెద్ద సంఖ్యలో రెయిడ్స్ నిర్వహించడంతో గని లోపలకి వెళ్లే రంధ్రాన్ని వారు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో, లోపలికి వెళ్లినవాళ్లు అక్కడే చిక్కుకుపోయారు

ఆ తర్వాత కమ్యూనిటీ వారు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తాళ్లను వాడుతూ కొందర్ని బయటికి తీశారు. ఇది చాలా కష్టమైన పని.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

బయటకు రావడానికి చాలా కష్టపడాల్సిన మార్గాలు కొన్ని ఉండగా, వాటి నుంచి సుమారు 2 వేలమంది మైనర్లు బయటకు రాగలిగారు. వీరిలో చాలామందిని అరెస్ట్ చేశారు.

అయితే, మిగిలినవాళ్లు ఎందుకు పైకి రాలేకపోయారో స్పష్టత లేదు. వారు బలహీనంగా అయినా ఉండొచ్చు లేదా గనిలో గ్యాంగ్ సభ్యులు వారిని బెదిరించి ఉండొచ్చు. దీంతో, వారు ఇబ్బందుల్లో పడిపోయారు.

చనిపోయిన 87 మందిలో కేవలం ఇద్దర్ని మాత్రమే గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరిలో చాలామంది ఎలాంటి డాక్యుమెంట్లు లేని వలసదారులని, దీంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.

ఏం జరగబోతోందో పోలీసులు కనీసం హెచ్చరించలేదని మైనింగ్ అఫెక్టెడ్ కమ్యూనిటీస్ యునైటైడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ (ఎంఏసీయూఏ) కు చెందిన మాగ్నిఫిసెంట్ మాంబెల్ బీబీసీతో చెప్పారు.

తొలుత ప్రభుత్వం సరఫరాలకు అనుమతిచ్చి, ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని కోరుతూ పలు కోర్టులలో ఈ సంస్థ గత రెండు నెలలుగా పోరాటం చేస్తోంది.

అధికారులే తమ వారిని చంపేశారని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు బాధిత కుటుంబాలు.

ఆపరేషన్ తీవ్రతరమైన తర్వాత, అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.

ఆహారం పంపేందుకు లేదా గనిలోని కార్మికులను తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు సాయం చేయడానికి ప్రభుత్వం నిరాకరించింది.

‘‘కలుగుల్లో దాగిన వారిని పొగబెట్టయినా సరే బయటకు తీసుకువస్తాం’’ అని ఒక మంత్రి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

కోర్టులలో సమర్పించిన ఎన్నో దరఖాస్తుల తర్వాత మాత్రమే ప్రభుత్వం తలొగ్గింది.

నవంబర్‌లో మొక్కజొన్నల్లాంటి ఆహారం, నీటిని గని లోపలకి పంపారు. అయితే, కిందనున్న వేలాది మందికి ఇవి సరిపోలేదని మైనర్లలో ఒకరు చెప్పారు. నమలలేని, మింగలేనంత బలహీనంగా మైనర్లు ఉన్నారని తెలిపారు.

మరోసారి డిసెంబర్‌లో ఆహార సరఫరాలు చేపట్టారు. కానీ, అవి కూడా వారికి సరిపోలేదు.

''ప్రభుత్వ చర్యలతో మేం తీవ్ర నిరాశ చెందాం. ఈ సాయం చాలా ఆలస్యంగా అందింది.'' అని మాగ్నిఫిసెంట్ మాంబెల్ చెప్పారు.

అయితే, ఈ ఆరోపణలపై ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ ఏడాది మే నాటికి పాడుబడ్డ గనులన్నింటినీ క్లియర్ చేసేందుకు విస్తృతంగా కార్యకలాపాలు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు.

స్టిల్‌ఫొంటీన్‌లో జర్నలిస్టులతో మాట్లాడిన మైనింగ్ మంత్రి గ్వేడే మాంటాషే..అక్రమ మైనింగ్‌పై పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. దీన్ని ఆర్థిక వ్యవస్థపై దాడిగా, నేరంగా వర్ణించారు.

మైనర్లకు ఆహారం అందించడం వల్ల నేరాలు మరింత వృద్ధి చెందుతాయని చెబుతూ పోలీసులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. అక్రమ మైనర్లు తాము పనిచేసే కమ్యూనిటీల్లో నేర ప్రవృత్తిని పెంచుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

స్థానిక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం జామాజామాలు పలు అత్యాచారాలకు, హత్యలకు పాల్పడతున్నట్లు తెలిసింది.

మైనర్లకు సాయం చేసేందుకు తన భద్రతను పణంగా పెట్టిన మక్వాయి, స్టిల్‌ఫొంటీన్ గనిలోకి ప్రజలు బతుకుదెరువు కోసమే వెళ్తున్నారని అన్నారు.

ప్రజలు 2 కిలోమీటర్ల లోతుల్లోకి తాడు ద్వారా వెళ్లి, తమ కుటుంబాలకు పట్టెడన్నం పెట్టేందుకు తమ జీవితాలనే పణంగా పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

దక్షిణాఫ్రికాలో నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉండటంతో, పాడుబడ్డ గనుల్లోకి బలవంతంగా వెళుతున్న చేతివృత్తుల వారికి ప్రభుత్వం లైసెన్సు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

''పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే, తల్లిదండ్రులు గని లోపలకి వెళ్లేందుకు ఏమాత్రం ఆలోచించరు. ఎందుకంటే, వారికి అన్నం పెట్టాల్సిందే. పట్టెడన్నం కోసం వారి జీవితాలను ప్రమాదంలో పెడుతున్నారు.'' అని మక్వాయి అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)