మన టవళ్లను ఎన్ని రోజులకోసారి ఉతకాలి?

బాత్రూంలో ఆరేసిన టవల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మనం వాడే టవళ్లు లక్షల సూక్ష్మజీవులకు నిలయం
    • రచయిత, గ్రేస్ టైరెల్

మనం రోజూ టవళ్లను చాలా సార్లు వాడుతుంటాం. దీనివల్ల అవి ఎన్నో సూక్ష్మజీవులకు నిలయంగా మారతాయి. మరి వాటిని రోజూ ఉతకాలా?

ఈ రోజు పొద్దున మీరు స్నానం చేసినప్పుడు వాడిన టవల్ ఎంత శుభ్రంగా ఉందో చెప్పగలరా? ఎందుకంటే మనలో చాలా మంది వారానికి ఒక సారి టవల్‌ను ఉతుకుతారు. నెలకు ఒకసారి వాషింగ్ మెషిన్‌లో వేసేవారు కూడా ఉంటారు.

టవళ్లు పైకి శుభ్రంగానే కనిపించినా, అవి కొన్ని లక్షల సూక్ష్మజీవులకు నిలయంగా మారే అవకాశం ఎక్కువ. మన చర్మంపై సాధారణంగా కనిపించే బ్యాక్టీరియాతో పాటు, మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా కూడా టవళ్లలోకి సులువుగా వ్యాపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మనం స్నానం చేసిన తర్వాత కూడా మన శరీరంపై కొంత బ్యాక్టీరియా ఉండిపోతుంది. శరీరాన్ని టవల్‌తో తుడుచుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా టవల్ పైకి చేరుతుంది. అంతేకాదు, టవళ్లను ఉతికినప్పుడు నీటిలో ఉండే బ్యాక్టీరియా కూడా దానిపైకి చేరుతుంది. అలాగే టవల్‌ను ఆరేసినప్పుడు గాలిలో ఉండే ఫంగస్ కూడా అందులోకి చేరుతుంది.

జపాన్‌లో కొందరు స్నానం చేశాక బాత్‌టబ్‌లో మిగిలిపోయిన నీటిని బట్టలు ఉతకడానికి ఉపయోగిస్తారు. నీటిని ఆదా చేసేందుకు వారు అలా చేస్తుంటారు. అయితే, అలా చేయడం మంచిది కాదని టోకుషిమా విశ్వవిద్యాలయం పరిశోధకులు అంటున్నారు. ఆ నీటిలోని బ్యాక్టీరియా టవళ్లకు, ఇతర దుస్తులకు వ్యాపిస్తుంది. కొందరికి బాత్రూంలో టవళ్లను ఆరేసే అలవాటు ఉంటుంది. అలా చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.

కాలక్రమేణా, టవళ్లపై 'బయోఫిల్మ్‌' (సూక్ష్మజీవుల పొర) ఏర్పడుతుంది. తరచుగా ఉతికినా టవల్‌పై ఉన్న బ్యాక్టీరియా కారణంగా అది పాతగా కనిపిస్తుంది.

టవల్స్ వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి చేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇతరుల టవల్స్ వాడితే వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని పరిశోధనలో తేలింది

అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, టవల్‌పై ఉండే బ్యాక్టీరియా గురించి మనం ఆందోళన పడాలా?

టవళ్లను ఉతకడం అనే అంశం చిన్నదిగానే అనిపించవచ్చు, కానీ ఇంటి చుట్టూ వ్యాపించే సూక్ష్మజీవులకు టవళ్ల శుభ్రతకు సంబంధం ఉందని బోస్టన్‌లోని సిమన్స్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ హైజీన్ అండ్ ఇన్ హోమ్ అండ్ కమ్యూనిటీ విభాగం ప్రొఫెసర్, కో-డైరెక్టర్ ఎలిజబెత్ స్కాట్ అన్నారు.

"క్రిములు సహజంగా టవళ్లపైకి చేరుకున్నవి కావు. టవల్ మీద మనకు హాని కలిగించేవి ఏవైనా ఉంటే అవి మనుషుల అలవాట్ల వల్లనే చేరుకున్నవే.." అని ఆమె చెప్పారు.

నిజానికి, మన చర్మంపై దాదాపు 1,000 రకాల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఉంటాయి. చాలా వరకు ఇవి మనకు మంచి చేసేవే. హానికారక బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. మనలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

టవళ్లపై ఉండే బ్యాక్టీరియా మన చర్మంపై, మనం నివసించే పరిసరాలలో కనిపించే బ్యాక్టీరియా జాతులకు చెందినవే. వీటిలో సాధారణంగా మానవ పేగులలో కనిపించే స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా, ఎస్చెరిచియా కోలి జాతులతో పాటు, వ్యాధులు, విరేచనాలకు కారణం అయ్యే సాల్మోనెల్లా షిగెల్లా బ్యాక్టీరియా కూడా ఉంటాయి.

వీటిల్లో కొన్ని వ్యాధికారక క్రిములకు విషాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులపై ఈ బ్యాక్టీరియా దాడి చేస్తుంది.

 ఎండలో ఆరేసిన టవల్స్ ను

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టవల్‌ను ఉతికిన తరువాత ఎండలో ఆరబెట్టడం వల్ల వాటిపై ఉండే బ్యాక్టీరియాను తగ్గించవచ్చు.

మన చర్మానికి కూడా సహజంగా ఇన్ఫెక్షన్‌‌ను అడ్డుకునే శక్తి ఉంటుంది. బ్యాక్టీరియా, ఇతర వ్యాధికారక క్రిములను ఎదుర్కొనే మొదటి రక్షణ శ్రేణి మన చర్మమే. కాబట్టి బ్యాక్టీరియా టవల్ నుంచి మన చర్మానికి వ్యాపిస్తుందని పెద్దగా చింతించనవసరం లేదు. కానీ టవల్‌తో చర్మాన్ని రుద్దడం లాంటివి చేస్తే చర్మం రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

తరచుగా మన చేతులను టవళ్లతో తుడుచుకుంటాం. చేతుల్లో హానికరమైన సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి. ఇది అతిపెద్ద సమస్య. అందుకే ఈ హ్యాండ్ టవళ్లపై ఎక్కువ శ్రద్ధ అవసరం. వంటగదిలో పాత్రలు, చేతుల కోసం ఉపయోగించే కిచెన్ టవళ్లు కూడా ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులకు మరొక మూలం.

‘‘గ్యాస్ట్రోఎంటెరిక్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సాల్మోనెల్లా, నోరోవైరస్, ఇ. కోలి వంటి బ్యాక్టీరియాలు టవళ్ల ద్వారా వ్యాపిస్తాయి. కోవిడ్-19 వంటి వైరస్‌లు కాటన్ టవళ్లపై 24 గంటల వరకు జీవించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వస్తువులను తాకడం ద్వారా వైరస్ వ్యాపించదు’’ అని ఎలిజబెత్ స్కాట్ చెప్పారు.

ఎంపాక్స్ వైరస్ వంటి ఇతర వైరస్‌లతో ఎక్కువ ప్రమాదం ఉండవచ్చు. ఈ వ్యాధి సోకిన వ్యక్తులతో టవళ్లు, బెడ్ షీట్లు పంచుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తారు.

టవళ్ల శుభ్రత గురించి ఆలోచించడం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఒకటైన ఎంఆర్‌ఎస్‌ఏ (MRSA)ను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని స్కాట్ అంటున్నారు.

టవల్

ఫొటో సోర్స్, Getty Images

తరచుగా టవళ్లను ఉతకడం ద్వారా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను తగ్గించవచ్చు. ఈ విధంగా యాంటీబయాటిక్స్ వాడకం కూడా తగ్గుతుందని కార్డిఫ్ యూనివర్శిటీకి చెందిన ఫార్మాస్యూటికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ జీన్-వైవ్స్ మెయిలార్డ్ అన్నారు.

"ఇంటి పరిశుభ్రత అనేది నివారణకు సంబంధించినది, చికిత్స కంటే నివారణ ఉత్తమం" అని మైలార్డ్ చెప్పారు.

టవళ్లను వారానికి ఒకసారి ఉతికితే మంచిదని స్కాట్ సూచిస్తున్నారు. అయితే, అందరికీ ఇది వర్తించదు.

"ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, వారికి వాంతులు, విరేచనాలు అవుతాయి. వారికి ప్రత్యేక టవల్ ఉండాలి, దానిని రోజూ ఉతకాలి" అని స్కాట్ చెప్పారు.

బట్టలపైకి బ్యాక్టీరియా, వైరస్‌లు చేరకుండా డిటర్జెంట్ నిరోధిస్తుంది.

టవళ్లను వెచ్చని నీటిలో (40-60C మధ్య) సాధారణంగా, ఇతర బట్టల కంటే ఎక్కువ సేపు వాష్ సైకిల్‌లో పెట్టాలంటారు స్కాట్. తరచుగా యాంటీమైక్రోబయల్ డిటర్జెంట్లు వాడాలి.

వాస్తవానికి, అధిక ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువగా ఉతకడం వల్ల పర్యావరణంపై ప్రభావం ఉంటుంది. కాబట్టి సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఉతికేస్తే, బ్లీచ్ వంటి వాటిని ఉపయోగించవచ్చు.

భారత దేశంలో జరిగిన ఒక అధ్యయనంలో పాల్గొన్న వారిలో20 శాతం మంది వారానికి రెండుసార్లు టవళ్లు ఉతుకుతామని చెప్పారు.

ఒక డిటర్జెంట్‌తో పాటు, సూక్ష్మక్రిమిసంహాకారాలను వాడి, ఉతికి ఎండలో ఆరేస్తే బ్యాక్టీరియా, వైరస్ ముప్పును తగ్గించవచ్చని మరో అధ్యయనం పేర్కొంది.

ఇంటి పరిశుభ్రతను టీకాతో పోల్చారు స్కాట్. మనం పాటించే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల ఇన్ఫెక్షళ్ల నుంచి మనల్ని మనం రక్షించుకోవడంమే కాదు, మన చుట్టూ ఉన్నవారిని కూడా రక్షించుకోవచ్చని స్కాట్ అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)