లాస్ ఏంజలెస్ కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు వాడుతున్న ఈ 'పింక్ లిక్విడ్' ఏమిటి?

ఫొటో సోర్స్, Reuters
లాస్ ఏంజలెస్‌లో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చేందుకు విమానాల ద్వారా నిరంతరం గులాబీ రంగులో ఉన్న లిక్విడ్ (ద్రవం)ను మంటలపై చల్లుతున్నారు.
లాస్ ఏంజలెస్ అటవీ ప్రాంతంలో చెలరేగిన ఈ మంటలు నివాస ప్రాంతాలనూ ఇప్పటికే చాలా వరకు బుగ్గి చేశాయి. ఇప్పటి వరకూ ఈ మంటల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 24కి చేరింది.
లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 250 బిలియన్ డాలర్లు, అంటే సుమారు 2.16 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అమెరికాకు చెందిన ఒక వాతావరణ పర్యవేక్షణ సంస్థ అంచనా వేసింది.

మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇంకా పలుచోట్ల మంటలు ఆర్పే పనిలోనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ పింక్ లిక్విడ్?
లాస్ ఏంజలెస్‌లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు పింక్ లిక్విడ్‌ను విమానాల ద్వారా చల్లుతున్నారు.
ఇది మంటలను నియంత్రణలోకి తీసుకొచ్చే ఒక పదార్థం. నీరు, రసాయన లవణాలు, ఫెర్టిలైజర్స్ మిశ్రమం. ఇందులో ప్రధానంగా అమోనియం ఫాస్ఫేట్ ఉంటుంది.
మంట మండడానికి ఆక్సిజన్ అవసరం. ఈ రసాయన మిశ్రమం అగ్నికి ఆక్సిజన్ అందకుండా నిరోధిస్తుంది, తద్వారా మంటలు వేగంగా వ్యాపించకుండా నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ఈ పింక్ లిక్విడ్‌ను అమోనియం పాలీఫాస్ఫేట్ వంటి రసాయన లవణాలతో తయారుచేస్తారు. ఇది నీళ్ల మాదిరిగా త్వరగా ఆవిరైపోకుండా, చల్లిన చోట ఎక్కువసేపు ఉంటుంది.
దీనివల్ల, ఆక్సిజన్ అందక మంటలు అదుపులోకి రావడంతో పాటు అగ్నికీలలు వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది.
ఈ లిక్విడ్ గులాబీ రంగులో ఉండడం వల్ల ఏయే ప్రదేశాల్లో చల్లారో అగ్నిమాపక సిబ్బంది సులభంగా గుర్తించగలుగుతారు. అలాగే, మంటల వల్ల ప్రభావితమైన ప్రాంతాలను కూడా గుర్తించవచ్చు. ఇది, మంటలు చెలరేగినప్పుడు ఏయే ప్రాంతాలు ప్రభావితమవుతాయో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
అయితే, ఈ లిక్విడ్ మనుషులు, పర్యావరణంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనలతో దీని వాడకం కూడా వివాదంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కార్చిచ్చు ఎంత భయంకరమైనదంటే..
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. 9 భారీ విమానాలు, మరో 20 అగ్నిమాపక హెలికాప్టర్లు మంటలను అదుపులోకి తెచ్చే పనిలో నిమగ్నమై ఉన్నట్లు యూఎస్ ఫారెస్ట్ సర్వీస్ గురువారం తెలిపింది.
లాస్ ఏంజలెస్‌లోని అగ్నిమాపక సిబ్బంది నుంచి అందిన అధికారిక సమాచారం ప్రకారం, ఇంకా మూడు ప్రాంతాల్లో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఇక్కడ కనీసం ఆరుచోట్ల మంటలు చెలరేగాయి, వాటిలో కొన్నిచోట్ల మంటలను అదుపు చేయలేకపోయారు.
అలాగే, ఏటన్, హర్స్ట్‌లోని చాలా ప్రాంతం ఇప్పటికీ మంటల్లో ఉంది. ఆదివారం సాయంత్రానికి కెన్నెత్‌లో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకూ 24 మంది చనిపోయారు.
వేలాది ఎకరాల్లో మంటలు వ్యాపించడంతో లక్షలాది మంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాల్సి వచ్చింది.
వేల సంఖ్యలో ఇళ్లు, వాహనాలు దగ్ధమయ్యాయి. సామాన్యులతో పాటు చాలా మంది ప్రముఖుల ఇళ్లు కూడా ఈ మంటల్లో కాలి బూడిదయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్ షో 'నోబడీ వాంట్స్ దిస్' నటుడు ఆడమ్ బ్రాడీ, 'గాసిప్ గాల్'లో నటించిన లీటన్ మీస్టర్‌ల ఇల్లు కూడా అగ్నికి ఆహుతైంది.
లాస్ ఏంజలెస్‌లోని హాలీవుడ్ హిల్స్ ప్రాంతంలో వేలాది భవనాలు కాలి బూడిదయ్యాయి. ప్రతిష్టాత్మక సన్‌సెట్ బౌలేవార్డ్‌లోని ఇళ్లు, పాఠశాలలు, వాణిజ్య భవనాలు వాటిలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారీ స్థాయిలో మంటల వ్యాప్తికి కారణాలేంటి?
లాస్ ఏంజలెస్‌లో ఇంత భారీ విధ్వంసానికి బలమైన గాలులు, పొడి వాతావరణమే కారణమని, దీనివల్ల చెట్లు ఎండిపోయి మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితులు, బలమైన గాలులు ఈ మంటలకు కారణంగా నిలుస్తున్నాయి.
మంటలు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం మైదాన ప్రాంతం నుంచి తీరం వైపు వీచే 'శాంటా అనా' గాలులని, ఇవి గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీస్తాయని అంటున్నారు.
తూర్పు, లేదా ఈశాన్యం వైపు నుంచి అమెరికా తీరం వైపు వీచే ఈ శాంటా గాలులు ఏడాదిలో చాలాసార్లు వీస్తుంటాయి.
కార్చిచ్చులకు వాతావరణ మార్పులు కూడా కారణమవుతున్నాయని, వాటి వల్ల ఈ ప్రమాదం నిరంతరం పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా పశ్చిమ ప్రాంతంలో సంభవిస్తున్న కార్చిచ్చులకు, వాతావరణ మార్పులతో సంబంధముందని యూఎస్ ప్రభుత్వం జరిపిన పరిశోధన కూడా స్పష్టంగా పేర్కొంది.
''వాతావరణ మార్పులు, వేడి వాతావరణం, దీర్ఘకాల కరవు, గాలిలో తేమ లేకపోవడం వంటివి అమెరికా పశ్చిమ ప్రాంతంలో కార్చిచ్చుల ప్రమాదాన్ని, మంటల వ్యాప్తిని పెంచుతున్నాయి'' అని యూఎస్ ఓషియన్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ అంటోంది.
వేసవి కాలంలో తీవ్రమైన ఎండలు, వర్షాభావ పరిస్థితుల వల్ల కాలిఫోర్నియాలో పరిస్థితులు ఇటీవల కొద్దినెలలుగా మరింత దారుణంగా తయారయ్యాయి.
సాధారణంగా మే నుంచి అక్టోబర్ వరకూ దక్షిణ కాలిఫోర్నియాలో అగ్నిప్రమాదాల సీజన్‌గా పరిగణిస్తారు. కానీ, ఇప్పుడు కార్చిచ్చులు ఏడాది పొడవునా ఉండే సమస్యగా మారిపోయాయని ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














