భార్య అదృశ్యమైన ఇంట్లో మాంసం కొట్టే మొద్దు ఎందుకు ఉంది? మాధవి 'డెత్ మిస్టరీ'లో సమాధానం దొరకని 12 ప్రశ్నలు

ఒక మహిళ

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్చరిక: ఈ కథనంలో కలవరపరిచే అంశాలు ఉన్నాయి

హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక మహిళ అదృశ్యానికి సంబంధించిన కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

మిస్సింగ్ కేసులు నమోదు కావడం కొంత సాధారణమే కానీ, ఈ ఘటనకు సంబంధించి వస్తున్న వార్తలు తీవ్రంగా కలవరపరిచేలా ఉన్నాయి.

మాధవి అనే మహిళను ఆమె భర్త గురుమూర్తి అత్యంత కిరాతకంగా హత్య చేశారంటూ.. స్థానిక మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పెను సంచలనంగా మారింది. దీనిపై జాతీయ మీడియాలో సైతం కథనాలు రిపోర్టు అవుతున్నాయి.

అయితే.. మాధవి హత్య జరిగినట్లుగా పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

''ఈ కేసులో విషయంలో దర్యాప్తు జరుగుతోందని మీడియాకు చెబుతున్నాం. దారుణంగా హత్య జరిగినట్లుగా ఇంకా ఆధారాలు లభించలేదు. ఈ కేసుకు సంబంధించి ఏదైనా పురోగతి ఉంటే చెబుతామని మమ్మల్ని అడుగుతున్న మీడియాకు చెబుతున్నాం'' అని మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ నాగరాజు చెప్పారు.

వాట్సాప్ చానల్
మహిళ, ఆమె భర్త

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మాధవి తల్లిదండ్రులను పోలీసులు విచారించినప్పుడు గురుమూర్తిపై అనుమానం వ్యక్తం చేశారు

ఉద్యోగ విరమణ చేసి..

హైదరాబాద్ శివారులోని జిల్లెలగూడ పరిధిలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో పుట్టా గురుమూర్తి, వెంకట మాధవి దంపతులు ఐదేళ్లుగా నివాసం ఉంటున్నారు.

వీరికి ఇద్దరు పిల్లలు.

గురుమూర్తి, మాధవి స్వస్థలం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామం. వీరికి సుమారు 13 ఏళ్ల కిందట వివాహమైంది.

గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కంచన్ బాగ్ డీఆర్డీఎల్‌లో ప్రైవేటు సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నట్లుగా మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ కీసర నాగరాజు బీబీసీతో చెప్పారు.

HYDERABAD police
ఫొటో క్యాప్షన్, మాధవి మిస్సింగ్‌కు సంబంధించి గురుమూర్తి రెండు, మూడు వెర్షన్లు చెబుతున్నారని పోలీసులు తెలిపారు

మాధవి తల్లి ఏం చెప్పారంటే..

తమ కుమార్తె కనిపించడం లేదని మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ 2025 జనవరి 18న మీర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

''16వ తేదీ ఉదయం నా కుమార్తె మాధవి, తన భర్త గురుమూర్తికి చిన్న గొడవ జరిగి మధ్యాహ్నం చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. చుట్టుపక్కల వారు, తెలిసినవారు, బంధువుల వద్ద వెతికినా కనిపించలేదు'' అని సుబ్బమ్మ ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై మీర్‌పేట పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు(81/2025) నమోదైంది.

కేసు దర్యాప్తులో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు పోలీసులు.

''15వ తేదీన మాధవి, గురుమూర్తి ఇంటికి వచ్చారు. తర్వాత ఆమె ఆచూకీ లేదని తెలిసింది. సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలించాం. మాధవి తల్లిదండ్రులను విచారించినప్పుడు గురుమూర్తిపై అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ల అనుమానాలను పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టాం. ఇప్పటివరకు మిస్సింగ్ కేసుగానే దర్యాప్తు చేస్తున్నాం’’ అని మీర్ పేట ఇన్‌స్పెక్టర్ నాగరాజు బీబీసీతో చెప్పారు.

ఈ విషయంపై మాధవి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. వారు అందుబాటులోకి రాలేదు.

మహిళ

ఫొటో సోర్స్, UGC

మాధవి తల్లిదండ్రుల అనుమానాలతో దర్యాప్తు

మాధవిని గురుమూర్తి చంపారని, ఈ విషయాన్ని పోలీసుల వద్ద ఆయనే చెప్పినట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే, మీడియాలో ఎవరికి వారు తమకు తోచినట్టుగా కథనాలు రాస్తున్నారని, తాము అలాంటి వివరాలేవీ ఇప్పటి వరకు వెల్లడించలేదని మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ నాగరాజు చెప్పారు.

''గురుమూర్తిపై మాధవి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన అనుమానాల ఆధారంగా కేసు విచారణ సాగుతోంది'' అని ఆయన తెలిపారు.

ఇదే విషయంపై ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు.

''మాధవి మిస్సింగ్‌కు సంబంధించి గురుమూర్తి రెండు, మూడు వెర్షన్లు చెబుతున్నారు. వాటి ఆధారంగా కూడా విచారణ చేస్తున్నాం. వాటిలో నిజానిజాలు ఏంటన్నది కేసు దర్యాప్తులో తెలుస్తాయి'' అని ఆయన చెప్పారు.

మాధవిని చంపినట్లుగా ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని, దర్యాప్తులో అన్ని విషయాలూ తెలుస్తాయని బీబీసీకి చెప్పారు డీసీపీ ప్రవీణ్ కుమార్.

చెరువు

సీసీటీవీ ఫుటేజీలో ఏముంది?

సీసీటీవీ ఫుటేజీలో మాధవి ఇంట్లోకి వెళ్లినట్లుగా ఉంది, కానీ బయటకు వచ్చినట్లుగా కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు.

ఇప్పుడు ఇదే కీలకంగా మారింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ ఆధారంగా గురుమూర్తి కదలికలపైనా దర్యాప్తు జరుగుతోందని డీసీపీ ప్రవీణ్ కుమార్ బీబీసీకి చెప్పారు.

అలాగే శరీర భాగాలను ముద్దగా చేసి సమీపంలోని చెరువులో, డ్రైనేజీలో పడేసినట్లుగా ఇంకా తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని నాగరాజు బీబీసీతో చెప్పారు.

ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని, అప్పుడే అన్ని వివరాలనూ వెల్లడిస్తామని ఆయన అన్నారు.

కిచెన్

మాధవి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే..

గురుమూర్తి కుటుంబం నివాసం ఉన్న ఇంటి వద్ద బీబీసీ పరిశీలించింది.

ఇంటికి, బయట గేటుకు తాళం వేసి ఉంది. కిటీకిలోంచి చూస్తే, ఇంట్లో చిన్న కుక్కర్, చిన్నపాటి కలపమొద్దు, మద్యం బాటిల్, బకెట్ వంటివి కనిపించాయి. అక్కడ అసాధారణ పరిస్థితి ఏమీ కనిపించలేదు.

ఈ ఇల్లు గ్రౌండ్+ రెండంతస్తులు, పెంట్ హౌస్ ఉంది. ప్రస్తుతం మొత్తం పోర్షన్లలో ఎవరూ లేరు. బీబీసీ పరిశీలించిన సమయంలో తాళాలు వేసి ఉన్నాయి.

హైదరాబాద్ పోలీసులు

చిక్కుముడి విప్పాల్సిన ప్రశ్నలెన్నో..

ఇప్పుడు మాధవి అదృశ్యం కేసులో పోలీసులు చిక్కుముడి విప్పాల్సిన ప్రశ్నలెన్నో కనిపిస్తున్నాయి.

ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ప్రాథమిక స్థాయి నుంచి ఎన్నో సందేహాలు కేసు చుట్టూ ముడిపడి ఉన్నాయి.

  • మాధవి అదృశ్యమయ్యారా? అయితే, ఎక్కడికి వెళ్లారు?
  • ఇంట్లోంచి బయటకు రాలేదని పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. అలాంటప్పుడు ఆమె ఎలా అదృశ్యమయ్యారు? ఒకవేళ ఇంట్లోనే ఏదైనా జరిగిందా?
  • స్థానిక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆమె హత్యకు గురయ్యారా?
  • హత్యకు గురైతే ఆమెను హత్య చేసింది ఎవరు?
  • భర్తే ఆమెను హత్య చేశాడనుకుంటే, ఆమె మృతదేహం ఏమైనట్లు? మీడియాలో రిపోర్టు అవుతున్నట్లుగా అంత దారుణంగా ఎందుకు చంపినట్లు?
  • ఆమెను చంపితే, అందుకు ఉపయోగించిన ఆయుధాలు గానీ, ఇతర వస్తువులు గానీ ఏమయ్యాయి?
  • గురుమూర్తి రెండు, మూడు వెర్షన్లు చెబుతున్నారని పోలీసులు అంటున్నారు. వాటిల్లో ఏది నిజం?
  • మాధవి హత్యకు గురై ఉంటే, ఆమెను ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణమేమిటి?
  • దంపతులిద్దరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగింది?
  • ఒకవేళ మాధవిని భర్త హత్య చేసి ఉంటే, అతనొక్కడే చేశాడా? లేదా మరెవరైనా సహకరించారా?
  • ఇంట్లో మాంసం నరికేందుకు వాడే కలపమొద్దు ఎందుకు ఉంది?
  • 16వ తేదీన మాధవి కనిపించకుండాపోతే, ఆ తర్వాత రెండు రోజులు గురుమూర్తి ఏం చేశాడు?

ఇలా ఎన్నో ప్రశ్నలకు పోలీసులు సమాధానం కనుక్కోవాల్సి ఉంది. అప్పుడే కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చే వీలుంది.

దీనిపై డీసీపీ ప్రవీణ్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఒకట్రెండు రోజుల్లో కేసును పరిష్కరిస్తాం. అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పటికైతే మాధవి మిస్సింగ్ కేసుగానే దర్యాప్తుగా సాగుతోంది’’ అని స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)