‘ఈ రోజు కోసమే 18 ఏళ్లుగా వేచి చూస్తున్నాం’: థాయిలాండ్ స్వలింగ సంపర్కులు

ఫొటో సోర్స్, Benjamin Begley/ BBC
- రచయిత, జోనాథన్ హెడ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
థాయిలాండ్‌లో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 'వివాహ సమానత్వ చట్టం' గురువారం నుంచి అమలులోకి వచ్చింది. పోలీసు అధికారి పిసిట్ క్యూ సిరిహిరుంచై తన దీర్ఘకాల భాగస్వామి అయిన చనాతిప్ జేన్ సిరిహిరుంచైని వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు.
స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడంతో ఈ మైలురాయిని వేడుకగా జరుపుకోవడానికి బ్యాంకాక్ నగర అధికారులు ఎల్జీబీటీక్యూలకు సహకరిస్తున్నారు. నగరంలోని ఒక పెద్ద షాపింగ్ మాల్‌లో భారీ ఈవెంట్‌గా 180 స్వలింగ జంటలు కలుసుకోవడానికి పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
"మేం చాలారోజుల నుంచి సిద్ధంగా ఉన్నాం. చట్టం మాకు మద్దతు ఇస్తుందని వేచి ఉన్నాం" అని పిసిట్ అంటున్నారు.
పిసిట్, జేన్ ఇద్దరూ ఏడేళ్లుగా కలిసి ఉన్నారు. వివాహం చేసుకోవాలని ఒక బౌద్ధ సన్యాసి దగ్గరికి వెళ్లారు. ఆయన వారికి సిరిహిరుంచై అనే ఇంటి పేరును ఇచ్చారు. పెళ్లికి సమ్మతిస్తూ ఇద్దరూ సంతకాలు చేసిన లేఖను జారీచేయాల్సిందిగా స్థానిక అధికారులను ఈ జంట కోరింది.
అయితే, థాయ్ చట్టం ప్రకారం వారి యూనియన్ అధికారికంగా గుర్తింపు పొందడమే వారికి అతిపెద్ద కల. ఇప్పుడు, ఎల్జీబీటీక్యూ+ జంటలకు కూడా ఇతర జంటల మాదిరే సమానమైన హక్కులు వచ్చాయి.
వారు నిశ్చితార్థం, వివాహం చేసుకోవచ్చు. ఆస్తులను పర్యవేక్షించవచ్చు. ఆస్తిని వారసత్వంగా పొందవచ్చు. పిల్లలను దత్తత తీసుకోవచ్చు. వారి భాగస్వామి అనారోగ్యానికి గురైతే వైద్యపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. భాగస్వామితో ప్రభుత్వ పెన్షన్ వంటి ఆర్థిక ప్రయోజనాలను పంచుకోవచ్చు.

ఫొటో సోర్స్, Pisit Sirihirunchai
పెళ్లికి నిరాకరణ
"మేం కలిసి భవిష్యత్తును నిర్మించుకోవాలని అనుకుంటున్నాం. ఇల్లు కట్టుకోవాలని, ఒక కేఫ్ వంటి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం" అన్నారు పిసిట్.
"ప్రతి ఒక్కరూ మమ్మల్ని బహిరంగంగా గుర్తించగలిగే ఈ రోజు కోసం 18 సంవత్సరాలుగా వేచి ఉన్నాం. ఇకపై దాచాల్సిన అవసరం లేదు" అని 59 ఏళ్ల రుంగ్తివా తంగ్కనోపాస్ట్ చెప్పారు.
ఆమె తన పార్ట్‌నర్ ఫన్లవీని ఈ సంవత్సరం మే నెలలో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
రుంగ్తివా గతంలో 'గే'తో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు, తరువాత ఆయన మరణించారు. ఐవీఎఫ్ ద్వారా ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. భర్త మరణం తర్వాత బ్యాంకాక్‌లోని లెస్బియన్ పబ్ ఒకటి నడుపుతున్నారు. అక్కడ ఆమె ఫన్లవీ(45)ని కలుసుకున్నారు.
2013లో ప్రేమికుల రోజున ఈ జంట సెంట్రల్ బ్యాంకాక్‌లోని బ్యాంగ్ రాక్ జిల్లా కార్యాలయానికి వెళ్లి, అధికారికంగా వివాహం చేసుకోవాలనుకున్నారు. బ్యాంగ్ రాక్ అనేది వివాహ రిజిస్ట్రేషన్ జరిగే ఒక పాపులర్ ప్రదేశం, దీని పేరు థాయ్‌లో "లవ్ టౌన్" అని అర్థం.
ఆ సమయంలో కేవలం పురుషుడు, స్త్రీ (హెటెరోసెక్సువల్) మధ్య వివాహాన్ని మాత్రమే గుర్తించే చట్టాన్ని ఎల్జీబీటీక్యూ+ జంటలు సవాలు చేశాయి. రుంగ్తివా, ఫన్లవీ సుమారు 400 మంది జంటలతో కలిసి వివాహం కోసం వేచిచూశారు.
కానీ, ఈ జంటకు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తిరస్కరించారు. థాయ్ మీడియా వారి ప్రయత్నాన్ని అపహాస్యం చేసింది. లెస్బియన్లపై అభ్యంతరకరమైన భాషను వాడింది.


ఫొటో సోర్స్, Rungtiwa Thangkanopast
మద్దతుగా 400 ఓట్లు
వివాహ చట్టాలను మార్చాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు సామాజిక కార్యకర్తలు కృషి చేశారు. పార్లమెంటులో పౌర భాగస్వామ్య బిల్లు ప్రవేశపెట్టారు. ఇది స్వలింగ జంటలకు కొంత గుర్తింపును అందిస్తుంది కానీ, హెటెరోసెక్సువల్ (ఆడ, మగ) జంటల మాదిరి చట్టపరమైన హక్కులను అందించదు.
2014లో జరిగిన సైనిక తిరుగుబాటు కారణంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడం వల్ల ఈ బిల్లు పురోగతి ఆలస్యమైంది. పూర్తి వివాహ సమానత్వం ఆమోదం దక్కడానికి మరో దశాబ్దం పట్టింది. బిల్లుకు యువ, ప్రగతిశీల రాజకీయ పార్టీలు పాక్షికంగా మద్దతునిచ్చాయి. కాలక్రమేణ వైఖరులు మారాయి. అనేక పాశ్చాత్య దేశాలు స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశాయి. థాయ్ సంస్కృతిలో స్వలింగ సంబంధాలను మరింతగా ఆమోదించారు.
గత సంవత్సరం థాయ్ పార్లమెంటులో బిల్లుకు అనుకూలంగా 400 ఓట్లు, వ్యతిరేకంగా 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. కన్జర్వేటివ్ సెనేట్‌లో కూడా కేవలం నలుగురు సభ్యులు మాత్రమే దీనిని వ్యతిరేకించారు.
ఇప్పుడు, రుంగ్తివా, ఫన్లవీ వంటి జంటలు బహిరంగంగా, జనం ఎగతాళి చేస్తారనే భయం లేకుండా తమ ప్రేమను చాటుకుంటున్నారు.
"ఈ చట్టంతో మా కుటుంబానికి చట్టబద్ధత వచ్చింది" అని రుంగ్తివా చెప్పారు.
కొత్త చట్టం వివాహానికి సంబంధించిన థాయ్ సివిల్ కోడ్‌లోని 70 విభాగాల నుంచి పురుషుడు, స్త్రీ, భర్త, భార్య వంటి లింగ-నిర్దిష్ట పదాలను తొలగిస్తుంది. ఈ నిబంధనలను వ్యక్తిగత, జీవిత భాగస్వామి వంటి తటస్థ పదాలతో భర్తీ చేస్తారు.

ఫొటో సోర్స్, Benjamin Begley/ BBC
కొన్ని చట్టాలలో రాని మార్పు..
థాయిలాండ్‌లో జెండర్ న్యూట్రాలిటీ లేని అనేక చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి. స్వలింగ జంటలు పిల్లలను కనేందుకు సరోగసీని ఉపయోగించడంలో సవాళ్లను ఎదుర్కొంటారు. థాయ్ చట్టం ఇప్పటికీ తల్లిదండ్రులను "తల్లి, తండ్రి"గా నిర్వచిస్తోంది. అధికారిక పత్రాలలో తమకు నచ్చిన జెండర్ రాసే వెసులుబాటు లేదు. ఈ మార్పుల కోసం నిరంతరం పోరాడుతామని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.
అయినప్పటికీ, వివాహ సమానత్వాన్ని గుర్తించిన ఆసియాలోని అతికొద్ది దేశాలలో థాయిలాండ్ ఒకటి.
"స్వలింగ సంపర్కులకు నిజమైన ప్రేమ దక్కదనే పాత ఆలోచనను ప్రజలు విడిచిపెట్టాలి" అని చక్రిత్ ఇంక్ వధనవీర చెప్పారు.
అతను, అతని భాగస్వామి ప్రిన్ 24 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. చక్రిత్ తల్లిదండ్రులు వారి సంబంధాన్ని వెంటనే అంగీకరించినప్పటికీ, ప్రిన్ తల్లిదండ్రులు ఏడు సంవత్సరాల తర్వాత ఓకే చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














