లాస్ ఏంజలెస్: కార్చిచ్చుకు 5 కారణాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మ్యార్థ హెన్నిక్స్, జోసిలిన్ టింపర్లే, రిచర్డ్ గ్రే
లాస్ ఏంజలెస్‌లో మంటల తీవ్రత అంత ఎక్కువగా ఉండటానికి కారణమేంటి? అవి ఎందుకంత వేగంగా వ్యాపిస్తున్నాయనే విషయాలను బీబీసీ ఎర్త్ బృందం పరిశీలించింది.
జనవరి 7వ తేదీ ఉదయం తమ ఇళ్లకు సమీపంలోని కొండల్లో పొగలు వ్యాపించడాన్ని లాస్ ఏంజలెస్‌కు పశ్చిమాన ఉన్న పాలిసేడ్స్ లో నివసించేవారు గుర్తించారు. అప్పటికే 10 ఎకరాల మేర విస్తరించిన మంటలు, కేవలం 25 నిమిషాల్లోనే 200 ఎకరాలకు పైగా వ్యాపించాయి.
ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మంటలు పెద్ద ఎత్తున ఇళ్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు ఇలా చాలా ప్రాంతాలను చుట్టుముట్టేశాయి.
ఈ మంటలు లాస్ ఏంజలెస్‌లోని చాలా ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. నామరూపాల్లేకుండా నాశనం చేశాయి. జనవరి 9వ తేదీ ఉదయానికల్లా పాలిసేడ్స్ లో 17,234 ఎకరాలను చుట్టుముట్టిన మంటలు లాస్‌ఏంజలెస్‌లోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించాయి. నగర చరిత్రలోనే అత్యంత దారుణమైన కార్చిచ్చుగా దీనిని ఎక్యూ వెదర్స్ చీఫ్ మెటియోరాలజిస్ట్ జోనాథన్ అభివర్ణించారు.
ఇప్పటివరకూ 31 వేల ఎకరాలకు పైగా మంటలు వ్యాపించాయి. లక్షలాది మంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. వందలాది భవనాలు కాలి బూడిదయ్యాయి. ఈ గణాంకాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు ఇంకా అదుపులోకి రాలేదు.
కాలిఫోర్నియా అగ్నిమాపకాధికారులు చెబుతున్న దాని ప్రకారం, ఈ ప్రాంతంలో కనీసం ఐదుచోట్ల కార్చిచ్చులు చెలరేగాయి.

మొట్టమొదట, తీరప్రాంతంలో చెలరేగిన మంటలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పసిఫిక్ తీర పరిసర ప్రాంతాలతో పాటు భారీ భూభాగాన్ని మంటలు బుగ్గిచేశాయి. ఇందులో మెల్‌గిబ్సన్, హిల్టన్ వంటి ప్రముఖుల ఇళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మరో మూడుచోట్ల మంటలు చెలరేగాయి, వాటికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
గురువారం వెస్ట్ హిల్స్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
మంటల కారణంగా నగరం నలుమూలలా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటి కమ్మేసింది. భారీ సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలేసి బయటికి రావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకున్నాయి. స్కూల్స్, యూనివర్సిటీలను మూయించేశారు.
మంటలు అత్యంత వేగంగా, ఇంత భారీ స్థాయిలో వ్యాప్తి చెందడానికి గల 5 కారణాలు ఏంటో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
మంటలకు ఇంధనంగా వృక్షసంపద
ఎల్‌నినో ప్రభావంతో 2024లో భారీ వర్షాలు కురవడం.. ఈ శీతాకాలంలో భారీగా మంటలు వ్యాప్తి చెందే ముప్పుకు దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు.
''సాధారణంగా, వర్షాల వల్ల మంటలు చెలరేగే అవకాశం తక్కువని అనుకుంటారు, కాకపోతే మంటలు మండుతున్న సమయంలో కురిస్తే మాత్రమే అలా జరుగుతుంది'' అని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో ఫైర్‌సైన్స్ రీసర్చర్ రోడి హ్యాడెన్ అన్నారు.
అయితే, మంటలు వ్యాప్తి చెందే సీజన్‌కు ముందు వర్షాలు కురిసినట్లయితే చెట్లు ఎక్కువగా పెరిగి, అవి మంటలకు ఇంధనంగా మారతాయని ఆమె అంటున్నారు.
''వర్షాలు పడిన తర్వాత పొడి వాతావరణం ప్రారంభం కాగానే, అప్పుడు పెరిగిన చెట్లు వేగంగా ఎండిపోవడం మొదలవుతుంది. అలా అవి మంటలకు ఇంధనంగా మారతాయి'' అని రోరి హ్యాడెన్ చెప్పారు.
2024లో వర్షాలు, ఆ తర్వాత పొడి వాతావరణం రావడం వంటివి మంటల వ్యాప్తికి అనుకూలంగా మారాయని యూకే సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ హైడ్రాలజీ మారియా లూసియా ఫెర్రీరా ఒక ప్రకటనలో తెలిపారు.
బాగా తడిగా ఉండే వాతావరణం నుంచి ఒక్కసారిగా అతి పొడి వాతావరణానికి మారడాన్ని ''హైడ్రోక్లైమేట్ విప్లాష్'' అంటారు. 20వ శతాబ్దం మధ్య కాలం, అంటే 1950ల నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ హైడ్రోక్లైమేట్ విప్లాష్ ఏర్పడే ప్రమాదం 31 నుంచి 66 శాతానికి పెరిగినట్లు ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, Nasa Earth Observatory
శాంటా అనా పెనుగాలులు
శక్తిమంతమైన పెనుగాలులు కూడా మంటలు మరింత వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయి. లాస్ ఏంజలెస్‌కు పశ్చిమాన పర్వత ప్రాంతాల్లో ప్రారంభమైన మంటలను ఈ పెనుగాలులు వేగంగా కదిలే కార్చిచ్చుగా మార్చాయి, అది అప్పటికే ఎండిపోయిన చెట్లను తనలో కలిపేసుకుంటూ శాంటా మోనికా సమీపంలోని పసిఫిక్ తీరప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఈ గాలులు పొడిగా, అత్యంత వేడిగా ఉండడం వల్ల త్వరగా చెట్లలోని తేమపోయి, పూర్తిగా ఎండిపోతాయి.
"ఈ కార్చిచ్చుల్లో ప్రధానంగా మూడు విషయాలుంటాయి. మంటలు అంటుకోవడం, ఆ తర్వాత ఆ మంటలు మండడానికి ఇంధనం(ఏదైనా తగలబడే వస్తువు), గాలిలో ఉండే ఆక్సిజన్" అని హ్యాడెన్ చెప్పారు.
''కాలిఫోర్నియా ఎడారి మధ్య నుంచి వీచిన ఈ పెనుగాలుల వేగం మంటల వ్యాప్తిని ఊహించలేని స్థాయిలో తీవ్రతరం చేసింది'' అని ఆమె అన్నారు.
వీటిని శాంటా అనా గాలులు లేదా ఫాన్ గాలులుగా పిలుస్తారు. ఇవి మంటలు కార్చిచ్చుగా మారేందుకు కారణమవుతాయి. ''ఇవి చాలా పొడిగా ఉండే గాలులు. చాలా వేగంగా వీస్తాయి, అందువల్ల మంటలు చెలరేగగానే వాటిని అత్యంత వేగంగా వ్యాప్తిచేస్తాయి'' అని హ్యాడెన్ చెప్పారు.
''ఈ పెనుగాలులు గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంగా వీస్తాయని రిపోర్టులున్నాయి. అందువల్ల ఈ పెనుగాలులు మంటలకు తోడై, ఆ మంటలు కూడా అంతేవేగంగా ఒకచోటు నుంచి మరో చోటుకి వ్యాప్తి చెందేందుకు కారణమవుతాయి'' అని ఆమె అన్నారు.
ఈ గాలులు కొన్నిసార్లు మంటలు చెలరేగడానికి లేదా అంటుకోవడానికి కూడా కారణం కావొచ్చు. ఈ గాలుల ధాటికి విద్యుత్ తీగలు కిందకు వంగినప్పుడు, చెట్లకు తగిలి మంటలు వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
నిప్పురవ్వలు
గాలులు మంటలు ఎగసిపడేందుకు కారణం కావడం మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాలకు కూడా మంటలను వ్యాపింపజేస్తాయి. ఇవి నిప్పురవ్వలు లేదా నిప్పుకణికలను కూడా మోసుకెళ్తాయి. ఈ నిప్పుకణికలు ఆస్తి నష్టం జరగడానికి ప్రధాన కారణమని హ్యాడెన్ చెప్పారు.
''అంటే, రోడ్లు, భవనాలు వంటివి'' అని ఆమె అన్నారు. ఈ నిప్పుకణికలను ఏవీ ఆపలేవని, అవి ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్తాయని అన్నారు.
ఈ గాలులు కాలిపోతున్న చెట్ల నుంచి నిప్పురవ్వలను రేపి వాటిని మరోచోటుకి తీసుకెళ్తాయి. ఆ నిప్పురవ్వలు మంటలు మండుతున్న ప్రదేశం నుంచి కొద్ది మీటర్ల దూరంలోనే పడొచ్చు, అక్కడ కొత్తగా మంటలు రేపొచ్చు. లేదంటే గాలులతో పాటు కొన్ని మైళ్త దూరం కూడా వెళ్లిపడి, అక్కడ కొత్త మంటలు రేపొచ్చు.
''ఇవి పదుల కిలోమీటర్ల దూరం వెళ్లిపడి, ఇళ్ల సందుల్లో, లేదంటే ఇంటి పరిసరాల్లోని చెట్లలో చిక్కుకుని, ఆ తర్వాత అవి ఇళ్లను తగలబెట్టినట్లు రిపోర్టులు కూడా ఉన్నాయి'' అని హ్యాడెన్ చెప్పారు.
ఒక నిప్పురవ్వ కారణంగా ఒక ఇల్లు కాలిపోతే అగ్నిమాపక సిబ్బంది దానిని ఆర్పేయగలరు. ''కానీ ఇక్కడ సమస్యేంటంటే.. ఈ నిప్పురవ్వల వల్ల ఒకే సమయంలో పదుల సంఖ్యలో ఇళ్లు కాలిపోతాయి. ఆ తర్వాత ఆ కాలిపోతున్న ప్రతి ఇల్లు ఇంకా మరిన్ని నిప్పురవ్వలను వెదజల్లుతుంది'' అని హ్యాడెన్ చెప్పారు. ''అందువల్ల, గాలి ద్వారా వ్యాపించే నిప్పురవ్వలతో ప్రమాదం పొంచి ఉన్నట్లే'' అన్నారామె.
వీటి వల్ల ఆస్తి నష్టం మాత్రమే కాదు, మనుషులకు కూడా అత్యంత ప్రమాదకరం.
''అది అగ్ని గుండం లాంటిది. ఆక్సిజన్ కూడా అందదు'' అని అలెక్ గెల్లిస్ బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో అన్నారు. ఈయన ప్రియురాలి ఇల్లు ఇటీవల మంటల్లో కాలిపోయింది.
ఆ సమయంలో ''నేను నా కారు దగ్గరకు కూడా వెళ్లలేకపోయా'' అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images/ Maxar
కొండలు, లోయలు
ఇది పర్వత ప్రాంతం కావడం వల్ల కూడా కార్చిచ్చుల ప్రమాదం ఎక్కువ.
''కొండలపైకి మంటలు వేగంగా వ్యాపిస్తాయి. లోయలు, లోతట్టు ప్రాంతాల వంటి భౌగోళిక ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా తీవ్రంగా ఉంటాయి, వాటిని అదుపులోకి తీసుకురావడం కూడా దాదాపు అసాధ్యం'' అని హ్యాడెన్ చెప్పారు.
ఇలాంటి భౌగోళిక పరిస్థితులు అగ్నిప్రమాదాల తీవ్రతను పెంచడమే కాకుండా, అక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షితంగా బయటపడడం కూడా కష్టతరం చేస్తాయి. తీరప్రాంతంలో మంటలు వ్యాపించినప్పుడు, అక్కడి ప్రజలు ఖాళీ చేసి వెళ్దామన్నా కొండవాలులో ఇరుకైన రోడ్లమీదుగా బయటపడడం వారికి అదనపు సవాల్‌గా మారుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పులు
ఈ కార్చిచ్చుకు వాతావరణ మార్పులు ఎంతవరకూ కారణమనే విషయాలను ఇప్పుడే నిర్ధారించలేకపోయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులు తీవ్రతరం కావడానికి, వాతావరణ మార్పులకు సంబంధముంది.
అగ్నిప్రమాదాలు సంభవించే రోజుల సంఖ్య వాతావరణం కారణంగా పెరుగుతూ వస్తోందని, వాతావరణ మార్పులు ఈ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తున్నాయని మ్యాట్ మెక్‌గ్రాత్ బీబీసీ కోసం రిపోర్ట్ చేశారు.
భూమి వేడెక్కడం అంత చిన్నవిషయం కాదని హ్యాడెన్ అన్నారు. మనం చూస్తున్న ఈ తీవ్రమైన పరిణామాలు కూడా అందులో భాగమేనని అభిప్రాయపడ్డారు.
''వేడి వాతావరణం, దానికితోడు పెనుగాలులు, అలాగే చెట్లు పెరగడానికి అనుకూలమైన వర్షపాతం వంటి అంశాలతో ఇది ముడిపడి ఉంది. అందువల్ల ఈ భారీ మార్పును వేడి - పొడి వాతావరణం, వర్షపాతం, గాలుల కోణంలో మాత్రమే కాకుండా.. దీనికి కారణమయ్యే అవకాశమున్న వాతావరణంలోని అన్ని కోణాల నుంచి దీనిని పరిశీలిస్తున్నాం. అదే పొంచివున్న ముప్పును నిర్వచించనుంది.''
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














