‘‘నీ భర్త చిత్ర హింసలు ఎదుర్కొంటున్నాడు. ఇదంతా నీ తప్పే''

- రచయిత, విల్ వెర్నోన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్విత్లానా ఎప్పుడూ తన దేశానికి ద్రోహం చేయాలని అనుకోలేదు. ఆమె క్షణకాలం కూడా అలాంటి ఆలోచనలు చేయలేదు.
యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లోని తన ఇంట్లో ఆమెను కలిసినప్పుడు, ''నా భర్త నన్నెప్పటికీ క్షమించకపోయేవాడు'' అని ఆమె అన్నారు.
42 ఏళ్ల స్విత్లానా, రష్యా ఆధీనంలో ఉన్న తన భర్త డీమా గురించి తెలుసుకోవడానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆర్మీ వైద్యుడు అయిన డీమాను రష్యా నిర్బంధించింది. స్విత్లానాకు ఒకరోజు గుర్తు తెలియని ఫోన్ కాల్ వచ్చింది.
''నువ్వు యుక్రెయిన్‌కు ద్రోహం చేస్తే, డీమాకు జైల్లో మెరుగైన చికిత్స ఇప్పిస్తాం. కుదిరితే వీలైనంత త్వరగా బయటకు పంపిస్తాం'' అని ఆ ఫోన్‌లో ఆమెకు ఒక గొంతు వినిపించింది.

''ఒక యుక్రెయిన్ నంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తన పేరు దిమిత్రీ అని చెప్పారు. రష్యా యాసలో ఆయన మాట్లాడారు. నువ్వు ఒక మిలిటరీ ఎన్‌లిస్ట్‌మెంట్ ఆఫీసును లేదా ఒక మిలిటరీ వాహనాన్ని తగులబెట్టాలి. లేదా యుక్రెయిన్ రైల్వేస్ ఎలక్ట్రికల్ బాక్స్‌ను ధ్వంసం చేయాలి'' అని ఆ వ్యక్తి తనతో చెప్పినట్లు స్విత్లానా వివరించారు.
దీంతోపాటు రష్యా డ్రోన్లు, క్షిపణుల నుంచి యుక్రెయిన్ గగనతలాన్ని కాపాడే డిఫెన్స్ యూనిట్ల లొకేషన్‌ను బహిర్గతం చేయాలనే మరో అవకాశాన్ని కూడా ఆమెకు ఇచ్చారు.
దిమిత్రీ ఈ ప్రతిపాదనల గురించి చెబుతున్నప్పుడు, యుక్రెయిన్ అధికారులు చెప్పిన సూచనలను గుర్తు చేసుకున్నానని స్విత్లానా తెలిపారు.
ఒకవేళ రష్యా ఏజెంట్లు సంప్రదిస్తే ఎలా ప్రతిస్పందించాలో సూచిస్తూ కుటుంబాలకు యుక్రెయిన్ అధికారులు కొన్ని సూచనలు చేశారు. వీలైనంత ఎక్కువ సమయం వారిని ఎంగేజ్ చేయడంతో పాటు, ప్రతి అంశాన్నీ రికార్డ్ చేయాలని, ఫోటోలు తీయాలని అధికారులు సూచించినట్లు ఆమె చెప్పారు.వారు చెప్పినట్టుగానే స్విత్లానా మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీశారు. వాటిని బీబీసీకి చూపించారు.

యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఎస్‌బీసీ చెప్పినట్లుగా, ఆమె ఒక స్థానిక రైల్వే లైన్‌పై బాంబులు వేయడానికి అంగీకరించినట్లుగా రష్యా ఏజెంట్ల ముందు నటించారు.
టెలిగ్రామ్ యాప్‌లో దిమిత్రీ చేసిన రెండు వాయిస్ కాల్స్ రికార్డింగ్‌లను ఆమె మాకు వినిపించారు. ఆ కాల్స్‌లో మోలోటోవ్ కాక్‌టెయిల్ పేలుడు పదార్థాన్ని ఎలా తయారు చేయాలి? వాటిని ఎలా ఉపయోగించాలనే అంశంపై దిమిత్రీ ఆమెకు సూచనలు చేస్తున్నారు.
''ఒక లీటర్ లైటింగ్ ద్రవంలో కాస్త పెట్రోల్ పోయండి. ఏదైనా ఒక రైల్వే జంక్షన్ వద్దకు వెళ్లండి. అక్కడ సెక్యూరిటీ కెమెరాలు లేకుండా చూసుకోండి. కావాలంటే ఒక టోపీ ధరించు'' అంటూ తనకు ఆ వ్యక్తి సూచించినట్టు స్విత్లానా వివరించారు.
''పని పూర్తయ్యాక దానికి సంబంధించిన రుజువులు పంపించు. కాగితంపై ఈ రోజు తేదీ రాసి, పని పూర్తయ్యాక ఆ కాగితాన్ని ఫోటో తీసి పంపించు'' అని దిమిత్రీ డిమాండ్ చేసినట్లు ఆమె తెలిపారు.
ఈ పని చేసినందుకు బదులుగా తన భర్తతో ఫోన్ కాల్ మాట్లాడే అవకాశం లేదా తన భర్తకు ఏదైనా పార్సిల్ పంపించే అవకాశం ఇస్తానని దిమిత్రీ చెప్పినట్లుగా స్విత్లానా వివరించారు.

ఫొటో సోర్స్, Ukrainian Police Service
''నాతో మాట్లాడుతున్న వ్యక్తి రష్యాలో ఉన్నారని, ఆయనతో ఇక మాట్లాడొద్దని ఎస్‌బీయూ చెప్పింది. దీంతో నేను ఆ పని చేయలేనని దిమిత్రీకి చెప్పేశాను. అప్పటి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. నీ భర్తను చంపేస్తాం, జీవితంలో మళ్లీ నీ భర్తను చూడలేవు. నీ భర్త చిత్ర హింసలు ఎదుర్కొంటున్నాడు. ఇదంతా నీ తప్పే.. అంటూ కొన్ని రోజుల పాటు ఆయన నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి’’ అని స్విత్లానా వివరించారు.
డీమా గురించి ఎంత ఆందోళన చెందారని ప్రశ్నించినప్పుడు స్విత్లానా కళ్లు చెమ్మగిల్లాయి.
''నా గుండె బద్ధలయ్యేది. దేవుడా, అతనికేమీ కావొద్దంటూ దేవుడిని ప్రార్థించేదాన్ని. ఓవైపు, నాతో మాట్లాడుతున్న వ్యక్తికి ఖైదీలతో ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చని నా మనసు చెబుతుండేది. మరోవైపు, ఒకవేళ అతని పరిధిలోనే నా భర్త ఉండి ఉంటే ఎలా? అని భయం వేసేది. తను లేకుండా ఎలా బతకాలి? అని భయపడేదాన్ని'' అని స్విత్లానా గుర్తు చేసుకున్నారు.
రష్యా ఏజెంట్లకు సహకరించడం ఏవిధంగానూ ఖైదీల దుస్థితిని మెరుగుపరచకపోగా, వారు విడుదలయ్యే అవకాశాలను సంక్లిష్టం చేస్తుందని బీబీసీకి ఎస్‌బీయూ చెప్పింది.
ఒకవేళ రష్యా ఏజెంట్లు సంప్రదిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటూ ఖైదీల కుటుంబాలను, బంధువులను పోలీసు అధికారులు కోరుతున్నారు.
ఇలా చేస్తే వారికి తగిన రక్షణ కల్పిస్తామని, ఇలా కాకుండా విధ్వంసం లేదా గూఢచర్యం చేయడానికి అంగీకరిస్తే దేశద్రోహంగా పరిగణించి జీవిత ఖైదు పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది.

యుద్ధ ఖైదీలకు చెందిన దాదాపు 50 శాతం కుటుంబాలను రష్యా ఏజెంట్లు సంప్రదించారని యుక్రెయిన్ మిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన పెట్రో యాట్సెంకో తెలిపారు.
''వారు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంటారు. తమ వారిని కాపాడుకోవడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ, వారు చెప్పేది చేయడం వల్ల బందీలుగా ఉన్న తమ వారికి ఎలాంటి ప్రయోజనం కలగదని వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని పెట్రో చెప్పారు.
ఉదాహరణకు ఎవరైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు సంబంధించిన లొకేషన్‌ను రష్యన్లకు చేరవేస్తే అది యుక్రెయిన్‌కు చాలా పెద్ద సమస్య అవుతుందని పెట్రో అన్నారు.
యుద్ధ ఖైదీలుగా పట్టుబడిన యుక్రెయిన్ల సంఖ్యను అధికారులు వెల్లడించరు. కానీ, ఈ సంఖ్య 8,000కు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రష్యా ఏజెంట్లకు సహకరించి, వారితో పనిచేయడానికి ఒప్పుకున్న ఖైదీల కుటుంబాల సంఖ్య చాలా తక్కువేనని బీబీసీతో యుక్రెయిన్ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఒకరు చెప్పారు.
యుద్ధ ఖైదీల కుటుంబాలను ఎరగా వాడుకుంటున్నారంటూ వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఒక ప్రకటనలో రష్యా ప్రభుత్వం పేర్కొంది. జెనీవా కన్వెన్షన్ ప్రకారం, యుక్రెయిన్ సైనికుల పట్ల మానవత్వంతో వ్యవహరిస్తున్నామని తెలిపింది.
పైగా యుక్రెయిన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని రష్యా ఆరోపించింది.

స్విత్లానా భర్త డీమా మూడు నెలల క్రితం రష్యా నిర్బంధం నుంచి విడుదలయ్యారు.
ఈ జంట ఇప్పుడు తమ నాలుగేళ్ల కుమారుడు వోవాతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు.
డీమా విడుదలైనప్పుడు సంతోషంతో దు:ఖం ఆగలేదని స్విత్లానా వివరించారు.
''సంతోషంతో నేను ఎప్పుడూ లేనంతగా ఏడ్చాను. మరణం అంచుల నుంచి మళ్లీ నా ప్రేమను తిరిగి పొందినట్లు అనిపించింది'' అని స్విత్లానా చెప్పారు.
స్విత్లానా సహాయ నిరాకరణకు బదులుగా రష్యన్లు తనపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదని డీమా ఆమెకు చెప్పారు.
తనకు వచ్చిన ఫోన్ కాల్స్ గురించి స్విత్లానా చెప్పినప్పుడు డీమా షాకయ్యారు.
''వాటిని తట్టుకొని ఎలా నిలబడ్డావు'' అని డీమా అడిగినప్పుడు, ''నేనొక అధికారి భార్యను'' అంటూ ఆమె బదులిచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














