పాతికేళ్లుగా అధికారంలో ఉన్న పుతిన్ ‘రష్యాను జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పిన బోరిస్ ఎల్సిన్ మాట పాటించారా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్టీవ్ రోసెన్‌బర్గ్
- హోదా, బీబీసీ రష్యా ఎడిటర్
1999 డిసెంబర్ 31వ తేదీని నేను ఎన్నటికీ మర్చిపోలేను.
అప్పట్లో నేను బీబీసీ మాస్కో బ్యూరోలో ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నాను. హఠాత్తుగా మాకొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ పదవి నుంచి దిగిపోయారన్నది ఆ వార్త.
అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్న ఆయన నిర్ణయం మాస్కోలోని బ్రిటిష్ మీడియా రిపోర్టర్లు సహా అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ వార్త వచ్చినప్పుడు ఆఫీసులో రిపోర్టర్ ఎవరు లేరు. దీంతో నేనే ఆ వార్త రాసి తొలిసారిగా బీబీసీలో ప్రసారం చేశాను.
"పూర్తి కాలం అధ్యక్ష పదవిలో కొనసాగాలని భావిస్తున్నట్లు బోరిస్ ఎల్సిన్ తరచూ చెబుతుండేవారు. అయితే తాను మనసు మార్చుకున్నట్లు ఆయన ఇవాళ రష్యన్లకు చెప్పారు" అని నేను ఆ వార్తలో రాశాను.
రిపోర్టర్‌గా నా కెరీర్ అలా మొదలైంది.
అప్పుడే రష్యా నాయకుడిగా వ్లాదిమిర్ పుతిన్ కాలం కూడా మొదలైంది.
ఎల్సిన్ రాజీనామాతో రష్యా రాజ్యాంగం ప్రకారం అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న వ్లాదిమిర్ పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. మూడు నెలల తర్వాత ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు.
రష్యా అధ్యక్ష భవనాన్ని వదిలి వెళుతూ ఎల్సిన్ పుతిన్‌కు ఒక సూచన చేశారు. "రష్యాను జాగ్రత్తగా చూసుకో" అనేదే ఆ సూచన.

యుక్రెయిన్‌లో విధ్వంసం
యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి మూడేళ్లవుతున్న ఈ సమయంలో అప్పట్లో ఎల్సిన్ చెప్పిన మాటలను నాకు పదేపదే గుర్తుకొస్తున్నాయి.
ఎందుకంటే పుతిన్ యుక్రెయిన్‌తో మొదలు పెట్టిన యుద్ధం విధ్వంసకర పరిణామాలకు దారి తీసింది.
ప్రధానంగా ఈ యుద్ధం వల్ల యుక్రెయిన్‌లోని అనేక నగరాల్లో భారీ విధ్వంసం, ప్రాణ నష్టం ఏర్పడింది.
యుక్రెయిన్‌లో 20శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. కోటి మంది యుక్రెయిన్ ప్రజలు నిరాశ్రయులయ్యారు.
రష్యా కూడా ఈ యుద్ధంతో నష్టపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యాకూ భారీ నష్టం
యుక్రెయిన్‌పై ‘ప్రత్యేక సైనిక చర్య’ పేరుతో పుతిన్ మొదలు పెట్టిన ఈ యుద్ధం రష్యాకూ భారీ నష్టం కలిగించింది.
రష్యాలో పట్టణాలు, నగరాల మీద నిరంతరం డ్రోన్ దాడులు జరుగుతున్నాయి.
యుక్రేనియన్ సైనికులు రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు.
రష్యా ఆర్థిక వ్యవస్థ మీద అంతర్జాతీయంగా ఆంక్షలతో ఒత్తిడి పెరుగుతోంది.
రష్యా ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.. అణచివేత పెరిగింది.
పాతికేళ్ల కిందట పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేను రిపోర్టింగ్ చేస్తున్నాను.
రష్యా కొత్త నాయకుడు రెండున్నర దశాబ్ధాల తర్వాత కూడా అధికారంలో ఉంటారని, రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుందని, పశ్చిమ దేశాలతో గొడవ పడుతుందని 1999 డిసెంబర్ 31న ఎవరూ ఊహించలేదు.

ఫొటో సోర్స్, Reuters
‘మేక్ రష్యా గ్రేట్ అగైన్’ అనేదే పుతిన్ లక్ష్యమా?
బోరిస్ ఎల్సిన్ తన వారసుడిగా వేరే ఎవరినైనా ఎంచుకుని ఉంటే ఈ రెండున్నర దశాబ్దాల చరిత్ర ఎలా ఉండేదో అని నేను తరచూ అనుకునేవాడిని.
బహుశా ఇది మేధోపరమైన ప్రశ్న కావచ్చు. చరిత్ర ఎప్పుడూ.. అయితే, కాకుంటే, బహుశా వంటి వాటితో నిండి ఉంటుంది.
ఒక్క విషయం మాత్రం సుస్పష్టంగా చెప్పగలను. పాతికేళ్ల నుంచి నేను ‘రకరకాల పుతిన్’లను చూశాను.
నా ఒక్కడికే కాదు చాలామందికి అలా అనిపించి ఉండొచ్చు.
‘నేను కలిసిన పుతిన్ వ్యవహార దక్షతలో సమర్థుడు. నేటో - రష్యా కొన్సిల్ ఏర్పాటు చేయడమనేది చాలా వైవిధ్యభరితమైనది. ప్రస్తుతం ఆయనకున్న అధికార కాంక్షకు ఇది పూర్తిగా భిన్నమైనది’ అని నేటో మాజీ చీఫ్ లార్డ్ రాబర్ట్సన్ 2023లో నాతో చెప్పారు.
‘2022 మేలో నా పక్కనే కూర్చుని యుక్రెయిన్ సార్వభౌమ, స్వతంత్ర దేశం.. అది దాని భద్రత గురించి సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పిన పుతిన్ ఇప్పుడు యుక్రెయిన్ అసలు దేశమే కాదంటున్నారు’ అన్నారు రాబర్ట్సన్.
‘యుక్రెయిన్ స్వతంత్ర దేశం అని చెప్పిన కాలంలో పుతిన్ చర్మం చాలా పలచగా ఉండేదేమో.. అప్పట్లో ఆయనకు తన దేశం కోసం భారీ లక్ష్యాలు ఉన్నాయని అనుకున్నాను. సోవియట్ యూనియన్ ప్రపంచంలో రెండో అతి పెద్ద శక్తిగా గుర్తింపు పొందింది. కానీ, రష్యా ఆ దిశగా ఏమీ సాధించలేకపోయింది. బహుశా ఈ అంశం ఆయన అహాన్ని దెబ్బ తీసి ఉండవచ్చు’ అన్నారు రాబర్ట్సన్.
పుతిన్‌లో మనం చూసిన మార్పుకు ఇదొక వివరణగా భావించవచ్చు. పుతిన్‌ను దహించి వేస్తున్న లక్ష్యం "మేక్ రష్యా గ్రేట్ అగైన్" ( ప్రచ్ఛన్న యుద్ధంలో మాస్కో ఓడిపోయిందని భావిస్తున్న అనేకమంది కోసం ఆయన ఈ లక్ష్యం పెట్టుకుని ఉండవచ్చు).
ఆయనకున్న ఈ లక్ష్యం పొరుగువారితో పాటు పశ్చిమ దేశాలతో ఘర్షణకు దారి తీసింది.
అయితే దీనికి రష్యా అధ్యక్ష భవనం వివరణ మరోలా ఉంది.
పుతిన్ ప్రసంగాలు, వ్యాఖ్యలు చూస్తే ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నట్లు అనిపిస్తుంది. పశ్చిమ దేశాలు రష్యాకు చాలా కాలంగా అబద్దాలు చెబుతున్నాయని.. రష్యాకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని, తమ భద్రతను పశ్చిమ దేశాలు కొట్టిపారేస్తున్నాయనే భావనలో ఆయన ఉన్నారు.
అయితే ‘రష్యాను జాగ్రత్తగా చూసుకో’ అంటూ ఎల్సిన్ చేసిన సూచనను పాటించానని పుతిన్ నమ్ముతున్నారా?
దీని గురించి తెలుసుకునేందుకు నాకు ఇటీవలే అవకాశం వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యాను అగాథపు అంచుల నుంచి కాపాడానన్న పుతిన్
2024 సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న సందర్బంగా ఆయన సుదీర్ఘమైన నాలుగు గంటల ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఏదైనా ప్రశ్న అడగాల్సిందిగా నన్ను కోరారు.
‘రష్యాను జాగ్రత్తగా చూసుకో అని బోరిస్ ఎల్సిన్ మీకు చెప్పారు కదా’ అని నేను ఆయనకు గుర్తు చేశాను.
మీరు చేపట్టిన 'ప్రత్యేక సైనిక చర్య' వల్ల జరిగిన నష్టం సంగతి ఏంటి? కుర్క్స్ ప్రాంతంలో యుక్రెయిన్ సేనలు ఉండటం, ఆర్థిక ఆంక్షలు, అధిక ద్రవ్యోల్బణం.. వంటివి కనిపిస్తున్న వేళ మీరు రష్యాను జాగ్రత్తగా చూసుకున్నానని అనుకుంటున్నారా? అని అడిగాను.
‘అవును’ అని పుతిన్ సమాధానమిచ్చారు.
‘నేను రష్యాను జాగ్రత్తగా చూసుకోవడమే కాదు, రష్యాను అగాథపు అంచుల నుంచి వెనక్కు తీసుకొచ్చాను’ అని చెప్పారు.
ఎల్సిన్ కాలంలో రష్యా తన సార్వభౌమత్వాన్ని కోల్పోయే దశలో ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. పశ్చిమ దేశాలు ఎల్సిన్‌ను మభ్యపెట్టి రష్యాను తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాయి అని ఆయన ఆరోపించారు.
రష్యా స్వతంత్రంగా, సార్వభౌమ దేశంగా ఉండేందుకు తాను అన్నీ చేస్తున్నానని పుతిన్ చెప్పారు.
పుతిన్ తనను తాను రష్యా సార్వభౌమత్వ రక్షకుడిగా చెప్పుకొన్నారు. యుక్రెయిన్‌పై యుద్ధాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో ఆయన కొత్త ఆలోచనతో ముందుకొచ్చారా? లేక ఆధునిక రష్యా చరిత్ర ఇదేనని ఆయన నమ్ముతున్నారా?
దీనిపై నేనిప్పుడే ఏమీ చెప్పలేను. అయితే రానున్న రోజుల్లో ఇదే కీలక ప్రశ్న కావచ్చని అనుకుంటున్నాను.
యుక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధం ఎలా ముగుస్తుందనే విషయంతోపాటు రష్యా భవిష్యత్ ఎలా ఉంటుందనే అంశం ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం ఉండొచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














