రష్యా గ్యాస్ బంద్‌తో చలికాలంలో ఈయూ గజగజ వణకాల్సిందేనా? ఈ చర్య ఎవరికి నష్టం, ఎవరికి లాభం...

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, నిక్ థోర్పే, లారా గోజీ
- హోదా, బీబీసీ న్యూస్
యుక్రెయిన్ మీదుగా యూరప్‌కు రష్యా గ్యాస్ సరఫరాకు తెరపడింది. అయిదేళ్ల ఒప్పందం ముగిసిపోవడంతో రష్యా గ్యాస్ సరఫరా నిలిపేయాల్సి వచ్చింది. దీంతో దశాబ్దాలుగా సాగిన ఈ అంకం ముగిసింది.
ఈ విషయంపై యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ మాట్లాడుతూ, 'మా రక్తం మీద మరిన్ని కోట్లు సంపాదించే అవకాశాన్ని మేం రష్యాకు ఇవ్వబోం’ అన్నారు.
ఇది రష్యాపై సాధించిన మరో విజయమని పోలాండ్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
ఈ మార్పుకు తాము సిద్ధంగా ఉన్నట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. ఈయూలోని సభ్య దేశాలు ఈ మార్పును తట్టుకోగలవని యూనియన్ అంటోంది.
అయితే, యూరోపియన్ యూనియన్‌లో భాగంగా లేని దేశమైన మోల్డోవా ఇప్పటికే గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతోంది.
రష్యా ఇప్పటికీ నల్ల సముద్ర మార్గాన టర్క్ స్ట్రీమ్ ద్వారా హంగరీ, తుర్కియే, సెర్బియా వంటి దేశాలకు గ్యాస్ సరఫరా చేసే అవకాశం ఉంది.

రష్యా నుంచి ఈయూకు గణనీయంగా తగ్గిన దిగుమతులు
రష్యా 1991 నుంచి యుక్రెయిన్ మార్గాన యూరప్‌కు గ్యాస్ సరఫరా చేస్తోంది.
బుధవారం ఉదయం 8 గంటల నుంచి యుక్రెయిన్ మార్గాన యూరప్‌కు రష్యా గ్యాస్ ఎగుమతులు నిలిచిపోయాయని రష్యా కంపెనీ గాజ్ ప్రామ్ ప్రకటించింది.
ఈ నిలిపివేత వల్ల తక్షణ పరిణామాలు అంత తీవ్రంగా లేకపోయినప్పటికీ, భవిష్యత్‌లో యూరప్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.
రష్యా ఒక కీలక మార్కెట్‌ను కోల్పోయింది. కానీ, ఈ మార్పు వల్ల ఎక్కువగా నష్టపోయేది ఈయూ దేశాలేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.
రష్యా 2022లో పూర్తిస్థాయిలో యుక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి రష్యా నుంచి గ్యాస్ దిగుమతులను ఈయూ గణనీయంగా తగ్గించింది.
అయితే, యూరోపియన్ యూనియన్‌లోని పలు సభ్య దేశాలు గ్యాస్ కోసం రష్యా పైనే అధికంగా ఆధారపడటంతో రష్యా ఏటా దాదాపు 5 బిలియన్ యూరోల ( రూ. 43,000 కోట్లు) ఆదాయం ఆర్జించింది.
ఈయూ గ్యాస్ దిగుమతుల్లో రష్యా నుంచి 2023లో వచ్చినది కేవలం 10 శాతమే. 2021లో ఈ దిగుమతులు 40% ఉండేవి.
స్లోవేకియా, ఆస్ట్రియా వంటి ఈయూ సభ్య దేశాలు మాత్రం గ్యాస్ కోసం రష్యా మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
ఈ గ్యాప్‌ను ఎదుర్కొనేందుకు తమ దగ్గర గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, ఇతర మాధ్యమాలనుంచి కూడా తమకు గ్యాస్ సరఫరా అవుతుందని ఆస్ట్రియా ఎనర్జీ రెగ్యులేటర్ వెల్లడించింది.
మరోవైపు, ఈ ఒప్పందం ముగియడంతో స్లోవేకియా ఇబ్బందుల్లో పడింది.
రష్యా నుంచి యూరప్‌కు గ్యాస్ పంపేందుకు స్లోవేకియా ఎంట్రీ పాయింట్ దేశంగా వ్యవహరిస్తోంది. ఇందుకుగాను రవాణ రుసుముల రూపంలో ఆదాయాన్ని పొందింది.
గ్యాస్ దిగుమతి చేసుకోడానికి ఇతర మార్గాలను కనుక్కుంటామని స్లోవేకియా అంటోంది. 2025లో గ్యాస్ ధరలు పెరగనున్నాయని తమ వినియోగదారులను ఉద్దేశించి డిసెంబర్‌లో స్లోవేకియా ఎనర్జీ రెగ్యులేటర్ ప్రకటించింది.
ఈ ఒప్పందం ముగిసిపోవడం వల్ల ఈయూలోని సభ్య దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, రష్యాపై దీని ప్రభావం ఏమీ ఉండదని స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోను ఉటంకిస్తూ వార్తాసంస్థ రాయిటర్స్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘యుక్రెయిన్‌కు విద్యుత్ నిలిపేస్తాం’’
పుతిన్‌తో చర్చలు జరిపేందుకు శుక్రవారం మాస్కోను సందర్శించిన ఫికో, యుక్రెయిన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో పుతిన్‌కు ఆర్థిక బలాన్ని అందిస్తూ, యుక్రెయిన్‌ను బలహీనపర్చేందుకు స్లొవేకియా ప్రయత్నిస్తోందంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ ఆరోపించారు.
యుక్రెయిన్ ప్రజల్ని మరింత ఇబ్బందులు పెట్టేందుకు పుతిన్ చేస్తోన్న ప్రయత్నాల్లోకి స్లొవేకియాను కూడా ఫికో భాగం చేస్తున్నారని ఆయన అన్నారు.
స్లోవేకియా నుంచి వచ్చే విద్యుత్, యుక్రెయిన్‌కు చాల కీలకం. ఒకవేళ స్లొవేకియా విద్యుత్ సరఫరా నిలిపివేస్తే యుక్రెయిన్‌కు తాము అండగా నిలబడేందుకు సిద్ధమని పోలాండ్ ప్రకటించింది.
''అంతర్జాతీయ మార్కెట్ల నుంచి గ్యాస్ సరఫరాకు ప్రత్యమ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఈ మార్గాలని ఎంచుకొని యూరప్‌కు గ్యాస్ సరఫరా చేస్తూ, కోట్లు సంపాదించే అవకాశాన్ని రష్యాకు ఇవ్వకూడదు’’ అని పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సిరోర్స్కీ అన్నారు.
అందుకే అమెరికా, ఖతార్, నార్త్ సీ నుంచి పోలాండ్ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోందని ఆయన చెప్పారు.
అయితే, రష్యా నుంచి గ్యాస్‌ను నిలిపేయడం వల్ల తీవ్రంగా నష్టపోయే దేశం మోల్డోవా.
రష్యా గ్యాస్ ఆధారంగానే ఈ దేశంలోని ఒక పవర్ స్టేషన్ ద్వారా అధిక భాగం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘చలితో అల్లాడుతున్న ప్రజలు’’
చెల్లింపులు చేయకపోవడంతో మోల్డోవాకు జనవరి 1 నుంచి గ్యాస్ సరఫరాను నిలిపేస్తామని డిసెంబర్ 28న రష్యా గ్యాస్ కంపెనీ గాజ్ ప్రామ్ ప్రకటించింది.
ఈ ఆరోపణలను మోల్డోవా అధ్యక్షుడు కొట్టిపారేశారు.
ఇంధనాన్ని రష్యా ఒక రాజకీయ అస్త్రంగా వాడుతోందని ఆయన ఆరోపించారు.
రష్యా చేపడుతున్న చర్యల వల్ల చలికాలం వేళ వేడి, కాంతి లేకుండా ట్రాన్స్‌నిస్ట్రియా అల్లాడుతుందని ఆయన అన్నారు.
స్థానిక కాలమానం ప్రకారం 07:00 గంటలకు గ్యాస్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల ట్రాన్స్‌నిస్ట్రియాకు హీట్, వేడి నీటి సరఫరా ఆగిపోయింది.
ప్రజలంతా వెచ్చని దుస్తులు ధరించాలని, కుటుంబ సభ్యులంతా ఒకే గదిలో ఉండాలని, కిటికీలకు దుప్పట్లు లేదా మందపాటి కర్టెన్లను వేలాడదీయాలని, ఎలక్ట్రిక్ హీటర్లను ఉపయోగించాలని ఎనర్జీ సంస్థ తిరస్తెప్లోఎంఎర్గో సూచించింది.
2025లో సాధారణ ఎన్నికలకు ముందు తమ దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో క్రెమ్లిన్ "బ్లాక్ మెయిల్" చేస్తోందని మోల్డోవా అధ్యక్షుడు మైయా సాండు ఆరోపించారు.
యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి ఖతార్, అమెరికా నుంచి ద్రవీకృత సహజ వాయువు (LNG), అలాగే నార్వే నుంచి పైప్డ్ గ్యాస్ రూపంలో ఈయూ ప్రత్యామ్నాయ వనరులను కనుగొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














