బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: 'రాత్రివేళ భయంభయంగా గడుపుతున్నాం’ అని భారత్, బంగ్లా సరిహద్దు ప్రజలు ఎందుకు చెబుతున్నారు?

భారత్, బంగ్లాదేశ్ బోర్డర్, త్రిపుర
ఫొటో క్యాప్షన్, భారత్ - బంగ్లా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి
    • రచయిత, దిలీప్ కుమార్ శర్మ
    • హోదా, ఇండియా-బంగ్లదేశ్ బోర్డర్ నుంచి, బీబీసీ హిందీ కోసం

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్ హసీనా 2024 ఆగస్ట్ 5న అధికారానికి దూరమయ్యారు. అప్పటి నుంచి భారత్ - బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే వార్తలు నిరంతరం వస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో, భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోనూ ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. సరిహద్దు రాష్ట్రమైన త్రిపురలోని కాళీపూర్ గ్రామంలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది.

కేవలం 40 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో రెండు దేశాల మధ్యగా వెళుతున్న ఇనుప కంచెపై బట్టలు ఆరేసి కనిపించాయి.

కాళీపూర్ గ్రామస్థుల జీవితాలు ఆగస్టు 5వ తేదీకి ముందు సాఫీగా సాగిపోయేవి. కానీ, ఆ తర్వాత నుంచి ఈ ప్రాంతంలో బీఎస్ఎఫ్ నిఘా కట్టుదిట్టమైంది. భయాందోళన వాతావరణం నెలకొంది.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సాయంత్రం ఐదు గంటలకి ఇంకా కొంత సమయం ఉండగానే, కాళీపూర్‌కు చెందిన పుతుల్ మాలాకార్ తన పనులను ముగించుకుని త్వరగా ఇంటికెళ్లి పోవాలనే హడావుడిలో కనిపించారు.

ఆగస్టు 5వ తేదీకి ముందు ఆయనలో ఇంత హడావుడి కనిపించేది కాదు.

ఈ మార్పు, ఇక్కడ నెలకొన్న భయాందోళనల గురించి పుతుల్ మాలాకార్ బీబీసీతో మాట్లాడుతూ, ''ఈ సరిహద్దు ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా టెన్షన్‌గా ఉంటోంది. రాత్రిళ్లు భయంభయంగా గడుపుతున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరొచ్చి(అటువైపు నుంచి) దాడి చేస్తారేమోనన్న భయంగా ఉంటోంది'' అన్నారు.

ఇండియా, బంగ్లాదేశ్, బోర్డర్, త్రిపుర
ఫొటో క్యాప్షన్, కాళీపూర్ గ్రామస్థులు బట్టలు ఆరేసిన ఈ కంచె ఇప్పుడు ఆ గ్రామానికి రక్షణ కవచంలా ఉంది.

గ్రామస్థులు ఏమంటున్నారు?

భారత సరిహద్దులోని ఫెన్సింగ్ ఇప్పుడు ఇక్కడి గ్రామస్థులకు రక్షణ కవచంగా మారింది.

బీఎస్ఎఫ్ అనుమతి లేకుండా ఎవరూ కాళీపూర్ గ్రామంలోకి రాలేరు.

గ్రామంలోకి ప్రవేశించడానికి ముందే బీఎస్ఎఫ్ చెక్‌పోస్టు ఉంటుంది. ఇటువైపు వచ్చి, వెళ్లే వ్యక్తులను నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

కట్టుదిట్టమైన ఈ భద్రతా ఏర్పాట్ల గురించి 67 ఏళ్ల పుతుల్ మాలాకార్ మాట్లాడుతూ, ''బంగ్లాదేశ్‌లో అలజడి రేగినప్పటి నుంచి బీఎస్ఎఫ్ ఇక్కడ నిఘా కట్టుదిట్టం చేసింది. ఐదు నెలల కిందట ఇలాంటి పరిస్థితి లేదు'' అని చెప్పారు.

''అర్ధరాత్రి బయటకు వెళ్లొద్దని కూడా బీఎస్ఎఫ్ చెబుతోంది. సాయంత్రం పొద్దుపోవడానికి ముందే దాదాపు ఇంటికొచ్చేస్తాను. వేరే ఊరి నుంచి ఎవరైనా చుట్టాలు వచ్చినా ముందుగా బీఎస్ఎఫ్ చెక్‌పోస్టులో వాళ్ల ఐడెంటిటీ కార్డులు చూపించాల్సి ఉంటుంది.'' అని తెలిపారు.

భారత్, బంగ్లాదేశ్ బోర్డర్, త్రిపుర
ఫొటో క్యాప్షన్, ఇంటికి త్వరగా వెళ్లిపోవాలని గతంలో మాలాకార్ ఎప్పుడూ హడావుడి పడేవారు కాదు.

''బంగ్లాదేశ్‌లో గందరగోళం కారణంగా మేం మా పొలాలకు కూడా వెళ్లలేకపోతున్నాం. గ్రామంలో చాలా మందికి ఫెన్సింగ్ ఆవలి వైపు భూములున్నాయి. కానీ, ఇప్పుడు ఎవరూ అటువైపు వెళ్లడం లేదు'' అన్నారాయన.

ఈశాన్య భారతంలోని అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాలు 1879 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్‌‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. అందులోనూ త్రిపుర అత్యధికంగా 856 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది.

త్రిపురలోని ఉనాకోటీ జిల్లా ఒక్కటే 73 కిలోమీటర్ల బోర్డర్ కలిగివుంది. ఈ జిల్లాలో కాళీపూర్ వంటి గ్రామాలు 15కి పైగానే ఉన్నాయి.

భారత్, బంగ్లాదేశ్ బోర్డర్, త్రిపుర
ఫొటో క్యాప్షన్, భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు కంచెకు కొద్దిమీటర్ల దూరంలోనే దిలీప్ దాస్ కుటుంబం నివసిస్తోంది.

' విభజనలాంటి పరిస్థితి'

ఈ జిల్లాలో ఓ చిన్న గ్రామమైన సమ్రుర్‌పార్‌‌కి చెందిన దిలీప్ దాస్ కూడా ప్రస్తుత పరిస్థితులతో ఆందోళన చెందుతున్నారు.

భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దులోని ఫెన్సింగ్‌కు కొద్దిమీటర్ల దూరంలో, తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న 48 ఏళ్ల దిలీప్ దాస్ అభిప్రాయం ప్రకారం, భారత్ - బంగ్లాదేశ్‌ మధ్య ప్రస్తుత పరిస్థితి కొత్తగా విభజన జరిగినట్లు ఉంది.

''రెండు దేశాల మధ్య ఇదొక రకమైన కొత్త విభజన. మా బంధువులు చాలా మంది ఇప్పటికీ బంగ్లాదేశ్‌లో ఉండడం వల్ల ఇది మమ్మల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది'' అన్నారాయన.

''ఐదు నెలల కిందటి వరకూ ఒకరి ఊరికి మరొకరం వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఎలా ఉన్నారనే బాగోగుల సమాచారం కూడా వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారానే అడిగి తెలుసుకుంటున్నాం. బంగ్లాదేశ్‌లో హిందువులను హింసిస్తున్నారనే సమాచారం సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. అదే మా బాధ'' అని దిలీప్ దాస్ అన్నారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడంపై దిలీప్ దాస్ మాట్లాడుతూ, ''ఇప్పుడు యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తింది. భారత్ - బంగ్లాదేశ్ మధ్య యుద్ధం జరిగినా, లేదంటే అక్కడున్న మా బంధువులను హింసిస్తున్న తీరు కారణంగా ఇక్కడ కూడా కల్లోలం చెలరేగితే, అప్పుడు చాలా కష్టమవుతుంది. బోర్డర్‌లో ఉంటున్నాం, కాబట్టి ఇంకా ఎన్నో విషయాలు గ్రామస్థుల్లో భయాందోళనలు రేపుతున్నాయి'' అని చెప్పారు.

సరిహద్దుకు సమీపంలోని కాలార్‌కాందీ గ్రామానికి చెందిన నాజ్ముల్ హుస్సేన్ కూడా ఇదేవిధంగా ఆందోళన చెందుతున్నారు. హుస్సేన్ బంధువుల్లో కొందరు షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్‌ సభ్యులుగా ఉన్నారు.

భారత్, బంగ్లాదేశ్ బోర్డర్
ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లోని తమ బంధువులను కలవడం కష్టంగా మారిందని నాజ్ముల్ హుస్సేన్ అన్నారు.

''ఇంతకుముందు బంగ్లాదేశ్‌లోని మా బంధువులను సులభంగా కలిసేవాళ్లం, కానీ ఇప్పుడది చాలా కష్టమైన పని. మా బంధువుల్లో చాలా మందికి అక్కడి అవామీ లీగ్ పార్టీతో సంబంధముంది. వాళ్లిప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చాలా మంది దాక్కున్నారు, కొందరు విదేశాలకు పారిపోయారు'' అని హుస్సేన్ చెప్పారు.

అవామీ లీగ్ మద్దతుదారుల పరిస్థితి భయానకంగా ఉందని ఫోన్‌లో మాట్లాడే సమయంలో నాజ్ముల్ బంధువుల్లో చాలా మంది ఆయనకు చెప్పారు. అవామీ లీగ్‌తో సంబంధమున్న వ్యక్తులపై బీఎన్‌పీ, జమాతె ఇస్లాం కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు.

త్రిపుర మొత్తం జనాభా సుమారు 37 లక్షలు కాగా, మూడు లక్షలకు పైగా ముస్లిం జనాభా ఉంది. బెంగాలీ మూలాలున్న హిందూ జనాభా 22 లక్షలకు పైనే. వీరిలో చాలా మందికి బంగ్లాదేశ్‌లో బంధువులున్నారు.

భారత్, బంగ్లాదేశ్ బోర్డర్, త్రిపుర, ఉనాకోటీ జిల్లా
ఫొటో క్యాప్షన్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఉనాకోటీ జిల్లా ఎస్పీ కాంతా జాంగిర్ తెలిపారు.

భద్రత కట్టుదిట్టం

భారత్ - బంగ్లాదేశ్ బోర్డర్‌ గ్రామాల ప్రజల భయాందోళనల నేపథ్యంలో బీఎస్‌ఎఫ్‌తో కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఉనాకోటీ జిల్లా పోలీసులు చెబుతున్నారు.

''ఉనాకోటీ జిల్లా 73 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకుంటోంది, 20 బీఎస్ఎఫ్ శిబిరాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి'' అని ఆ జిల్లా ఎస్పీ కాంతా జాంగిర్ తెలిపారు.

''బంగ్లాదేశ్‌ సమస్య తలెత్తినప్పటి నుంచి మాత్రమే కాదు, అంతకుముందు కూడా బీఎస్ఎఫ్‌తో కలిసి బోర్డర్ ఏరియాల్లో గస్తీ, ఫ్లాగ్‌మార్చ్‌లు చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గస్తీ మరింత పెంచాం'' అని ఎస్పీ చెప్పారు.

ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజల్లో విశ్వాసం నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. అంతేకాకుండా, ఎవరైనా మతపరమైన పోస్టులు చేస్తే, వాటిని వెంటనే తొలగించడంతో పాటు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నివసిస్తున్న దిలీప్, హుస్సేన్‌లది ఒకే పరిస్థితి. బంగ్లాదేశ్‌లోని తమ బంధువుల గురించి దిలీప్ ఆందోళన చెందుతుండగా, మున్ముందు పరిస్థితులు చక్కబడతాయనే ఆశ హుస్సేన్‌లోనూ సన్నగిల్లుతున్నట్లుగా కనిపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)