థాయ్‌లాండ్: భయంతో టూరిస్ట్‌ను చంపేసిన ఏనుగు

ఏనుగులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థాయ్‌లాండ్‌లో టూరిస్టులు ఏనుగులకు స్నానం చేయించడం అనేది ఒక సాధారణ అంశం.
    • రచయిత, కెల్లీ ఎన్జీ
    • హోదా, బీబీసీ న్యూస్

ఒక ఏనుగు తనకు స్నానం చేయిస్తున్న ఓ స్పానిష్ మహిళను భయంతో చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.

థాయ్‌లాండ్‌లోని ఏనుగుల కేంద్రంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

22 ఏళ్ల బ్లాంకా ఓజాన్‌గురెన్ గార్సియా అనే విద్యార్థి, కోహ్ యావో ఎలిఫెంట్ కేర్ సెంటర్‌లో గత శుక్రవారం ఏనుగుకు స్నానం చేయిస్తుండగా అది దాడి చేయడంతో చనిపోయారు.

ఆ ఏనుగు దాని సహజ ఆవాసం బయట టూరిస్టులతో ఒత్తిడికి గురై ఉండొచ్చని స్పానిష్ వార్తా పత్రిక క్లారిన్‌తో నిపుణులు చెప్పారు.

స్పెయిన్ యూనివర్సిటీ ఆఫ్ నవర్రాలో లా అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విద్యార్థి అయిన గార్సియా, స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా తైవాన్‌లో నివసిస్తున్నారు.

తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆమె థాయ్‌లాండ్‌ను సందర్శించారు. ఏనుగు దాడి చేసినప్పుడు ఆయన కూడా ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఏనుగులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పర్యటకుల కోసం కోహ్ యావో సెంటర్ రకరకాల 'ఎలిఫెంట్ కేర్' ప్యాకేజీలను అందిస్తోంది.

బ్యాంకాక్‌లోని స్పానిష్ కాన్సులేట్, గార్సియా కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తోందని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యువల్ అల్బారెస్ చెప్పారు.

ఈ ఘటన గురించి నిర్వాహకుల స్పందన తెలుసుకోవడానికి ఆ ఏనుగుల కేంద్రాన్ని బీబీసీ న్యూస్ సంప్రదించింది.

థాయ్‌లాండ్‌లో టూరిస్టులు ఏనుగులకు స్నానం చేయించడం అనేది ఒక సాధారణ అంశం.

పర్యటకుల కోసం కోహ్ యావో సెంటర్ రకరకాల 'ఎలిఫెంట్ కేర్' ప్యాకేజీలను అందిస్తోంది. ఇందులో భాగంగా వారు ఏనుగుల కోసం ఆహారం తయారు చేయచ్చు, తినిపించవచ్చు, స్నానం చేయించవచ్చు, వాటితో కలిసి నడవొచ్చు. ఈ ప్యాకేజీలు రూ. 4700 నుంచి రూ, 7,222 మధ్యన ఉంటాయి.

ఏనుగులు

ఫొటో సోర్స్, Getty Images

ఏనుగులకు స్నానం చేయించడం వంటి కార్యకలాపాలను గతంలో జంతు సంరక్షణ కార్యకర్తలు విమర్శించారు. ఇలా చేయడం వల్ల జంతువుల సహజ ప్రవర్తనలకు ఆటంకం కలుగుతుందని, అవి అనవసర ఒత్తిడికి గురవుతాయని, గాయాల పాలవుతాయని వారు వాదించారు.

బందీలుగా ఉన్న ఏనుగుల గర్భధారణ ప్రక్రియను ఆపాలని థాయ్‌లాండ్ సహా అనేక దేశాలను 'వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్' అనే అంతర్జాతీయ చారిటీ సంస్థ కోరింది.

ఆసియాలో పర్యాటకం కోసం వినియోగిస్తున్న ప్రతి 10 ఏనుగుల్లో ఆరు ఏనుగులు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నాయని చారిటీ చెప్పింది.

''తెలివైన, సామాజిక జీవితం గడిపే ఈ జంతువులు బందీలుగా చాలా తీవ్ర బాధలను అనుభవిస్తున్నాయి. వాటికి ఉద్వేగాలు, ఆలోచనలు ఉంటాయి. ఏనుగుల సహజ జీవన పరిస్థితులను కృత్తిమంగా సృష్టించలేం'' అని చారిటీ పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)