విడాకులైతే మహిళలు ఇంటి కోసం ఖర్చు చేసిన జీతమంతా వదులుకోవాల్సిందేనా?

వివాహిత స్త్రీ, ఆర్థిక సాధికారికత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉద్యోగస్తురాలైన మహిళ ( ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, వి. నందిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''నాకు పెళ్లయి 10 ఏళ్లు అవుతోంది. అప్పటినుంచి నేను ఉద్యోగం చేస్తూనే ఉన్నా. బిడ్డ పుట్టినప్పుడు మాత్రమే చిన్న బ్రేక్ తీసుకున్నా. ఇన్నేళ్లుగా సంపాదించినదంతా నా కుటుంబం కోసమే ఖర్చు పెట్టా. నా భర్తతో అభిప్రాయభేదాలతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని ఇంటి నుంచి వచ్చేసినప్పుడు నా దగ్గర దాచుకున్న డబ్బు ఏమీ లేదు.''

చెన్నైకి చెందిన 35 ఏళ్ల కార్తీక చెప్పిన మాటలివి. భర్తతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. విడాకులకు సంబంధించిన న్యాయప్రక్రియ జరుగుతోంది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం పిల్లాడి చదువు ఖర్చులను భార్యభర్తలిద్దరూ పంచుకుంటున్నారు.

కానీ, వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇలా ఎప్పుడూ జరగలేదు. కలిసి జీవించినప్పుడు కార్తీక తన జీతం మొత్తాన్ని కుటుంబం కోసమే ఖర్చు పెట్టేవారు. రోజూవారీ ఖర్చులు, పిల్లాడి కోసమే తన జీతాన్ని వెచ్చించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

''కుటుంబం కోసమే ఖర్చు చేస్తున్నా కదా అనుకున్నాం. అందరం క్షేమంగా ఉన్నామని భావించేదాన్ని. నా భర్త ఆదాయాన్ని పొదుపు కోసం, నా జీతాన్ని ఇంటి ఖర్చుల కోసం వాడేవాళ్లం'' అని ఆమె చెప్పారు.

భారతీయ సమాజంలో పెళ్లి అయిన మహిళల ఆర్థిక విషయాలను ముఖ్యంగా ఇంట్లోని పురుషులే నియంత్రిస్తుంటారని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఆర్థిక ప్రణాళిక సంబంధించిన విషయాలను తమ భర్తే చూసుకుంటారని 89 శాతం మహిళలు చెప్పినట్లు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 2022 అక్టోబర్‌లో విడుదల చేసిన డేటాలో తెలిసిందని వార్తాసంస్థ లైవ్ మింట్ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ అధ్యయనంలో వెయ్యి మంది మహిళలు పాల్గొన్నారు.

భారత సామాజిక నిర్మాణంలో మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం విషయానికొస్తే, వారి తండ్రి లేదా భర్త లేదా కొడుకులే ఈ విషయాలను చూసుకుంటారని స్త్రీవాదులు కూడా అంటున్నారు.

ఆర్థిక సాధికారికత

ఫొటో సోర్స్, Getty Images

''నా జీతం ఖర్చుకు, నా భర్త జీతం పొదుపుకు''

కార్తీక విషయానికొస్తే, ఆమె జీతం అంతా కుటుంబానికే ఖర్చు చేశారు. విడాకులు తీసుకుంటున్న ఈ తరుణంలో తాను సర్వం కోల్పోయి నిస్సహాయంగా మిగిలిపోయానని ఆమె అన్నారు.

''నా అత్తామామ 60 వ పెళ్లి రోజు సందర్భంగా ఇల్లు నిర్మాణం కోసం నేను బ్యాంక్ లోన్ తీసుకున్నా. పిల్లల ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ నేనే చూసుకున్నా. మాది ప్రేమ వివాహం. పెళ్లికి ముందు కూడా ఆయన కోసం నేను చాలా ఖర్చు చేశాను'' అని కార్తీక చెప్పారు.

పదేళ్ల క్రితం ఆమె ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. తొలినాళ్లలో రూ. 20,000 జీతంగా పొందిన ఆమె ప్రస్తుతం ఒక లాజిస్టిక్స్ కంపెనీలో రూ. 50,000 జీతానికి పని చేస్తున్నారు.

ట్రావెలింగ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, ట్రావెలింగ్ కోసం తాను దాచుకున్న డబ్బును కూడా ఒక దశలో కుటుంబం కోసమే ఖర్చు చేశానని ఆమె చెప్పారు.

''ఇప్పటివరకు నేను సంపాదించిన డబ్బులో రూ. 25 లక్షలు కుటుంబానికే ఖర్చు చేశా'' అని ఆమె తెలిపారు.

వైవాహిక జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాతే తన మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలింగ్, రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ వంటి అత్యవసరాలకు ఖర్చు చేసుకోగలిగానని ఆమె అన్నారు.

''నా భర్త నెలకు లక్షన్నర రూపాయలు సంపాదిస్తారు. కానీ, ఇంటి ఖర్చులకు ఆయన డబ్బు వాడరు. ఇంట్లో ఖర్చులన్నీ నేనే చూసుకోవాలి. ఆయన డబ్బులన్నీ పొదుపు చేస్తారు. నా ఇల్లు, నా వాళ్ల కోసమే నేను ఖర్చు చేస్తున్నానని అనుకున్నా. ఇప్పుడు ఒక ఇల్లు అద్దె తీసుకోవడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. లోన్ తీసుకొని డౌన్ పేమెంట్ చేశాను. మా అమ్మ కూడా అదే సమయంలో చనిపోయారు. దానికోసం లక్షన్నర ఖర్చు అయింది'' అని ఆమె చెప్పారు.

తన జీతంతో కొన్న వస్తువులు కూడా అత్తింటివారు భర్త నుంచి విడిపోయాక తనకు ఇవ్వలేదని ఆమె వాపోయారు. తన నగలు మాత్రమే తీసుకొని బయటకు వచ్చానని చెప్పారు.

''నా ప్రెగ్నెన్సీ, ప్రసవం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటినీ నేనే చూసుకున్నా. మా అమ్మనాన్నలది మధ్యతరగతి కుటుంబం. మీ తల్లిదండ్రులు డబ్బులు పెట్టలేకపోతే వాటన్నింటి ఖర్చులు నువ్వే చూసుకోవాలని మా అత్తింటి వారు నాతో అన్నారు'' అని ఆమె తెలిపారు.

ఆర్థిక సాధికారికత

ఫొటో సోర్స్, Getty Images

''మహిళలు ఆలస్యంగా అర్థం చేసుకుంటారు''

విడాకుల వరకు వచ్చాకే మహిళలకు ఇలాంటి విషయాలు, సమస్యలు అర్థమవుతాయని కార్తీక తరఫు న్యాయవాది సెంతామరై అన్నారు.

''ఈ ఒక్క కేసు మాత్రమే కాదు. రోజూ ఇలాంటి ఘటనలు చాలా చూస్తున్నాం. కార్తీక కేసులో ఆమె ఖర్చు చేసిన సొమ్ములో కనీసం రూ. 15 లక్షలు తిరిగి ఇవ్వాలని మేం వాదిస్తున్నాం'' అని సెంతామరై చెప్పారు.

ఇలాంటిదే మరో ఘటన గురించి కూడా సెంతామరై బీబీసీతో పంచుకున్నారు.

మదురైకి చెందిన కావ్య ఒక బ్యాంకులో పనిచేస్తారు. నెలకు రూ. 30,000 జీతం.

''నా భర్త తీసుకున్న ఒక లోన్ కోసం నేను ప్రతీనెలా రూ. 7,000 ఈఎంఐ చెల్లిస్తాను. మా తల్లిదండ్రుల బాగోగుల కోసం, సేవింగ్స్ కోసం కొంత డబ్బు కేటాయిస్తాను. మా పిల్లల ఖర్చులు కూడా నేనే చూసుకుంటా'' అని కావ్య చెప్పారు.

తన కంటే తన భర్త ఎక్కువ సంపాదిస్తారని, ఇంటి అద్దె, రోజువారీ ఖర్చులు ఆయనే చూసుకుంటారని చెప్పారు. అయితే, తన తల్లిదండ్రులకు డబ్బులిచ్చే విషయం తన భర్తకు తెలియదని ఆమె అన్నారు.

''ఖర్చుల కోసం నా భర్త నన్ను తరచుగా డబ్బులు అడుగుతుంటారు. నా దగ్గర ఉన్నదాంట్లో కాస్త ఆయనకు ఇస్తాను. మొత్తం ఇచ్చేస్తే నా దగ్గర ఏమీ మిగలదు. ఒకవేళ నా అమ్మనాన్నాలకు నేను డబ్బులిస్తున్నానని తెలిస్తే మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి'' అని కావ్య చెప్పారు.

''పెళ్లి తర్వాత కూడా ఉద్యోగాలు చేసే మహిళలు డబుల్ డ్యూటీ చేస్తున్నారు. ఇటు ఇంట్లో పనులతో పాటు అటు ఆఫీసు పనులు చేయాలి. కానీ, ఒకవేళ వారు స్థలం లేదా ఇల్లు కొనాలని అనుకుంటే, ఆ మహిళల పేరు మీద ఆస్తులు కొనడానికి ప్రాధాన్యం ఇవ్వట్లేదు'' అని లాయర్ సెంతామరై అన్నారు.

మహిళల ఆర్థిక సాధికారికత

ఫొటో సోర్స్, Getty Images

నిరుద్యోగ మహిళల పరిస్థితి ఏంటి?

తిరుచ్చికి చెందిన 32 ఏళ్ల జనప్రియతో బీబీసీ మాట్లాడింది.

''పిల్లల కోసం నేను ఉద్యోగానికి వెళ్లలేదు. నేను గ్రాడ్యుయేషన్ చేశాను. నా భర్త వ్యాపారం చేస్తారు. ఇంతకుముందు మా కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ మా మామగారి నియంత్రణలో ఉండేవి. కాబట్టి, పెళ్లయినప్పటి నుంచి నా ఖర్చుల కోసం డబ్బులు అడగాలంటే వెనుకాడేదాన్ని. ఇప్పుడు అంతా నా భర్తే చూసుకుంటున్నారు. ఇంట్లో ఖర్చుల కోసం, నా ఖర్చుల కోసం ఆయన డబ్బు ఇస్తారు. కానీ, నా ఖర్చులన్నీ ఆయన నియంత్రణలో ఉంటాయి'' అని ఆమె చెప్పారు.

ఇంటి ఖర్చుల విషయంతో తమ భర్తతో తరచూ గొడవ జరుగుతుందని మేం మాట్లాడిన మరికొందరు మహిళలు వెల్లడించారు.

చెన్నైలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తోన్న ఒక మహిళ, తన ఆహారం దుస్తుల కోసం జీతాన్ని ఖర్చు చేసుకుంటే, 'నువ్వు సంపాదించినదంతా నీకు కావాల్సిన వాటికే ఖర్చు చేస్తావా?' అంటూ తన భర్త నిలదీస్తారని చెప్పారు. ఆమె తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

తన జీతం, బ్యాంకు అకౌంట్ వంటి వివరాలను తన భర్త తెలుసుకుంటాడని, ఆయనకు సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటికీ బయటకు చెప్పరని ఆమె అన్నారు.

''సొంతంగా సంపాదన లేని మహిళలకు వారి భర్తలే ఆర్థిక సాధికారికత అందించాలి. ముఖ్యంగా, వారి సొంత ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వాలి'' అని సుప్రీం కోర్టు జడ్జి పీవీ నాగరత్న గత జులైలో ఒక కేసు సందర్భంగా వ్యాఖ్యానించినట్లు వార్తా సంస్థ 'ది హిందూ' తెలిపింది.

ఈ పరిస్థితి ఎందుకు? ఏమి చేయాలి?

ఆర్థిక నిర్ణయాల విషయానికొచ్చేసరికి మహిళలను ఎందుకు ద్వితీయ స్థానంలో చూస్తున్నారని దిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ విమన్ డైరెక్టర్ మణిమేగలై ని అడగ్గా ఆమె స్పందించారు.

''భారత కుటుంబ వ్యవస్థ నిర్మాణం ఇలాగే ఉంది. ముఖ్యమైన ఆర్థిక విషయాల్లో మహిళలకు తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వారిని అలాగే పెంచారు. కుటుంబానికి సంబంధించిన రోజువారీ ఖర్చులకు సంబంధించిన నిర్ణయాలను మాత్రమే వారికి వదిలేస్తారు. ఆస్తులు, పెట్టుబడులు వంటి వాటిలో వారి జోక్యం ఉండదు. ఇంట్లోని పురుషులకే వీటిని వదిలేస్తారు. మహిళలు స్వతంత్రంగా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోకపోతే వృద్ధాప్యంలో లేదా ఒంటరిగా జీవించాల్సి వచ్చినప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని మణిమేగలై చెప్పారు.

మహిళలకు కొన్ని సూచనలు కూడా చేశారు. అవేంటంటే,

  • పెళ్లి అయిన కొత్తలోనే ఇంటి ఖర్చుల గురించి చర్చించి నిర్ణయం తీసుకోవాలి. రోజువారీ ఖర్చులతో పాటు పెట్టుబడులను భార్యభర్తలిద్దరూ పంచుకోవాలి.
  • ఆర్థిక విషయాల గురించి మీ అభిప్రాయాలను మొహమాటం లేకుండా పంచుకోవాలి.
  • మహిళలకు సొంతంగా పొదుపు ఖాతా ఉండాలి, పెట్టుబడులపై అవగాహన పెంచుకోవాలి.
  • ఖర్చుల కోసం భార్యభర్తలిద్దరూ జాయింట్ అకౌంట్ తెరవాలి
  • ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు దానికి యాజమానిగా లేదా సహ యజమానిగా తన పేరు ఉంచాలని నిర్మొహమాటంగా చెప్పాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)