చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్టు వల్ల భారత్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గవిన్ బట్లర్, అన్షుల్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ప్రపంచంలో అతి పెద్ద జలవిద్యుదుత్పత్తి కేంద్రం, రిజర్వాయర్ నిర్మించేందుకు చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని వల్ల భారత్, బంగ్లాదేశ్‌పై పర్యావరణ ప్రభావం పడటంతో పాటు టిబెట్‌లో భారీగా ప్రజలు నిరాశ్రయులవుతారనే ఆందోళనలు వినిపిస్తున్నాయి.
చైనాలో యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ఈ డ్యామ్, ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద విద్యుదుత్పత్తి కేంద్రమైన త్రీ గార్జెస్ డ్యామ్ ద్వారా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ కంటే మూడు రెట్లు అధికంగా ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు.
‘ఇది సురక్షితమైన పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేసే ప్రాజెక్టు’ అని చైనా అధికారిక మీడియా అభివవర్ణించింది. ఈ ప్రాజెక్టు స్థానికంగా ప్రజలకు సంపదను అందించడంతోపాటు చైనా పర్యావరణ సమతుల్యత లక్ష్య సాధనకు తోడ్పుతుందని తెలిపింది.
అయితే దీని వల్ల ఏర్పడే పరోక్ష పరిణామాల పట్ల మానవహక్కుల సంఘాలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
2020 చివరి రోజుల్లో బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ నిర్మాణం గురించి చైనా ప్రకటన చేసింది. దీని వల్ల స్థానికంగా లక్షల మంది నిరాశ్రయులు అవుతారనే భయాలు ఏర్పడ్డాయి.
డ్యామ్ నిర్మాణం పూర్తయితే అక్కడ సహజ వనరులు, జీవావరణం అంతా అస్తవ్యస్తం అవుతుంది. టిబెట్ పీఠభూమిలో ఇది చాలా వైవిధ్య భరితమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది.
టిబెట్‌కు సంబంధించిన ప్రాంతాల్లో చైనా ఇప్పటికే అనేక ఆనకట్టల్ని కట్టింది. 1950ల్లో చైనా ఆక్రమించినప్పటి నుంచి టిబెట్ వివాదాస్పద ప్రాంతంగా ఉంది.
టిబెటన్లు, వారి భూములను చైనా ఏ విధంగా దోచుకుంటుందో చెప్పడానికి బీజింగ్ నిర్మిస్తున్న ఆనకట్టలే నిదర్శనమని మానవహక్కుల కార్యకర్తలు గతంలో బీబీసీతో చెప్పారు.
ముఖ్యంగా టిబెట్, అక్కడి బౌద్దులు అనేక ఏళ్లుగా చైనా అణచివేతను ఎదుర్కొంటున్నారు. చైనాకు వ్యతిరేకంగా గొంతెత్తిన వేలమందిని చంపేశారని కొందరు హక్కుల కార్యకర్తలు భావిస్తున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో చైనా నిర్మించతలపెట్టిన తాజా ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వేలమంది టిబెటన్లను చైనా ప్రభుత్వం నిర్బంధించింది.
అరెస్టులు, దాడులతో ఈ ఆందోళనలు ముగిశాయి. దాడుల్లో కొంతమంది తీవ్రంగా గాయపడినట్లు బీబీసీ గుర్తించింది.
గంగుటో డ్యామ్, హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మించాలన్న చైనా ప్రణాళికలను వారు వ్యతిరేకించారు.
ఈ నిర్మాణం వల్ల అనేక గ్రామాలతో పాటు పురాతన బౌద్ద ఆరామాలు, అందులో తాము పవిత్రంగా భావించే అవశేషాలు నీట మునుగుతాయని వారు ఆందోళన చెందుతున్నారు.
అయితే చైనా మాత్రం నీట మునిగిపోయే వారికి పునరావాసం కల్పిస్తామని, నష్టపరిహారం చెల్లిస్తామని, పురాతన విగ్రహాలు, మత పరమైన వాటికి రక్షణ కల్పిస్తామని చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నమా?
బ్రహ్మపుత్ర నది మీద నిర్మిస్తున్న ఆనకట్ట వల్ల పర్యావరణం మీద పెద్ద ప్రభావం ఏమీ పడదని చైనా అధికారులు వాదిస్తున్నారు. కానీ, ఈ ప్రాజెక్టు వల్ల ఎంత మంది నిరాశ్రయులు అవుతారనే విషయాన్ని బయటకు చెప్పడం లేదు.
త్రీ గార్జెస్ డ్యామ్ నిర్మాణం వల్ల కోటి 40 లక్షల మందికి పునరావాసం కల్పించాల్సి వచ్చింది.
హైడ్రో పవర్ డ్యామ్ నిర్మాణం కోసం భారీ స్థాయిలో పనులు చేపట్టాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. టిబెట్‌లో అతి పొడవైన నదిగా గుర్తింపు పొందిన యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నది ప్రవాహాన్ని దారి మళ్లించడానికి నంచాబర్వా పర్వతాల్లో 20 కిలోమీటర్ల పొడవున్న నాలుగు సొరంగాల్ని తవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఆనకట్ట నిర్మాణంతో అంతర్జాతీయ సరిహద్దుల గుండా ప్రవహించే నదీ ప్రవాహాన్ని చైనా నియంత్రించగలుగుతుందని నిపుణులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్రహ్మపుత్ర నది టిబెట్ నుంచి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది.
"టిబెట్ పీఠభూమిలోని నదుల్ని నియంత్రించడం ద్వారా చైనా భారత ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది" అని 2020లో ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ ప్రచురించిన నివేదిక వెల్లడించింది.
బ్రహ్మపుత్ర నది మీద భారీ ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి చైనా 2020లో తన ప్రణాళికను ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వంలో సీనియర్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడారు. చైనా నిర్మిస్తున్న డ్యామ్ ప్రభావం తగ్గించడానికి భారత ప్రభుత్వం కూడా భారీ జలాశయం, హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించే అంశాన్ని పరిశీలిస్తోందని చెప్పారు.
ఆనకట్ట నిర్మాణంపై భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ, బ్రహ్మపుత్ర నది మీద తమకు ‘చట్టబద్దమైన హక్కు’ ఉందని, భారత ఆందోళనలను అర్థం చేసుకున్నామని గతంలో స్పందించింది.
పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో భాగంగా చైనా ప్రభుత్వం బ్రహ్మపుత్ర నది మీద గత పదేళ్లలో అనేక ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి కేంద్రాలను నిర్మించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా భారీగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భూకంపాల ప్రమాదం
భూమి మీద లోతైన లోయ గుండా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్రలో ఒక భాగం 50 కిలోమీటర్ల పరిధిలో 2వేల మీటర్ల లోతుకు పడిపోతుంది. భౌగోళికంగా ఈ నదికున్న ప్రత్యేకత వల్ల దీని నుంచి భారీ స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
ఈ నది ఉన్న ప్రాంతం దృష్ట్యా ఇక్కడ చేపట్టే నిర్మాణాల విషయంలో ఇంజనీరింగ్ పరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం చైనా తలపెట్టిన ఈ ఆనకట్ట, ఆ దేశం ఇప్పటి వరకు నిర్మించిన, నిర్మిస్తున్న వాటిలో ప్రతిష్టాత్మకమైనది.
డ్యామ్ నిర్మించే ప్రాంతం భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఉంది. ఆనకట్ట నిర్మాణం కోసం చేపట్టే భారీ తవ్వకాలు, ఇరుకుగా, లోతుగా ఉండే ప్రాంతంలో చేపట్టే నిర్మాణాల వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని చైనా పరిశోధకులు గతంలో హెచ్చరించారు.
"భూకంపాలతో పాటు కొండచరియలు విరిగిపడటం, నదీ ప్రవాహంలో మట్టి పెళ్లలు, రాళ్లు వచ్చి చేరడం వంటి వాటిని మనం నియంత్రించలేము. అంతే కాకుండా అవి ప్రాజెక్టుకు భారీ ముప్పుగా పరిణమిస్తాయి" అని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన జియోలాజికల్ బ్యూరోలో సీనియర్ ఇంజనీర్ ఒకరు 2022లో చెప్పారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ట్రిలియన్ యువాన్లు ( 127 బిలియన్ డాలర్లు) ఖర్చవుతుందని చోంగీ జలవనరుల సంస్థ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, బంగ్లాదేశ్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?
టిబెట్‌లో ఉన్న కైలాసపర్వతంలోని యాంగ్సీ హిమానీ నదం నుంచి పుట్టిన బ్రహ్మపుత్ర నది 3వేల కిలోమీటర్లు ప్రవహిస్తుంది.
అక్కడ యార్లంగ్ త్సాంగ్‌పో అని పిలిచే నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. ఇది అస్సాం గుండా ప్రవహించి బంగ్లాదేశ్ చేరుతుంది. బంగ్లాదేశ్‌లో ఈ నదిని జమున అని పిలుస్తున్నారు. ఆ తర్వాత గంగానదిలో కలుస్తుంది.
బంగ్లాదేశ్‌కు అవసరమైన నీటి వనరుల్లో 90 శాతం సరిహద్దుల నుంచే వస్తున్నాయి. వేసవి కాలంలో బ్రహ్మపుత్ర నుంచి 70 శాతం నీరు అందుతుంది. బంగ్లాదేశ్‌కు బ్రహ్మపుత్ర నది ఎంత కీలకమో చెప్పడానికి ఈ అంకెలు చాలు.
అందుకే చైనా నిర్మిస్తున్న ఆనకట్ట భారత్, బంగ్లాదేశ్‌లకు కీలకమైన అంశం.
బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మిస్తున్న ఆనకట్టను చైనాలోని మెకాంగ్ నదిపై నిర్మించిన డామ్‌తో పోల్చవచ్చని బెంగళూరులోని తక్షశిల ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ నిత్యానందం చెప్పారు.
"మెకాంగ్ నది మీద చైనా ఆనకట్టలు కట్టింది. ఈ ఆనకట్టల్లో నీటిని నిల్వ చేసి అవసరమైనప్పుడు కిందకు వదలడం లేదని మనం చదివాం. దీంతో పాటు ప్రవాహల్లో వచ్చే పూడిక రిజర్వాయర్లలోకి చేరుతుంది. ఈ పూడికను ఏం చేయాలనే దానిపై చైనా వద్ద ఎలాంటి ప్రణాళిక లేదు. బ్రహ్మపుత్ర మీద నిర్మించే ప్రాజెక్టు విషయంలోనూ ఇలాగే జరగవచ్చని భారత్, బంగ్లాదేశ్ ఆందోళన చెందుతున్నాయి" అని నిత్యానందం చెప్పారు.
భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్ ఏటా తీవ్రమైన వరద పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఈ ప్రాంతాలు రానున్న రోజుల్లో కొండ చరియలు విరిగిపడటం, భూకంపాలు, ఆకస్మిక వరదలు లాంటి ఉపద్రవాల్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
అరుణాచల్ ప్రదేశ్‌కు కొండ చరియలు విరిగిపడటం, భూకంపాల నుంచి ముప్పు పొంచి ఉంది. బ్రహ్మపుత్ర మీద భారీ ఆనకట్ట నిర్మించడం వల్ల ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది. దీని వల్ల ఊహించని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు విషయంలో చైనా, భారత్, బంగ్లాదేశ్ పరస్పరం సహకరించుకుంటే అందరికీ మేలు జరుగుతుందని షినువా యూనివర్సిటీలో హైడ్రాలిక్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు 2023లో నిర్వహించిన అధ్యయనం తేల్చింది.
ఆనకట్ట నిర్మాణంతో బ్రహ్మపుత్ర వరదల్ని నియంత్రించవచ్చని దీని వల్ల, భారత్‌లో 32.6 శాతం ప్రాంతాలకు, బంగ్లాదేశ్‌లో 14.8 శాతం ప్రాంతానికి వరద ముప్పు తగ్గుతుందని అధ్యయనంలో తేలింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














